కూచిపూడి పుట్టినిల్లు!
భారతదేశంలోని సుప్రసిద్ధ శాస్త్రీయ నృత్యరీతులలో కూచిపూడికి ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణాతీరంలోని కూచిపూడి గ్రామమే ఈ అద్భుత నృత్యరీతికి పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో నడయాడిన యతి నారాయణ తీర్థులు, ఆయన శిష్యుడు సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్యరీతికి ఆద్యులని అంటారు.
కూచిపూడి నృత్య రీతికి కూడా భరతముని రచించిన నాట్యశాస్త్రమే ఆధారమని చెబుతారు. నాట్యశాస్త్రం క్రీస్తుపూర్వం 2వ శతాబ్ది నుంచి క్రీస్తుశకం 2వ శతాబ్ది మధ్యకాలానికి చెందినదై ఉంటుందని చరిత్రకారుల అంచనా. దేశంలో భక్తి ఉద్యమం పుంజుకుంటున్న క్రీస్తుశకం ఏడో శతాబ్ది కాలంలో కూచిపూడి నృత్యం ఊపిరి పోసుకుంది.
తంజావూరు వరకు ‘తరంగాల’ తాకిడి
కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడైన నారాయణ తీర్థులు ‘శ్రీ కృష్ణలీలా తరంగిణి’ని విరచించారు. ఇందులో నృత్యానికి అనువుగా ఆయన రచించిన లయబద్ధమైన పాటలే తరంగాలుగా ప్రసిద్ధి పొందాయి. నారాయణ తీర్థులు కొంతకాలం తంజావూరులో గడిపారు. అప్పట్లో ఆయన తంజావూరు ఆలయంలో తాను రూపొందించిన నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.
ఆనాటితో కూచిపూడి ‘తరంగాల’ తాకిడి తంజావూరు వరకు పాకింది. నారాయణ తీర్థుల శిష్యుడైన సిద్ధేంద్రయోగి ‘పారిజాతాపహరణం’ నృత్య రూపకాన్ని రూపొందించారు. కూచిపూడి నృత్యరీతిలో ఇది ‘భామాకలాపం’గా ప్రసిద్ధి పొందింది. నారాయణ తీర్థుల తరంగాలను, సిద్ధేంద్రయోగి రూపొందించిన భామాకలాపాన్ని ప్రదర్శించని కూచిపూడి నర్తకులే ఉండరు. ఆధునిక కాలంలో సైతం కూచిపూడి నృత్యప్రదర్శనల్లో ఈ అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి.
గోల్కొండ నవాబుల ఆదరణ
కూచిపూడి నృత్యాన్ని గోల్కొండ నవాబులు ఎంతగానో ఆదరించారు. కూచిపూడి నర్తకుల ప్రదర్శనకు మంత్రముగ్ధుడైన గోల్కొండ నవాబు అబుల్ హసన్ కుతుబ్ షా కూచిపూడి కళాకారుల కోసం కూచిపూడి గ్రామంలో ఉదారంగా భూములిచ్చారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు కొనసాగిస్తున్నంత కాలం వారు ఆ భూములను అనుభవించవచ్చని ఆయన తన శాసనంలో స్పష్టం చేశారు. తర్వాతి కాలంలో సిద్ధేంద్రయోగి రూపకల్పన అయిన ‘భామాకలాపం’ ప్రేరణతో రామశాస్త్రి అనే నాట్యవిద్వాంసుడు ‘గొల్లకలాపం’ రూపొందించారు. ఒక గోపికకు, ఒక బ్రాహ్మణుడికి నడుమ జరిగే హాస్య సంభాషణతో రూపొందించిన ‘గొల్లకలాపం’ కూడా కూచిపూడి నృత్య ప్రదర్శనలలో ప్రసిద్ధి పొందింది.
ఆధునిక సొబగులు
ఆధునిక కాలంలో హరిమాధవయ్య కూచిపూడి నృత్యప్రదర్శనల్లో భాగవత మేళ నాటకాన్ని ప్రవేశపెట్టారు. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో చింతా వెంకటరామయ్య కూచిపూడి కళాకారులందరినీ సంఘటితపరచి నాట్యబృందాన్ని ఏర్పరచారు. ధార్వాడ్, పార్శీ నాటక కంపెనీల తరహాలో ఆయన ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య బృందాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రదర్శనలు ఇచ్చాయి. అప్పట్లోనే కూచిపూడి నృత్యప్రదర్శనల్లో విద్యుద్దీపాలంకరణలు, వస్త్రాలంకరణల్లో ఆధునిక పోకడలతో రంగాలంకరణ ఆధునిక సొబగులను దిద్దుకుంది.
ఆ కాలంలోనే బందా కనకలింగేశ్వరరావు, విస్సా అప్పారావు, తాండవకృష్ణ వంటి కళాకారులు నృత్యప్రదర్శనలను కొనసాగించడంతో పాటు కూచిపూడి నృత్యరీతిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పత్రికల్లో విరివిగా వ్యాసాలు రాసేవారు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి తన తనయుడు జగన్నాథ శర్మతో కలసి కూచిపూడి ప్రదర్శనల్లో మరిన్ని వినూత్న ప్రయోగాలు చేశారు. అప్పటి వరకు కూచిపూడి ప్రదర్శనల్లో స్త్రీపాత్రలను కూడా పురుషులే అభినయించేవారు. వేదాంతం వారి చొరవతో స్త్రీ పాత్రలను స్త్రీలే అభినయించడం మొదలైంది.
కేంద్ర సంగీత నాటక అకాడమీ 1958లో నిర్వహించిన అఖిలభారత నాట్య సదస్సులో కూచిపూడి నృత్యరీతికి తొలిసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. కూచిపూడి ప్రదర్శనల్లో స్త్రీలు రంగస్థలంపైకి రావడం మొదలయ్యాక తొలితరంలో ఇంద్రాణి రెహమాన్, యామినీ కృష్ణమూర్తి వంటి వారు నృత్యతారలుగా వెలుగొందారు. వారి స్ఫూర్తితో మరింత మంది నర్తకీమణులు రంగప్రవేశం చేసి, కూచిపూడి కీర్తిని ఖండాంతరాలకు చాటుతున్నారు.