కశ్మీర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మరోసారి వక్రబుద్ధిని చూపెట్టాడు. కశ్మీర్ తమదేనని అర్థం వచ్చేలా మరింత అగ్గిరాజేశాడు. తొలుత భారత ప్రధాని నరేంద్ర మోదీపై అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది.. కశ్మీర్ జట్టును పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ఆడటానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి విజ్ఞప్తి చేశాడు. పీఎస్‌ఎల్‌లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీ ఉండాలంటూ కొత్త రాగం అందుకున్నాడు. వచ్చే పీఎస్‌ఎల్ సీజన్ నాటికే కశ్మీర్ టీమ్ ఏర్పాటుకు కృషి చేయాలంటూ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరో అడుగు ముందుకేసి తన చివరి పీఎస్‌ఎల్ సీజన్‌లో ఆ జట్టుకు తానే నాయకత్వం వహించాలన్నాడు (మోదీపై విషం కక్కిన అఫ్రిది: పెను దుమారం)
‘పీసీబీకి ఇదే నా విన్నపం. తదుపరి పీఎస్‌ఎల్‌లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీని తయారు చేయండి. ఈ జట్టుకు నేనే సారథిగా వ్యహరించి పీఎస్‌ఎల్‌కు వీడ్కోలు చెబుతా. కశ్మీర్ జట్టుకు సారథిగా చేసే అవకాశాన్ని నేనే ఉపయోగించుకుంటా. కచ్చితంగా పీఎస్‌ఎల్‌లో కశ్మీర్ జట్టు ఉండాల్సిందే’ అంటూ ఒకవైపు విజ్ఞప్తి, మరొకవైపు డిమాండ్ అనే విధంగా అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో కశ్మీర్‌లకు ఒక స్టేడియం, ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేయాలన్నాడు. దీనికి తాను కరాచీ నుండి వచ్చి సాయం చేస్తానంటూ ఎప్పుడూ లేని ప్రేమను కురిపించాడు. ఇక్కడ దాదాపు 125 క్రికెట్ క్లబ్‌లు ఉన్నట్లు విన్నానని, వీటి మధ్య టోర్నమెంట్లు నిర్వహించే దిశగా ఏర్పాట్లు కూడా చేయాలని పీసీబీకి కొత్త తలపోటును తెచ్చిపెట్టాడు. కశ్మీర్‌లో మ్యాచ్‌లు చూడటానికి సంతోషంగా ఇక్కడకి వస్తానని, నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించి తనతో పాటు కరాచీకి తీసుకువెళ్తానన్నాడు. వారంతా తనతోపాటు ఉండవచ్చని, వారికి ప్రాక్టీస్‌తో పాటు ఎడ్యుకేషన్ కూడా తానే చూస్తానని భరోసా ఇస్తూ లేనిపోని ఆశలు కల్పించాడు అఫ్రిది. (ఈ బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసా?)
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అఫ్రిది తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. లాక్‌డౌన్ నేపథ్యంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల ప్రజలకు తన ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు అఫ్రిది ఆదివారం పీఓకేలో పర్యటించాడు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్తాన్ మొత్తం సైన్యం ఏడు లక్షలు మాత్రమే. భారత ప్రభుత్వం ఒక్క కశ్మీర్‌లోనే ఏడు లక్షలకుపైగా తన సైన్యాన్ని మోహరించందంటూ వ్యాఖ్యానించాడు.. అయినా కశ్మీరీ పౌరులకు పాక్ సైన్యానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధిపై పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉందని విషం వెళ్లగక్కాడు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు.. అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అఫ్రిది నీ స్థాయిని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ విమర్శించగా, భజ్జీ, యువరాజ్ సింగ్‌లు సైతం మండిపడ్డారు.తీవ్ర దుమారాన్ని రేపిన అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment