Maddali Usha Gayathri: నృత్య తపస్వి Sakshi Special Story About Kuchipudi Nrutyakarini Maddali Usha Gayathri | Sakshi
Sakshi News home page

Maddali Usha Gayathri: నృత్య తపస్వి

Published Thu, Mar 21 2024 5:40 AM

Sakshi Special Story About Kuchipudi Nrutyakarini Maddali Usha Gayathri

ఆమె ప్రయాణం నాట్యం. ఆమె ప్రయత్నం నాట్యకళకు జీవం పోయడం. నాలుగేళ్ల వయసు నుంచి కూచిపూడిని జీవనాడిగా చేసుకుని., 69 ఏళ్ల వయసులోనూ కళను వీడలేదు   హైదరాబాద్‌ వాసి మద్దాలి ఉషాగాయత్రి. సుదీర్ఘ నృత్య ప్రయాణంలో భారత్‌తోపాటు దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

వందల మంది  ఔత్సాహికులు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా 200కు పైగా నృత్యాంశాలకు సోలోగా కొరియోగ్రఫీ చేశారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గీతాంజలికి బ్యాలే చేసి, కేంద్ర ప్రభుత్వ అవార్డులు పొందారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న డా. ఉషా గాయత్రి నృత్య ప్రయాణం తెలుసుకుంటే ఈ కళాసేవ ఒక తపస్సులా అనిపించకమానదు.

‘‘కూచిపూడి నృత్యానికి సంబంధించిన సాహిత్యం, రచనలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పుస్తకాలుగా తీసుకురావాలనేది నా చిరకాల స్వప్నం. దానిని నిజం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను’’ అని తనను తాను పరిచయం చేసుకున్న తపస్వి ఉషాగాయత్రి తన నృత్య జీవన గమ్యాన్ని ఇలా మనముందుంచారు.
‘‘నాలుగేళ్ల వయసులో ఉదయ్‌ శంకర్‌ శిష్యుడైన దయాల్‌ శరణ్‌ వద్ద నాట్యాభ్యాసం మొదలుపెట్టాను.

ఇక్కడే కథక్, ఒడిస్సీ, సంగీతం కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రఖ్యాత గురువు వేదాంతం జగన్నాథ శర్మ వద్ద కూచిపూడి, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, పద్మభూషణ్‌ డా.వెంపటి చినసత్యం, వేదాంతం ప్రహ్లాద శర్మ వద్ద యక్షగానాలు, ప్రఖ్యాత కళాక్షేత్ర గురువు కమలారాణి వద్ద నట్టువాంగం, పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ వద్ద పదములు నేర్చుకున్నాను. 1988లో హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎం.ఏ. పూర్తయ్యింది. అంతేకాకుండా ‘తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర వృద్ధి, వికాసం, నాట్యంలో అవతరణ‘ అనే అంశం మీద పరిశోధన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పొందాను.

రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయంలోని నృత్య విభాగంలోనూ పనిచేశాను. ఆ తర్వాత దాదాపు పాతిక సంవత్సరాలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఉద్యోగం చేశాను. నాట్యానికే అంకితం అవ్వాలనే తపనతో ఉద్యోగానికి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నాను. ‘నృత్యకిన్నెర‘ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో వందల మందికి శిక్షణనిస్తూ వచ్చాను. ఇందులో 50 మంది శిష్యులు నృత్యంలో డిప్లొమా  సర్టిఫికెట్లు పొందారు. 10 మంది చిన్నారులు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఆర్‌టీ స్కాలర్‌షిప్‌ పొందారు. నా శిష్యులు దేశవిదేశాల్లో స్థిరపడటమే కాకుండా నృత్యంలో పీహెచ్‌డీ, ఎం.ఏ. పట్టాలు పొంది గురువులు, నర్తకులుగా అభివృద్ధి చెందారని చెప్పుకోవడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.

పాదం కదపని వేదిక లేదు
సంగీత నాటక అకాడమీ, సౌత్‌ జోన్  కల్చరల్‌ సెంటర్, టీటీడీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఎన్నో వందల ప్రదర్శనలు. దేశంలోని న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి  నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చాను. భారత స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో 1997లో మారిషస్‌లో ఇచ్చిన ప్రదర్శనకుగాను ఆనాటి ప్రెసిడెంట్‌ సత్కరించడం ఒక గొప్ప జ్ఞాపకం. ప్రదర్శనల కోసం  శిష్యులతోపాటు యూకే, యూరోప్‌లలో పర్యటించాను.

యూకేటీఏ, జయతే కూచిపూడి, అంతర్జాతీయ కూచిపూడి ఫెస్టివల్‌లో భాగంగా ప్రదర్శనలు ఇవ్వడం మరో గొప్ప అనుభూతి. ప్రధానంగా దాదాపు 200 లకు పైగా సోలో నృత్యాంశాలకు కొరియోగ్రఫి చేయడంతో పాటు ప్రతిష్టాత్మకమైన 16 బ్యాలేలు చేశాను. ఇందులో భాగంగా రచయిత ప్రొఫెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌  చారిత్రక నవల శివభక్త మార్కండేయ, మా తెలుగుతల్లికి మల్లెపూదండ, స్వర్ణోత్సవ భారతి, వందేమాతరం, సంక్రాంతి లక్ష్మి, రుక్మిణీ సత్య, అలిమేలుమంగ చరిత్ర, యశోదకృష్ణ వంటి బ్యాలేలు ప్రదర్శించాను.

రవీంద్రుని గీతాంజలి మాట నిజమైన వేళ
విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన గీతాంజలికి బ్యాలే చేయడం నా అదృష్టంగా భావిస్తాను. కలకత్తా వేదికగా ఈ ప్రదర్శన చేసిన సమయంలో ఒక విషయం నన్ను అమితమైన ఆనందానికి లోను చేసింది. ‘ఏదో ఒకనాడు, ఎవరో ఒకరు నా సాహిత్యానికి నృత్య రూపాన్ని తీసుకువస్తారు’ అని ఆనాడే రచయిత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన మాటలను అక్కడి వారు ప్రస్తావించడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని, సంతృప్తినిచ్చింది. కావ్యాలకు, కథనాలకు, నృత్యానికి ఎంతటి అనుబంధం ఉంటుందో ఆ సంఘటన రుజువు చేసింది.

12 గంటలు 12 మంది శిష్యులు
నృత్యం దర్శయామిలో భాగంగా 72 సోలో నృత్యాంశాలైన శబ్దాలు, తరంగములు, దరువులు, తిల్లానాలు, అష్టపదులు, కీర్తనలు.. తదితర అంశాలతో 12 మంది శిష్యురాళ్లతో కలిసి 12గంటల పాటు అవిరామంగా నృత్యప్రదర్శన చేశాం. 12గంటల పాటు నిరంతరాయంగా నట్టువాంగం నిర్వహించి దానిని గురువు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రికి అంకితం చేశాం. చేసిన సోలో ప్రదర్శనలు, బ్యాలేలు న్యూ ఢిల్లీ దూరదర్శన్ తో పాటు విదేశీ ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి.

ఎంతో ప్రోత్సాహం..
ఈ నృత్య ప్రయాణంలో నా జీవిత భాగస్వామి మద్దాళి రఘురామ్‌ ప్రోత్సాహం ఎనలేనిది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను.

వాటిలో .. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2001లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ అవార్డు ‘హంస పురస్కారాన్ని’, 2004లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, యూరప్‌ తెలుగు అసోసియేషన్  ఆధ్వర్యంలో ఉత్తమ నర్తకిగా, న్యూయార్క్‌లో ఉత్తమ నాట్యగురువుగా, సిలికాన్  ఆంధ్ర అంతర్జాతీయ కూచిపూడి కన్వెన్షన్ లో ఆనాటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, మారిషస్‌ ప్రెసిడెంట్‌ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాను.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నృత్యరత్న బిరుదుతోపాటు, ఉత్తమ నర్తకి–నాట్యగురు అవార్డులను పొందాను. 1984లో ఇండియన్  కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్ (న్యూ ఢిల్లీ) ఆధ్వర్యంలో ఉత్తమ కళాకారిణిగానూ, భారత్‌తో పాటు విదేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలకు న్యాయనిర్ణేతగా సేవలందించాను.

గత డిసెంబర్‌లో స్ట్రోక్‌ వచ్చి వీల్‌చెయిర్‌లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా నా కళా తపన ఆగలేదు. వీల్‌ చెయిర్‌ నుంచే విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణను అందిస్తున్నాను. ఈ నెల 6న రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక పురస్కారాన్ని వీల్‌చెయిర్‌లో ఉండే అందుకున్నాను. నా శ్వాస ఉన్నంతవరకు కళాసేవలో తరించాలని, కళలో ఔత్సాహికులను నిష్ణాతులను చేయాలన్నదే నా తపన’ అంటూ ఉషాగాయత్రి తన సుదీర్ఘ నృత్య ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా మన ముందు ఆవిష్కరించారు.

– హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి సిటీ, హైదరాబాద్‌

Advertisement
 
Advertisement
 
Advertisement