సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహానీయుడు బి.ఆర్.అంబేడ్కర్. ఈ దేశ సామాజిక వ్యవస్థ ఆధారంగా నిరుపమాన అధ్యయనంతో జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించాడు. అంబేడ్కర్ సేవలు, ఆలోచనలు మానవ మర్యాద కోసం, అంతరాల్లేని సమాజం కోసం, దోపిడీ పీడనలు లేని వ్యవస్థ నిర్మాణం కోసమనే స్పృహను భారతీయ సమాజం కలిగి ఉన్నందు వల్లే ఆయన దూరమై ఆరు దశాబ్దాలు దాటినా ప్రజలు ఆయన జయంతులు, వర్ధంతులు జరుపుకొంటున్నారు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణపై అంబేడ్కర్ అభిప్రాయాలు, ఏర్పాటుచేసిన ప్రకరణ 3 తెలంగాణ రాష్ట్ర పోరాటానికి తాత్విక సమర్థనను ఇచ్చాయి.
ఆధునిక భారతీయ పునరుజ్జీవన ఉద్యమ వెలుగుగా కొనసాగిన అంబేడ్కర్ తాత్విక ధారలో ముఖ్యమైన సంక్షేమ రాజ్యభావనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడేళ్లుగా కొనసాగిస్తున్నారు. సాధ్యమైనంత తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ రాజ్య ఫలాలను అందజేస్తున్నారు. అంబేడ్కర్ వ్యవసాయాన్ని మౌలికమైన పరిశ్రమగా గుర్తించారు. భూమి సక్రమ వినియోగానికి సరైన పెట్టుబడిని, ఉత్పత్తి సాధనాలను సమకూర్చాలనీ, నీటి పారుదల సౌకర్యాలను కలిగించాలనీ, వీటికి రాజ్యమే బాధ్యత వహించాలనీ అన్నారు. ఈ వెలుగులో రైతుబంధు పథకాన్ని విజయవంతంగా కేసీఆర్ అమలుచేస్తున్నారు.
స్త్రీలు సాధించిన అభివృద్ధి ఆధారంగా సమాజ ప్రగతి నిర్ధారించబడుతుందనే అంబేడ్కర్ దార్శనికతలో శిశు సంక్షేమం, స్త్రీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్ల, ఆశా వర్కర్ల జీతాలను పెంచారు. బాధిత మహిళలను రక్షించటం కోసం సఖి కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలికల డ్రాపౌట్సు తగ్గించడం కోసం హెల్త్ కిట్స్, భారీ సంఖ్యలో గురుకులాలను, కళాశాలలను ప్రారంభించారు. నాగరికత వల్ల లభించే భౌతిక ప్రయోజనాలను వదులుకోవచ్చు గానీ విద్యా ఫలాలను అందుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపరాదన్నారు అంబేడ్కర్. స్వరాష్ట్రం సిద్ధించాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 1000 పైగా గురుకులాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
జాతీయపార్టీల పాలకులు అధికారాలను ఎక్కువగా తమ గుప్పిట్లో ఉంచుకొని రాష్ట్రాలపై పెత్తనం చలాయిస్తున్నారు. అందుకే ఫెడరల్ ఫ్రంట్ దిశగా అంబేడ్కర్ సూచించిన సమాఖ్య స్ఫూర్తి అమలుకోసం కేసీఆర్ జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా నడవాల్సిన రాజకీయాలు వ్యక్తిగత విశ్వాసాలైన మతం, ఆరాధనా స్థలాల చుట్టూ తిరుగుతూ వాటి ఆధారంగా మరల అధికారాన్ని పొందే అవాంఛనీయ ధోరణులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ అలోచనాధారలో స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆయన సాధించిపెట్టిన అపూర్వ ఫలితాలను కాపాడుకుంటూ మనపై మోపిన బాధ్యతలను కొనసాగించడంలో ముందువరసలో ఉండాలి.
– అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
(నేడు అంబేడ్కర్ వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment