నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని బాదన్‌కుర్తి నుంచే ఆసియాలోని చాలా దేశాలకు బౌద్ధం వ్యాపించిందనే దానికి ఆధారాలు దొరుకుతున్న తరుణంలో బౌద్ధం పరంగా ఈ ప్రాంతం అంతర్జాతీయ శోభను సంతరించుకోబోతోంది. నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో అంతర్జాతీయ బౌద్ధ విద్యాలయం, బౌద్ధ భిక్షువులకు శిక్షణ ఇచ్చే బౌద్ధారామం ఏర్పాటు కాబోతున్నాయి. వీటి నిర్మాణాలకు తైవాన్, మలేసియా సహా పలు దేశాలు ముందుకొచ్చాయి. పూర్తిగా ఆయా దేశాలకు చెందిన సంస్థల నిధులతోనే విద్యాలయం, బౌద్ధారామం రూపుదిద్దుకోనున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో..
ఆచార్య నాగార్జునుడు రూపొందించిన మహాయాన బౌద్ధాన్ని ఆరాధిస్తున్న దేశాలు బుద్ధవనంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. నాగార్జున కొండను కేంద్రంగా చేసుకుని ఆచార్య నాగార్జునుడు తన బోధనలను విశ్వవ్యాప్తం చేయటమే ఇందుకు కారణం. దీంతో బుద్ధవనంలో ‘ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బుద్ధ అండ్ ఆచార్య నాగార్జున’పేరుతో అంతర్జాతీయ బౌద్ధ విద్యాసంస్థను స్థాపించేందుకు ప్రతిపాదించాయి. బౌద్ధ భిక్షువులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచ స్థాయి బౌద్ధారామాన్ని కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయిం చాయి. ఇప్పటికే తమ ప్రతిపాదనలను అందజేశాయి. అధికారికంగా ఆ రెండు సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిన వెంటనే ఆయా దేశాల ప్రతినిధులు వచ్చి ఒప్పందం చేసుకోనున్నారు. బెంగళూరులోని మహాబోధి సంస్థ, లోటస్ గ్రూపు హోటల్స్ యాజమాన్యం కూడా వీటి ఏర్పాటుకు సహకరించనున్నాయి.
ఏం చేస్తారంటే..?
చైనా, జపాన్, తైవాన్ వంటి దేశాల్లో బౌద్ధ విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిల్లో ప్రత్యేక విద్యను బోధిస్తున్నారు. ఆధునిక విద్య ఉన్నత శిఖరాలను తాకుతున్నా విద్యార్థుల్లో ప్రశాంతత కరువైంది. దీంతో విద్యావిధానంలో మార్పు రావాలంటూ చాలా దేశాలు నినదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భూటాన్‌లో విద్యా వ్యవస్థకు సంబంధించి హ్యాపీనెస్ ఇండెక్స్‌ను ప్రతిపాదించగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ఇలా అశాంతిని దూరం చేసేలా గొప్ప విద్యావిధానానికి బౌద్ధ విద్యాసంస్థలు సానబడుతున్నాయి. ఇదే తరహా విద్యావిధానంతో బుద్ధవనంలో విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక శాస్త్రం, తర్కం, చరిత్ర, మనోశాస్త్రం, శిల్పశాస్త్రం ఇలా అన్ని అంశాలు ఉంటాయి.. కానీ అన్నీ బౌద్ధంతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి విద్యా సంస్థలకు అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉంది. ఇక్కడ ఆ తరహా విద్యాలయం ఏర్పాటైతే చాలా దేశాల నుంచి విద్యార్థులు వస్తారని అంచనా. బౌద్ధ సన్యాసులకు శిక్షణ, బోధనలు, ధ్యానం వంటి వాటికి సంబంధించి బౌద్ధారామం ఏర్పాటు కానుంది.
పర్యాటకులు పెరిగే అవకాశం
చాలా దేశాలు తమ భౌగోళిక ప్రాంతంలో ఉన్న చిన్నచిన్న బౌద్ధ ఆధారాలను కూడా గొప్పగా అభివృద్ధి చేసుకుని పర్యాటకానికి దోహదం చేసుకునేలా తీర్చి దిద్దాయి. వాటితో పోలిస్తే తెలంగాణలో బౌద్ధం జాడలు స్పష్టంగా, గొప్పగా ఉన్నా.. ఆరామాలు, చైత్యాలు, బౌద్ధ స్థూపాలు వెలుగు చూసినా పట్టించుకునే దిక్కులేదు. బుద్ధుడిని కలిసి ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన బావరి నివసించిన బాదన్‌కుర్తి.. తెలంగాణలోని ప్రాంతమే. కానీ ఇప్పటి వరకు అక్కడ తవ్వకాలు కూడా జరిపించలేదు. ఫలితంగా తెలంగాణలోని బౌద్ధం జాడలపై అవగాహనే లేకుండా పోయింది. అయితే ఇటీవల నగరంలో బౌద్ధంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కొందరు విదేశీ బౌద్ధ భిక్షువులు ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జున కొండల్లోని బౌద్ధ జాడలు చూసి అబ్బురపడ్డారు. అప్పటి నుంచే బుద్ధవనంపై ఇతర దేశాల్లో అవగాహన మొదలైంది. తాజా ప్రతిపాదనలు ఫలవంతమైతే విదేశీ పర్యాటకులు క్యూ కడతారని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment