బౌద్ధం @ బాదన్‌కుర్తి | Buddhism @ badankurti | Sakshi
Sakshi News home page

బౌద్ధం @ బాదన్‌కుర్తి

Published Wed, Jul 27 2016 4:04 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

బౌద్ధం @ బాదన్‌కుర్తి

బౌద్ధం @ బాదన్‌కుర్తి

వారంలో కేంద్రానికి ప్రణాళిక పంపనున్న 
రాష్ర్ట ప్రభుత్వం రూ.100 కోట్ల కేంద్ర నిధులొస్తాయని అంచనా
వాటితో బౌద్ధ ప్రాంతాల అభివృద్ధి ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా రూపకల్పన 
హైదరాబాద్: బుద్ధగయ... బోధివృక్షం కింద గౌతముడికి జ్ఞానోదమై బుద్ధుడిగా మారిన చోటు. బిహార్‌లో ఉన్న ఆ పవిత్ర క్షేత్రాన్ని ఒక్కసారైనా సందర్శించాలని బౌద్ధాన్ని ఆచరించేవారు భావిస్తుంటారు. ప్రపంచ వారసత్వ కట్టడ ప్రాంతంగా ‘యునెస్కో’ గుర్తింపు పొందిన బుద్ధగయ అందరికీ సుపరిచితమే. మరి బాదన్‌కుర్తి గురించి విన్నారా? బుద్ధుడిని కలసి బౌద్ధాన్ని ప్రచారం చేసేందుకు వెళ్లిన తొలి బృందం ఈ ప్రాంతానికి చెందినదే. ఈ విషయం బుద్ధుడి బోధనల్లో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు.

‘మహాజనపథ రాజ్యం అస్మక పాలనకాలంలో గోదావరి నది రెండుగా చీలిన ప్రాంతంలోని ఆవాసానికి చెందిన వారు బుద్ధుని దర్శనం చేసుకుని ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుంబిగించారు’ అని బుద్ధుని బోధనల లిఖితరూపంలో ఉంది. ఈ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రానికి సమీపంలో గోదావరి ఒడ్డున ఉంది. చరిత్రలో గొప్ప ప్రాధాన్యమున్న ప్రాంతమైనప్పటికీ ఇప్పటివరకు కనీసం తెలంగాణవాసులకూ పరిచయం లేని ప్రాంతంగా మిగిలిపోయింది.

ఇంతకాలం తర్వాత ఇప్పుడు దానికి ప్రాధాన్యం దక్కనుంది. తెలంగాణ పరిధిలో ఉన్న బౌద్ధ ప్రాధాన్య ప్రాంతాలను ప్రపంచ పర్యాటకులకు చేరువ చేసేందుకు ప్రత్యేక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ పురావస్తు, పర్యాటకశాఖ ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి వారంలో కేంద్రానికి పంపనుంది. కేంద్రం నుంచి రూ. 100 కోట్ల వరకు నిధులు వస్తాయని అంచనా వేస్తోంది. ఆ నిధులతో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో బయటపడ్డ బౌద్ధ ప్రాధాన్య ప్రాంతాలను అభివృద్ధి చేయనుంది.
 
 ఏం చేయనున్నారు...
 క్రీ.పూ. ఐదో శతాబ్దం నుంచి ఒకటో శతాబ్దం వరకు వివిధ కాలల్లో వెల్లివిరిసిన బౌద్ధానికి సంబంధించిన జాడలు తెలంగాణ ప్రాంతంలో పలు తవ్వకాల్లో వెలుగుచూశాయి. కానీ ఇంకా బహిర్గతం కానీ ఎన్నో చారిత్రక ప్రాధాన్యమున్న గుర్తులు భూగర్భంలోనే ఉండిపోయాయి. ఇప్పటికే వెలుగు చేసిన ప్రాంతాలను అభివృద్ధి చేయటంతోపాటు వెలుగుచూడని చోట ప్రభుత్వం కొత్తగా తవ్వకాలు చేపట్టనుంది. బుద్ధిస్ట్ సర్క్యూట్ రూపంలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ చర్యల వల్ల బౌద్ధ ప్రాంతాలకు విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటకానికి ఊతమిస్తుందని భావిస్తోంది.
 
 పలు ప్రాంతాల్లో బయటపడ్డ బౌద్ధం ఆనవాళ్లు
 కరీంనగర్ జిల్లా ధూళికట్టలో జరిపిన తవ్వకాల్లో బుద్ధుడి అస్తికతోపాటు మహాచైత్యం, మహాస్థూపం వెలుగుచూశాయి. కోటిలింగాల, స్తంభాలపల్లి, పాశిగాంలలోనూ విహారాలు, చైత్యాలు, శాసనాలు లభించాయి. నల్లగొండ జిల్లా ఫణిగిరిలో మహాచైత్యం జాడ దొరికింది. గాజులబండ, తిరుమలగిరి, వర్ధమానకోట, అరవపల్లి, పజ్జూరు, ఓబులాయపల్లి, ఏలేశ్వరం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ముదిగొండ, అశ్వారావుపేట, కారుకొండ  , మొదక్ జిల్లా కొండాపూర్, వరంగల్ జిల్లా గీసుకొండల్లో బౌద్ధం జాడలు లభించాయి. వర్ధమానకోటలో ఇక్ష్వాకుల కాలం నాటి బుద్ధుడి విగ్రహం లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement