badankurti
-
బౌద్ధుల గుడిలో.. బోధనలకు బడి!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని బాదన్‌కుర్తి నుంచే ఆసియాలోని చాలా దేశాలకు బౌద్ధం వ్యాపించిందనే దానికి ఆధారాలు దొరుకుతున్న తరుణంలో బౌద్ధం పరంగా ఈ ప్రాంతం అంతర్జాతీయ శోభను సంతరించుకోబోతోంది. నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో అంతర్జాతీయ బౌద్ధ విద్యాలయం, బౌద్ధ భిక్షువులకు శిక్షణ ఇచ్చే బౌద్ధారామం ఏర్పాటు కాబోతున్నాయి. వీటి నిర్మాణాలకు తైవాన్, మలేసియా సహా పలు దేశాలు ముందుకొచ్చాయి. పూర్తిగా ఆయా దేశాలకు చెందిన సంస్థల నిధులతోనే విద్యాలయం, బౌద్ధారామం రూపుదిద్దుకోనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో.. ఆచార్య నాగార్జునుడు రూపొందించిన మహాయాన బౌద్ధాన్ని ఆరాధిస్తున్న దేశాలు బుద్ధవనంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. నాగార్జున కొండను కేంద్రంగా చేసుకుని ఆచార్య నాగార్జునుడు తన బోధనలను విశ్వవ్యాప్తం చేయటమే ఇందుకు కారణం. దీంతో బుద్ధవనంలో ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బుద్ధ అండ్ ఆచార్య నాగార్జున’పేరుతో అంతర్జాతీయ బౌద్ధ విద్యాసంస్థను స్థాపించేందుకు ప్రతిపాదించాయి. బౌద్ధ భిక్షువులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచ స్థాయి బౌద్ధారామాన్ని కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయిం చాయి. ఇప్పటికే తమ ప్రతిపాదనలను అందజేశాయి. అధికారికంగా ఆ రెండు సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిన వెంటనే ఆయా దేశాల ప్రతినిధులు వచ్చి ఒప్పందం చేసుకోనున్నారు. బెంగళూరులోని మహాబోధి సంస్థ, లోటస్ గ్రూపు హోటల్స్ యాజమాన్యం కూడా వీటి ఏర్పాటుకు సహకరించనున్నాయి. ఏం చేస్తారంటే..? చైనా, జపాన్, తైవాన్ వంటి దేశాల్లో బౌద్ధ విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిల్లో ప్రత్యేక విద్యను బోధిస్తున్నారు. ఆధునిక విద్య ఉన్నత శిఖరాలను తాకుతున్నా విద్యార్థుల్లో ప్రశాంతత కరువైంది. దీంతో విద్యావిధానంలో మార్పు రావాలంటూ చాలా దేశాలు నినదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భూటాన్‌లో విద్యా వ్యవస్థకు సంబంధించి హ్యాపీనెస్ ఇండెక్స్‌ను ప్రతిపాదించగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ఇలా అశాంతిని దూరం చేసేలా గొప్ప విద్యావిధానానికి బౌద్ధ విద్యాసంస్థలు సానబడుతున్నాయి. ఇదే తరహా విద్యావిధానంతో బుద్ధవనంలో విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక శాస్త్రం, తర్కం, చరిత్ర, మనోశాస్త్రం, శిల్పశాస్త్రం ఇలా అన్ని అంశాలు ఉంటాయి.. కానీ అన్నీ బౌద్ధంతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి విద్యా సంస్థలకు అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉంది. ఇక్కడ ఆ తరహా విద్యాలయం ఏర్పాటైతే చాలా దేశాల నుంచి విద్యార్థులు వస్తారని అంచనా. బౌద్ధ సన్యాసులకు శిక్షణ, బోధనలు, ధ్యానం వంటి వాటికి సంబంధించి బౌద్ధారామం ఏర్పాటు కానుంది. పర్యాటకులు పెరిగే అవకాశం చాలా దేశాలు తమ భౌగోళిక ప్రాంతంలో ఉన్న చిన్నచిన్న బౌద్ధ ఆధారాలను కూడా గొప్పగా అభివృద్ధి చేసుకుని పర్యాటకానికి దోహదం చేసుకునేలా తీర్చి దిద్దాయి. వాటితో పోలిస్తే తెలంగాణలో బౌద్ధం జాడలు స్పష్టంగా, గొప్పగా ఉన్నా.. ఆరామాలు, చైత్యాలు, బౌద్ధ స్థూపాలు వెలుగు చూసినా పట్టించుకునే దిక్కులేదు. బుద్ధుడిని కలిసి ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన బావరి నివసించిన బాదన్‌కుర్తి.. తెలంగాణలోని ప్రాంతమే. కానీ ఇప్పటి వరకు అక్కడ తవ్వకాలు కూడా జరిపించలేదు. ఫలితంగా తెలంగాణలోని బౌద్ధం జాడలపై అవగాహనే లేకుండా పోయింది. అయితే ఇటీవల నగరంలో బౌద్ధంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కొందరు విదేశీ బౌద్ధ భిక్షువులు ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జున కొండల్లోని బౌద్ధ జాడలు చూసి అబ్బురపడ్డారు. అప్పటి నుంచే బుద్ధవనంపై ఇతర దేశాల్లో అవగాహన మొదలైంది. తాజా ప్రతిపాదనలు ఫలవంతమైతే విదేశీ పర్యాటకులు క్యూ కడతారని అధికారులు భావిస్తున్నారు. -
బౌద్ధం @ బాదన్‌కుర్తి
వారంలో కేంద్రానికి ప్రణాళిక పంపనున్న రాష్ర్ట ప్రభుత్వం రూ.100 కోట్ల కేంద్ర నిధులొస్తాయని అంచనా వాటితో బౌద్ధ ప్రాంతాల అభివృద్ధి ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా రూపకల్పన హైదరాబాద్: బుద్ధగయ... బోధివృక్షం కింద గౌతముడికి జ్ఞానోదమై బుద్ధుడిగా మారిన చోటు. బిహార్‌లో ఉన్న ఆ పవిత్ర క్షేత్రాన్ని ఒక్కసారైనా సందర్శించాలని బౌద్ధాన్ని ఆచరించేవారు భావిస్తుంటారు. ప్రపంచ వారసత్వ కట్టడ ప్రాంతంగా ‘యునెస్కో’ గుర్తింపు పొందిన బుద్ధగయ అందరికీ సుపరిచితమే. మరి బాదన్‌కుర్తి గురించి విన్నారా? బుద్ధుడిని కలసి బౌద్ధాన్ని ప్రచారం చేసేందుకు వెళ్లిన తొలి బృందం ఈ ప్రాంతానికి చెందినదే. ఈ విషయం బుద్ధుడి బోధనల్లో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. ‘మహాజనపథ రాజ్యం అస్మక పాలనకాలంలో గోదావరి నది రెండుగా చీలిన ప్రాంతంలోని ఆవాసానికి చెందిన వారు బుద్ధుని దర్శనం చేసుకుని ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుంబిగించారు’ అని బుద్ధుని బోధనల లిఖితరూపంలో ఉంది. ఈ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రానికి సమీపంలో గోదావరి ఒడ్డున ఉంది. చరిత్రలో గొప్ప ప్రాధాన్యమున్న ప్రాంతమైనప్పటికీ ఇప్పటివరకు కనీసం తెలంగాణవాసులకూ పరిచయం లేని ప్రాంతంగా మిగిలిపోయింది. ఇంతకాలం తర్వాత ఇప్పుడు దానికి ప్రాధాన్యం దక్కనుంది. తెలంగాణ పరిధిలో ఉన్న బౌద్ధ ప్రాధాన్య ప్రాంతాలను ప్రపంచ పర్యాటకులకు చేరువ చేసేందుకు ప్రత్యేక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ పురావస్తు, పర్యాటకశాఖ ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి వారంలో కేంద్రానికి పంపనుంది. కేంద్రం నుంచి రూ. 100 కోట్ల వరకు నిధులు వస్తాయని అంచనా వేస్తోంది. ఆ నిధులతో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో బయటపడ్డ బౌద్ధ ప్రాధాన్య ప్రాంతాలను అభివృద్ధి చేయనుంది. ఏం చేయనున్నారు... క్రీ.పూ. ఐదో శతాబ్దం నుంచి ఒకటో శతాబ్దం వరకు వివిధ కాలల్లో వెల్లివిరిసిన బౌద్ధానికి సంబంధించిన జాడలు తెలంగాణ ప్రాంతంలో పలు తవ్వకాల్లో వెలుగుచూశాయి. కానీ ఇంకా బహిర్గతం కానీ ఎన్నో చారిత్రక ప్రాధాన్యమున్న గుర్తులు భూగర్భంలోనే ఉండిపోయాయి. ఇప్పటికే వెలుగు చేసిన ప్రాంతాలను అభివృద్ధి చేయటంతోపాటు వెలుగుచూడని చోట ప్రభుత్వం కొత్తగా తవ్వకాలు చేపట్టనుంది. బుద్ధిస్ట్ సర్క్యూట్ రూపంలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ చర్యల వల్ల బౌద్ధ ప్రాంతాలకు విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటకానికి ఊతమిస్తుందని భావిస్తోంది. పలు ప్రాంతాల్లో బయటపడ్డ బౌద్ధం ఆనవాళ్లు కరీంనగర్ జిల్లా ధూళికట్టలో జరిపిన తవ్వకాల్లో బుద్ధుడి అస్తికతోపాటు మహాచైత్యం, మహాస్థూపం వెలుగుచూశాయి. కోటిలింగాల, స్తంభాలపల్లి, పాశిగాంలలోనూ విహారాలు, చైత్యాలు, శాసనాలు లభించాయి. నల్లగొండ జిల్లా ఫణిగిరిలో మహాచైత్యం జాడ దొరికింది. గాజులబండ, తిరుమలగిరి, వర్ధమానకోట, అరవపల్లి, పజ్జూరు, ఓబులాయపల్లి, ఏలేశ్వరం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ముదిగొండ, అశ్వారావుపేట, కారుకొండ , మొదక్ జిల్లా కొండాపూర్, వరంగల్ జిల్లా గీసుకొండల్లో బౌద్ధం జాడలు లభించాయి. వర్ధమానకోటలో ఇక్ష్వాకుల కాలం నాటి బుద్ధుడి విగ్రహం లభించింది.