పుష్కరాల పండగొచ్చింది! | krishna pushkaralu - 2016 | Sakshi
Sakshi News home page

పుష్కరాల పండగొచ్చింది!

Published Sun, Aug 7 2016 11:15 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

పుష్కరాల పండగొచ్చింది!

పుష్కరాల పండగొచ్చింది!

కృష్ణానది స్వగతం

నన్ను ‘అమ్మా’ అని పిలుచుకునే రైతుబిడ్డలు ఎప్పుడూ కనిపిస్తుంటారు. నా దీవెనల కోసం తపిస్తుంటారు. నేను చల్లగా, కడుపు నిండుగా ఉండాలని కోరుకుంటారు. అప్పుడప్పుడూ పిల్లాపాపలతో పర్యాటకులు వచ్చి నా అణువణువునూ తడిమి చూడాలని తపన పడుతూ నిలువెల్లా తడిసిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు... నా తీరాన కొత్త మనుషులు కనిపిస్తున్నారు.

మడత నలగని చొక్కాలు, ప్రభుత్వ వాహనాలు, ఫైలు పట్టుకున్న బిళ్ల బంట్రోతు. ఒకరు కొలతలు వేస్తున్నారు, ఒకరు గుర్తులు పెడుతున్నారు. గెంతులు వేస్తున్న జింకలు ఆగి మరీ ఈ తతంగాన్ని చూస్తున్నాయి. పక్షులు ఓ కంట చూసి రెక్కలు టపటపలాడిస్తూ వెళ్లిపోతున్నాయి. మరాఠా, కన్నడ, తెలుగు కుటుంబాలు ప్రయాణాలకు సిద్ధమవుతున్నాయి. అవును మరి. నాకు పండుగ కళ వస్తోంది. వేడుకకు నన్ను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి వేడుక జరిగి పుష్కరకాలమైంది. ఇప్పుడు నాకు మళ్లీ పండగొచ్చింది. గత ఏడాది గోదారమ్మ పండుగ చేసుకుంది. అప్పటి నుంచి ఈ ఏడాది నా పండుగను తలుచుకుంటూనే ఉన్నారు.
 
 నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నేను దేశంలో పెద్ద నదుల్లో నాలుగో స్థానంలో ఉన్నాను. గంగమ్మ, గోదారమ్మ, బ్రహ్మపుత్ర నాకంటే పెద్దవి. ఉత్తరాదిన గంగమ్మకు ఇచ్చిన స్థానం దక్షిణాదిలో మహాగణపతి సాక్షిగా నాకే ఇచ్చారు. పశ్చిమ కనుమల్లో నేను పుట్టిన మహాబలేశ్వర్‌కు దగ్గరలోనే ‘వాయికారులు’ నా తీరాన విశ్వేశ్వరాలయం కట్టి దక్షిణకాశి అని పేరు పెట్టుకున్నారు. స్నాన ఘాట్‌లు కట్టి ఏడాదంతా నన్ను దర్శించుకుని, పవిత్ర స్నానాలు చేస్తున్నారు. దేవగిరి రాజు నేను పుట్టిన చోట నాకు ‘కృష్ణబాయి ఆలయం’ కట్టాడు. సముద్రమట్టానికి 1,300 మీటర్ల ఎత్తులో పుట్టి బిరబిరా పరుగులు పెట్టే నా ప్రవాహం కవుల ఊహకు మాత్రమే అందగలిగిన ఓ సృజనాత్మకత. అరేబియా సముద్రానికి 64 కిలోమీటర్ల దూరాన పుట్టి అటుగా పయనించక... వయ్యారాలు పోతూ వలపుల మలుపులు తిరుగుతూ 1,400 కిలోమీటర్ల దూరం వడివడిగా పరుగులు తీయడంలోనూ ఓ సృజనాత్మకత దాగి ఉంది. ఇంతకంటే గొప్ప ఊహ నా బిడ్డలది. నాకు ఆలయం కట్టిన చోటనే ఓ తటాకాన్ని తవ్వి నా ప్రవాహాన్ని అందులోకి మళ్లించి గోముఖం నుంచి బయటపడేటట్లు నాకో చక్కని దారినిచ్చారు. శివాజీ అనుచరుడు ఆ ఆలయంలో నన్ను మొక్కిన తర్వాతనే అఫ్జల్‌ఖాన్ మీద విజయం సాధించాడని విజయోత్సవాలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. అప్పటి నుంచి ఏటా ఆ సంతోషాన్ని నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు మరాఠా బిడ్డలు.
 
 నాతోపాటు నలుగురు!
 నేను పుట్టిన మహాబలేశ్వర్ కొండల్లోనే పుట్టిన కొయ్‌నా, వేణి, సావిత్రి, గాయత్రి వచ్చి నాతో కలిసే వరకు నేను కృష్ణమ్మనే. వేణితో కలిసి కృష్ణవేణినయ్యాను. మా అందరినీ కలిపిన నేలను పంచగంగగా కొలుస్తారు. జనం నన్ను జీవనదిగా కొలుస్తారు. కానీ... నాకు ఆ గౌరవాన్ని తెచ్చి పెట్టిన నా ఉపనదులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? వారణ, భీమ, డిండి, ఎర్ల, పెద్దవాగు, హాయిలా, మూసీ, పాలేరు, మున్నేరు, దూద్‌గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగ-భద్రల్లో చాలా నదులు నాలో కలిసి తమ ఉనికినే త్యాగం చేస్తున్నాయి. నా తీరాన వెలసిన రాజ్యాలు, పాలకులు, పాలితులు నన్ను ఎప్పుడూ వేరుగా చూడలేదు. వారి జీవితంలో నేనూ ఓ భాగం అయ్యాను. జొన్న, మొక్కజొన్న, వరి ధాన్యాలనిస్తున్నాను. నేలను సారవంతం చేయాలనే తపనతో అంత ఎత్తు నుంచి నేలకు దూకుతుంటాను కదా. అందుకే నాకు తొందరెక్కువ. స్థితప్రజ్ఞతతో మంద్రంగా ప్రవహించడం నాకు చేతకాని పని. నిజమే... నన్ను శంకరంబాడి సుందరాచారి బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోందన్నాడు. ఆ బిరబిరలో భూదేవి గుండెను నిలువునా చీల్చేస్తుంటాను. 75 అడుగుల లోతుకు తొలుస్తున్నా కూడా ఆ సహనమూర్తి నా కోతను భరిస్తూ నా ప్రవాహానికి దారినిస్తుంది.
 
 మహాబలేశ్వర్ నుంచి హంసలదీవి దగ్గర ఉన్న పాలకాయి తిప్ప వరకు ఆద్యంతం కనువిందు చేసే నా ప్రవాహంలో... కునె, గోకక్, గోడ్చిన మలకి, కల్‌హట్టి, సిరిమనె, యతిపోతల, మల్లెల తీర్థం జలపాతాలది సింహభాగం. విశాలమైన చెట్లు చేమల మీద సేదదీరే వలస పక్షులకు ఘటప్రభ, గుడావి ఓ మజిలీ. వన్యప్రాణులు నా తీరాన విస్తరించిన అడవుల్లో ధైర్యంగా సంచరిస్తుంటాయి.
 
 కృష్ణ సౌరభాలు!
 కవుల కలాల్లో ఇంకిన సిరాని నేను. మరాఠులైతే మంచి మనిషిని నాతో పోలుస్తారు. తెలుగు కలాలు నల్లని కురులున్న అమ్మాయిని నాతో పోలుస్తాయి. ‘కృష్ణమ్మ అందాలు...’ అంటూ ఒకరు రాస్తే, ఆ ఒడ్డు- ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు’ అంటూ మరో కవి రాస్తాడు. నా తీరం కళలకు కాణాచి. కూచిపూడి మువ్వల రవళి నా తీరాన్నే ఘల్లుమంది. చరిత్రలో సూర్యప్రభలా వెలిగిన శాతవాహన, ఇక్ష్వాకు రాజవంశాలు నా తీరంలోనే రాజ్యాలను విస్తరించుకున్నాయి. మౌర్యుల నుంచి స్వాతంత్య్రం పొందిన శాతవాహనులు నా తీరాన్నే స్వతంత్య్ర రాజ్యం ఎంచుకున్నారు. అలా తొలి తెలుగు రాజ్యం నా తీరానే వెలిసింది. ఇప్పుడు నా తీరమే రాజధానికి ఆధారం అనే కొత్త పల్లవి విని అంతగానే పరవశించిపోయాను. కానీ... పంట పొలాలకు ఇవతల నేను ప్రవహిస్తుంటే అవతల రైతుబిడ్డ కన్నీరు ప్రవహిస్తోంది. ఆ కన్నీటిని తుడిచే గుండె గల మనిషి కోసం నా కళ్లు వెతుకుతున్నాయి.
 
 బౌద్ధగమనం!
 ఉత్తరాదిలో నిరంజన నది తీరాన పుట్టిన బౌద్ధం దక్షిణాదిలో నా తీరాన పరిఢవిల్లింది. ఇప్పుడు బౌద్ధం కనిపించడం లేదు కానీ ఆచార్య నాగార్జునుడి శ్రమకు ఆనవాళ్లు మాత్రం ఉన్నాయి. అవి బౌద్ధాన్ని గుర్తు చేస్తున్నాయి. విగ్రహారాధన, పూజాదిక్రతువులు వద్దని చెప్పిన బుద్ధుడిని అనుసరించిన తరాలను చూశాను. ఆ తర్వాత బుద్ధుడి విగ్రహానికే పూజలు చేస్తున్న తరాలనూ చూశాను. బౌద్ధకాలచక్రం కోసం స్వయంగా దలైలామా అమరావతికి వస్తే సమసమాజం కోసం బుద్ధుడు చెప్పిన ప్రవచనాలను వినిపిస్తాడేమో... అనుకున్నాను. కానీ ఆయన బుద్ధుడి విగ్రహానికి పూజలు చేసి వెళ్లాడు. నాగార్జున కొండ ఆత్మీయులను దూరం చేసుకున్న పసిబిడ్డలా ఉందిప్పుడు. బౌద్ధవిస్తరణ కాలంలో వెలిసిన స్థూపాలు, చైత్యాలు, ఆరామాలు రిజర్వాయర్ ముంపులో మునిగి పోయి శిఖరం మాత్రం ఒక దీవిలా కనిపిస్తోంది. రిజర్వాయర్ నిర్మాణం కోసం స్థానభ్రంశం చెందిన బౌద్ధ ప్రతీకలు నా మీద అలకబూనినట్లే కనిపిస్తుంటాయి.
 
 ఆ ఒడ్డు... ఈ ఒడ్డు!
 నా తీరాన అడవులున్నాయి, కొండ కోనలున్నాయి. పంటపొలాలున్నాయి, నివాస ప్రదేశాలున్నాయి. అయితే వాటి మధ్య నేను... ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి మధ్య ఓ విభజన రేఖలా ఉండేదాన్ని. బ్రిటిష్ పాలకులు ఆ దూరాన్ని తగ్గించేశారు. మహారాష్ర్టలో ‘వాయి’ దగ్గర కృష్ణ వంతెన మొదలు, సంగ్లి దగ్గర ఇర్విన్ వంతెన. ఇక మహారాష్ట- కర్నాటకలను కలుపుతూ రాయిబాగ్ దగ్గర సౌందట్టి వంతెన, బీజాపూర్- భాగల్‌కోట్‌లను కలుపుతూ తంగదాగి వంతెన కట్టే వరకు పడవ ప్రయాణమే ఏకైక మార్గం. వంతెనలు కట్టాక పాదం తడవకుండా ప్రయాణం చేయగలగడం సాధ్యమైంది.
 
 నా పరుగుకు పగ్గాలు!
 కొండంత మబ్బు ఒక్కసారిగా ఒలికిపోయినట్లు ఉంటుంది నా ప్రవాహం. అంత నీటిని సాగరం పాలు కానివ్వకుండా ఆనకట్టలు కడుతుంటే ఇదీ మంచిదే... అని మురిసిపోయాను. అందరూ నా బిడ్డలే. అన్ని కంచాల్లోకి అన్నం రావాలనేదే నా తపన కూడా. అలా మొదలైన ఆనకట్టల పరంపర నన్ను నన్నుగా ఉంచుతారా లేదా అని సందేహపడేటట్లు చేస్తోందిప్పుడు. ధోమ్, హిప్పగిరి, కానూర్, అమర్, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, పులిచింతల, తుంగ-భద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్‌లతో అడుగడుగునా ఆనకట్టలే. పైగా ఎవరెంత నీటిని నిలుపుకోవాలనే వివాదాలు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఆనకట్ట తలుపులు తెరుస్తారో? మాకు ఎక్కువయ్యావు... చాలు పొమ్మని నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు.
 
 నా ప్రవాహాన్ని నిలువరించుకోవడం నా చేతుల్లో ఉండదు. ఒక్కసారిగా ఊళ్లను ముంచేస్తాను.
 అయినా... మనిషికి ఎంతిచ్చినా ఇంకెంతో పొందాలనే అశ. అయితే అంతటి అశ ఉండాలేమో! ఆ ఆశే లేకపోతే నిశీధిని నీటితో వెలిగించడం సాధ్యమయ్యేది కాదేమో? నా మీద జలవిద్యుత్ కేంద్రాలతో జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నాడు. అంతటితో సంతోషించక నా తీరాన నెలకొల్పిన బొగ్గు కరెంటు కేంద్రాలు విడుదల చేసి బూడిదను నాలోకే వదిలి నన్ను కలుషితం చేస్తున్నాడు. అదేమంటే అభివృద్ధి అంటాడు. బిడ్డ అభివృద్ధి చెందుతున్నాడని సంతోషించడమే నేను చేయగలిగింది.
 
 ప్రాచీనకాలంలో మనిషి నన్ను శుద్ధి చేయడం కూడా తన బాధ్యతే అనుకునేవాడు. నదిని చూసినప్పుడు ఒక నాణెం వేయడాన్ని ఆనవాయితీగా అనుసరించాడు. నాణెం వేయడం అనే నమ్మకాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. అయితే అప్పటి నాణేలు రాగివి. వాటికి నీటిని శుద్ధిచేసే గుణం ఉండేది. ఇప్పటి నాణేలకు ఆ గుణం లేదు. అయినప్పటికీ వేస్తూనే ఉన్నారు. ఆ లోహాలను కూడా నా కడుపులో కరిగించుకునే ప్రయత్నం చేస్తున్నాను.

పుణ్యతీరం!
 భారతీయ పురాణాలు నన్ను విష్ణువు స్వరూపం అంటాయి. విష్ణువు అవతారమైన కృష్ణుడి పేరే నా పేరంటాయి. కృష్ణుడికైనా, నాకైనా ఆ పేరును తెచ్చింది మా నల్లదనమే. నాలో మునిగి లేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వాసం. దత్తాత్రేయుడు ఔదుంబర్‌లో నా తీరాన నివసించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైల క్షేత్రం నా తీరానే ఉంది. అది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం కూడా. జోగులాంబ నా తీరానే అలంపూర్‌లో ఉంది. రెండు సంగమేశ్వరాలయాలకు సాక్షిని. సంగ్లి దగ్గర వరుణ నది కలిసే ప్రదేశంలో ఒకటి, కర్నూలులో తుంగభద్ర కలిసే చోట ఓ సంగమేశ్వరాలయం ఉన్నాయి. ఇక అమరావతిలోని అమరేశ్వరాలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ ఆలయం నిత్యం వేదమంత్రోచ్ఛారణతో నా తీరాన్ని పులకింప చేస్తుంటుంది. నా తీరాన ఆలయాలు కట్టిన పాలకులను చూశాను. దేవుడి విగ్రహాలను నా నీటితో అభిషేకించి భక్తిగా కళ్లు మూసుకుని దణ్ణం పెడితే ముచ్చటపడ్డాను. ఇప్పటి పాలకులు ఆ ఆలయాలే అడ్డు అని కూలుస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నాను.
 
 పుష్కరశోభ!
 నా తీరాన విస్తరించిన చెట్లు పక్షులకు ఆవాసాలు. అవి కువకువలాడుతుంటే ఆలకిస్తాను. వలస పక్షులు వస్తుంటాయి పోతుంటాయి. ఏడాది మారిందని నాకు చెప్పకనే చెబుతుంటాయి. అలా పన్నెండు ఏడాదులు మారితే పుష్కరకాలం. సందడే సందడి. పెద్ద పండుగకు పిల్లలంతా వచ్చినట్లు ఉంటుంది. జనం నేలను చీల్చుకుని పుట్టుకొచ్చినట్లు కనిపిస్తారు. నాలో మునిగి, లేచి గుండెల నిండా గాలిపీల్చుకుంటుంటారు. చన్నీరు ఒంటిని వణికిస్తుంటే, అరచేత్తో కళ్లను తుడుచుకుని ఆశ్చర్యంగా ఒంటిని చూసుకుంటుంటారు పిల్లలు.

బాల్యం ఎంత అందమైనదో. వాళ్లనలా చూస్తుంటే ఈ పండగ ఇలాగే ఉంటే బావుణ్ణు. పుష్కరానికోసారి నా బిడ్డలందరూ నన్ను పలకరిస్తారు. ప్రేమగా స్పృశిస్తారు. వాయి దగ్గర కృష్ణమాయి నుంచి విజయవాడలోని కృష్ణవేణి వరకు నా ప్రతీకలుగా ఉన్న దేవతామూర్తులందరికీ వందనం చేస్తారు. నన్ను ఇంత ప్రేమిస్తున్న బిడ్డలకు నేనేమివ్వగలను?
 ఏటా పంటలతో సస్యశ్యామలం చేయడం తప్ప! అందుకే తెలుగుతల్లి మెడలోని పూలదండలో నేనూ ఓ పరిమళ సుమాన్నయ్యాను.
 - వాకా మంజులారెడ్డి
 
నా మీద నాగార్జునసాగర్ ఆనకట్ట కట్టారు. దానిని అప్పట్లో దేశం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ప్రధాని నెహ్రూ కలలకు ప్రతిరూపం అది. ప్రపంచంలో నిర్మించిన పొడవైన ఆనకట్ట. బహుళార్థసాధకంగా నిర్మించిన ఆ ఆనకట్ట మీద నుంచి రాత్రి ప్రయాణిస్తే ఆకాశంలో నక్షత్రాలన్నీ నేలకు దిగి నా ముంగిట ప్రణమిల్లినట్లు ఉంటుంది. సాగర్ ప్రాజెక్టు నుంచి 11 కి.మీ.ల దూరంలో యతిపోతల జలపాతం ప్రకృతి తీర్చిదిద్దుకున్న అద్భుతం.
 
అమరావతికి వస్తే రెండు వేల ఏళ్ల నాటి బౌద్ధస్థూపాన్ని అబ్బురంగా చూసి మురిసిపోవచ్చు. ద్రావిడ నిర్మాణశైలిలో ఉన్న అమరేశ్వరాలయం ప్రముఖమైనది. అక్కడి నుంచి విజయవాడను పలకరిస్తే కనకదుర్గమ్మ కొండ మీద ఠీవిగా కనిపిస్తుంది. అర్జునుడు తపస్సు చేసిన ఇంద్రకీలాద్రి ఇదే. ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి నా ప్రవాహాన్ని చూస్తూ, పిల్లతెమ్మెరలను ఆస్వాదించని వారుండరు. ఇక్కడికి దగ్గరలోనే ఉంది భవానీ ద్వీపం. ఇక్కడి వరకూ వచ్చాక ఉండవల్లి గుహలను చూడకుండా వెళ్లవద్దు.
 
 నా పుట్టిల్లు...
 నేను పుట్టిన మహాబలేశ్వర్ కొండలు అడుగడుగునా ప్రకృతి సౌందర్య వీచికలే. నదుల కలయిక, ఉపనదుల సంగమాలు, జలపాతాల ఝరులు... కమనీయ దృశ్యాల సుమహారాలు.
 లాడ్విక్ పాయింట్ నుంచి చుట్టూ చూస్తే కలిగే పరవశం అంతా ఇంతా కాదు. అర్థర్ పాయింట్‌ను క్వీన్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అని కూడా అంటారు. అందమైన ప్రదేశాలను బ్రిటిష్ కాలంలో విదేశీ టూరిస్టులు కనిపెట్టడంతో పేర్లన్నీ పాశ్చాత్య వాసన వస్తుంటాయి. అర్థర్ పాయింట్ నుంచి చూస్తే లోయలో సావిత్రి మౌనంగా ప్రవహిస్తుంటుంది.
 
 నా పరుగును ఆపి... ఎల్ఫిన్‌స్టోన్ పాయింట్, టైగర్స్ స్ప్రింగ్, కేట్స్ పాయింట్, బాంబే పాయింట్, విల్సన్ పాయింట్, వెన్నా లేక్, లింగమల, చినమాన్, దోభీ వాటర్ ఫాల్స్ అందాలను కళ్లారా చూద్దామని పిస్తుంది. కేట్స్ పాయింట్‌ని సన్‌రైజ్ పాయింట్ నుంచి చూస్తే... పశ్చిమ కనుమల సౌందర్యాన్ని చూడడానికి సూర్యుడు పర్వతాల మీదకు పరుగులు తీస్తున్నట్లు ఉంటుంది. ఐదు నదుల జన్మస్థానం కావడంతో నా పుట్టింటిని ‘ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్’ అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement