పుష్కరాలు... గురుగ్రహ సంచారం | krishna pushkaralu - 2016 | Sakshi
Sakshi News home page

పుష్కరాలు... గురుగ్రహ సంచారం

Published Sun, Aug 7 2016 10:16 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

పుష్కరాలు... గురుగ్రహ సంచారం

పుష్కరాలు... గురుగ్రహ సంచారం

 మనదేశంలోని పన్నెండు ప్రధాన నదులకు పుష్కరాలు జరుగుతాయి. ఒక్కో నదికి ఈ పుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతాయి. అయితే, ప్రతి ఏడాదీ ఈ పన్నెండు నదులలో ఏదో ఒక నదికి పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి. గురుగ్రహ సంచారం ఆధారంగా ఈ పన్నెండు నదులకూ పుష్కరాలు ఏర్పడుతుంటాయి. మేషం నుంచి మీనం వరకు గల పన్నెండు రాశులలో గురువు ఒక్కో రాశిలో ఉన్నప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు జరుగుతాయి. గురువు ఒక్కో రాశిలో ఏడాది పాటు ఉంటాడు. గురువు ఏ రాశిలో ఉన్నప్పుడు ఏ నదికి పుష్కరాలు జరుగుతాయంటే...
 
పుష్కరాల నేపథ్యం... పుష్కరుడి గాథ
వరుణదేవుడి కొడుకైన పుష్కరుడి వల్ల నదులకు పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు ఒకసారి బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు. విష్ణువు పాదాల నుంచి ఉద్భవించిన పవిత్రజలాల్లో నిరంతరం జీవిస్తూ, నదులకు పరిశుద్ధత కల్పించేలా తనకు శాశ్వత పవిత్రతను అనుగ్రహించాలని వేడుకున్నాడు పుష్కరుడు. నిస్వార్థమైన పుష్కరుడి కోరికకు బ్రహ్మదేవుడు వెంటనే సరేనంటూ వరాన్ని అనుగ్రహించాడు.
 
పుష్కరుడు వరాలు పొందే సమయానికి దేవగురువైన బృహస్పతి కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయసాగాడు. బృహస్పతి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరుకోమన్నాడు. ‘దేవా! నీ అనుగ్రహం వల్ల శాశ్వత పవిత్రతను పొందిన పుష్కరుడు నన్ను ఎల్లవేళలా వెన్నంటి ఉండేలా వరం ప్రసాదించు’ అని కోరుకున్నాడు దేవగురువు. ‘పుష్కరుడికి నేను వరమిచ్చిన మాట నిజమే! అయితే, అతడు స్వతంత్రుడు. అతడి అభిప్రాయం కోరదాం. అతడు సరేనంటే నాకేమీ అభ్యంతరం లేదు’ అన్నాడు బ్రహ్మదేవుడు.
 
 పుష్కరుడిని పిలిచి, దేవగురువు కోరికను తెలిపాడు. తాను స్వేచ్ఛాసంచారినని, ఎల్లవేళలా దేవగురువును వెన్నంటి ఉండటం తనకు సాధ్యం కాదని తేల్చేశాడు పుష్కరుడు. అతడి మాటలతో బృహస్పతి నిరాశ చెందాడు. దీనికి పరిష్కారంగా బ్రహ్మదేవుడు ఒక మధ్యేమార్గాన్ని సూచించాడు. దేవగురువు ఒక రాశిలోకి ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు, ఆ రాశిని విడిచిపెట్టే ముందు చివరి పన్నెండు రోజులూ అతడిని అనుసరిస్తూ ఉండాలని కోరాడు.

బ్రహ్మదేవుడి సూచనకు సమ్మతించాడు పుష్కరుడు. ఒక్కో రాశికి ఒక్కో పవిత్రనది చొప్పున ఎంపిక చేసి, దేవగురువు ఆయా రాశుల్లో ప్రవేశించిన తొలి పన్నెండు రోజులు, తుది పన్నెండు రోజులు ఆయా నదుల్లో ఉండేందుకు అంగీకరించాడు. పుష్కరుడు ఉండే సమయాల్లో ఆయా నదులకు పవిత్రత ఏర్పడుతుండటంతో నాటి నుంచి వాటి పుష్కరాలు నిర్వహించడం మొదలైంది.
 
ద్వాదశరాశుల్లో గురుగ్రహ సంచార ఫలితాలు
నవగ్రహాలలో దేవగురువైన బృహస్పతి కూడా ఒకరు. జ్యోతిష పరిభాషలో బృహస్పతినే గురుగ్రహంగా సంబోధిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం గురువు నైసర్గిక శుభుడు. అంటే, సహజంగానే శుభాలను ఇచ్చే గ్రహం. సంపదకు, అదృష్టానికి, అధ్యయన శక్తికి, విద్యకు, కుటుంబంలో శాంతి సామరస్యాలకు, వంశాభివృద్ధికి కారకుడు గురువు.

జాతకరీత్యా, గోచార రీత్యా గురువు అనుకూల స్థానాల్లో ఉన్నప్పుడు తన కారకత్వాలకు సంబంధించి సకల శుభఫలితాలను అనుగ్రహిస్తాడు. అననుకూల స్థానాల్లో ఉన్నప్పుడు తన కారకత్వాలకు సంబంధించి శుభఫలితాలను అందించలేకపోతాడు. అలాంటి సమయాల్లోనే జాతకులకు ఆయా అంశాలకు సంబంధించిన ఈతిబాధలు ఎదురవుతాయి. ద్వాదశరాశుల్లో గురుగ్రహ ఫలితాలు ఇలా ఉంటాయి...
 
 జన్మరాశి: ఆరోగ్యం, కార్యసిద్ధి, ఆర్థికలాభం, శుభకార్యాలు, ఆధ్యాత్మిక చింతన
 ద్వితీయం: ఆర్థికలాభం, సంఘంలో పలుకుబడి, సంపద పెరుగుదల, సంతానం వల్ల సంతోషం
 తృతీయం: ఆరోగ్యం, విద్యలో పురోగతి, శ్రమ, వృథా వ్యయం
 చతుర్థం: సంతోషం, కుటుంబసౌఖ్యం, మనశ్శాంతి, ఆర్థికలాభం, వాహన సౌఖ్యం
 పంచమం: విద్యాభివృద్ధి, కళాభినివేశం, పాండిత్యం, ప్రేమ వ్యవహారాలు, సంతానలాభం
 షష్టం: ఆరోగ్యభంగం, అలజడి, శ్రమానంతర ఫలితం, ఆర్థిక ఇబ్బందులు
 సప్తమం: వివాహయోగం, దాంపత్య సౌఖ్యం, సంతానలాభం, సాంఘిక గౌరవం, ఆర్థికలాభం
 అష్టమం: మనశ్శాంతి లోపం, రహస్య శత్రుపీడ, ఆర్థిక పురోగతికి అవరోధం, నిరుత్సాహం
 నవమం: ఆరోగ్యలాభం, ఉత్సాహం, కార్యసిద్ధి, ఆర్థికలాభం, పేరు ప్రఖ్యాతులు
 దశమం: కార్యక్షేత్రంలో విజయం, ప్రభుత్వ ఆదరణ, కుటుంబ సౌఖ్యం, సాంఘిక గౌరవం
 ఏకాదశం: ఆర్థిక పురోగతి, వ్యాపార విజయం, పదవీలాభం, శ్రమాధిక్యత, సాంఘిక గౌరవం
 ద్వాదశం: ఆరోగ్యభంగం, ఆశాభంగం, మనస్తాపం, శ్రమాధిక్యత, విదేశ గమనం
 
 
 గురువు సంచరించే రాశి     నది
 మేషం    గంగ
 వృషభం    నర్మద
 మిథునం    సరస్వతి
 కర్కాటకం    యమున
 సింహం    గోదావరి
 కన్య    కృష్ణ
 తుల    కావేరి
 వృశ్చికం    భీమ
 ధనుస్సు    పుష్కరవాహిని
 మకరం    తుంగభద్ర
 కుంభం    సింధు
 మీనం    {పణీత
     (ప్రాణహిత)
 
 గురుదోష పరిహారం
గోచార ఫలితాల ఆధారంగానే కాకుండా, జాతకంలో గురు గ్రహం స్థితిగతుల ఆధారంగా, గురువు బలహీనంగా ఉన్నట్లయితే జ్యోతిషులను, పురోహితులను సంప్రదించి పరిహారాలను చేయించుకోవాల్సి ఉంటుంది. గురుగ్రహ పరిహారాల్లో కొన్ని...
శనగలు, పసుపు వస్త్రాలను పండితులకు దానం చేయాలి.
గురుగ్రహ మంత్రాన్ని 16 వేలసార్లు జపం చేయాలి. జపాన్ని 11 దినాల్లో పూర్తి చేయాలి.
స్వయంగా జపం చేసుకోలేని వారు ఇతోధిక దక్షిణ తాంబూలాలిచ్చి ఇందుకోసం పురోహితుని నియోగించుకోవచ్చు.
గురుగ్రహ శాంతి యజ్ఞం నిర్వహించడం వల్ల కూడా సత్ఫలితాలు ఉంటాయి.
కుడిచేతి చూపుడువేలికి కనకపుష్యరాగాన్ని ధరించాలి
శ్రీ మేధాదక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయడం మంచిది.
గణేశారాధన, రుద్రాభిషేకం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement