♦ కొత్త కోణం
వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధి అణువణువునా అంటరాని కులాల త్యాగాలతో నిండి ఉన్నాయి. ఆ త్యాగాల అనుభవాలను మరిచిన సమాజం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అంటరాని కులాలు గతంలో శ్రమ దోపిడీకి గురికావడమే కాదు, వర్తమాన సమాజంలో ఎటువంటి భాగస్వామ్యానికీ నోచుకోవడంలేదు. హీనంగా చూస్తూ వారిని ఊరి బయటకు నెడుతున్నారు. జాతి సంపదను పెంచిన కులాలు ప్రభుత్వాల దగ్గర రిజర్వేషన్ల కోసమో, సంక్షేమ కార్యక్రమాల కోసమో మోకరిల్లాల్సిన పరిస్థితి.
‘ఆఫ్రికా నవ నక్షత్రాలూ వెనక్కి ఇచ్చేయాలి. అవి ఆఫ్రికా వజ్రాలు. తొమ్మిది వజ్రాలను తొమ్మిది నక్షత్రాలని పిలుస్తాం. ఇవి బ్రిటన్‌లో ఉన్నాయి. అటువంటి వేలాది వజ్రాలు ఆఫ్రికా నుంచి తవ్వి తీసుకెళ్లారు. అవి మావి, మాకే చెందాలి’ ఆఫ్రికా రిపరేషన్స్ మూవ్‌మెంట్ నాయకులు, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు బెర్నిగ్రాంట్ డిమాండ్ ఇది. ఆఫ్రికాను బ్రిటన్ వలసగా మార్చుకోవడం, సంపదను దోచుకెళ్లడం వంటి వివరాలను బెర్నిగ్రాంట్ తెలి యజేశారు. ఆఫ్రికా నల్లజాతి ప్రజలు వజ్రాలను వెలికితీసి బ్రిటన్‌ను సంపన్నదేశంగా మార్చారని బెర్నీ పేర్కొన్నారు. ఆఫ్రికా నల్లజాతి కార్మికుడు ఒకరు ప్రీమియర్ మైనింగ్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో 1905లో ఒక వజ్రం కంటపడింది. ఇది చరిత్రలో నమోదు కాలేదు. ఆ వజ్రాన్ని 1907లో బ్రిటన్ ప్రభుత్వం లక్షా యాభైవేల పౌండ్స్‌కు కొనుగోలు చేసి చక్రవర్తి ఏడవ ఎడ్వర్డ్‌కు జన్మదిన కానుకగా అందజేసింది. దాన్ని ఆ తర్వాత తొమ్మిది చిన్న వజ్రాలుగా మలిచారు. వీటినే తొమ్మిది నక్షత్రాలుగా పిలుస్తామని బెర్నీగ్రాంట్ తెలి పారు. బెర్నీ ఆఫ్రికా రిపరేషన్స్ మూవ్‌మెంట్ నాయకుడు.
ఆ ఉద్యమం గురించి ఇంకొంచెం
2001 ఆగస్టు– సెప్టెంబర్ నెలల్లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన ప్రపంచ జాతి వివక్షా వ్యతిరేక సదస్సులో మొదటిసారిగా ‘రిపరేషన్స్’అనే అణగారిన ప్రజల విముక్తినాదం నా చెవులను తాకింది. ‘వివక్షకూ అణచివేతకూ గురైన ప్రజల ప్రగతి కోసం మానవ హక్కులూ, సేవాదృక్పథం మాత్రమే సరిపోవు. కోల్పోయిన అన్నిరకాల వనరులు, సంపద తిరిగి పొందేంతవరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదే రిపరేషన్స్’ అని నల్లజాతి నినదించింది. అప్పటి నుంచి ఆ ఉద్యమం అంచెలంచెలుగా విస్తరిస్తున్నది. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఆదిమ తెగల ప్రజలకు అక్కడి ప్రభుత్వాలు రిపరేషన్స్ పేరుతో ఏటా కొన్ని నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడుతున్నాయి. అమెరికాలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. డిసెంబర్ 7, 2009న ఫెడరల్ కోర్టు రెడ్ ఇండియన్స్‌కి రిపరేషన్స్ నిధులు అందజేయాలని తీర్పునిచ్చింది. ఇది ఆధునిక ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడానికి సూచనగా నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా భావించారు కూడా. ఆదిమ తెగల ప్రజల సంపద, వారసత్వం మీదనే ఆధునిక సమాజాల నిర్మాణం జరిగిందనీ, అణచివేతతో, పీడనతో ప్రజలనుంచి దోచుకున్న సంపదతోనే ప్రస్తుత వ్యవస్థలు పనిచేస్తున్నాయనీ, అటువంటి వారసత్వాన్నీ, సంపదనూ అందించిన ప్రజలను మర్చిపోవడం లేదా వివక్షకు గురిచేయడం ఎంత మాత్రం సరికాదని ఆ సమయంలోనే ఒబామా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనితో మరోసారి రిపరేషన్స్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
‘రిపరేషన్స్’అంశం చరిత్రకు కొత్తకాదు. గతంలో యుద్ధంలో ఓడినవారు విజేతలకు నష్టపరిహారంగా కొంత సంపదను రిపరేషన్స్ పేరిట చెల్లించేవారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో జరిగిన యూదు జాతి హత్యాకాండకు పరిహారంగా ప్రభుత్వం ఏటా రిపరేషన్స్ చెల్లిస్తున్నది. కెనడాలో 1991 నుంచి అ««ధ్యయనం చేసి 2006లో అక్కడి ఆదిమ తెగల అభివృద్ధి కోసం రెండు బిలియన్ డాలర్ల ఆర్థికసాయాన్ని అందజేసింది. నియంతృత్వ పాలనలలో నిర్బంధానికి గురైన ప్రజలకు, కార్యకర్తలకు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడిన అనంతరం తగు నష్టపరిహారం చెల్లించినట్టు ఆధారాలున్నాయి. చిలీ, మొరాకో, గుయానా, బార్బొడాస్, జమైకా దేశాల్లో ఇటువంటి రాజకీయ రిపరేషన్స్ అందజేశారు. రాజకీయ పరమైన వారసత్వ హక్కుగా ఈ రోజు ఆఫ్రికా రిపరేషన్స్ మూవ్‌మెంట్ నడుస్తున్నది. అమెరికా నల్లజాతి ప్రజలు కూడా తమకు జరిగిన అన్యాయానికీ, దోపిడీకి రిపరేషన్స్ పరిష్కారమని భావిస్తున్నారు.
రిజర్వేషన్ – రిపరేషన్
ఈ నేప«థ్యం నుంచే భారతదేశంలో రిజర్వేషన్లను అర్థం చేసుకోవాలి. ఇటీవల ఈ రిజర్వేషన్ల డిమాండ్‌కు కొత్త అర్థాలు తీసుకొస్తున్నారు. జనాభా అధికంగా ఉండి, రాజకీయాలను ప్రభావితం చేసేవారు తమ ఆర్థిక, సామాజిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా రిజర్వేషన్లపైన ఉద్యమాలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం స్ఫూర్తి ప్రకారం కాకుండా కేవలం తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి కొందరు రాజకీయ నాయకులు ఇటువంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. ఎలాగైనా అధికారంలోనికి రావాలనే ఆశతో ప్రధాన పార్టీలన్నీ ఇటువంటి నినాదాలను సమర్థిస్తున్నాయి. రాజ్యాంగ పరిధిలో అవి ఏమాత్రం ఇమడవని తెలిసినప్పటికీ ప్రోత్సహిస్తున్నాయి. దానితో రిజర్వేషన్ల లక్ష్యమే ప్రమాదంలో పడింది.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రకారం పౌరులెవ్వరైనా వివక్షకు గురికాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అయితే నిజానికి ఏ వర్గాలైతే ఈ దేశంలో వివక్షకూ, దోపిడీకీ, వెలివేతకూ గురయ్యాయో అవి ఇంకా అదే పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నాయి. ఆర్థిక, సామాజిక అంతరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ వర్గాలకే ఎంతో చేసినట్టు, దేశ సంపదను దోచిపెడుతున్నట్టు ఆధిపత్య కులవాదులు భావించడమే దారుణం. పైకి ఏం చెబుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల పట్ల, వారి అభివృద్ధి పట్ల రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేదు. కానీ సంక్షేమం పేరుతో ఘనకార్యం చేస్తున్నట్టు ప్రకటించుకుంటున్నారు. ఆఫ్రికా రిపరేషన్స్ మూవ్‌మెంట్ స్ఫూర్తిని చూశాక, వారి వాదనను అర్థం చేసుకున్న తర్వాత ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీలకు కావాల్సింది రిజర్వేషన్లు మాత్రమే కాదు, రిపరేషన్స్ సైతం తప్పనిసరి అని భావించాలి. ప్రస్తుతం ఎస్సీలుగా పేర్కొంటున్న అంటరాని కులాలు మూడు వేల సంవత్సరాలకు పైగా తమ శ్రమను, సంపదను, ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించాయి.
ఆ శ్రమ, త్యాగం వృథా కారాదు
వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధి అణువణువునా అంటరాని కులాల త్యాగాలతో నిండి ఉన్నాయి. ఆ త్యాగాల అనుభవాలను మరిచిన సమాజం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అంటరాని కులాలు గతంలో శ్రమ దోపిడీకి గురికావడమే కాదు, వర్తమాన సమాజంలో ఎటువంటి భాగస్వామ్యానికీ నోచుకోవడంలేదు. హీనంగా చూస్తూ వారిని ఊరి బయటకు నెడుతున్నారు. జాతి సంపదను పెంచిన కులాలు ప్రభుత్వాల దగ్గర రిజర్వేషన్ల కోసమో, సంక్షేమ కార్యక్రమాల కోసమో మోకరిల్లాల్సిన పరిస్థితి.
వ్యవసాయ సమాజం పురోగమించడానికి అంటరాని కులాలు చేసిన కృషి అనిర్వచనీయం. చనిపోయిన పశువుల చర్మాలను శుద్ధి చేసి 18 రకాల వృత్తి వస్తువులను అందించి ఉండకపోతే ఈ రోజు మన సమాజాన్ని ఈ స్థాయిలో ఊహించడం కష్టమే. అత్యంత మురికితో ఉండి, వాసనకూడా తట్టుకోలేని స్థితిలో తోలును లందలో ఉంచి శుభ్రం చేయడం సమాజంలోని మరే ఇతర సామాజిక వర్గం చేయలేనప్పుడు అంటరాని కులాలుగా ఉన్న వీరు దాన్ని అత్యంత బాధ్యతగా సామాజిక పురోగమనానికి ఒక ఆయుధంగా వాడారు. వ్యవసాయ రంగంలో పశుపోషణ, చెరువుల నిర్మాణం, నిర్వహణ, దున్నడం, పంటల రక్షణ వంటి పనులు అంటరాని కులాలే నిర్వహించాయి.
ఇటీవల రైతేరాజు అనీ, అన్నదాత అనీ చెపుతున్నదంతా ఎవరిని గురించి ప్రస్తావిస్తున్నదంటే భూమి ఎవరి చేతిలో ఉందో వారిని గురించే, భూమిపైన కాగితపు హక్కుదారులను గురించే తప్ప ఆ మట్టిలో మట్టిగా ఆరుగాలం కష్టపడి, తమ చెమటతో పంటలను పండించిన ఈ అంటరాని జనం తమ రక్తాన్ని ధారపోసి గుక్కెడు గంజికి సైతం నోచుకోక తరతరాలుగా ఆ భూమికి దూరంగా బతుకుతున్నారన్న స్పర్శ ఈ సమాజానికి ఎందుకు లేకుండా పోయిందో అర్థం కాదు. ఇక ఏ తోలైతే సాంకేతిక నైపుణ్యానికి పునాదులు వేసిందో దాన్ని ఆవిష్కరించిన అంటరాని కులాలు ఈ రోజు అదే పరిశ్రమలో కూలీలుగా కూడా మిగల్లేదు. ఏటా వేల కోట్ల రూపాయల ఎగుమతితో విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్న వాళ్లు పరిశ్రమాధిపతులైతే వృత్తికీ, ఉత్పత్తికీ దూరమై దిక్కు తోచక గ్రామాల్లో అలమటిస్తున్నది మాత్రం అంటరాని కులాలు. 150 ఏళ్ల రైల్వే, గనుల చరిత్రను తవ్వి తీస్తే కార్మికుల కృషి, త్యాగం బయటపడతాయి. కానీ ఇప్పటి వరకు ఆ చరిత్రను రాయడానికీ, అధ్యయనం చేయడానికీ ఏ ప్రభుత్వాలూ సిద్ధంగా లేవు.
ఆదివాసీల పరిస్థితీ అంతే!
అదేవిధంగా ఆదివాసీలు గత వందల సంవత్సరాల్లో తమ భూమినీ, అడవినీ కోల్పోయి పుట్టిన గడ్డపైనే పరాయి బతుకు బతుకుతున్నారు. పరిశ్రమాధిపతుల ప్రయోజనం కోసం ప్రభుత్వాలు ఆదివాసీలను తరిమి వేస్తూ అక్కడి వనరులను ఆక్రమించుకుంటున్నాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు ఆధునిక ప్రభుత్వాలు సైతం వారిని వెంటాడి వేటాడుతున్నాయి. దేశ సంపదను వృద్ధి చేయడంలో, వనరులను కాపాడడంలో ఎన్నో త్యాగాలు చేసిన ఆదివాసీల కోసం, అంటరాని కులాల కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు వాటి మీద ఆధారపడి అమలు జరుగుతున్న రిజర్వేషన్లు, సంక్షేమ కార్యక్రమాలు, రోజురోజుకీ ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద, వారి మంచి, చెడు ప్రవర్తనలమీద ఆధారపడుతున్నాయి.
అందుకే ఆఫ్రికా నల్లజాతి ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టుగా, ఉద్యమిస్తున్నట్టుగా రిపరేషన్స్ అనే ఉద్యమాన్ని భారతదేశంలో కూడా ఆదివాసీలు, దళితులు ఆరంభించక తప్పని పరిస్థితిని భారత సమాజం, ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. రిజర్వేషన్ల మీద నిరసనతో ఉన్న సమాజం, దళితుల పట్ల అడుగడుగునా ద్వేషంతో ఉన్న కుల సమాజం భారతదేశ చరిత్రను మరొక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అణచివేతకు గురైన వర్గాల వారు దేశంలో 25 శాతం ఉన్నారు. దేశంలో సామరస్యం, శాంతి, ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఒక్కటే మార్గం ఉంది. తరతరాలుగా ఈ సమాజంలో భాగం కాలేకపోయిన, వివక్షకీ గురి అవుతోన్న ఆ అణగారిన వర్గాలను ఈ దేశంలో ఒక భాగంగా గుర్తించక తప్పదు.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213
Comments
Please login to add a commentAdd a comment