అభిప్రాయం
రిజర్వేషన్ల మీద జాతీయ స్థాయిలో ఇంతటి ప్రస్తావన చోటు చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఇది ప్రస్తావన మాత్రంగానే సాగుతున్న వ్యవ హారం కాబట్టి దీనిని చర్చ అనడం లేదు. ప్రస్తుతం జరుగు తున్న ఎన్నికల్లో (లోక్‌సభ ఎన్ని కలు–2024) బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందనీ, రిజర్వేషన్లను రద్దు చేస్తుందనీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి కమలనాథులు తీవ్ర కలవర పాటుకు గురౌతున్నారు. అర్‌ఎస్‌ఎస్ చేత కూడా ఖండన ప్రకటనలిప్పిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం కానీ, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన కానీ ఏ కోశానా లేవని చెప్పుకుంటున్నారు. రిజర్వేషన్లు జనాభాలో అత్య ధిక శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి నవి కాబట్టి బీజేపీ ఇంతగా ఇది అయిపోతోందని అర్థమవుతోంది.
సామాజికంగా అణగారిన వర్గాలకు–అంటే సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అందుకు విరుద్ధంగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని రాజ్యాంగంలో చేర్పించి ఆ వర్గానికి ఏకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర బీజేపీ పాలకులది. ఇందు కోసం అగ్ర వర్ణాలనుంచి ఒత్తిడి వర్గాలను రంగంలో దింపిన ఘనత బీజేపీది.
దేశంలో శతాబ్దాలుగా కఠోరంగా అమల్లో గల కుల వ్యవస్థ, బ్రాహ్మణీయ వివక్ష వల్ల చదువుకీ, ఆస్తికీ, ఆత్మగౌరవానికీ బహు దూరంగా బతుకుతూ... అదే సమయంలో సకల శ్రామిక, సేవక వృత్తులు చేస్తూ సమాజ రథాన్ని నడిపిస్తున్న వేలాది కింది కులాల ప్రజలను చేయి అందించి ముందుకు తీసుకురావలసిన కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాంగ కర్తలు సానుకూల వివక్షకు అవకాశం కల్పించారు.
విద్య, ఉద్యోగాల్లో కొంత శాతాన్ని ప్రత్యేక పరిగణన ద్వారా వారికి కేటాయించాలని నిర్ణయించారు. రాజ్యాంగ అధికరణలు 15(4), 46 ఇందుకే చోటు చేసుకున్నాయి. ప్రమోషన్లలో, భర్తీ కాకుండా మిగిలిపోయిన బ్యాక్ లాగ్ ఉద్యోగాలలో కూడా ఈ రిజర్వేషన్లు వర్తింపజేయడానికి వేర్వేరు రాజ్యాంగ సవరణల ద్వారా అవకాశం కల్పించారు.
బాబా సాహెబ్ అంబేడ్కర్ అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించడంతో దేశంలో సమతా భావన బలపడడం ప్రారంభించింది. అయినా ఇప్పటికీ వెలి గ్లాసులు, వెలి బావులు వంటివి కొనసాగుతున్నాయి. అగ్రవర్ణాలకు కేటాయించిన మంచినీటి కుండలోని నీరు తాగేడనే నెపం మీద పాఠశాలలో దళిత బాలుడిని కొట్టి చంపిన మాదిరి దారుణ ఉదంతాలు జరుగతున్నాయి.
రిజర్వేషన్లు కల్పించి ఏడు దశాబ్దాలు దాటినా అణగారిన వర్గాల– ఎస్సీ, ఎస్టీ, బీసీల బతుకులు చాలీ చాలని గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు వారి బతుకులను మరింతగా అంచులకు ఈడ్చివేశాయి. అందుకే జనాభాలో తామెందరో... విద్య, ఉద్యోగాల్లో అంత శాతం వాటా తమకు రావాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. కులగణన నినాదం బలం పుంజుకున్నది. కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రధాన వాగ్దానంగా చేసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాను బట్టి రిజర్వేషన్లు వర్తిస్తుండగా దేశ జన సంఖ్యలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లను 27 శాతానికే కుదించారు.
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు గీచిన హద్దు గీత, క్రీమీ లేయర్ నిబంధన బీసీల పాలిట శాపాలయ్యాయి. ఆర్థిక వెనుకబాటుతనం పేరిట అగ్రవర్ణ పేదలకు రాజ్యాంగ సవరణ ఆయుధంతో 10 శాతం కోటా కల్పించిన మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని, క్రీమీ లేయర్‌ను తొలగించడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదు? కులగణను బీజేపీ ఎందుకు వ్యతి రేకిస్తోంది? బీసీల దయనీయస్థితి అంకెల్లో అచ్చు గుద్ది నట్టు బయటపడి వారిని వాడుకుంటూనే తాను వారిని ఎంతగా వంచిస్తున్నదో బహిర్గతమవుతుందనే భయంతోనే కదా!
బీజేపీ చరిత్రంతా రిజర్వేషన్ల వ్యతిరేక చరిత్రే. దశాబ్దాల క్రితం మండల్ నివేదిక అమలుకు తలపెట్టిన ప్పుడు చెలరేగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం, మందిర్ ఆందోళన పరివార్ శక్తుల ప్రమేయంతో చెలరేగినవే కదా! సమ్మిళిత లక్షణంతో సెక్యులర్ సదాశయంతో వారి వారి అణగారినతనం ఆధారంగా హిందూయేతర మత స్థులలోని వారికీ రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది.
2005 లో యూపీఏ ప్రభుత్వం నెలకొల్పిన జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ దేశంలో ముస్లింలు దయనీయ స్థితిలో ఉన్నారనీ, వారికి విశేష స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ సిఫారసు చేసింది. ఇప్పుడు ముస్లింలకు అరకొరగా ఉన్న రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తామని ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో కఠోర స్వరంతో ప్రకటిస్తున్నారు. రాజ్యాంగ ధర్మాన్ని కాల రాస్తున్నారు. ముస్లింల రిజర్వే షన్లను తెగనరుకుతానంటున్న బీజేపీ, ఆ తర్వాత వారికి దగ్గరగా ఉన్న ఎస్సీ, ఎస్టీల కోటాకు టాటా చెప్పాబోదనే హామీ ఎక్కడిది?
ఈ ఎన్నికల్లో తమ పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి లోక్‌సభలో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను తొలగిస్తామనీ, రాజ్యాంగాన్ని మారుస్తామనీ రాజస్థాన్ మంత్రి కిరోరి లాల్ మీనా ప్రకటించినట్టు చూపించిన ఒక వీడియో గత నెలలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బీజేపీ తన అభిమతాన్ని అధికారికంగా కాకుండా అనధికారిక మార్గాలలో వ్యక్తం చేస్తూ ఉంటుందనే అభిప్రాయం ఉంది.
రిజర్వేషన్ల జోలికి వెళ్ళబోమనీ, అది తప్పుడు ప్రచారమనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న హామీలను నమ్మలేం. అర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ కూడా రంగ ప్రవేశం చేసి రిజర్వేషన్ల రద్దు జరగబోదని స్పష్టంగా ప్రకటించారు. అయితే గతంలో ఆయనొకసారి రిజర్వేషన్లను సమీక్షించాలని అన్నారు. 2015 లో బిహార్ ఎన్నికలకు కొద్ది వారాల ముందు మాట్లాడుతూ రిజర్వేషన్ విధానంపై సామాజిక సమీక్ష జరగాలని ప్రకటించారు.
దాని మీద వివాదం చెలరేగడంతో ఇతర పేద వర్గాలకు కూడా మేలు చేసే ఉద్దేశంతోనే ఆయన అలా అన్నారని వివరణ వచ్చింది. ఆచరణలో బీజేపీ పదేళ్ల పాలనలో రిజర్వేషన్లు కను మరుగయ్యేలా ప్రైవేటైజేషన్ ముమ్మరించింది. సామా జికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన బీసీలకు విధానపరంగా అది ఉపయోగపడింది శూన్యమే. బడు గులను కేవలం పేదలుగా, పైనుంచి నెలకు 5 కిలోల బియ్యం ‘ముష్టి’ వేస్తే అదే మహా ప్రసాదమని కళ్ళకు అద్దుకొనేవారుగా మాత్రమే బీజేపీ పరిగణిస్తూ ఉంది.
హిందూ కుల వ్యవస్థ దశాబ్దాలుగా అణగదొక్కగా చదువు, ఆత్మగౌరవం పిసరంతైనా అంటని బానిస బతు కులు బతికినవారికి పరిహారంగా రిజర్వేషన్లను కల్పించడాన్ని తాము నెత్తిన పెట్టుకునే సనాతన నీతికి అవమా నమని వారు భావిస్తున్నారు. ఉదాహరణకు మహిళలపై గతంలో మోహన్ భాగవత్ వెలిబుచ్చిన అభిప్రాయా లను గమనించవచ్చు. ‘పెళ్లి ఒక కాంట్రాక్టు అని ఈ ఒప్పందం ప్రకారం నువ్వు నా ఇంటి బాధ్యతలు నెరవేరిస్తే నీ అవస రాలాన్నిటినీ నేను తీరుస్తాను, నిన్ను భద్రంగా కాపాడుతాను అని భర్త భార్యకు చెబుతాడు, భార్య ఈ ప్రకారం నడుచుకున్నంత కాలం భర్త ఆమె బాధ్యత వహిస్తాడు, ఆమె ఈ కాంట్రాక్టును ఉల్లంఘిస్తే ఆమెను అతడు వదిలేయవచ్చు’అని ఆయన అన్నారు.
గ్రామీణ భారతంలో రేప్‌లు తక్కువనీ, పట్టణాల్లో, నగరాల్లోనే ఎక్కు వని కూడా అన్నారు. మహిళ ఆస్వతంత్రురాలుగా, పురుషుడి చేతుల్లో ఉండాలని ఆయన ప్రవచించారు. ఇటువంటి భావాలు గలవారి అధిపత్యంలో దేశం సెక్యులర్ రాజ్యాంగానికీ, రిజర్వేషన్లకూ స్వస్తి చెప్పి మనుస్మృతిని అమల్లోకి తెస్తుందనే భయాలు కలగడం సహజాతి సహజం.
జి. శ్రీరామమూర్తి
వ్యాసకర్త సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment