బీజింగ్: కోవిడ్ మహమ్మారి విజృంభణ మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. ఎన్నో కుటుంబాల్లో కడుపుకోత మిగిల్చింది మహమ్మారి. నేటికి కూడా చాలా మంది ఆ బాధ నుంచి బయట పడలేకపోతున్నారు. ప్రేమించిన వారు దూరమవ్వడంతో వారిని మర్చిపోలేక.. ఒంటరిగా బతకలేక నరకం అనుభవిస్తున్నారు. వుహాన్ వాసి లియు పే తండ్రి కరోనా బారిన పడి మరణించాడు. తండ్రి చనిపోయిన నాటి నుంచి అతడు ఒంటరితనం అనుభవిస్తున్నాడు. ఇన్నాళ్లు లియు పేతో కలిసిన తిరిగిన స్నేహితులు, బంధువులు ప్రస్తుతం అతడిని తప్పించుకుతిరుగుతున్నారు. కారణం అతడి తండ్రి కరోనాతో చనిపోవడంతో.. లియుని కలవడం.. ఇంటికి ఆహ్వానించడం వంటివి చేస్తే.. తమకి కూడా ఇన్‌ఫెక్షన్ సోకుతుందనే అనుమానంతో వారు లియుకి దూరంగా ఉంటున్నారు. తండ్రి దూరమయ్యాడు.. బంధువులు, స్నేహితులు ఆదరించడం లేదు. దాంతో జీవితం పట్ల ఒక లాంటి నిర్లిప్తత భావం ఏర్పరుచుకున్నాడు లియు. ఇన్నాళ్ల నుంచి తాను చేస్తోన్న వ్యాపారాన్ని వదులుకున్నాడు. బుద్ధిజంలోకి మారాలని భావిస్తున్నాడు.
కరోనా వైరస్ విజృంభణ మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. మహమ్మారి వ్యాప్తి వుహాన్ నుంచి ప్రారంభమైంది. అయితే మొదట చైనా అధికారులు వైరస్ గురించి ఎలాంటి సమాచారాన్ని బయటకు రానివ్వలేదు. అన్నింటి కంటే ముఖ్యమైనది ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తిస్తుందనే విషయాన్ని దాచి పెట్టారు. దాంతో వుహాన్ వ్యప్తంగా దాదాపు 4 వేల మంది కోవిడ్ బారిన పడి మరణించారు. లియు పే తండ్రి కూడా కరోనా వైరస్ బారిన పడి చనిపోయాడు. లియు పే తండ్రి లియు ఓకింగ్ రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి కరోనా వైరస్‌గా నిర్థారించారు. అయితే మొదట్లో మహమ్మారి తీవ్రత గురించి తెలియకపోవడంతో.. ప్రభుత్వ సిబ్బంది.. ఆస్పత్రి యాజమాన్యం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఈ ఏడాది జనవరి 29న అతడు మరణించాడు. అదే రోజున తాను మరణించానంటున్నాడు లియు పే. ఇక తండ్రి మరణం తర్వాత తాను పిచ్చివాడిగా మారిపోయానన్నాడు. వైరస్ గురించి ప్రభుత్వం దాచి పెట్టడం వల్లే తాను తండ్రితో పాటు జీవితాన్ని కోల్పోయానని ఆవేదనం వ్యక్తం చేస్తున్నాడు. చైనా ప్రభుత్వం మీద తనకు ఎంతో కోపంగా ఉండేదని.. ఒకానొక సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలని భావించానని తెలిపాడు లియు. (చదవండి: కరోనాపై చైనా మరో కథ)
లియు పేతో పాటు చాలా మంది వుహాన్ వాసులు సోషల్ మీడియా వేదికగా జిన్ పింగ్ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్ల తాము కుటుంబ సభ్యులను కోల్పోయి నరకం అనుభవిస్తున్నామని ఆరోపించారు. ఇక తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన లియు పే.. తన బాధను ఎవరు పట్టించుకోరు అని అర్థం చేసుకున్న తర్వాత తన కోపాన్ని బౌద్ధ మతం వైపు మళ్లించాడు. మందు, మాంసం, ఆల్కహాల్‌ను వదిలేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంతో తనకున్న సంబంధాలన్నింటిని తెంచుకున్నాడు. వ్యాపారన్ని కూడా త్యజించి.. బౌద్ధంలోకి మారాడు. ఇప్పడతని దృష్టిలో డబ్బుకి ఏ మాత్రం విలువలేదు. ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న లియు జీవిత రహస్యం తెలుసుకునే పనిలో ఉన్నాడు. (చదవండి: యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది బలి)
ఇక ప్రస్తుతం వుహాన్‌లో కరోనా కేసులు ఏవి వెలుగు చూడనప్పటికి జనాల్లో మాత్రం భయం పోవడం లేదు. గతంలో వైరస్ బారిన పడి.. కోలుకున్న వారితో మాట్లాడాలంటే సందేహిస్తున్నారు జనాలు. వారితో కలవడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యే వివాదాలు తలెత్తుతున్నాయి. వుహాన్‌కు చెందిన 36 ఏళ్ల యువతి తన తండ్రిని కోల్పోయింది. ఆ బాధ నుంచి కోలుకోలేకపోతుంది. ఇక వైరస్ గురించి.. చైనా ప్రభుత్వం దాన్ని కప్పిపెట్టిన విధానం గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. బంధువులు, స్నేహితులు తనను దూరం పెట్టారనివాపోయింది. ‘జీవితం కొనసాగుతుంది.. కానీ అది మిగిల్చిన గాయాల తడి అలానే ఉంటుంది’. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment