‘భూతల స్వర్గం’ నెత్తుటి చరిత్ర | kashmir is not a land it is peoples life | Sakshi
Sakshi News home page

‘భూతల స్వర్గం’ నెత్తుటి చరిత్ర

Published Thu, Oct 13 2016 1:12 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

‘భూతల స్వర్గం’ నెత్తుటి చరిత్ర - Sakshi

‘భూతల స్వర్గం’ నెత్తుటి చరిత్ర

కొత్త కోణం
భారత్‌–పాకిస్థాన్‌ ఉద్రిక్తతలకు మూల కారణం కశ్మీరే. రెండు దేశాలూ ఆ సమస్యను  ఆధిపత్యం, యుద్ధబలం లాంటి విషయాలకు పరిమితం చేస్తున్నాయి. కశ్మీర్‌ను భూభాగంగా చూస్తున్నాయి. కశ్మీర్‌ అంటే భూభాగమే కాదు. ప్రజలు, వారి విశ్వాసాలు, అభిప్రాయాలు, ఆచారాలు, వారి జీవితాలు. కశ్మీర్‌ను భారత్‌లో భాగంగా నిలుపుకోవా లంటే మన ప్రభుత్వాలు, పార్టీలు రాజకీయాలకు అతీతంగా, కశ్మీరీల మనోభావాలను గెలవ యత్నించాలి. దొంగదారులు వెతకడం మాని, దూరదృష్టితో ఆలోచించాలి.

‘‘ముత్యాల హారంలో పొదిగిన ఆకుపచ్చని మరకతం లాంటిది కశ్మీర్‌ లోయ. ఎటు చూసినా సరస్సులు, గలగల పారే సెలయేళ్లు, తివాచీ పరచి నట్టు ఉండే పచ్చిక బయళ్లతో మంచు కశ్మీరం మదిని దోచేస్తోంది. భూలోక స్వర్గంలా కనువిందు చేస్తున్నది. కొమ్మలు, రెమ్మలు ఏపుగా పెరిగిన వృక్షాలు, ఆకాశాన్ని ముద్దాడే పర్వతాలు, చల్లని, స్వచ్ఛమైన గాలి, తీయని నీళ్లు, కశ్మీరీ ప్రజల స్వచ్ఛమైన మనస్సులకు అద్దం పడుతున్నవి. సారవంతమైన నేలలో అందానికి అందం, పుష్టికరమైన, బలిష్టమైన మనుషులు కశ్మీర్‌ శక్తికి ప్రతీకలు’’ బ్రిటన్‌కు చెందిన సర్‌ వాల్టెర్‌ లారెన్స్‌ రాసిన ‘కశ్మీర్‌ లోయ’ (1895) çపుస్తకంలోని పంక్తులివి. కశ్మీర్‌ ప్రజల గురించి ఆయన ‘‘ఇక్కడి రైతులు అబద్ధమాడి ఎరుగరు. అటువంటి సందర్భమే వస్తే అల్లల్లాడి పోతారు. అటువంటి ప్రజలను నేనెక్కడా చూడలేదు’’ అని పేర్కొన్నారు. భూతల స్వర్గంగా ఎందరో కవులు, పండితులు కొనియాడిన ఆ ఆకుపచ్చని లోయలోని నదీనదాల్లో నేడు పారుతున్నది నీరు కాదు, నెత్తురు. ఓ వైపు ఉగ్రవాద దాడులు, మరో వైపు భారత పోలీసు, సైనిక బలగాల కాల్పులు.. ఈ హింసాకాండకు బలైపోతున్నది సామాన్య ప్రజలు, పసిపిల్లలు, మహి ళలు. 1947 నుంచి గత 70 ఏళ్లుగా ఈ రక్తాశ్రు ప్రవాహాలు విషాద కశ్మీరం చరిత్రను లిఖిస్తున్నాయి. ఎన్నో యుద్ధాలు, మరెన్నో ఒప్పందాలు, ఇంకెన్నో చర్యలు... ఏం జరిగినా కశ్మీర్‌లోయ రక్తపాతానికి అడ్డుకట్ట వేయలేక పోయాయి.

బౌద్ధం పరిఢవిల్లిన నేలపైనే...
1947 నుంచి నేటి వరకు కశ్మీర్‌ రక్తసిక్త చరిత్రను మాత్రమే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ, 1,400 ఏళ్ల కిందటే అక్కడ వేలాది మంది తలలు తెగిపడ్డాయి. కశ్మీర్‌ రక్తచరిత పురాతనమైనది. ఒక మతంపైన ఇంకొక మతం పైచేయి సాధించడానికి సాగించిన ఘోర హింసాకాండ నాటి కశ్మీర్‌ను అల్లకల్లోలం చేసింది. కశ్మీర్‌లో మొదట పరిఢవిల్లిన తాత్వికత బౌద్ధం. అంతకు ముందటి ప్రభువులు, పరిపాలకులు సాగించిన క్రతువులు వేదాల ఆధారంగా సాగినవి మాత్రమే. అశోకుడు బౌద్ధం స్వీకరించిన తర్వాత బౌద్ధం.. మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉన్న కశ్మీర్‌కు కూడా వ్యాపించింది. మజ్జనితికో అనే బౌద్ధ గురువును అశోకుడు కశ్మీర్‌కు పంపించాడు. ఆ ప్రాంతంలో ఎన్నో స్థూపాలను, విహారాలను నిర్మించాడు. నేటికీ నిలిచిన శ్రీనగర్‌కి పురుడు పోసింది కూడా అశోకుడే. అయినా అది నాగవంశం పాలనలో ఉన్నట్టు చరిత్ర చెబుతున్నది. అయితే అప్పటికే ప్రజల్లో బౌద్ధం ఆనవాళ్లు ఉన్నాయి, దానితో నాగవంశానికి చెందిన ఆరవాలో అనే రాజు కూడా బౌద్ధం స్వీకరించక తప్పలేదు. ఈ విషయాలు 12వ శతాబ్దంలో కల్హణుడు రాసిన రాజతరంగిణిలో స్పష్టంగానే ఉన్నాయి. బౌద్ధాన్ని ప్రేమించి, అనుసరించిన మిళిందుడు కూడా కశ్మీర్‌ను పరిపాలించాడు. తర్వాతి కాలంలో కనిష్కుడు శ్రీనగర్‌కు సమీపంలోని కుందనవనంలో నాలుగవ బౌద్ధ సమ్మేళనాన్ని నిర్వహించాడు. ఆ తర్వాతనే ఆచార్య నాగార్జునుడు మహాయానాన్ని ప్రారంభించాడు. అయితే క్రీస్తు శకం 6వ శతాబ్దం ఆరంభంలో హూణ వంశానికి చెందిన మిహిరకులుడు బౌద్ధంపై క్రూర దాడులకు పూనుకుని, వందలాది విహారాలను ధ్వంసంచేశాడు, తలల మీద వెలలు కట్టి మరీ లక్షలాది మంది బౌద్ధ భిక్కులను వెంటాడి, వేటాడి హత్యగావింపజేశాడు. ఈ విషయాలు కూడా కల్హణుని రాజతరంగిణిలో విస్పష్టంగా ఉన్నాయి. చరిత్రకారుడు విన్సెంట్‌ స్మిత్‌ ‘‘ప్రాచీన భారతదేశ చరిత్ర’’లో సైతం క్రీ.శ. 528 ప్రాంతంలో మిహిరకులుడు బౌద్ధం పట్ల ప్రదర్శించిన వైరాన్ని,  క్రూరత్వాన్ని, స్థూపాలు, విహారాల విధ్వంసాన్ని సవివరంగా వర్ణించాడు.
 
ఇక 9వ శతాబ్దంలో యావద్భారతంలో హిందూ మతాన్ని పాదు కొల్పడానికి దిగ్విజయ యాత్ర సాగించిన ఆదిశంకరాచార్యుడు మరింత క్రూరంగా, కశ్మీర్‌ సహా అంతటా లక్షలాది మంది బౌద్ధులను చంపించడమో లేదా హిందూ మతంలోనికి చేర్పించడమో చేసినట్టు చరిత్ర చెబుతున్నది. ఇక ఆ తర్వాత అçఫ్ఘన్లు, మొగలులు జరిపిన దాడులతో కశ్మీర్‌లో బౌద్ధం తట్టుకోలేక పోయింది. హిందూ మతం దాడులు, దౌర్జన్యాలు, హింసా కాండతో పాటు, ముస్లింల దండయాత్రలు కూడా బౌద్ధాన్ని దెబ్బతీసినట్టు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తన ‘‘విప్లవం– ప్రతీఘాత విప్లవం’’లో వివరిం చారు. అయితే ముస్లింల దండయాత్రల వల్ల హిందూ మతం కూడా దెబ్బతిన్నా నిలిచింది, కానీ బౌద్ధం మాత్రం తీవ్రంగా నష్టపోయింది ఎందువలన? దీనికి అంబేడ్కర్‌ సమాధానమిచ్చారు. ముస్లింల దురాక్ర మణలు, దాడులు జరిగిన కాలంలో హిందూ మతానికి రాజ్యం మద్దతు ఉన్నది. బౌద్ధులకు అలాంటి మద్దతు లేకపోవడమే కాదు, హిందూ మతానుయాయులైన రాజులు బౌద్ధాన్ని చాలా దెబ్బతీశారు. దీనితో హిందూ మతం వల్ల అప్పటికే తీవ్రంగా నష్టపోయిన బౌద్ధు్దలు గత్యంతరం లేక ఇస్లాంను స్వీకరించి ముస్లింలుగా మారారు. అందుకే ఒకప్పుడు బౌద్ధం విలసిల్లిన అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కశ్మీర్, బంగ్లాదేశ్‌ లాంటి ప్రాంతాలు ముస్లిం ప్రాంతాలుగా మారిపోయాయి. హిందూ, ఇస్లాం మతాలు రెండూ ఒకప్పుడు కశ్మీర్‌లో నెత్తురుటేరులను పారించినవే.

వర్తమాన రక్త చరితకు మూలాలు
ప్రాచీన కాలంలో తెగలుగా, ముఖ్యంగా నాగజాతిగా జీవించిన కశ్మీర్‌ ప్రజలు తర్వాత విజేతల చేతుల్లో బానిసలైపోయారు. ఎవరు ఆ రాజ్యాన్ని జయిస్తే వారి మతమే అక్కడి అధికార మతమైంది. అయితే ఇస్లాంలోని సూఫీతత్వం, ప్రాచీన తాత్విక ««ధోరణి బౌద్ధం రెండూ అక్కడి ప్రజలను శాంతికాముకులను చేశాయి. ఈ చారిత్రక నేపథ్యం నుంచి నేటి కశ్మీర్‌ హింసాకాండను చూడాల్సి ఉన్నది. వివిధ రాజవంశాల పాలనలోని కశ్మీర్‌ 1846లో బ్రిటిష్‌ వారి అధీ నంలోకి వచ్చింది. అప్పటి కశ్మీర్‌ రాజు గులాబ్‌సింగ్‌ బ్రిటిష్‌ సార్వభౌమ త్వాన్ని అంగీకరిస్తూ వారితో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. జమ్మును బ్రిటిష్‌వారు కశ్మీర్‌లో కలిపి ఒక రాష్ట్రంగా, స్వతంత్ర సంస్థానంగా రూపొం దించారు.

అయితే 1930లలో భారత స్వాతంత్య్రోద్యమాలు, పోరాటాల స్ఫూర్తితో సంస్థానాల రాజులు, మహారాజులకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాట్లు లేచాయి. 1931లోనే కశ్మీర్‌ ప్రజలు నాటి రాజు మహారాజా హరిసింగ్‌ నిరం కుశత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించారు. అదే సమ యంలో హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం వ్యతిరేక పోరాటాలు కూడా ఊపందు కున్నాయి. 1932లో షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో ఆల్‌ జమ్మూ–కశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. 1937లో షేక్‌ అబ్దుల్లా, జవహర్‌ లాల్‌ నెహ్రూతో సమావేశమై కశ్మీర్‌ ప్రజా పోరాటాల గురించి చర్చించి, తమ సంస్థ పేరును నేషనల్‌ కాన్ఫరెన్స్‌గా మార్చారు. 1941లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌  నుంచి విడి పోయిన చౌదరి గులాం అబ్బాస్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ను పునరుద్ధరించి, మహ మ్మద్‌ అలీ జిన్నా స్థాపించిన ముస్లిం లీగ్‌లో కలిపారు.

1946లో మహరాజా హరిసింగ్‌కు వ్యతిరేకంగా షేక్‌ అబ్దుల్లా నాయ కత్వాన ‘క్విట్‌ కశ్మీర్‌’ఏ ఉద్యమం ప్రారంభమైంది. అయితే కశ్మీర్‌ను భారత దేశంలో సంపూర్ణ భాగస్వామిగా చేయడానికి చేసిన ప్రయత్నాన్ని హరిసింగ్‌ మొదట వ్యతిరేకించి, స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. అయితే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి విడిపోయిన ముస్లిం కాన్ఫరెన్స్‌ పాకిస్థాన్‌లో కలవడానికి నిర్ణయించుకున్నది. స్వతంత్రంగా ఉంటానన్న హరిసింగ్‌కు వ్యతిరేకంగా అది ఆందోళనకు దిగింది. ఇది క్రమంగా హిందూ, ముస్లిం అల్లర్లకు దారితీసింది. హరిసింగ్‌ క్రమంగా పాలన మీద పట్టు కోల్పోసాగాడు. దీనితో 1947 నవంబర్‌ 1న నాటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌ మహమ్మద్‌ అలీ జిన్నాను కలిసి, కశ్మీర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే బాగుంటుందని సూచించగా, దాన్ని జిన్నా తిరస్కరించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు షేక్‌ అబ్దుల్లా కశ్మీర్‌ను భారత్‌లో భాగంగా ఉండడానికి అంగీకరించడంతో అక్కడి రాజకీయ నాయకత్వం రెండుగా చీలింది. దానితో 1949 అక్టోబర్‌ 17న భారత రాజ్యాంగ సభ కశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలను ఇచ్చే 370 ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చింది. ఇది ఒక చారిత్రక ఘట్టం. అయితే కశ్మీర్‌పై ఆధిపత్యం కోసం 1947 నుంచి పాకిస్తాన్‌ ప్రయత్నిస్తూనే ఉంది. దాని ప్రోత్సాహంతో, మద్దతుతో ఆ ప్రాంతంపై దాడులు సర్వసాధారణం అయిపోయాయి. దీనికి ప్రతిగా భారత సైన్యం తరచుగా దాడులు చేస్తూనే ఉన్నది. అయితే ఉడిలో జరిగిన దాడి మరింతగా ఉద్రిక్తతలకు కారణమైంది. భారత ప్రభుత్వం ఉగ్రవాద శిబిరాలపైన ‘సర్జికల్‌ స్రై్టక్స్‌’ దాడులు చేసింది. ఒక దశలో దాడులు యుద్ధం వైపు వెళ్తాయనే ఊహాగానాలూ వచ్చాయి.

యుద్ధం కాదు పరిష్కారం
నిజానికి భారత్‌–పాకిస్థాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తతలకు మూల కారణం కశ్మీరే. రెండు దేశాలూ ఆ సమస్యను తమ ఆధిపత్యం, యుద్ధబలం లాంటి విషయా లకు పరిమితం చేస్తున్నాయి. కశ్మీర్‌ను భూభాగంగా చూస్తున్నాయి. కశ్మీర్‌ అంటే భూభాగం మాత్రమే కాదు. ప్రజలు, వారి విశ్వాసాలు, అభిప్రా యాలు, ఆచారాలు, అంతిమంగా వారి జీవితాలు ఇవేవీ  చర్చనీయాంశాలు కాకపోవడం యాదృచ్ఛికం కాదేమో. అటు పాక్‌లో, ఇటు భారత్‌లో అధికార, ప్రతిపక్ష నేతలంతా తమ దేశభక్తికి కొలబద్ధగా కశ్మీర్‌ని వాడుతున్నారు. భారతదేశంలో ఇప్పటికే భాగంగా ఉన్న కశ్మీర్‌ను తనలో భాగంగా నిలుపు కోవాలంటే మన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, అక్కడి ప్రజల మనోభావాలను గెలుచుకోవడానికి ప్రయత్నిం చాలి. యుద్ధం అనివార్యమే అయితే గెలవాలంటే సైనికులు, ఆయుధాలు మాత్రమే సరిపోవు, ప్రజల మద్దతు కావాలి. ఉగ్రదాడులను ఎదుర్కోవడౖ మెనా సరిహద్దు ప్రజల మద్దతు లేనిదే సాధ్యం కాదు. యుద్ధం ద్వారానే ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలమనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. యుద్ధం సమస్య మాత్రమే. యుద్ధమే ఆ  సమస్యకు సమాధానం కాదు, కాలేదు. ఇప్ప టికీ మించిపోయింది లేదు. అన్ని పార్టీల రాజకీయ నాయకత్వం కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి దొంగదారులు వెతకడం మాని దూరదృష్టితో ఆలో చించి, శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేయాలి.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు- మల్లెపల్లి లక్ష్మయ్య
‘ మొబైల్‌ : 97055 66213

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement