బుద్ధిజంలోనే మానవీయత!
మంగళూరు యూనివర్సిటీ అధ్యాపకుడు వలీరియన్ రోడ్రిగస్
ఏఎన్‌యూ(పొన్నూరు): ఆధునిక ప్రపంచం కంటే మానవ విలువలతో కూడిన ప్రపంచాన్ని అంబేడ్కర్ కాంక్షించారని, దాని కోసమే విలువలు, శాంతికి ప్రాధాన్యమిచ్చే బౌద్ధమతాన్ని స్వీకరించారని మంగళూరు యూనివర్సిటీ అధ్యాపకుడు, తత్వవేత్త ప్రొఫెసర్ వలీరియన్ రోడ్రిగస్ అన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, ఏఎన్‌యూ బుద్ధిజం విభాగాలు సంయుక్తంగా ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అండ్ బుద్ధిజం’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు శుక్రవారం యూనివర్సిటీలో ప్రారంభమైంది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొఫెసర్ రోడ్రిగస్ కీలకోపన్యాసం చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ బుద్ధిజం మత, కుల వ్యవస్థకు వ్యతిరేకమని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ మాట్లాడుతూ బుద్ధిజం ప్రధాన ప్రాంతమైన ఏపీ రాజధాని అమరావతిలో అంబేడ్కర్ స్మృతి వనం, 125 అడుగుల విగ్రహం, ధ్యాన కేంద్రం, సమావేశ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు.