ఒక దళితజన బాంధవుడు | Mallepalli laxmaiah tributes to dalit leader Shamsunder | Sakshi

ఒక దళితజన బాంధవుడు

Published Thu, Dec 15 2016 1:55 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

ఒక దళితజన బాంధవుడు - Sakshi

ఒక దళితజన బాంధవుడు

కొత్త కోణం
రాజకీయంగా దళితులు బలపడాలంటే, ముస్లింలతో ఐక్య సంఘటన నిర్మించాలని ఆయన విశ్వసించారు. అందుకే నిజాం ప్రభుత్వంతో కలసి పనిచేశారు. అప్పుడే కోటి రూపాయల నిధిని దళితుల విద్యాభివృద్ధి కోసం నిజాం ప్రభుత్వం కేటాయించే విధంగా కృషి చేశారు. 1975 మే 19న తుదిశ్వాస విడిచే వరకు శ్యాంసుందర్‌ దళితుల అభ్యున్నతి మినహా ఏ విషయాలకు ప్రా«ధాన్యం ఇవ్వలేదు. ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ, అక్కడ కూడా దళితుల అభ్యున్నతినే ప్రధాన లక్ష్యంగా భావించారు.

‘‘భారతదేశంలోని 16 కోట్ల మంది అస్పృశ్యులు అమానవీయ, ఆటవిక పరిస్థితుల్లో దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. ఏ దేశంలోనైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే, ఆ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి, అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లభించేటట్టు చేసే బాధ్యత ఐక్యరాజ్యసమితిపై ఉన్నది. అటువంటి బాధ్యతను తీసుకుని, భారతదేశంలో ఉన్న కోట్లాదిమంది అంటరాని కులాలను అమానుషమైన పద్ధతుల నుంచి బయటపడేయాలని నేను కోరుతున్నాను.’’ 1948లో పారిస్‌లో జరిగిన భద్రతామండలి సమావేశంలో దళిత బాంధవుడు, సమరశీల పోరాటనేత బత్తుల శ్యాంసుందర్‌ చేసిన ప్రసంగంలోని వాక్యాలివి. ఉమ్మడి హైదరాబాద్‌ రాష్ట్రం, నిజాం సంస్థానంలో అంటరాని కులాల పక్షాన పోరాడిన భాగ్యరెడ్డి వర్మ, బి.ఎస్‌. వెంకట్రావు, అరిగె రామస్వామి, పి.ఆర్‌. వెంకటస్వామి, జె.హెచ్‌. సుబ్బయ్య, ఎం.ఎల్‌. యాదయ్యలతో పాటు ఉద్యమించిన శ్యాంసుందర్‌ దళిత ఉద్యమ చరిత్ర మరవలేని, మరపురాని నాయకుడు.

విద్యార్థి సంఘాల నాయకత్వ స్థాయి నుంచి అగ్రరాజ్యాల, ప్రపంచాధిపత్య దేశాల ప్రతినిధులతో సమంగా కూర్చుని, ఐక్యరాజ్యసమితి వేదికల వరకు దళిత గొంతును వినిపించే అరుదైన అవకాశం శ్యాంసుందర్‌కు దక్కింది. 1908, డిసెంబర్‌ 21వ తేదీన ఇప్పటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఒక రైల్వే కార్మికుడి ఇంట్లో ఆయన జన్మించారు. వారి పూర్వీకులు ఇప్పటి తెలంగాణ ప్రాంతంవారే. 1915లో శ్యాంసుందర్‌ కుటుంబం హైదరాబాద్‌ చేరుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, న్యాయశాస్త్రాలలో ఆయన పట్టాలు సాధించారు. విద్యార్థి ఉద్యమాలలో కీలకపాత్ర పోషించారు. విశ్వవిద్యాలయం సిండికేట్, సెనేట్‌ల సభ్యునిగా ఎన్నికయ్యారు.

దళితుల ఐక్యతే ఊపిరిగా
ఇదే సమయంలో హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో అంటరాని కులాల ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. శ్యాంసుందర్‌ విద్యాభ్యాసం పూర్తి చేసే సమయానికి హైదరాబాద్‌లో దళిత ఉద్యమం ఒక నిర్మాణాత్మక పాత్రను పోషిస్తున్నది. ఆ నేపథ్యమే శ్యాంసుందర్‌ను మరో ముందడుగు వేయించింది. 1931లో అంటరాని కులాల యువకులను సంఘటిత పరచడానికి యంగ్‌మెన్స్‌ అసోసియేషన్‌ను స్థాపించారు శ్యాంసుందర్‌. అదే సమయంలో స్వదేశీలీగ్‌ సభ్యునిగా, హైదరాబాద్‌ లైబ్రరీ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1930–31 సంవత్సరాలలో లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు అంబేడ్కర్‌ను ఆహ్వానించాలని కోరుతూ సాగిన ఉద్యమానికి మద్దతుగా యూత్‌లీగ్‌ ఆఫ్‌ అంబేడ్కరైట్‌ను స్థాపించారు. 1939లో స్వాతంత్య్ర సమర యోధురాలు సరోజినీనాయుడు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేట్స్‌ మహాసభల కార్యదర్శిగా దక్షతతో పనిచేశారు. ఇవేకాక, 1945లో అఖిల భారత నిమ్నజాతుల సంఘానికి అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు.

శ్యాంసుందర్‌ కేవలం సంఘాలకు నాయకుడిగానే కాక, దళితుల పక్షాన నిలిచి, ఆచరణలో  సమరశీల పాత్రను పోషించారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రతిపాదించిన అనేక విషయాలపైన ఉద్యమ కార్యాచరణను సాగిం చారు. అంటరాని కులాల ప్రజలు తమ ప్రతినిధులను తమ ఓట్లతోనే ఎన్నుకునే విధంగా ప్రత్యేక ఎలక్టరేట్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ హైదరాబాద్‌లో 1947లో యాభైవేల మందితో ర్యాలీ నిర్వహించారు. ఆ సంవత్సరమే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఎన్నిక కావడం విశేషం. ఈ సమయంలోనే నిజాం ప్రభుత్వానికీ, భారత ప్రభుత్వానికీ మధ్య ఏర్పడిన వైరుధ్యాల నేపథ్యంలో నిజాం ప్రభుత్వం తరఫున ఐక్యరాజ్య సమితికి వెళ్లిన ప్రతినిధులలో శ్యాంసుందర్‌ ఒకరు. అక్కడ ఒకవైపు హైదరాబాద్‌ ప్రభుత్వ స్వతంత్రత గురించి వాదిస్తూనే రెండోవైపు దళితుల సమస్యలను చాటారు. దళితుల ప్రత్యేక సమస్యను, సమాజం మొత్తం ఉమ్మడి సమస్యలను సమర్థవంతంగా సమన్వయం చేయడంలో శ్యాంసుందర్‌ అనుసరించిన వ్యూహం ప్రత్యేకమైనది. కొద్దిమందికే సాధ్యమైనపని. హైదరాబాద్‌ విలీనం అనంతరం తిరిగి వచ్చిన శ్యాంసుందర్‌ను దాదాపు తొమ్మిది నెలలపాటు భారత ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది.

తరువాత ఆయన పూర్తి స్థాయి రాజకీయ పోరాటం చేస్తూనే, అంటరాని కులాల హక్కుల కోసం ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నారు. 1952లో మలక్‌పేట నుంచి పోటీ చేశారు. 1956 తర్వాత శ్యాంసుందర్‌ తన ఉద్యమ కేంద్రాన్ని ప్రస్తుత కర్ణాటకలోని గుల్బర్గాకు మార్చారు. దళిత సమాజం హక్కుల కోసం పూర్తి సమయాన్ని వినియోగించాలని నిర్ణయించుకోవడం వల్లనేమో, శ్యాంసుందర్‌ వివాహానికి దూరంగా ఉన్నారు. 1957లో బీదర్‌ లోని బాల్కి నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఆయన సాగించిన ఉద్యమాలు ఈనాటి ప్రజాప్రతినిధులకు మార్గదర్శకాలు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడమే కాక, దేశవ్యాప్తంగా దళిత ఉద్యమాన్ని సమన్వయం చేయడం, దళితుల్లో ఆత్మస్థయిర్యాన్ని ఇనుమడించే విధంగా కార్యాచరణను రూపొందించే పనిని కూడా చేయడం ఆయన ప్రత్యేకత.  సిద్ధాంతపరమైన పలు అంశాలను శ్యాంసుందర్‌ ప్రతిపాదించి, కార్యాచరణలో పెట్టేందుకు ప్రయత్నించారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా అంటరాని కులాలపై దాడులు పెరిగాయేగానీ తగ్గలేదు. చట్టం, రాజ్యాంగం దళితులకు అండగా, రక్షణ కవచంగా ఉన్నదని చూపెడుతూనే, రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయని ఫలితాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. దళిత సమాజంలో రాజ్యాంగాన్ని అమలు చేయించుకొనే చైతన్యాన్ని నింపే పోరాటాలకు రూపకల్పన చేశారు. ఈ కార్యాచరణలో ముఖ్యమైనది ‘భీమసేన’ నిర్మాణం.

భీమసేన ఏర్పాటు
‘భారతీయ భీమసేన’ను స్థాపించాల్సిన అవసరాన్ని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జన్మదినం సందర్భంగా గుల్బర్గాలోని భీమ్‌నగర్‌లో జరిగిన(1968) సభలో శ్యాంసుందర్‌ పేర్కొన్నారు. ఆ నిర్ణయాన్ని హర్షధ్వానాల మధ్య సభికులు ఆమోదించారు. అయితే ‘భీమసేనలో చేరాలనుకునే వాళ్లంతా, తమ ఇండ్లలో ఉన్న హిందూ దేవుళ్ల చిత్రపటాలను, విగ్రహాలను తగులబెట్టాలి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆ రోజు స్థాపించిన భీమసేన ఉద్యమం కర్ణాటకనే కాదు, భారతæదళిత ఉద్యమాన్నీ ప్రభావితం చేసింది. దళితులపై దాడులు జరిగిన సమయాలలో, లేదా హిందూ ఆధిపత్యకులాలు రకరకాల వేధింపులకు గురిచేసినప్పుడు దళితులకు అండగా నిలబడాలని, ఆర్థిక దిగ్బంధనం విధించిన సమయంలో సహకారాన్ని అందించడమే లక్ష్యంగా ఉండాలని ‘భీమసేన’ ప్రణాళిక స్పష్టం చేసింది. సభ్యులు ఆత్మరక్షణ విధానాలను నేర్చుకోవాలనీ, ప్రతిరోజూ ఉదయం పెరేడ్‌లు నిర్వహించాలనీ, కర్రసాము లాంటి విద్యలను అభ్యసించాలనీ ప్రణాళికలో పేర్కొన్నారు. మాజీ సైనికాధికారుల ద్వారా దళిత యువకులకు శిక్షణనిప్పించడం కూడా ఒక కార్యక్రమంగా నిర్ణయించారు. దళితులపై దాడులు జరిగే ప్రాంతాలను ముందే పసిగట్టడానికి గూఢచార వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇంకా రాజకీయ చైతన్యానికి శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. సవర్ణులు దళితుల ఆస్తిపాస్తులకు హాని కలిగించిన సందర్భాల్లో భీమసేన బాధితులకు అండదండలను అందించాలి. భీమసేనను ప్రతిజిల్లాలోను బలోపేతం చేయడానికి శ్యాంసుందర్‌ దృఢ దీక్షతో పనిచేశారు.

‘భీమసేన’ ప్రణాళికకు తగ్గట్టుగానే కార్యాచరణ కూడా ఉండేది. దళితులపై దాడులు చేసిన వాళ్లను ప్రభుత్వం, పోలీసులు వెనకేసుకొచ్చిన సమయంలో సేన ప్రతిఘటించిన సందర్భాలూ ఉన్నాయి. గుల్బర్గా జిల్లాలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించాలి. ఆ జిల్లా కమలాపూర్‌లో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే శంకర్‌ శెట్టి పాటిల్‌ ఇంటిలో నింగమ్మ అనే దళిత మహిళ పనిచేసేది. ఆమెను భూస్వామి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు. శ్యాంసుందర్‌ నాయకత్వంలోని భీమసేన ఆందోళనకు దిగింది. పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో ఆగ్రహించిన భీమసేన కార్యకర్తలు శంకర్‌ శెట్టి పాటిల్‌పై దాడిచేసి చితకబాదారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దళితులు ఏ మాత్రం అన్యాయాలను, దౌర్జన్యాలను సహించరని భీమసేన స్పష్టం చేసింది. ఇది బాధిత దళితుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపింది. 1970వ దశకం ప్రారంభంలో మహారాష్ట్రలో నిర్మాణమైన దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమానికి భీమసేన స్ఫూర్తి ఉందని పరిశీలకుల అంచనా.

ఆ నాలుగు సూత్రాలు
దళితుల విముక్తికి శ్యాంసుందర్‌ నాలుగు పరిష్కారాలను ప్రతిపాదించారు. మొదటిది దళిత్‌స్థాన్‌ ఏర్పాటు. 20 శాతం ఉన్న అంటరాని కులాలకు భారతదేశంలో అందుకు తగ్గట్టుగా భూభాగాన్ని కేటాయిస్తే, వాళ్లు స్వతంత్రంగా జీవిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అంబేడ్కర్‌ కూడా ఒక దశలో ప్రతిపాదించిన విషయాన్ని విస్మరించరాదు. ప్రతి తాలూకాలో 25 శాతం గ్రామాలను దళితులకు అప్పగించాలని ఆచరణాత్మకమైన ప్రతిపాదనలు కూడా చేశారు. రెండో అంశం– ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు. మూడవది– బలమైన రాజకీయ సంస్థల నిర్మాణం. నాల్గవది ప్రత్యేక విశ్వవిద్యాలయాల స్థాపన. వీటన్నిటితో పాటు, రాజకీయంగా దళితులు బలపడాలంటే, ముస్లింలతో ఐక్య సంఘటన నిర్మించాలని ఆయన విశ్వసించారు. అందుకే హైదరాబాద్‌ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వంతో కలసి పనిచేశారు. అప్పుడే కోటి రూపాయల నిధిని దళితుల విద్యాభివృద్ధి కోసం నిజాం ప్రభుత్వం కేటాయించే విధంగా కృషి చేశారు. 1975 మే 19న తుదిశ్వాస విడిచే వరకు శ్యాంసుందర్‌ దళితుల అభ్యున్నతి మినహా ఏ విషయాలకు ప్రా«ధాన్యం ఇవ్వలేదు. ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ, అక్కడ కూడా దళితుల అభ్యున్నతినే ప్రధాన లక్ష్యంగా భావించారు. ఈనాటి రాజకీయ నాయకులకూ, ఉద్యమకారులకూ శ్యాంసుందర్‌ జీవితం స్ఫూర్తిదాయకంగా నిలవాలి.
(డిసెంబర్‌ 21 శ్యాంసుందర్‌ 108వ జయంతి)

- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement