పరమపావని ఆ మాత...
ఈ పుణ్యభూమిలో కృష్ణమ్మను భక్తితో స్మరించేవారు సంసారమాయను దాటగలరని స్కాంద పురాణం చెబుతోంది.. తనను భక్తితో సేవించే వారి కష్టాలు పారద్రోలడానికి ఈ నది నిత్యం ప్రవహిస్తూ జీవనది అయింది. భక్తితో కృష్ణాజలాలను సేవించేవారి హృదయాలలో విష్ణుమూర్తి నివసించి, సంసార భయం పోగొట్టి, జ్ఞానం ప్రసాదిస్తాడు. శాంతిని కోరేవారికి కృష్ణామహాత్మ్యం మంచి ఔషధంగా పనిచేస్తుంది.
కృష్ణునిచే సృష్టించబడిన ఈ తల్లి, సర్వపాపాలను తొలగించేది కనుక కృష్ణ అనే పేరు సార్థకమైంది. విష్ణుమూర్తి అనుజ్ఞ ప్రకారం కృష్ణమ్మను బ్రహ్మదేవుడు తన కుమార్త్తెగా చేసుకున్నాడు. సకల పాపాలను తొలగించే కృష్ణమ్మ పవిత్రగాథను కుమారస్వామికి శివుడు వివరించగా, ఆ గాథను నారదుడు వివరిస్తున్నాడు..
బ్రహ్మాది దేవతలతో పూజలు అందుకుంటున్న శివుని దర్శించాలని ఒకనాడు కుమారస్వామి కైలాసానికి వచ్చి, తండ్రితో, ‘దేవా! నమస్కారం. అష్టమూర్తివై వెలుగుతున్న నీ విభూతిరేఖలే కదా ఈ పుణ్యనదులన్నీ. కృష్ణవేణీ మహాత్మ్యం వినాలని ఉంది’ అన్నాడు.
బ్రహ్మలోకం నుండి కృష్ణవేణి భూమికి వచ్చుట...
కృతయుగంలో కృష్ణవేణి దేవతల చేత, మహర్షుల చేత సేవించబడుతూ, పుణ్యమూర్తిగా విరాజిల్లుతోంది. ప్రజలంతా ఉత్తమ, అధమ తేడా లేకుండా కాలం గడుపుతున్నారు. కాలానుగుణంగా వారిలో వారికి కలహాలు బయలుదేరాయి, ఆనందం తరిగిపోయింది. పాపం వృద్ధి చెంది, ప్రజానాశనం జరగటం చూసి, రక్షణోపాయం ఆలోచించి, కృష్ణునితో ‘పాపవిముక్తి కోసం కృష్ణవేణినదిని సృష్టించారు. ఇప్పుడు అది బ్రహ్మలోకంలో ఉంది. నీవు వెంటనే అక్కడకు వెళ్లి, కృష్ణానదిని భూలోకానికి తీసుకుని వచ్చి, భూమి మీద పాపాలను ప్రక్షాళన చేసే తీర్థాలను సృష్టించు, లే కపోతే లోకస్థితి తారుమారవుతుంది’ అన్నారు.
వారి కోరిక మేరకు కృష్ణుడు కృష్ణానదిని కానుకగా పొంది, భూమి మీదకు తీసుకువస్తున్న సమయంలో, కృష్ణవేణి ఏ ప్రదేశంలో నిలుస్తుందా అని బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు వెంట వస్తున్న సమయంలో, ఒక చోట ఒక మహాతపస్విని చూచి, ‘నువ్వు ఎవరు? ఇక్కడ ఎందుకు తపస్సు చేస్తున్నావు? కృష్ణవేణీ మాత వస్తున్న సందర్భంగా వరం కోరుకో, ఆ తల్లి ప్రసాదిస్తుంది’ అన్నారు. ఆ మహర్షి, ‘నేను సహ్యాద్రిని. ఈ నది ఇక్కడ ప్రవహించాలి. ఈ పవిత్ర నదీజలంతో స్నానం చేసి పవిత్రుడనవుతాను. ఆ తల్లి అనుగ్రహంతో లోకంలో ప్రసిద్ధి చెందుతాను’ అన్నాడు. ‘ఓ మహాత్మా! నువ్వు కోరినట్లే నీ నుండి ఉద్భవించి ‘సహ్యజ’ పేరుతో ప్రసిద్ధి చెందుతాను.
నాకు చెల్లెళ్లయిన ఇతర నదులు కూడా నీ నుండే జన్మించే వరం కూడా ఇస్తున్నాను’ అని కృష్ణవేణి అనుగ్రహించింది. సహ్యాద్రి సంతోషించి కృష్ణమ్మను తనతో తీసుకువెళ్లాడు. కృష్ణమ్మ తల్లి ప్రభావంతో స్వర్గం విశాలమైపోయింది. నరకం కుంచించుకుపోయిందని ఋషులు, దేవతలు ప్రశంసించారు. ఆ సమయంలో విష్ణుమూర్తి, ‘నేను శ్వేత అశ్వత్థ రూపంలో ఉంటాను. కృష్ణవేణి కూడా ఆ చెట్టు మొదటి నుంచే బయలుదేరి ప్రకాశిస్తుంది’ అని చెప్పి ఆయన అశ్వత్థ రూపం ధరించాడు. కృష్ణమ్మ ఆ చెట్టు మొదట్లో జలధారగా రూపొందింది. ఆ తల్లి లోకంలోని పాపాలను కడుగుతూ పూర్వదిశగా ఉన్న సముద్రంలో చేరింది. అది మొదలు కృష్ణాతీరంలో అడుగడుగునా తీర్థాలు వెలశాయి.. వేదాలలో ఋగ్వేదంలాగ తీర్థాలలో కృష్ణవేణి ఉత్తమం...’ అని శివుడు చెప్పగా స్కందుడు స్వర్గానికి వెళ్లాడు.
- డా.పురాణపండ వైజయంతి
సాక్షి, విజయవాడ
శ్రీ దత్తాత్రేయస్వామి కలియుగ అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలోని గురుద్వీపంలో తన అవతారాన్ని చాలించారు. కృష్ణానది మధ్యన ఉన్న ఈ చిన్న దీవి పేరు నిజానికి కురవపురం. దీనినే కురుగడ్డ, కురంగడ్డ అని కూడా అంటారు.