భూలోకవాసులకు బ్రహ్మజ్ఞానం బోధించాలని దేవగురువైన బృహస్పతికి సంకల్పం కలిగింది. భూలోకంలో ఒక బ్రాహ్మణుని ఇంట వాచస్పతి అనే పేరుతో జన్మించాడు. యుక్తవయసు వచ్చేనాటికి సకలశాస్త్ర పారంగతుడిగా గుర్తింపు పొందాడు. నర్మదా నదీతీరం వద్ద ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, అనేక మంది విప్ర బాలకులను శిష్యులుగా చేర్చుకున్నాడు. వారికి తానే అన్నవస్త్రాదులను ఇస్తూ, విద్యాబోధన చేస్తుండేవాడు.
అదే కాలంలో సూర్యపుత్రుడైన శనైశ్చరుడు విద్యాభ్యాసం చేయాలనుకున్నాడు. ఒకనాడు తండ్రి వద్దకు వెళ్లి, తన కోరికను వెలిబుచ్చాడు. ‘తండ్రీ! నేను విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నాను. నాకు తగిన గురువు ఎవరు?’ అని అడిగాడు. ‘నాయనా! దేవగురువు బృహస్పతి సమస్త విద్యలలోనూ గొప్పవాడు. నీకు తగిన గురువు అతడే! ఇప్పుడు అతడు వాచస్పతి అనే పేరుతో భూలోకంలో జన్మించి, భూలోకవాసులకు విద్యాబోధన చేస్తున్నాడు. అతడి వద్దకు వెళ్లి బ్రహ్మజ్ఞానాన్ని పొందు. అతడు విప్రకుమారులకు తప్ప ఇతరులకు బోధించడు. అందువల్ల నువ్వు విప్రవేషంలో వెళ్లు’ అని చెప్పాడు.
తండ్రి చెప్పినట్లే శనైశ్చరుడు విప్రబాలకుడి వేషంలో వాచస్పతి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న విప్రబాలకుల ద్వారా గురువును కలుసుకున్నాడు. ‘ఆచార్యా! విద్యాభ్యాసం కోరి మీ వద్దకు వచ్చాను’ అని చెప్పాడు. వాచస్పతి అతడిని చూసి, ‘నీ వంశమేది?’ అని ప్రశ్నించాడు. ‘కపిలుడి వంశంలో జన్మించాను’ అని బదులిచ్చాడు శనైశ్చరుడు. వాచస్పతి అతడిని తన గురుకులంలో చేర్చుకున్నాడు.వాచస్పతి వద్ద విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులందరిలోనూ శనైశ్చరుడు అనతికాలంలోనే బ్రహ్మజ్ఞానం సహా సమస్త విద్యలనూ, శాస్త్రాలనూ పరిపూర్ణంగా నేర్చుకున్నాడు. ఇక అతడికి నేర్పాల్సినది ఇంకేమీ లేదని నిశ్చయించుకున్నాక వాచస్పతి ఒకనాడు అతడిని పిలిచి, ‘అబ్బాయీ! నీకు నేర్పాల్సినది ఇంకేమీ లేదు. నీ విద్యాభ్యాసం పూర్తయింది. నువ్వు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, సుఖప్రదంగా జీవించవచ్చు’ అని చెప్పాడు.
‘ఆచార్యా! గురుదక్షిణగా ఏమివ్వమంటారు? మీకు గురుదక్షిణ చెల్లించకుంటే, అది నాకు శ్రేయస్కరం కాదు’ అని పలికాడు శనైశ్చరుడు.‘నాకు ఏమీ అవసరం లేదు. నిజంగా నువ్వెవరివో వివరంగా చెప్పి వెళ్లు, చాలు’ అన్నాడు వాచస్పతి. ‘ఆచార్యా! నేను సూర్యపుత్రుడిని. నా పేరు శనైశ్చరుడు. నా తండ్రి ఆజ్ఞ మేరకు మీ వద్దకు వచ్చి, విద్యలు నేర్చుకున్నాను’ బదులిచ్చాడు శనైశ్చరుడు.వాచస్పతి ఆశ్చర్యపోయాడు. ‘నాయనా! ఇప్పుడు నీకు తప్పక గురుదక్షిణ అడుగుతాను. నీ దృష్టి నా మీద పడకుండా వరమివ్వు, చాలు’ అని అడిగాడు.
‘ఆచార్యా! మీరు కోరినా, అది అసాధ్యం కదా! గ్రహచారాన్ని తప్పించడం ఎవరికి సాధ్యం? బ్రహ్మాదులకైనా అది తప్పదని మీకు కూడా తెలుసు కదా! అయితే, నా దృష్టి పడినా, మీకు ఆపద లేకుండా మాత్రం చేయగలను’ అని చెప్పాడు శనైశ్చరుడు. ‘అది చాలు నాకు’ బదులిచ్చాడు గురువు.ఒకనాడు వాచస్పతి పూలసజ్జ పట్టుకుని, ఆశ్రమ సమీపంలోని పూలతోటలో పూలు కోసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఆ దేశపు రాజు పరివారంతో పాటు వేటకు వచ్చి, ఆ ఉద్యానవనంలో విశ్రాంతి కోసం నిలిచారు. రాజుతో పాటు రాణి, పసిపిల్లవాడు కూడా ఉన్నారు. పసిపిల్లవాడిని ఉయ్యాలలో వేసి దాసీజనం కాపలాగా ఉన్నారు. హఠాత్తుగా ఉయ్యాలలోని పసిపిల్లవాడు అదృశ్యమయ్యాడు. రాజ పరివారంలో హాహాకారాలు మొదలయ్యాయి. కొడుకు కనిపించక రాణి దుఃఖించసాగింది. ‘పసిపిల్లవాడిని వెంటనే వెదికి తీసుకురండి’ అంటూ భటులను ఆజ్ఞాపించాడు రాజు.
వారు తోట నలుమూలలా వెదుకుతుండగా, పూలు కోసుకుంటున్న వాచస్పతి కనిపించాడు. అతడి చేతనున్న పూలసజ్జలోని పూల మీద నెత్తుటి మరకలు కనిపించాయి. వారు అతడిని పట్టుకుని, సజ్జను వెదికారు. అందులో బాలుడి మొండెం కనిపించింది. అతడిని వెంటనే బంధించి, రాజు ముందు ప్రవేశపెట్టారు. ‘ఇతడికి తగిన శిక్ష విధించండి’ అని మంత్రులను ఆజ్ఞాపించాడు రాజు.వాచస్పతిని ముందు నుంచి ఎరిగి ఉన్న మంత్రులు అతడు అంతటి ఘోరం చేసి ఉంటాడంటే నమ్మలేక, అతడికి శిక్ష విధించడానికి తటపటాయించసాగారు. నేరానికి బలమైన రుజువు ఏదీ లేక విచారణ చేయడం ప్రారంభించారు. వాచస్పతి ఏం జరుగుతున్నదో అర్థంకాక కాసేపు తికమకపడ్డాడు. కాసేపు ధ్యానంలోకి వెళ్లాడు. ఇదంతా శనైశ్చరుని దృష్టి ప్రభావమేనని గ్రహించాడు. మనసులోనే శనైశ్చరునికి స్తోత్రం చేశాడు.
శనైశ్చరుడు ఇచ్చిన మాట ప్రకారం గురువును ఆపద నుంచి గట్టెక్కించాలని నిశ్చయించుకున్నాడు.రాజ పరివారం ఆందోళనలో ఉన్న ఆ సమయంలో అశరీరవాణి ఇలా వినిపించింది: ‘రాజా! ఈ విప్రుడు నిర్దోషి. నీ కుమారుడికి ఆపదేమీ కలగలేదు. అతడు నీ ఇంటనే హంసతూలికా తల్పంపై ఆదమరచి నిదురపోతున్నాడు’ అని వినిపించింది. రాజాజ్ఞపై రాజ భటులు హుటాహుటిన గుర్రాల మీద దౌడు తీసి, రాజ ప్రాసాదానికి చేరుకున్నారు. హాయిగా నిద్రిస్తున్న బాలుడు వారి అలికిడికి మేలుకున్నాడు. వారు అతణ్ణి జాగ్రత్తగా ఎత్తుకుని, రాజు వద్దకు తీసుకువచ్చారు. రాజ పరివారం అంతా సంతోషించారు. వాచస్పతికి ఘన సత్కారం చేసి, అనేక కానుకలను బహూకరించి, రాజు, అతడి పరివారం తిరుగు ప్రయాణమయ్యారు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment