దేశంలోని అన్ని రాష్ట్రాలూ దేనికవే ప్రత్యేకమైనవే అయినా, పంజాబ్ మరింత ప్రత్యేకమైనది. దేశ సరిహద్దులో ఉండటం వల్ల రక్షణ అనేది వారి రక్తంలో కలిసిపోయింది. దానికి సాక్ష్యంగా ఇప్పటికీ దేశ జనాభా ప్రాతిపదికన అత్యధిక శాతం మంది సైన్యంలో కొనసాగుతున్నది అక్కడి నుంచే. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎందరో వీరులు ఇక్కడ ఉదయించారు. హరిత విప్లవం కాలంలో దేశానికి అన్నం గిన్నె అయింది ఈ రాష్ట్రమే. అలాగే ఇటీవలి రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపింది కూడా పంజాబీ రైతులే. అలాంటి వారిని ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ కొంతమంది దేశద్రోహులుగా నిందిస్తున్నారు; ఇది తగని పని. అది వారి సమగ్రతను అనుమానించడమే. వారి త్యాగాల చరిత్రను అవమానించడమే.
జనవరి 5వ తేదీన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లా సమీపంలోని పయరయన గ్రామం దగ్గర ఫ్లైఓవర్ పైన దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ నిలిచిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న వీరుల సమాధి హుస్సేనివాలా దగ్గర జరిగే సభలో పాల్గొనడానికి వెళుతున్న ప్రధానికి ఎదురైన ఈ ఘటన యావత్ దేశంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతులు అడ్డుకోవడం వల్లనే ప్రధాని కాన్వాయ్ ముందుకు వెళ్ళలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతాంగ ఉద్య మానికి సారథ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఈ వాదనను ఖండించింది.
ప్రధాని కాన్వాయ్‌ను రైతులు అడ్డుకోలేదనీ, ఆ దారిలో ప్రధాని వస్తున్న విషయం కూడా రైతులకు తెలియదనీ కిసాన్ మోర్చా జనవరి 6వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ, నిరసనలు తెలియజేయాలని నిర్ణయించిన మాట నిజమనీ, జనవరి 2వ తేదీన గ్రామస్థాయిలో, 5వ తేదీన జిల్లా స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించాలనీ నిర్ణయించినట్టు కూడా ఆ ప్రకటన తెలిపింది. నల్ల చట్టాల రద్దుతో పాటు, ధాన్యపు మద్దతు ధర ప్రకటించాలనీ, రైతులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలనీ, ఇప్పటికీ జైళ్ళలో ఉన్న రైతాంగ నాయకులను విడుదల చేయాలనే డిమాండ్లతో ఈ నిరసనలు చేపట్టామనీ కిసాన్ మోర్చా వెల్లడించింది.
కిసాన్ మోర్చా నుంచి వచ్చిన ప్రకటన వల్ల, కొన్ని పత్రికలు రాసిన కథనాల వల్ల రైతులకు నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని అడ్డుకునే ఉద్దేశమే లేదని తెలుస్తున్నది. అయినా కొంతమంది అదేపనిగా ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకోవడం దేశ ద్రోహమనీ, వీళ్ళంతా జాతి వ్యతిరేకులనీ... ఇంకాస్త ముందుకు వెళ్ళి, సిక్కులు ఇతర దేశాలతో చేతులు కలిపి ప్రధాని పైన దాడి చేయాలనుకొన్నారనీ... ఇలా అనేక అసత్య ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి పంజాబ్‌లోని రైతులు, ప్రత్యేకించి సిక్కులు బలమైన శక్తిగా నిలబడ్డారు. అందువల్లే కావొచ్చు, సిక్కుల పైన గతం నుంచీ కొంత మందికి ఉన్న విద్వేషాన్ని మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఎంత మాత్రం సరైనది కాదు.
సిక్కులు... ప్రత్యేకించి పంజాబ్ సిక్కులు మనం ఈ రోజు అనుకుంటున్న భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా భావించి బలిదానాలు చేశారు. ఈ రోజు మనం పిలుస్తున్న సిక్కు సంప్రదాయం, లేదా సిక్కు మతం ఆవిర్భవించిందే భారతదేశ రక్షణకు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. భారతదేశానికి పంజాబ్ పశ్చిమంగా ఉండి, నిత్యం దాడులకు, యుద్ధాలకు గురైంది. అయితే వందల ఏండ్లుగా సాగుతున్న విదేశీ దాడులను ఎదుర్కోవాలంటే కుల వ్యవస్థ వల్ల ఉన్న అనైక్యత ఉండకూడదనీ, మూఢనమ్మకాలు సమసి పోవాలనీ, వందల దేవుళ్ళ పేరుతో విభజనకు గురవడం సరికాదనీ గురునానక్ గుర్తించారు.
విదేశీ దాడులను ఆపాలన్న ఉన్నత లక్ష్యంతో క్రీ.శ.1469లో గురు నానక్ ప్రారంభించిన సిక్కు సంప్రదాయదాన్ని, ఏడవ గురువైన గురుగోవింద్ సింగ్ ఒక శక్తిమంతమైన మతంగా అభివృద్ధి చేశారు. చదువు, యుద్ధ విద్య, క్రమశిక్షణ, సత్‌ప్రవర్తనలో కాగిన ఒక జీవన విధానాన్ని గురుగోవింద్ సింగ్ ప్రబోధించారు. వీరివల్లనే భారత దేశం విదేశీయుల దాడులను ప్రత్యేకించి మొఘల్ దాడులను, బ్రిటిష్ దాడులను ఎదుర్కోగలిగింది.
శత్రువుల గుండెల్లో భయోత్పాతాన్ని సృష్టించిన సిక్కుల త్యాగా లను చరిత్ర సుస్థిరం చేసింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ కారుల్లో సిక్కుల పాత్ర చిరస్మరణీయం. ఉరికొయ్యల ఉయ్యాలలూగుతానని ప్రకటించిన నూనూగు మీసాల షాహీద్ భగత్ సింగ్ త్యాగం వెలకట్టలేనిది. భగత్‌సింగ్‌ను ఈ నేల ఏనాటికీ మరువజాలదు. లాల్, బాల్, పాల్ త్రయంలో లాల్‌గా పిలుచుకునే లాలా లజపతి రాయ్ పంజాబ్ బిడ్డనే విషయాన్ని మరువకూడదు. జలియన్ వాలా బాగ్ మారణకాండకు లండన్ వెళ్లి ప్రతీకారం తీర్చుకున్న ఉద్దండుడు ఉద్ధం సింగ్ సైతం ఈ గడ్డమీది వాడే.
భారతదేశ విభజన సందర్భంగా వేలాదిమంది సిక్కులు మత కలహాలకు బలయ్యారు. భారతదేశ స్వాతంత్య్రానంతరం రాజ్యాం గంలో పంజాబ్‌కు ప్రత్యేకంగా కొన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి, ఆనాటి నాయకులు ఇచ్చిన మాట మరిచిపోయారు. దాంతో 1980 ప్రాంతంలో ఖలిస్తాన్ ఉద్యమం బయలుదేరింది. అది క్రమంగా హింసారూపం దాల్చింది. ఎందరో సిక్కు యువకులు టెర్రరిస్టులుగా ముద్రపడి ప్రాణాలు కోల్పోయారు. ఆ పగ, ప్రతీకారమే మన ప్రధాని ఇందిరాగాంధీ ప్రాణాలను బలిగొన్నది. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీలో సిక్కుల ఊచకోత జరిగింది. అయినప్పటికీ పంజాబ్ ప్రజలు, రైతులు దేశ ఆర్థికాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు.
స్వాతంత్య్రానంతరం దేశం ఎదుర్కొన్న సమస్యల్లో ప్రధానమై నది ఆహార కొరత. అందుకుగాను దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులను పెంచాలని అప్పటి ప్రభుత్వాలు నూతన వ్యవసాయ విధానాలను ప్రకటించాయి. దానిపేరే సస్యవిప్లవం. అందులో మళ్ళీ మొదటి వరసలో నిలిచింది పంజాబ్, హరియాణా రైతులే. 1970 నాటికి దేశంలోని ఆహార అవసరాలలో 70 శాతం అందించిన రాష్ట్రం పంజాబ్ ప్రాంతమేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలుసు. ఒక రకంగా దేశాన్ని కాపాడింది పంజాబ్ మాత్రమే నంటే అనుమానం అక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు పంజాబ్, హరియాణా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి.
అదేవిధంగా మొదటగా చెప్పినట్లుగానే, ఇప్పటికీ దేశ రక్షణ కర్తవ్య నిర్వహణలో పంజాబ్, హరియాణా ప్రజల, ప్రత్యేకించి సిక్కుల పాత్రను విస్మరించలేం. ఇటీవల పార్లమెంటులో ప్రకటించిన సైన్యం వివరాల ప్రకారం మొత్తం దేశ సైన్యం 11 లక్షల 51 వేలు. ఇందులో 89, 088 మంది పంజాబీయులే. ఇది మొత్తం సైన్యంలో 7.7 శాతం. దేశ జనాభాలో పంజాబ్ జనాభా 2.3 శాతం. అంటే జనాభా దామాషా కన్నా 5.4 శాతం అధికంగా పంజాబీలు సైన్యంలో ఉన్నారు. సైన్యంలో పంజాబ్‌ది రెండోస్థానం. ఉత్తరప్రదేశ్‌ది మొదటిస్థానం. ఉత్తరప్రదేశ్ నుంచి సైన్యంలో ఉన్నవారు 1,67,000. కానీ దాని జనాభా దేశంలో 16.5 శాతం కాగా, సైన్యంలో వారు ఉన్నది 14.5 శాతం. అంటే జనాభా ప్రాతిపదికన 2 శాతం తక్కువ. అదేవిధంగా హరియాణా నుంచి సైన్యంలో ఉన్నవారి సంఖ్య 65, 978. కాగా దేశా జనాభాలో వారిది 2.09 శాతం. అయినా సైన్యంలో ఉన్నవాళ్లు 5.7 శాతం. అంటే దాదాపు మూడున్నర శాతం అధికం. పంజాబ్, హరి యాణాల్లో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారనే విషయాన్ని మరవద్దు.
దేశ ఆర్థికాభివృద్ధిలో, దేశ రక్షణలో, దేశభక్తిలో పంజాబ్‌ది అగ్ర భాగం. అటువంటి దేశభక్తి నరనరాన నింపుకున్న పంజాబ్ ప్రజలను, దేశానికే అన్నం పెట్టిన పంజాబ్ రైతులను దేశ ద్రోహులుగా, జాతి వ్యతిరేకశక్తులుగా ముద్ర వేయడం ఎంత మాత్రం విజ్ఞత అనిపించు కోదు. ప్రధాని కాన్వాయ్ నిలచిపోవడం విషయంపై విచారణ జర గాలి. నిజాలను రాబట్టాలి. అది పోలీసుల పని. కానీ పంజాబ్ రైతులు ఎందుకు ఇంకా ఆగ్రహంతో ఉన్నారో తెలుసుకొని, పరిష్కారాలను కనిపెట్టడం రాజనీతిజ్ఞుల కర్తవ్యం. పాలకులు ప్రజాస్వామ్యయు తంగా ఆలోచించగలగాలి. ఇప్పటికే విద్వేషాలు, వివక్షలు ఎన్నో ప్రతి కూల ఫలితాలను ఇచ్చాయి. ఇప్పటికైనా రాజనీతిజ్ఞతతో వ్యవహరి స్తారో, ప్రజల ఆశలను అడియాసలు చేసి దోషులుగా మిగిలిపోతారో తేల్చుకోవాల్సిందే పాలకులే.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment