ప్రజాస్వామిక స్వేచ్ఛకు లింకన్‌ మార్గం | Mallepally Laxmaiah Guest Column About Abraham Lincoln Pathway Democracy | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామిక స్వేచ్ఛకు లింకన్‌ మార్గం

Published Thu, Nov 19 2020 12:37 AM | Last Updated on Thu, Nov 19 2020 12:40 AM

Mallepally Laxmaiah Guest Column About Abraham Lincoln Pathway Democracy - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వం వైపు పయనిస్తోంది. వివిధ దేశాల్లో అమలులో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఎన్నికలు మాత్రమే పరమావ«ధి కావు. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉన్నదనే విషయానికే అధిక ప్రాధాన్యత. అయితే ఒక అధ్యయనం ప్రకారం ఇండియాతో పాటు, అమెరికా, యూరప్‌లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశాలు కూడా సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలుగా మార్కులు సంపాదించలేక పోతున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు. వాటిని అమలు చేయనంతవరకు మన దేశంలో సమానత్వం సిద్ధించదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు.

‘‘ఈ నేల నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కనుమరుగు కాకూడదు. ఈ జాతి నూతన స్వేచ్ఛకు జన్మనివ్వాలి. అందుకే ప్రభుత్వాలు ప్రజల చేత, ప్రజల కోసం పనిచేయాలి.’’ నవంబర్‌ 19, 1863న అమెరికాలోని గెట్టిస్‌బర్గ్‌ గడ్డమీది నుంచి చేసిన ప్రకటన ఇది. దాదాపు 157 ఏళ్ళనాడు ఆనాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ ప్రజాప్రభుత్వమంటే ఏమిటనే విషయాన్ని ప్రపంచానికి విడమర్చి చెప్పారు.

అబ్రహాం లింకన్‌ ఈ ప్రకటన యుద్ధభూమి నుంచి చేసిన సింహ గర్జన. అమెరికా అంతర్యుద్ధం సమయంలో ఈ స్వేచ్ఛా నినాదాన్ని చ్చారు. లింకన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బానిస విధా నాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు. ఇది అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అమెరికా కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్‌ చేసే స్థాయికి చేరింది. దీంతో దక్షిణ, ఉత్తర ప్రాంతాల విభజన జరిగి, అంతర్యుద్ధానికి దారితీసింది. ఇందులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఒక ప్రభుత్వం యుద్ధం చేయడం ఇదే చరిత్రలో మొదటిసారి, బహుశా చివరిసారి కూడా కావచ్చు. నల్లజాతి ప్రజలను బానిసత్వం నుంచి తప్పించ డానికి ఇటువంటి సాహాసోపేతమైన చర్యకు పూనుకున్న లింకన్‌ చరిత్రలో ఒక మహోన్నత స్థానాన్ని అలంకరించారు. అయితే ఆయన సాహసమే ఆయన హత్యకు కూడా కారణమైంది. 

ప్రజాస్వామ్యమంటే ఓటింగ్‌ జరగడం, ప్రతినిధులు ఎన్నిక కావడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమనే సాధారణ ప్రక్రియ కాదనే విషయాన్ని అబ్రహాం లింకన్‌ తేల్చి చెప్పారు. అందుకే లింక న్‌కు ముందు ఎందరెందరో సామాజికవేత్తలు, రాజనీతివేత్తలు ప్రజా స్వామ్యం గురించి ఎన్నో సూత్రీకరణలు చేసినప్పటికీ లింకన్‌ చేసిన వ్యాఖ్య ప్రపంచానికి ప్రామాణికమైంది. అందుకే నవంబర్‌ 19 ప్రజా స్వామ్య పునరుజ్జీవనానికి ఒక పునాది వేసింది. చరిత్రకారులు చెపుతు న్నట్టుగా, ప్రజాస్వామ్య భావన గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో లాంటి వాళ్ళ ఆలోచనల నుంచి పుట్టినప్పటికీ లింకన్‌కే ఆ గౌరవం దక్కింది.

నిజానికి అరిస్టాటిల్, ప్లేటోలకు ముందే మన దేశంలో గౌతమబుద్ధుడు ప్రజాస్వామ్య సూత్రాలను ప్రబోధించాడు. అగ్గన్న సుత్త, కలామ సుత్త, వస్సకర సుత్తలో ప్రభుత్వాలు ఎట్లా వ్యవహ రించాలో, ప్రజల పాత్ర ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉండాలో బుద్ధుడు సవివరంగా చెప్పాడు. కానీ మన దేశ చరిత్రకారులు, ప్రధానంగా బౌద్ధదమ్మ వ్యతిరేకులు బుద్ధుడిని ఒక మత ప్రభోదకుడిగా, అహింస, సత్యమనే చిన్న చిన్న విషయాలకు పరిమితం చేశారు. లిచ్చవి జన పదం గురించి వస్సకర సుత్తలో మాట్లాడుతూ, వారి పరిపాలనా విధానం ప్రజలకు ఎంత దగ్గరగా ఉందో బుద్ధుడు వివరిస్తాడు.

అయితే ఆధునిక చరిత్రలో వచ్చిన అనేక మార్పుల వల్ల ప్రజాస్వామ్య ఆలోచనలు చాలా ప్రగతిశీలంగా మారాయి. అటువంటి ఫలితమే మనకు లింకన్‌ మాటల్లో కనిపిస్తుంది. అయితే  లింకన్‌కు జన్మనిచ్చిన అమెరికా గడ్డమీదే ప్రభుత్వాలు ఎటువంటి నిరంకుశ, ఆధిపత్య ధోర ణులతో తమ మనుషులు కానివారిని అణచివేస్తున్నామో చూస్తున్నాం.

ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమొక్రసీ అండ్‌ ఎలక్టోరల్‌ అసిస్టెన్స్‌ (ఇంటర్నేషనల్‌ ఐడియా) సంస్థ ప్రజాస్వామ్య తీరుతెన్ను లపై 2019లో అధ్యయనం జరిపింది. ప్రపంచంలో ఉన్న ఖండాల వారీగా, విడివిడిగా వివిధ దేశాల పనివిధానాలను ఇందులో సమీక్షిం చింది. ‘‘ప్రస్తుతం విభిన్న సంస్కృతులు, పరిస్థితులను కలిగి ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం వివిధ రూపాల్లో అమలు అవుతున్నది. ప్రపం చానికి మార్గదర్శనం చేసే నాయకత్వం లేదు. నియంతృత్వ ధోరణులు పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక ప్రధాన లక్ష్యంగా ఉన్నది.

దానికోసం ఈ అధ్యయనం ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ ఆక్స్‌ఫామ్, ఇంటర్నేషనల్‌ ఎగ్జి క్యూటివ్‌ డైరెక్టర్‌ విన్నీ బైనయిమే ఈ నివేదికకు ముందుమాటగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పనితీరును అయిదు ప్రధాన అంశా లుగా విభజించారు. మొదటిది, ప్రాథమిక హక్కులు, రెండవది స్త్రీ సమానత్వం, మూడవది సంక్షేమం, నాలుగోది అవినీతి రహితం, ఐదవది మానవాభివృద్ధి సూచికలు. అంటే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఎన్నికలు మాత్రమే పరమావ«ధి కావనేది దీనర్థం. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉన్నదనే విషయానికి ఈ రిపోర్టు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అన్ని రకాలుగా మార్గ దర్శకాలుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. అయితే, ఇండియాతో పాటు, అమెరికా, యూరప్‌లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశాలు సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలుగా మార్కులు సంపాదించలేక పోయాయి. భారతదేశంలో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆ నివేదిక సారాంశం. ప్రభుత్వం అనుసరి స్తున్న అభివృద్ధి నమూనాలను ప్రశ్నిస్తున్న సంఘాలను, సంస్థలను, వ్యక్తులను ప్రభుత్వం సహించని స్థితి ఉన్నదనీ; అందులో భాగంగానే విదేశీ సహాయ క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)లో తెచ్చిన మార్పులు, అనేక ప్రజాస్వామిక, స్వచ్ఛంద సంస్థలను పనిచేయలేని స్థితికి తెచ్చాయనీ ఈ నివేదిక అభిప్రాయపడింది. 

టర్కీ రచయిత, జర్నలిస్ట్‌ ఈస్‌ తెమెల్‌కురన్‌ రాసిన ‘హౌ టు లూజ్‌ ఎ కంట్రీ–ద సెవెన్‌ స్టెప్స్‌ ఫ్రమ్‌ డెమొక్రసీ టు డిక్టేటర్‌షిప్‌’ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వంవైపు పయనిస్తున్నదని చెబుతోంది. అందుకు తెమెల్‌ కురన్‌ ఏడు అంశాలను ప్రస్తావించారు. అందులో మొదటిది, ప్రజ లకు అనవసరమైన విషయాలపై ఉద్యమ నిర్మాణం జరగడం, అసలు సమస్యలు పక్కదారి పట్టేవిధంగా ప్రజల దృష్టిని మళ్ళించడం; రెండవది, హేతుబద్ధమైన ఆలోచనలు కాకుండా, ప్రజల్లో మూఢ త్వాన్ని పెంచేందుకు శతవిధాలా ప్రయత్నం జరగడం; మూడవది, నిస్సిగ్గుగా వ్యవహరించే తత్వాన్ని ప్రజల మెదళ్ళలో చొప్పించడం,  నాల్గవది, పాలనా వ్యవస్థలైన న్యాయ, రాజకీయ యంత్రాంగాలను ధ్వంసం చేయడం; ఐదవది, నాయకుల, సంస్థల అభిప్రాయాల ప్రకారం ప్రజల మనస్సులను తయారుచేయడం. ఆరవది, ఎవరైనా తమ అభిప్రాయాలను తెలియజేస్తే అపహాస్యం చేయడం; ఏడవది, అంతిమంగా తాము ఆలోచించిన మూసలో యావద్దేశాన్ని పోత పోయాలనుకోవడం. ఈ ఏడు అంశాలు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం తన ప్రజాస్వామ్యాన్ని కోల్పోతుందని తెమెల్‌కురన్‌ చెబుతున్నారు. అమెరికా, యూరప్, ఆసియాలోని చాలా దేశాల్లో ఇటువంటి పార్టీలు, ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని తెమెల్‌కురన్‌ తేల్చి చెప్పారు.

ఇది మన దేశానికి వర్తింపజేసి చూసుకుంటే, ఆ ప్రమాదం మనల్ని కూడా వెంటాడుతున్నది. ఇక్కడే వేళ్ళూనుకొని ఉన్న కుల వ్యవస్థ వల్ల సామాజిక ఆధిపత్యం, వివక్ష, విద్వేషం కొనసాగు తున్నాయి. ఇదే విషయాన్ని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని సమర్పిస్తూ, నవంబర్‌ 25న చేసిన చివరి ప్రసంగంలో ‘‘మన దేశం 1950, జనవరి 26వ తేదీ నుంచి వైరుధ్యంలోకి వెళుతున్నది. రాజకీయంగా సమానత్వం సాధించినప్పటికీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని పరిష్క రించాలనుకుంటే, మన దేశం, మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడక తప్పదు’’ అని హెచ్చరించారు.

అందుకుగానూ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్‌ 38, ఆర్టికల్‌ 46 ఈ దేశంలోని వివిధ ప్రాంతాల, వివిధ కులాల, తెగల ప్రజల మధ్య ఉన్న అంతరాలను తొలగించే మార్గదర్శకాలు. కానీ వాటిని మన ప్రభుత్వాలు పట్టిం చుకునే స్థితిలో లేవు. పౌరహక్కుల నాయకుడు కె.జి.కన్నాభిరాన్‌ స్మారకోపన్యాసం చేస్తూ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకు హెచ్చరికగా, మార్గనిర్దేశంగా ఉంటాయి.

‘‘భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు. వాటిని అమలు చేయనంతవరకు మన దేశంలో సమానత్వం సిద్ధించదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు’’ అన్నారాయన. ఆదేశిక సూత్రాల అమలును పర్యవేక్షిం చడానికి ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన చాలాసార్లు మాట్లాడారు. స్మారకోపన్యాసాన్ని ‘లాంగ్‌ లివ్‌ ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌’ అంటూ ముగించడం మనల్ని మేల్కొల్పడానికే ననడంలో అతిశయోక్తి 
లేదు. 


మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు 
మొబైల్‌ : 81063 22077

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement