పుష్కర తృష్ణ
ఆశలు తీర్చుకోవాలనే ఆకలి ఉన్నట్లే
ఆశయాలు తీర్చుకోవాలనే దాహం ఉండాలి.
దాన్నే తృష్ణ అంటారు.
నదులతో మానవాళి అనుబంధం ఈనాటిది కాదు. అది అనాదిగా కొనసాగుతూనే ఉంది. దేశదేశాల్లోని నాగరికతలు నదీతీరాల్లోనే వెలశాయి. జీవధారలైన నదులు మానవాళికి ప్రాణాధారాలుగా నిలుస్తున్నాయి. అన్ని దేశాల్లోనూ నదులను గౌరవిస్తారు. మన దేశంలో నదులను నదీమాతలుగా పూజిస్తారు కూడా. నదీమాతలకు అందరూ బిడ్డలే! నదులు నేలను సస్యశ్యామలం చేస్తాయి. నవధాన్యాల సిరులు పండిస్తాయి. సకల చరాచర జీవరాశుల మనుగడకు భరోసా ఇస్తాయి.
నదులు దాహార్తిని తీరుస్తాయి. ఉధృత ప్రవాహంతో సమస్త కశ్మలాలనూ ప్రక్షాళన చేస్తాయి. కశ్మలాలంటే బాహ్య కశ్మలాలనేనా? అంతఃకశ్మలాలను కూడా జీవనదులు ప్రక్షాళన చేస్తాయని, అన్ని పాపాలనూ కడిగేసి లోకులను పునీతం చేస్తాయని భారతీయులు నమ్ముతారు. అందుకే నదీతీరాల్లో అన్ని తీర్థాలు వెలశాయి. అన్ని క్షేత్రాలు వెలశాయి. అవన్నీ మన వేద శాస్త్రాల్లో, పురాణేతిహాసాల్లో సుస్థిర స్థానాన్ని పొందాయి.
మానవులకు జనన మరణాలు ఆద్యంతాలుగా ఉన్నట్లే నదులకు కూడా ఒక ఆవిర్భావం, ఒక ముగింపు ఉంటాయి. ఎక్కడో సన్నని ధారగా మొదలైన నదులు ఎక్కడెక్కడి జలధారలనో తమలో కలుపుకొని, తమను తాము విస్తరించుకుని నేలను చీల్చుకొని ప్రవహిస్తాయి. ప్రవాహ మార్గంలో ఎన్నెన్నో ఎగుడుదిగుళ్లను చవి చూస్తాయి. మార్గమధ్యంలో నానా కాలుష్యాలను ఎంతో సహనంతో భరిస్తాయి.
చినుకు రాలనప్పుడు చిక్కిపోతాయి. వర్షాలు కురిసినప్పుడు బలం పుంజుకుని, ఉధృతంగా ఉరకలేస్తాయి. వానలు మోతాదు మించినప్పుడు వరదలుగా పోటెత్తుతాయి. తుదకు ఎక్కడో సముద్రంలో కలిసిపోతాయి. ఏ చోట పుట్టినా, సముద్రంలో ఎక్కడ కలిసినా అవి ప్రవహించినంత మేరా మానవాళికి మాత్రమే కాదు, సమస్త జీవరాశికీ మేలు చేస్తాయి. నదులను మూలం నుంచి ముగింపు వరకు పరికిస్తే, అచ్చం మానవ జీవితానికి నకలులాగానే అనిపిస్తాయి.
నదుల రుణం తీర్చుకోలేనిది. తీర్చుకోలేని రుణమైనా శాయశక్తులా తీర్చుకోవాల్సిందేనని మన సంప్రదాయం నిర్దేశిస్తోంది. నదులకు రుణం తీర్చుకునే సందర్భాలుగానే మన పెద్దలు పన్నెండు జీవనదులకు పుష్కరాలను ఏర్పాటు చేశారు. ఇవే పుణ్యనదులుగా మన్ననలు అందుకుంటున్నాయి.
త్వరలోనే పుష్కరాలు జరుపుకోబోతున్న కృష్ణానది కూడా ఒక పుణ్యనది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో సన్నని ధారగా మొదలైన ఈ జీవనది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సాగరసంగమం చేస్తోంది. పుష్కరాల సందర్భంగా పితృకార్యాలు చేయడం ఆనవాయితీ. పుష్కరాల్లో కేవలం పితృదేవతలకు మాత్రమే కాదు, మిత్రులు, గురువులు, యజమానులు, ప్రభువులు, రుషులకు కూడా పిండప్రదానం చేస్తారు. పుష్కరకాలంలో దాన ధర్మాలు చేస్తారు. పుష్కలంగా నీళ్లిచ్చే నదికి పుష్కరానికొకసారి నదీపూజ చేస్తారు.
ఇదంతా రుణం తీర్చుకోవడం కాదు గానీ, మేలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొనే విధాయకం. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన సందర్భం. జీవరాశికి మేలు చేయాలనేదే నదుల తృష్ణ. పుష్కరానికి ఒకసారైనా నదులలో మునిగి బాహ్యాంతరాలను పునీతం చేసుకోవాలనేదే మానవుల తృష్ణ.
ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణాపుష్కరాలు
పుష్కర సమయంలో దేవతలకు గురువు అయిన బృహస్పతితో పాటు పుష్కరుడు, మూడున్నర కోట్ల దేవతలందరూ ఆ నదిలో కొలువుంటారు.