kotha konam
-
పంజాబీయులు మన సహోదరులు
దేశంలోని అన్ని రాష్ట్రాలూ దేనికవే ప్రత్యేకమైనవే అయినా, పంజాబ్ మరింత ప్రత్యేకమైనది. దేశ సరిహద్దులో ఉండటం వల్ల రక్షణ అనేది వారి రక్తంలో కలిసిపోయింది. దానికి సాక్ష్యంగా ఇప్పటికీ దేశ జనాభా ప్రాతిపదికన అత్యధిక శాతం మంది సైన్యంలో కొనసాగుతున్నది అక్కడి నుంచే. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎందరో వీరులు ఇక్కడ ఉదయించారు. హరిత విప్లవం కాలంలో దేశానికి అన్నం గిన్నె అయింది ఈ రాష్ట్రమే. అలాగే ఇటీవలి రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపింది కూడా పంజాబీ రైతులే. అలాంటి వారిని ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ కొంతమంది దేశద్రోహులుగా నిందిస్తున్నారు; ఇది తగని పని. అది వారి సమగ్రతను అనుమానించడమే. వారి త్యాగాల చరిత్రను అవమానించడమే. జనవరి 5వ తేదీన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లా సమీపంలోని పయరయన గ్రామం దగ్గర ఫ్లైఓవర్ పైన దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ నిలిచిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న వీరుల సమాధి హుస్సేనివాలా దగ్గర జరిగే సభలో పాల్గొనడానికి వెళుతున్న ప్రధానికి ఎదురైన ఈ ఘటన యావత్ దేశంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతులు అడ్డుకోవడం వల్లనే ప్రధాని కాన్వాయ్ ముందుకు వెళ్ళలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతాంగ ఉద్య మానికి సారథ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఈ వాదనను ఖండించింది. ప్రధాని కాన్వాయ్‌ను రైతులు అడ్డుకోలేదనీ, ఆ దారిలో ప్రధాని వస్తున్న విషయం కూడా రైతులకు తెలియదనీ కిసాన్ మోర్చా జనవరి 6వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ, నిరసనలు తెలియజేయాలని నిర్ణయించిన మాట నిజమనీ, జనవరి 2వ తేదీన గ్రామస్థాయిలో, 5వ తేదీన జిల్లా స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించాలనీ నిర్ణయించినట్టు కూడా ఆ ప్రకటన తెలిపింది. నల్ల చట్టాల రద్దుతో పాటు, ధాన్యపు మద్దతు ధర ప్రకటించాలనీ, రైతులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలనీ, ఇప్పటికీ జైళ్ళలో ఉన్న రైతాంగ నాయకులను విడుదల చేయాలనే డిమాండ్లతో ఈ నిరసనలు చేపట్టామనీ కిసాన్ మోర్చా వెల్లడించింది. కిసాన్ మోర్చా నుంచి వచ్చిన ప్రకటన వల్ల, కొన్ని పత్రికలు రాసిన కథనాల వల్ల రైతులకు నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని అడ్డుకునే ఉద్దేశమే లేదని తెలుస్తున్నది. అయినా కొంతమంది అదేపనిగా ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకోవడం దేశ ద్రోహమనీ, వీళ్ళంతా జాతి వ్యతిరేకులనీ... ఇంకాస్త ముందుకు వెళ్ళి, సిక్కులు ఇతర దేశాలతో చేతులు కలిపి ప్రధాని పైన దాడి చేయాలనుకొన్నారనీ... ఇలా అనేక అసత్య ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి పంజాబ్‌లోని రైతులు, ప్రత్యేకించి సిక్కులు బలమైన శక్తిగా నిలబడ్డారు. అందువల్లే కావొచ్చు, సిక్కుల పైన గతం నుంచీ కొంత మందికి ఉన్న విద్వేషాన్ని మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. సిక్కులు... ప్రత్యేకించి పంజాబ్ సిక్కులు మనం ఈ రోజు అనుకుంటున్న భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా భావించి బలిదానాలు చేశారు. ఈ రోజు మనం పిలుస్తున్న సిక్కు సంప్రదాయం, లేదా సిక్కు మతం ఆవిర్భవించిందే భారతదేశ రక్షణకు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. భారతదేశానికి పంజాబ్ పశ్చిమంగా ఉండి, నిత్యం దాడులకు, యుద్ధాలకు గురైంది. అయితే వందల ఏండ్లుగా సాగుతున్న విదేశీ దాడులను ఎదుర్కోవాలంటే కుల వ్యవస్థ వల్ల ఉన్న అనైక్యత ఉండకూడదనీ, మూఢనమ్మకాలు సమసి పోవాలనీ, వందల దేవుళ్ళ పేరుతో విభజనకు గురవడం సరికాదనీ గురునానక్ గుర్తించారు. విదేశీ దాడులను ఆపాలన్న ఉన్నత లక్ష్యంతో క్రీ.శ.1469లో గురు నానక్ ప్రారంభించిన సిక్కు సంప్రదాయదాన్ని, ఏడవ గురువైన గురుగోవింద్ సింగ్ ఒక శక్తిమంతమైన మతంగా అభివృద్ధి చేశారు. చదువు, యుద్ధ విద్య, క్రమశిక్షణ, సత్ప్రవర్తనలో కాగిన ఒక జీవన విధానాన్ని గురుగోవింద్ సింగ్ ప్రబోధించారు. వీరివల్లనే భారత దేశం విదేశీయుల దాడులను ప్రత్యేకించి మొఘల్ దాడులను, బ్రిటిష్ దాడులను ఎదుర్కోగలిగింది. శత్రువుల గుండెల్లో భయోత్పాతాన్ని సృష్టించిన సిక్కుల త్యాగా లను చరిత్ర సుస్థిరం చేసింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ కారుల్లో సిక్కుల పాత్ర చిరస్మరణీయం. ఉరికొయ్యల ఉయ్యాలలూగుతానని ప్రకటించిన నూనూగు మీసాల షాహీద్ భగత్ సింగ్ త్యాగం వెలకట్టలేనిది. భగత్‌సింగ్‌ను ఈ నేల ఏనాటికీ మరువజాలదు. లాల్, బాల్, పాల్ త్రయంలో లాల్‌గా పిలుచుకునే లాలా లజపతి రాయ్ పంజాబ్ బిడ్డనే విషయాన్ని మరువకూడదు. జలియన్ వాలా బాగ్ మారణకాండకు లండన్ వెళ్లి ప్రతీకారం తీర్చుకున్న ఉద్దండుడు ఉద్ధం సింగ్ సైతం ఈ గడ్డమీది వాడే. భారతదేశ విభజన సందర్భంగా వేలాదిమంది సిక్కులు మత కలహాలకు బలయ్యారు. భారతదేశ స్వాతంత్య్రానంతరం రాజ్యాం గంలో పంజాబ్‌కు ప్రత్యేకంగా కొన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి, ఆనాటి నాయకులు ఇచ్చిన మాట మరిచిపోయారు. దాంతో 1980 ప్రాంతంలో ఖలిస్తాన్ ఉద్యమం బయలుదేరింది. అది క్రమంగా హింసారూపం దాల్చింది. ఎందరో సిక్కు యువకులు టెర్రరిస్టులుగా ముద్రపడి ప్రాణాలు కోల్పోయారు. ఆ పగ, ప్రతీకారమే మన ప్రధాని ఇందిరాగాంధీ ప్రాణాలను బలిగొన్నది. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీలో సిక్కుల ఊచకోత జరిగింది. అయినప్పటికీ పంజాబ్ ప్రజలు, రైతులు దేశ ఆర్థికాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశం ఎదుర్కొన్న సమస్యల్లో ప్రధానమై నది ఆహార కొరత. అందుకుగాను దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులను పెంచాలని అప్పటి ప్రభుత్వాలు నూతన వ్యవసాయ విధానాలను ప్రకటించాయి. దానిపేరే సస్యవిప్లవం. అందులో మళ్ళీ మొదటి వరసలో నిలిచింది పంజాబ్, హరియాణా రైతులే. 1970 నాటికి దేశంలోని ఆహార అవసరాలలో 70 శాతం అందించిన రాష్ట్రం పంజాబ్ ప్రాంతమేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలుసు. ఒక రకంగా దేశాన్ని కాపాడింది పంజాబ్ మాత్రమే నంటే అనుమానం అక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు పంజాబ్, హరియాణా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అదేవిధంగా మొదటగా చెప్పినట్లుగానే, ఇప్పటికీ దేశ రక్షణ కర్తవ్య నిర్వహణలో పంజాబ్, హరియాణా ప్రజల, ప్రత్యేకించి సిక్కుల పాత్రను విస్మరించలేం. ఇటీవల పార్లమెంటులో ప్రకటించిన సైన్యం వివరాల ప్రకారం మొత్తం దేశ సైన్యం 11 లక్షల 51 వేలు. ఇందులో 89, 088 మంది పంజాబీయులే. ఇది మొత్తం సైన్యంలో 7.7 శాతం. దేశ జనాభాలో పంజాబ్ జనాభా 2.3 శాతం. అంటే జనాభా దామాషా కన్నా 5.4 శాతం అధికంగా పంజాబీలు సైన్యంలో ఉన్నారు. సైన్యంలో పంజాబ్‌ది రెండోస్థానం. ఉత్తరప్రదేశ్‌ది మొదటిస్థానం. ఉత్తరప్రదేశ్ నుంచి సైన్యంలో ఉన్నవారు 1,67,000. కానీ దాని జనాభా దేశంలో 16.5 శాతం కాగా, సైన్యంలో వారు ఉన్నది 14.5 శాతం. అంటే జనాభా ప్రాతిపదికన 2 శాతం తక్కువ. అదేవిధంగా హరియాణా నుంచి సైన్యంలో ఉన్నవారి సంఖ్య 65, 978. కాగా దేశా జనాభాలో వారిది 2.09 శాతం. అయినా సైన్యంలో ఉన్నవాళ్లు 5.7 శాతం. అంటే దాదాపు మూడున్నర శాతం అధికం. పంజాబ్, హరి యాణాల్లో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారనే విషయాన్ని మరవద్దు. దేశ ఆర్థికాభివృద్ధిలో, దేశ రక్షణలో, దేశభక్తిలో పంజాబ్‌ది అగ్ర భాగం. అటువంటి దేశభక్తి నరనరాన నింపుకున్న పంజాబ్ ప్రజలను, దేశానికే అన్నం పెట్టిన పంజాబ్ రైతులను దేశ ద్రోహులుగా, జాతి వ్యతిరేకశక్తులుగా ముద్ర వేయడం ఎంత మాత్రం విజ్ఞత అనిపించు కోదు. ప్రధాని కాన్వాయ్ నిలచిపోవడం విషయంపై విచారణ జర గాలి. నిజాలను రాబట్టాలి. అది పోలీసుల పని. కానీ పంజాబ్ రైతులు ఎందుకు ఇంకా ఆగ్రహంతో ఉన్నారో తెలుసుకొని, పరిష్కారాలను కనిపెట్టడం రాజనీతిజ్ఞుల కర్తవ్యం. పాలకులు ప్రజాస్వామ్యయు తంగా ఆలోచించగలగాలి. ఇప్పటికే విద్వేషాలు, వివక్షలు ఎన్నో ప్రతి కూల ఫలితాలను ఇచ్చాయి. ఇప్పటికైనా రాజనీతిజ్ఞతతో వ్యవహరి స్తారో, ప్రజల ఆశలను అడియాసలు చేసి దోషులుగా మిగిలిపోతారో తేల్చుకోవాల్సిందే పాలకులే. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
ప్రజాస్వామిక స్వేచ్ఛకు లింకన్ మార్గం
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వం వైపు పయనిస్తోంది. వివిధ దేశాల్లో అమలులో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఎన్నికలు మాత్రమే పరమావ«ధి కావు. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉన్నదనే విషయానికే అధిక ప్రాధాన్యత. అయితే ఒక అధ్యయనం ప్రకారం ఇండియాతో పాటు, అమెరికా, యూరప్‌లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశాలు కూడా సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలుగా మార్కులు సంపాదించలేక పోతున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు. వాటిని అమలు చేయనంతవరకు మన దేశంలో సమానత్వం సిద్ధించదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. ‘‘ఈ నేల నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కనుమరుగు కాకూడదు. ఈ జాతి నూతన స్వేచ్ఛకు జన్మనివ్వాలి. అందుకే ప్రభుత్వాలు ప్రజల చేత, ప్రజల కోసం పనిచేయాలి.’’ నవంబర్ 19, 1863న అమెరికాలోని గెట్టిస్బర్గ్ గడ్డమీది నుంచి చేసిన ప్రకటన ఇది. దాదాపు 157 ఏళ్ళనాడు ఆనాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాప్రభుత్వమంటే ఏమిటనే విషయాన్ని ప్రపంచానికి విడమర్చి చెప్పారు. అబ్రహాం లింకన్ ఈ ప్రకటన యుద్ధభూమి నుంచి చేసిన సింహ గర్జన. అమెరికా అంతర్యుద్ధం సమయంలో ఈ స్వేచ్ఛా నినాదాన్ని చ్చారు. లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బానిస విధా నాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు. ఇది అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అమెరికా కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేసే స్థాయికి చేరింది. దీంతో దక్షిణ, ఉత్తర ప్రాంతాల విభజన జరిగి, అంతర్యుద్ధానికి దారితీసింది. ఇందులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఒక ప్రభుత్వం యుద్ధం చేయడం ఇదే చరిత్రలో మొదటిసారి, బహుశా చివరిసారి కూడా కావచ్చు. నల్లజాతి ప్రజలను బానిసత్వం నుంచి తప్పించ డానికి ఇటువంటి సాహాసోపేతమైన చర్యకు పూనుకున్న లింకన్ చరిత్రలో ఒక మహోన్నత స్థానాన్ని అలంకరించారు. అయితే ఆయన సాహసమే ఆయన హత్యకు కూడా కారణమైంది. ప్రజాస్వామ్యమంటే ఓటింగ్ జరగడం, ప్రతినిధులు ఎన్నిక కావడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమనే సాధారణ ప్రక్రియ కాదనే విషయాన్ని అబ్రహాం లింకన్ తేల్చి చెప్పారు. అందుకే లింక న్కు ముందు ఎందరెందరో సామాజికవేత్తలు, రాజనీతివేత్తలు ప్రజా స్వామ్యం గురించి ఎన్నో సూత్రీకరణలు చేసినప్పటికీ లింకన్ చేసిన వ్యాఖ్య ప్రపంచానికి ప్రామాణికమైంది. అందుకే నవంబర్ 19 ప్రజా స్వామ్య పునరుజ్జీవనానికి ఒక పునాది వేసింది. చరిత్రకారులు చెపుతు న్నట్టుగా, ప్రజాస్వామ్య భావన గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో లాంటి వాళ్ళ ఆలోచనల నుంచి పుట్టినప్పటికీ లింకన్కే ఆ గౌరవం దక్కింది. నిజానికి అరిస్టాటిల్, ప్లేటోలకు ముందే మన దేశంలో గౌతమబుద్ధుడు ప్రజాస్వామ్య సూత్రాలను ప్రబోధించాడు. అగ్గన్న సుత్త, కలామ సుత్త, వస్సకర సుత్తలో ప్రభుత్వాలు ఎట్లా వ్యవహ రించాలో, ప్రజల పాత్ర ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉండాలో బుద్ధుడు సవివరంగా చెప్పాడు. కానీ మన దేశ చరిత్రకారులు, ప్రధానంగా బౌద్ధదమ్మ వ్యతిరేకులు బుద్ధుడిని ఒక మత ప్రభోదకుడిగా, అహింస, సత్యమనే చిన్న చిన్న విషయాలకు పరిమితం చేశారు. లిచ్చవి జన పదం గురించి వస్సకర సుత్తలో మాట్లాడుతూ, వారి పరిపాలనా విధానం ప్రజలకు ఎంత దగ్గరగా ఉందో బుద్ధుడు వివరిస్తాడు. అయితే ఆధునిక చరిత్రలో వచ్చిన అనేక మార్పుల వల్ల ప్రజాస్వామ్య ఆలోచనలు చాలా ప్రగతిశీలంగా మారాయి. అటువంటి ఫలితమే మనకు లింకన్ మాటల్లో కనిపిస్తుంది. అయితే లింకన్‌కు జన్మనిచ్చిన అమెరికా గడ్డమీదే ప్రభుత్వాలు ఎటువంటి నిరంకుశ, ఆధిపత్య ధోర ణులతో తమ మనుషులు కానివారిని అణచివేస్తున్నామో చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (ఇంటర్నేషనల్ ఐడియా) సంస్థ ప్రజాస్వామ్య తీరుతెన్ను లపై 2019లో అధ్యయనం జరిపింది. ప్రపంచంలో ఉన్న ఖండాల వారీగా, విడివిడిగా వివిధ దేశాల పనివిధానాలను ఇందులో సమీక్షిం చింది. ‘‘ప్రస్తుతం విభిన్న సంస్కృతులు, పరిస్థితులను కలిగి ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం వివిధ రూపాల్లో అమలు అవుతున్నది. ప్రపం చానికి మార్గదర్శనం చేసే నాయకత్వం లేదు. నియంతృత్వ ధోరణులు పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక ప్రధాన లక్ష్యంగా ఉన్నది. దానికోసం ఈ అధ్యయనం ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ ఆక్స్‌ఫామ్, ఇంటర్నేషనల్ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనయిమే ఈ నివేదికకు ముందుమాటగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పనితీరును అయిదు ప్రధాన అంశా లుగా విభజించారు. మొదటిది, ప్రాథమిక హక్కులు, రెండవది స్త్రీ సమానత్వం, మూడవది సంక్షేమం, నాలుగోది అవినీతి రహితం, ఐదవది మానవాభివృద్ధి సూచికలు. అంటే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఎన్నికలు మాత్రమే పరమావ«ధి కావనేది దీనర్థం. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉన్నదనే విషయానికి ఈ రిపోర్టు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అన్ని రకాలుగా మార్గ దర్శకాలుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. అయితే, ఇండియాతో పాటు, అమెరికా, యూరప్‌లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశాలు సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలుగా మార్కులు సంపాదించలేక పోయాయి. భారతదేశంలో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆ నివేదిక సారాంశం. ప్రభుత్వం అనుసరి స్తున్న అభివృద్ధి నమూనాలను ప్రశ్నిస్తున్న సంఘాలను, సంస్థలను, వ్యక్తులను ప్రభుత్వం సహించని స్థితి ఉన్నదనీ; అందులో భాగంగానే విదేశీ సహాయ క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)లో తెచ్చిన మార్పులు, అనేక ప్రజాస్వామిక, స్వచ్ఛంద సంస్థలను పనిచేయలేని స్థితికి తెచ్చాయనీ ఈ నివేదిక అభిప్రాయపడింది. టర్కీ రచయిత, జర్నలిస్ట్ ఈస్ తెమెల్‌కురన్ రాసిన ‘హౌ టు లూజ్ ఎ కంట్రీ–ద సెవెన్ స్టెప్స్ ఫ్రమ్ డెమొక్రసీ టు డిక్టేటర్షిప్’ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వంవైపు పయనిస్తున్నదని చెబుతోంది. అందుకు తెమెల్ కురన్ ఏడు అంశాలను ప్రస్తావించారు. అందులో మొదటిది, ప్రజ లకు అనవసరమైన విషయాలపై ఉద్యమ నిర్మాణం జరగడం, అసలు సమస్యలు పక్కదారి పట్టేవిధంగా ప్రజల దృష్టిని మళ్ళించడం; రెండవది, హేతుబద్ధమైన ఆలోచనలు కాకుండా, ప్రజల్లో మూఢ త్వాన్ని పెంచేందుకు శతవిధాలా ప్రయత్నం జరగడం; మూడవది, నిస్సిగ్గుగా వ్యవహరించే తత్వాన్ని ప్రజల మెదళ్ళలో చొప్పించడం, నాల్గవది, పాలనా వ్యవస్థలైన న్యాయ, రాజకీయ యంత్రాంగాలను ధ్వంసం చేయడం; ఐదవది, నాయకుల, సంస్థల అభిప్రాయాల ప్రకారం ప్రజల మనస్సులను తయారుచేయడం. ఆరవది, ఎవరైనా తమ అభిప్రాయాలను తెలియజేస్తే అపహాస్యం చేయడం; ఏడవది, అంతిమంగా తాము ఆలోచించిన మూసలో యావద్దేశాన్ని పోత పోయాలనుకోవడం. ఈ ఏడు అంశాలు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం తన ప్రజాస్వామ్యాన్ని కోల్పోతుందని తెమెల్‌కురన్ చెబుతున్నారు. అమెరికా, యూరప్, ఆసియాలోని చాలా దేశాల్లో ఇటువంటి పార్టీలు, ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని తెమెల్‌కురన్ తేల్చి చెప్పారు. ఇది మన దేశానికి వర్తింపజేసి చూసుకుంటే, ఆ ప్రమాదం మనల్ని కూడా వెంటాడుతున్నది. ఇక్కడే వేళ్ళూనుకొని ఉన్న కుల వ్యవస్థ వల్ల సామాజిక ఆధిపత్యం, వివక్ష, విద్వేషం కొనసాగు తున్నాయి. ఇదే విషయాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని సమర్పిస్తూ, నవంబర్ 25న చేసిన చివరి ప్రసంగంలో ‘‘మన దేశం 1950, జనవరి 26వ తేదీ నుంచి వైరుధ్యంలోకి వెళుతున్నది. రాజకీయంగా సమానత్వం సాధించినప్పటికీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని పరిష్క రించాలనుకుంటే, మన దేశం, మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడక తప్పదు’’ అని హెచ్చరించారు. అందుకుగానూ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 38, ఆర్టికల్ 46 ఈ దేశంలోని వివిధ ప్రాంతాల, వివిధ కులాల, తెగల ప్రజల మధ్య ఉన్న అంతరాలను తొలగించే మార్గదర్శకాలు. కానీ వాటిని మన ప్రభుత్వాలు పట్టిం చుకునే స్థితిలో లేవు. పౌరహక్కుల నాయకుడు కె.జి.కన్నాభిరాన్ స్మారకోపన్యాసం చేస్తూ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకు హెచ్చరికగా, మార్గనిర్దేశంగా ఉంటాయి. ‘‘భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు. వాటిని అమలు చేయనంతవరకు మన దేశంలో సమానత్వం సిద్ధించదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు’’ అన్నారాయన. ఆదేశిక సూత్రాల అమలును పర్యవేక్షిం చడానికి ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన చాలాసార్లు మాట్లాడారు. స్మారకోపన్యాసాన్ని ‘లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్’ అంటూ ముగించడం మనల్ని మేల్కొల్పడానికే ననడంలో అతిశయోక్తి లేదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
కరోనా నివారణలో కుబేరులెక్కడ?
ప్రభుత్వాలు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ప్రజలు బాధ్యత వహించాల్సి వస్తున్నది. విద్య, వైద్యం ఏ దేశానికైనా అత్యంత కీలకమైన విషయాలనీ, వాటిని అశ్రద్ధ చేయొద్దని నెత్తీనోరూ బాదుకున్నా ఫలితం లేకపోయింది. శాస్త్రీయ అధ్యయనాలపై దృష్టిసారించాలనీ, దేశంలో పరిశోధనలపై ఖర్చుపెట్టాలని ఎంతోమంది ఎంత చెప్పినా ఆయా రంగాలకు కేటాయిస్తున్న మొత్తం అత్యల్పం. వీటన్నింటి ఫలితమే నేటి దుస్థితికి కారణం.తెలుగు రాష్ట్రాలలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పెద్దపెద్ద కాంట్రాక్టర్లు తమ దాతృత్వాన్ని ప్రదర్శించాలి. ప్రజలుంటేనే వారుండేది. వారు బతికేది. అందుకే ఇప్పుడు ప్రజల్ని బతికిద్దాం. ‘‘మానవ జాతికి అత్యంత ప్రమాదకరంగా మారింది, సమస్త మానవ జాతిని నాశనం చేయబోతున్నది వైరస్ అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ లక్షలాది మంది మరణిస్తే అది యుద్ధాల వల్లనో, మిస్సైల్స్ వల్లనో కాదు. విషక్రిముల వల్ల మాత్రమేనని అర్థం చేసుకోవాలి. అణ్వాయుధాల తయారీ మీద లెక్కలేనంత డబ్బును ఖర్చుపెడుతున్నాం. కానీ అంటువ్యాధులను నివారించడానికి మనం ఒక్క ప్రయత్నం కూడా చేయడంలేదు. నిజానికి ఈ విషయంలో మన ప్రయత్నం శూన్యం. రాబోయే భయంకరమైన అంటువ్యాధిని ఎదు ర్కోవడానికి మనం సిద్ధంగా లేం’’ ప్రపంచ ప్రసిద్ధిచెందిన వ్యాపార వేత్త, అపరకుబేరుడు బిల్‌గేట్స్ భవిష్యత్‌ని ఆవిష్కరిస్తూ వెల్లడించిన అభిప్రాయమిది. 2015 మార్చి 18న ఆయన ‘2015 టెడ్ టాక్’లో సాంకేతిక పరిశోధనల ఆవశ్యకతను గుర్తుచేస్తూ చేసిన ముందస్తు హెచ్చరిక ఇది. దీన్ని అమెరికాకు బిల్‌గేట్స్ ఇచ్చిన వార్నింగ్ అని భావించొచ్చు. ఆరోగ్య రక్షణ, మందుల తయారీ మీద ప్రభుత్వం చేస్తోన్న ఖర్చు క్రమంగా తగ్గుతున్నదని, వైరస్‌లను ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం చొరవ చూపడంలేదని గేట్స్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. రోగనిర్ధారణ పరికరాలు, మందులు, వ్యాక్సిన్లను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడం ద్వారా దీనిని ఎదుర్కో గలమని సూచించారు. అయితే అమెరికా ప్రభుత్వం ఆయన సలహాలను పక్కన పెట్టింది. కానీ ఆయన మాత్రం ‘మిలింద గేట్స్ ఫౌండేషన్’ ద్వారా అటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. ఏ ఒక్కరి చొరవ మాత్రమే సరిపోదని ఆయన అనుభవం రుజువుచేసింది. దానివల్ల ఈ రోజు ప్రపంచంలో మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ను అగ్ర రాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా కూడా తట్టుకోలేకపోతున్నది. కరోనా వైరస్ దెబ్బకు అమెరికా అతలాకుతలం అవుతోంది. అమె రికాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోన్న ఇతర దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మన దేశంలో రోజురోజుకూ విజృంభిస్తోన్న కరోనా వైరస్ కోటా నుకోట్ల మంది ప్రజలను భయకంపితులను చేస్తోంది. కానీ అమెరికా లాగా, చైనాలాగా, ఇటలీలాగా వైరస్ ప్రభావం పెరిగితే దానిని తట్టు కోవడానికి మనదేశ ఆరోగ్య వ్యవస్థ ఏమాత్రం సరిపోదు. వైద్య శాలలు, డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది, మందులు, వ్యాక్సిన్లు సరి పోయేంత అందుబాటులో లేవు. మన దేశంలో వైద్యుల కొరత చాలా ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతివేయి మందికి ఒక డాక్టర్ ఉండాల్సి ఉండగా, మన దేశంలో 10,189 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఈ లెక్క ప్రకారం మన దేశంలో ఇంకా కావాల్సిన దానికన్నా ఆరు లక్షల మంది డాక్టర్ల కొరత ఉంది. అలాగే మన దేశ జనాభాని బట్టి చూస్తే మనకు దాదాపు 20 లక్షల మంది నర్సులు అవసరం ఉంటుంది. మన దేశంలో పదమూడు రాష్ట్రాల్లో 64 జిల్లాల్లో, 27 కోట్ల మంది ప్రజలకు అత్యవసరమైన బ్లడ్ బ్యాంక్‌లు లేవు. 2030 నాటికి 20 లక్షల మంది డాక్టర్లు మన దేశానికి అవసరమవుతారు. ఆరోగ్య వ్యవస్థ పరిరక్షణ మొత్తం 195 దేశాల్లో మనదేశం స్థానం 145గా ఉందంటే మనం ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో అర్థం అవుతుంది. ప్రభుత్వాలు ప్రత్యేకించి భారత ప్రభుత్వం ఆరోగ్యం, వైద్యంపై పెడుతున్న ఖర్చు జాతీయ స్థూల ఆదాయంలో 1.28 శాతం మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు తమకు వస్తున్న ఆదాయంలో 65 శాతం ఆరోగ్యానికే ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తంతో ప్రతి సంవత్సరం అయిదుకోట్ల 70 లక్షల మంది పేదరికం నుంచి బయ టపడవేయొచ్చని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడయ్యింది. ఇప్పటికే మనం పరిశోధనల విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థకు నిధుల కేటాయింపులు నామమాత్రం. ఏదో ఇలాంటి అత్యవసరమైన సమయాల్లో తప్ప మరెప్పుడూ దానిపేరు కూడా మనకు తెలియదు. అమెరికాలో ఇప్పటికిప్పుడు వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నం జరిగి సఫలం అయినట్టు వార్తలొస్తు న్నాయి. మన ప్రభుత్వాలు మాత్రం అటువైపుగా ఆలోచించటం మాట అటుంచి, వాళ్ళెవ్వరో తయారుచేస్తే మనం తెచ్చుకుందామనే భావ దారిద్య్రంలో బతుకుతున్నాం. అమెరికాలో బిల్‌గేట్స్ లాంటి వ్యాపార వేత్తలు స్వయంగా అటువంటి ప్రయత్నాలు చేస్తున్నా, ప్రభుత్వాలు మాత్రం తమకేమీ పట్టనట్టు మిన్నకుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మనదేశంలో ప్రభుత్వం, ఔషధ రంగంలో ఉన్న పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు ఏమిచేస్తున్నారో ఇప్పటి వరకు సమాచారం లేదు. అటువంటి నమ్మకం కనపడటం లేదు. గత చరిత్ర అంతా అదే చెబుతున్నది. ఇందులో శాస్త్రవేత్తల తప్పు తక్కువ. ప్రభుత్వాలకే నిర్దిష్ట మైన దృక్పథం లేదు. దృష్టిలేదు. అయితే ఇప్పుడు ఇవి తలచుకొని కూర్చుంటే కూడా లాభం లేదు. నిజానికి ప్రభుత్వాలు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ప్రజలు బాధ్యత వహించాల్సి వస్తున్నది. విద్య, వైద్యం ఏదేశానికైనా అత్యంత కీలకమైన విషయాలనీ, వాటిని అశ్రద్ధ చేయొద్దని నెత్తీనోరూ బాదుకున్నా ఫలితం లేకపోయింది. శాస్త్రీయ అధ్యయనాలపై దృష్టిసారించాలనీ, పొరుగుదేశాలపై యుద్ధానికి సిద్ధం కావడానికి బదులు మన దేశంలో పరిశోధనలపై ఖర్చు పెట్టా లని ఎంతోమంది ఎంత చెప్పినా ఆయా రంగాలకు కేటాయిస్తున్న మొత్తం అత్యల్పం. వీటన్నింటి ఫలితమే నేటి దుస్థితికి కారణం. అయితే ప్రస్తుత కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి కొన్ని చర్యలు తీసుకుంటూంటే కూడా దీనిని మన మందరం పాటించాల్సిందే. ఇందులో మినహాయింపులు అక్కరలేదు. స్వీయ నియంత్రణ అనే విషయాన్ని ప్రజలు పాటించి తీరాల్సిందే. అది తప్పనిసరి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ముందు గానే రాష్ట్రాలను లాక్డౌన్ చేశాయి. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి నుంచి లాక్డౌన్ ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాత్రి కర్ఫ్యూ ప్రకటిం చారు. ప్రజలకు మరింత బాధ్యత తెలిసిరావడానికి ఈ నిర్ణయం తీసు కున్నట్టు తెలుస్తున్నది. లాక్డౌన్ వల్ల రోజువారీ కూలీలూ, చిన్న చిన్న వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ప్రభుత్వాలు డబ్బులు, నిత్యావసర వస్తువులు అందించడానికి నిర్ణయించుకు న్నాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయమే. దీనికి కోట్ల డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రకటించిన నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆమో దించిన బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఏదోరకంగా ప్రభుత్వం ఆ బాధ్య తలను నెరవేరుస్తుందనుకుందాం. ఈ పరిస్థితి తొందరలోనే సర్దుకుం టుందనుకుందాం. ఒకవేళ ఏదైనా కారణం చేత లాక్డౌన్ కొనసాగితే, మరింతగా ప్రమాదం పెరిగితే వేల కోట్ల రూపాయల డబ్బులు కావాలి. అందుకు తగిన డబ్బులు ప్రభుత్వాల దగ్గర ఉంటాయని నేననుకోను. ఇక్కడే బిల్‌గేట్స్ లాంటి వాళ్ల చొరవ అవసరమవుతుంది. ఆయన ఆరోగ్య రక్షణకు, వ్యాక్సిన్ కనుగొనడానికి అమెరికాలో కృషి చేస్తు న్నారు. అయితే అటువంటి అపరకుబేరులు మనదేశంలో వందల మంది ఉన్నారు. ముఖ్యంగా వేల కోట్లు కలిగిన వాళ్ళు వందకు పైగా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ల మేధస్సుతోనో, కాలం కలిసిరావడంతోనో డబ్బులు సంపాదించారు. ఈ రోజు వాళ్ళ డబ్బు అట్లాగే బ్యాంకుల్లో మూలిగితే, ఈ దేశంలోని ప్రజలు పిట్టల్లా రాలిపోయిన తరువాత వాళ్ళు మాత్రం ఆ డబ్బుతో చేయగలిగేదేమీ ఉండదు. ముఖ్యంగా తిండి, మందులు అందించడానికి ప్రభుత్వాల చేతికి బలంకావాలి. ప్రభుత్వం దగ్గర వ్యవస్థ ఉంది. సిబ్బంది ఉంది. కానీ నిధుల కొరత మొత్తం కార్యక్రమాలను నిర్వీర్యపరిచే ప్రమాదం వుంది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాలలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పెద్దపెద్ద కాంట్రాక్టర్లు తమ దాతృత్వాన్ని ప్రదర్శిం చాలి. ప్రతి వ్యక్తీ ముఖ్యంగా వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు తమ ఆదాయంలో కనీసం ఒక పదిశాతం ప్రభుత్వాలకు అందజేస్తే భారత దేశంలో లక్షకోట్లకు పైగా సమకూరుతాయి. ఇది మనల్ని మనం కాపా డుకున్నట్టవుతుంది. అంతేకానీ 130 కోట్ల మంది ప్రాణాలు గాలిలో ఉంటే కేవలం రూ. 15,000 కోట్లను ప్రధాని నరేంద్రమోదీ వెచ్చించి నంత మాత్రాన ఏ ప్రయోజనమూ ఉండదు. ఈ మొత్తం దేశంలోని ప్రతిమనిషికీ విభజిస్తే ఒక్కొక్కరికీ వచ్చేమొత్తం రూ.115 రూపా యలు మాత్రమేనని అర్థం చేసుకోవాలి. అందుకే అందరం అంతకు మించి ఆలోచిద్దాం. అందరికీ మించి అపరకుబేరులు ఆలోచించాలి. ప్రజలుంటేనే వారుండేది. వారు బతికేది. అందుకే ప్రజల్ని బతికిద్దాం. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
నిబద్ధతకు నిలువెత్తు సంతకం!
జీవితమంతా ప్రజలకు నిబద్ధులై ఉండే అరుదైన అధికారుల గురించి ఆలోచిస్తే మొట్టమొదట మన కళ్లముందు కదలాడే ప్రత్యక్ష రూపం ఎస్.ఆర్. శంకరన్‌దే. 1974 ప్రాంతంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దళితుల, ఆదివాసీల విషయంలో చేసిన కీలక నిర్ణయాలు, శంకరన్ లాంటి అభ్యుదయ అధికారుల చేతిలో శక్తివంతమైన ఆయుధాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక దళిత, ఆదివాసీల అభ్యున్నతికి బాటలు వేసే అత్యంత సాహసోపేత మైన నిర్ణయాలెన్నో చేసిన ఎస్.ఆర్. శంకరన్ ఒక్క ఏడాదిలోనే దాదాపు 120 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ఐఏఎస్ అధికారుల చరిత్రలో అరుదైన సందర్భం. భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. విశిష్టమై నది. అధిపతులూ, అధికా రులూ, పరిపాలకులూ ఈ దేశంలో ఎంతటి అత్యు న్నత పదవిలో ఉన్న వారైనా భారత రాజ్యాంగానికి బద్ధులైæ ఉండాల్సిందే. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడి, పాలనను కొనసాగించే వ్యవ స్థలు మూడు. అందులో ఒకటి శాసన వ్యవస్థ. రెండు అధికార వ్యవస్థ. మూడు న్యాయ వ్యవస్థ. ఈ మూడింటిలో శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కేవలం విధానాలూ, చట్టాల, రూపకల్పనలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కానీ శాసన న్యాయ వ్యవస్థలు అంతగా ప్రజలకి చేరువ కావు. అయితే అధికార వ్యవస్థ నిత్యం ప్రజలమధ్యే ఉండాల్సి ఉంటుంది. వీరె ప్పుడూ ప్రజలకు, రాజ్యాంగానికీ మాత్రమే జవాబు దారీగా ఉండాలి. ప్రభుత్వంలోని బ్యూరోక్రాట్స్ కానీ, అధికారంలో ఉన్న పెద్దలెవరైనా, ఇతర ఆధి పత్యశక్తుల ఆజ్ఞలకు లోబడి పనిచేయాల్సిన అవ సరం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వా లను నడిపే ముఖ్యమంత్రులనూ, మంత్రులనూ ఎది రించి రాజ్యాంగం అమలుకోసం నిలబడే శక్తిసామ ర్థ్యాలు వీరికి కావాలి. జీవితమంతా ప్రజలకు నిబద్ధులై ఉండే అరుదైన అధికారుల గురించి ఆలోచిస్తే మొట్టమొ దట మన కళ్లముందు కదలాడే ప్రత్యక్ష రూపం ఎస్ఆర్ శంకరన్‌దే. ప్రభుత్వాలు, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థా, ఇతర పాలనా విభాగాలేవైనా వాటి కర్తవ్య నిర్వహణ అణగారిన వర్గాల సమస్యల పరి ష్కారంలోనే ప్రతిబింబిస్తుందని మనస్ఫూర్తిగా నమ్మి నవాడు. తాను బతికి ఉన్నంత కాలం అట్టడుగు వర్గాల, దళితుల అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేసారు. పేదలు, అత్యంత నిరుపేదలు అనే ఊహాజనితమైన ఆవిష్కరణలను తిప్పికొట్టి అన్ని రకాల పేదరికాలనూ, వివక్షనూ ఎదుర్కొంటున్న వర్గం కేవలం అంటరాని కులాలేనని తేల్చి చెప్పారు. పామరుల చెంతకు పాలనావ్యవస్థ పామరుల చెంతకు పాలనావ్యవస్థను పరుగులు పెట్టించిన ఘనత ఎస్.ఆర్. శంకరన్దేనంటే అతి శయోక్తికాదు. తమిళనాడులోని తంజావూరులో 1934, అక్టోబర్ 22న ఆయన జన్మించారు. మదు రైలో కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఆయన ఐఏ ఎస్‌లో చేరకముందు లెక్చరర్‌గా కొంత కాలం పని చేశారు. 1956లో ఐఏఎస్‌లో చేరిన శంకరన్ 1959లో కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్‌గానూ, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గానూ పనిచేశారు. తరువాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్ళారు. 1971–73లో కేంద్ర ఉక్కు, గనుల శాఖామంత్రిగా ఉన్న కుమార మంగళంకు స్పెషల్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. బొగ్గు గనులను జాతీయం చేసే కార్యక్రమంలో ఎస్.ఆర్. శంకరన్ పాత్ర అత్యంత కీలకమైనది. బొగ్గుగని కార్మికులు బానిసలుగా జీవి స్తున్న స్థితిలో వారికి రాజ్యాంగపరమైన హక్కులను కల్పించడంలో శంకరన్ కృతకృత్యులయ్యారు. సాంఘిక సంక్షేమానికి ఆద్యుడు కారణాలేవైనప్పటికీ 1974 ప్రాంతంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దళితుల, ఆదివాసీల విషయంలో చేసిన కీలక నిర్ణయాలు, ఎస్సీ, ఎస్టీల పట్ల అను సరించిన వైఖరి శంకరన్ లాంటి అభ్యుదయ అధికా రుల చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మారాయి. హైదరాబాద్‌లో 1976లో నిర్వహించిన హరిజన కాన్ఫరెన్స్ హరిజన పదం వాడకం అవమానకరమైన దనీ, దాన్ని ఇకపై వాడకూడదనీ తీర్మానించింది. తదనంతర కాలంలో ఆ తీర్మానమే ప్రభుత్వ ఉత్త ర్వుగా రూపుదిద్దుకుంది. అప్పటినుంచి ప్రభుత్వ రికార్డుల్లో హరిజన అనే పదం స్థానంలో షెడ్యూల్డ్ కులాలు అని చేర్చారు. ఈ సదస్సులో ఎస్సీల సమ స్యపై దాదాపు 322 సిఫారసులను సూచించారు. అందులో 224 తీర్మానాలు ఆమోదించారు. ఆంధ్ర ప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దళిత, ఆది వాసీల అభ్యున్నతికి బాటలు వేసే అత్యంత సాహ సోపేత మైన నిర్ణయాలెన్నో చేసిన ఎస్.ఆర్. శంకరన్ ఒక్క ఏడాదిలోనే దాదాపు 120 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ఐఏఎస్ అధికారుల చరిత్రలో అరు దైన సందర్భం.120 జీఓల్లో 100కి పైగా శంకరన్‌గారి సింగిల్ సిగ్నేచర్‌తో ఉండడం నిజాయితీ కలిగిన, పాలనాధికారులకు ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. హరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ పేరును సాంఘిక సంక్షేమ శాఖగా మార్పు చేయడం జీఓల్లో ఒకటి. దళితుల, ఆదివాసీల గురించి జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం అత్యంత స్పష్టంగా వివక్ష కనిపిస్తూంటుంది. వీరికోసం ప్రభుత్వం నిర్మించి ఇస్తోన్న ఇళ్లన్నీ వెలివేసినట్టు ఊరుచివరే నిర్మిస్తారు. గ్రామం వెలుపల కాకుండా, గ్రామం మధ్యలోనే వీరి ఇళ్ళు నిర్మించాలనీ, దళితుల వాడల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనీ, రేషన్ షాపు లను దళితులకే కేటాయించాలనీ, దళితుల పిల్లలకు పౌష్ఠికాహారం, గ్రామ పంచాయతీల్లో దళిత మహిళ లకు రిజర్వేషన్లు, ఒంటరి దళిత మహిళలకు ఇండ్ల స్థలాలు, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో శిక్షణ, ఇనాం భూములకు పట్టాలు, ప్రభుత్వ హౌజింగ్ కాలనీల్లో దళితులకు ఇండ్ల కేటాయింపుల్లో ప్రాధాన్యం, స్థానిక సంస్థల బడ్జెట్లో 15 శాతం నిధులను దళితుల అభివృద్ధికి ప్రత్యేకించి కేటాయిం చడం కుల నిర్మూలన అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చడం, దళిత వాడల్లో విద్యుదీకరణ, పబ్లిక్ స్కూల్స్‌లో రిజర్వేషన్లు దళిత వాడల్లో పాఠశాలల ఏర్పాటు లాంటివి వంద జీవోల్లో కొన్ని మాత్రమే. రెండో వైపు షెడ్యూల్డ్ తెగలైన ఆదివాసీలకు అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి సారించారు. ఆది వాసీల కోసం ప్రత్యేక సమీకృత ఆదివాసీ అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ)లను ఏర్పాటు చేయడంలో శంకరన్ కృషి మరువలేనిది. పైగా ఎస్సీ, ఎస్టీ పిల్లలకు మెరుగైన విద్యనందించే లక్ష్యంతో ప్రత్యేక హాస్టల్స్‌ను ప్రారంభించిన ఘనత కూడా శంకరన్‌దే. 1976లో వచ్చిన వెట్టిచాకిరీ నిషేధ చట్టం ఆయన కృషి ఫలి తమే. ఎందరినో భూస్వాముల చెర నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించారు. ఈ విషయమై 1978లో అధికారంలోనికి వచ్చిన ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డితో వచ్చిన విభేదాల కారణంగా త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బదిలీపై వెళ్ళారు. అక్కడ కేంద్ర పారామిలిటరీ దళాల అరా చకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎంతో కృషి చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేప ట్టిన అనంతరం ఆయన తిరిగి మన రాష్ట్రానికి వచ్చారు. సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్య తలు స్వీకరించారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు, స్కాలర్‌షిప్‌ల పెంపుదల, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలు కోసం కృషి చేసారు. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడులో జరిగిన దారు ణానికి చలించిపోయిన ఎస్ఆర్.శంకరన్ ప్రభుత్వ పెద్దలను ధిక్కరించి కూడా కొన్ని సాహసోపేత నిర్ణయాలు చేసారు. నక్సలైట్లతో చర్చలు పదవీ విరమణ తర్వాత మూడు ముఖ్యమైన విష యాలలో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు. అందులో పౌరస్పందన వేదిక (కన్సర్డ్న్ సిటిజన్స్ కమిటీ) ఒకటి. ప్రభుత్వానికీ నక్సలైట్లకూ మధ్య జరుగుతోన్న పోరులో కోల్పోతున్న పౌరుల ప్రాణా లను కాపాడేందుకు మానవీయ దృక్పథంతో మేధా వులను కూడగట్టి పౌరస్పందన వేదికను ఏర్పరి చారు. 1997లో ఏర్పాటైన ఈ వేదిక ప్రభుత్వానికీ నక్సలైట్ల మధ్య చర్చలు జరగడానికి తీవ్రంగా కృషి చేసింది. దాని ఫలితంగా 2004లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో నక్స లైట్లను చర్చలకు ఆహ్వానించడం భారతదేశ చరిత్ర లోనే అరుదైన సంఘటన. ఆ తర్వాత ఆయన దృష్టి మొత్తం పాకీపనివారి విముక్తిపై సారించారు. దళిత మావన హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్‌తో కలిసి సఫాయి కర్మచారీ ఆందోళన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడం కోసం శంకరన్ చేసిన ప్రయత్నం అద్వితీయమైనది. ప్రభుత్వ పాలనలో తన అనుభవాన్ని ఉపయోగించి ఆ సమస్యపై దేశ వ్యాప్తంగా చర్చకు తెరదీసారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చే విధంగా సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ ఉద్యమం వల్ల చేతితో మలం ఎత్తే అమానవీయ పని నుంచి ఎందరో బయటపడ్డారు. శంకరన్ ప్రధాన పాత్రధారిగా ప్రారంభమైన సఫాయి కర్మచారీ ఆందోళన్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడమే కాకుండా, దాని కన్వీనర్ బెజ వాడ విల్సన్‌కు రామన్ మెగసెసే అవార్డు రావడం శంకరన్ కృషిలో భాగంగా భావించాలి. పెళ్ళి తన లక్ష్యానికి అవరోధం అవుతుందని భావించి వ్యక్తిగత జీవితాన్నే త్యజించినవాడు. 2008 అక్టోబర్ 7వ తేదీన అశేష దళిత ప్రజానీకానికి వీడ్కోలు పలు కుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకున్న ఆస్తి మిత్రులు కొనిచ్చిన ఓ చిన్న ఫ్లాటు, ఆయన పుస్తకాలు మాత్రమే. నిస్వార్థ నిరాడంబర అభినవ బౌద్ధుడు ఎస్ఆర్.శంకరన్. ఆయన కృషికి గుర్తుగా పద్మభూషణ్ అవార్డు అతన్ని వరించి వస్తే సున్ని తంగా తిరస్కరించారు. కేంద్ర రాష్ట్రాల్లో శంకరన్ లాంటి నిబద్ధత కలిగిన అధికారులు చాలా అరుదనే చెప్పాలి. శంకరన్ ఆశయాలను ఈతరం అధికారులు పుణికిపుచ్చుకోవాల్సిన సందర్భమిదే. (అక్టోబర్ 22న ఎస్ఆర్.శంకరన్ జయంతి) మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
సడలుతున్న మౌఢ్యం సంకెళ్లు
కొత్త కోణం భారత యువతకే కాదు, పేద దేశాలన్నిటిలోని యువతకూ అమెరికా అం టే ఓ రంగుల కల. మనలాంటి దేశాల్లో తగు ఉద్యోగావకాశాలు లేకపోవడమే అందుకు కారణం కావచ్చు. ఏదేమైనా నేటి విద్యార్థి, యువజనులలో పలువు రికి ఆ రంగుల స్వప్నాన్ని సాకారం చేసుకోవడమే జీవిత లక్ష్యం. ఆ కల నిజా నికి అంత అందమైనది కానేకాదు. జాత్యహంకారం, పేద దేశాల నుంచి వలసవచ్చిన వారిపట్ల వ్యతిరేకత. నల్లవారిపై సాగే దాడులు, హింస ఎప్పటి కప్పుడు అమెరికా అసలు స్వరూపాన్ని బయట పెడుతూనే ఉన్నాయి. అంతే కాదు అతి గొప్ప ప్రజాస్వామ్యంగా చెప్పుకునే ఆ దేశంలో పౌరుల వ్యక్తిగత విశ్వాసాల పట్ల ఇసుమంత గౌరవమూ లేదనేది మరో చేదు వాస్తవం. శాస్త్రీ య చింతనను అణచివేసే మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి. భౌతికవాదాన్ని, కంటికి కనిపించే సత్యాన్ని, శాస్త్రీయతను ఎం తగా అణచివేసినా సమూలంగా నిర్మూలించడం అసాధ్యం. ఏదో రూపంలో, ఏదో చోట మళ్ళీ, మళ్ళీ అది జనిస్తూనే ఉంటుంది. దానిపేరే హేతుబద్ధత. శాస్త్రీయ చింతనపై ఆంక్షలు, వివక్ష ప్రపంచదేశాల్లో ఒకవంక మతం, అభౌతికవాదం విచ్చలవిడిగా వ్యాపిస్తున్నా, దానికి దీటుగా హేతువాదం, నాస్తికవాదం కూడా విస్తరిస్తున్నాయి. అమెరికా లోని కొన్ని రాష్ట్రాల్లో ‘నేను ఏ మతస్థుడినీ కాను,’ ‘నేను దేవుడిని నమ్మను’ అనే వారి పట్ల ఉద్యోగాల్లో, హోదాల్లో వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అర్కాన్సా, మేరీలాండ్, మిస్సిసిపి, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, టెన్సిసి, టెక్సస్ రాష్ట్రాలకు ‘బైబిల్ బెల్ట్’ అని పేరు. నాస్తికులు, హేతువాదులు ఎలాం టి ప్రభుత్వ పదవులు, హోదాల్లో ఉండటానికి వీల్లేని విధంగా ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన చట్టాలున్నాయి. నాస్తికులు, హేతువాదులపై ఈ నిషేధం ఎంత పకడ్బందీగా అమలు జరుగుతోందంటే... అలాంటి వారి సాక్ష్యానికి కోర్టుల్లో విలువ లేదు. ఈ ప్రపంచం మనుగడకు కారణం భౌతిక పరిస్థితులే తప్ప దైవం, మతం కారణం కాదని విశ్వసించే వారికి రకరకాల అవమా నాలు, వేధింపులు తప్పడం లేదు. ఇక ఇస్లామిక్ దేశాల్లో నాస్తికులపై తీవ్ర నిషేధం మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో మరణ దండనను సైతం విధి స్తున్నారు. అఫ్ఘానిస్తాన్, ఇరాన్, మలేసియా, మాల్దీవులు, మారిషస్, నైజీ రియా, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, సోమాలియా, సూడాన్, యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమన్ దేశాలు నాస్తికులు, హేతువాదులను తీవ్రం గా అణచివేస్తున్నాయి. మతాన్ని వదిలిన వారిని ఇస్లాం అతి తీవ్రంగా పరిగ ణించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇస్లాంను అనుసరించని మగవారికి మరణశిక్ష, మహిళలకు జీవిత ఖైదు విధించాలనే నిబంధనలున్నాయి. బుద్ధికి మౌఢ్యం సంకెళ్లు మన దేశంలో నాస్తికులు, హేతువాదులపై చట్టపరమైన నిషేధాలు లేకున్నా భౌతిక, మానసిక దాడులు, వెలివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మహా రాష్ట్రలో నాస్తికవాది నరేంద్ర దాబోల్కర్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు గోవింద్ పన్సారే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిం చి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకే వారిని సనాతనవాదులు హత్యచేశారు. పాలకవర్గ రాజ్యాధికారాన్ని, ఆధిపత్యాన్ని సవాలు చేసిన వారెవరైనా వారికి మతం పేరిట నాస్తికులుగా, హేతువాదులుగా, నిరీశ్వరవాదులుగా ముద్రలు వేసి ఊచకోత కోసిన చరిత్ర భారత ఛాందసవాదులది. మూఢవిశ్వాసాలను, అరాచకాలను ఎదిరించి సత్యాన్ని, హేతువాదాన్ని ప్రచారం చేసిన లక్షలాది మంది బౌద్ధులను ద్రోహు లుగా, దేవుడి వ్యతిరేకులుగా ముద్రవేసి, హతమార్చి, వారి శవాల గుట్టలపై హైందవ ధర్మాన్ని నెలకొల్పిన ఆధారాలు వారి గ్రంథాల్లోనే కావల్సినన్ని ఉన్నాయి. శుంగ వంశ స్థాపకుడైన పుష్యమిత్రుడు క్రీ.పూ.185లో చివరి మౌర్య చక్ర వర్తి బృహద్రదుడిని హతమార్చి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ‘అశోక వదన’, ‘దివ్యవదన’ బౌద్ధ గ్రంథాల్లో పుష్యమిత్రుని హత్యాకాండ నిక్షిప్తమై ఉంది. బయటి నుంచి దండెత్తి వచ్చిన హూణులు బౌద్ధుల పట్ల మరింత శతృ త్వంతో వ్యవహరించారు. హూణ వంశానికి చెందిన మిహిరకులుడు లక్షలాది బౌద్ధులను చంపిన వైనాన్ని కల్హణుని ‘రాజతరంగిణి’ వివరించింది. ‘ప్రాచీన భారతదేశ చరిత్ర’ రాసిన విన్సెంట్ స్మిత్ మిహిరకులుని ఈ క్రూరత్వాన్ని వివ రంగా ప్రస్తావించాడు. క్రీ.శ.528 ప్రాంతంలో శాంతియుత బౌద్ధ సమాజంపై తీవ్ర దాడులు జరిగాయి. మిహిరకులుడు బౌద్ధ చైత్యాలను, స్థూపాలను ధ్వంసం చేశాడు. మరొక రాజు శశాంకుడు ఏడో శతాబ్దం ప్రథమ దశాబ్దంలో అశోక చక్రవర్తి పోషించిన బుద్ధగయలోని బోధివృక్షాన్ని పెరికివేసి, తగుల బెట్టించాడు. పాటలీపుత్రలోని (నేటి పట్నా) బుద్ధుని పాదముద్ర శిలలను పగులగొట్టించాడు. విహారాలను ధ్వంసం చేశాడు. ఇవి భారత చరిత్రలో హేతుబద్ధతపై జరిగిన క్రూర దమనకాండలోని కొన్ని ఘటనలు మాత్రమే. విస్తరిస్తున్న నాస్తికవాదం ఇక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలను నాస్తి కులుగా ముద్రవేసి ప్రపంచవ్యాప్తంగా దాడులు చేశారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదన్నందుకు కొపర్నికస్పై దాడి చేశారు. అయినప్పటికీ హేతువాదం, శాస్త్రీయ చింతన ప్రాతిపదికగా కలిగిన నాస్తికవాదం నశించ లేదు. పైగా ఇటీవలి కాలంలో అది విస్తరిస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, దక్షిణాసియా దేశాల్లో నాస్తికత్వం, భౌతికవాదం పెరుగుతున్నాయి. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో నాస్తికులపై, భౌతికవాదంపై తీవ్ర వివక్ష ఉన్నా రోజు రోజుకూ మతంలేని, మతాన్ని అనుసరించని, దేవుణ్ణి నమ్మని వారి సంఖ్య పెరుగుతున్నట్టు ‘ప్యూ’ పరిశోధనా సంస్థ మే 2015 నివేదికలో స్పష్టం చేసింది. క్రైస్తవ యువకుల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని అది వెల్లడిం చింది. క్యాథలిక్కుల కన్నా ప్రొటెస్టెంట్లలో ఈ ధోరణి బలంగా ఉంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా జాతీయులకన్నా శ్వేత జాతీయులలోనే హేతువాద, నాస్తిక వాద దృష్టి ఎక్కువగా ఉందని అది తెలిపింది. 2007లో యువతలో 27 శాతం తమకు మతంతో సంబంధం లేదని ప్రకటిస్తే, 2015 లో అది 35 శాతానికి పెరిగింది. 1928-45 మధ్య పుట్టిన వారిలో క్రైస్తవ మతాన్ని పాటించేవారు 85 శాతం కాగా, అది 1990-96 మధ్య జన్మించిన వారిలో 56 శాతానికి పడి పోయింది. ‘గాలప్ ఇంటర్నేషనల్’ సంస్థ 2012లో చేపట్టిన ప్రపంచ వ్యాప్త సర్వే ప్రకారం యూరోపియన్ దేశాల్లో దేవుడనే భావన లేని జనాభా చాలా ఎక్కువగా ఉన్నది. బ్రిటన్‌లో దేవుడి మీద విశ్వాసాన్ని ప్రకటించిన వారు 37 శాతం మాత్రమే. అది జర్మనీలో 44 శాతం, డెన్మార్క్, నెదర్లాండ్స్‌లలో 28 శాతం ఉన్నారు. ఇక మతాన్ని విశ్వసించేవారు ఫ్రాన్స్‌లో 27 శాతం, ఈస్టోని యాలో 18 శాతం, స్వీడన్లో 18 శాతం, చెక్ రిపబ్లిక్లో 16 శాతం, నార్వేలో 22 శాతం మాత్రమే. ఇక తూర్పు, దక్షిణాసియా దేశాలకొస్తే చైనాలో 14 శాతం, జపాన్‌లో 16 శాతం, వియత్నాంలో 30 శాతం, హాంగ్‌కాంగ్‌లో 38 శాతం మాత్రమే మతం, దేవుడు అనే భావనలను నమ్ముతున్నారు. హేతువాదం సత్యాన్వేషణ మార్గం ప్రపంచమంతటా ఇలా హేతువాద చింతన పెరుగుతుండగా... మన దేశంలో మాత్రం దేవుడి మీద నమ్మకం అత్యధికంగా ఉంది. భారతీయుల్లో 81 శాతం దేవుడిని నమ్ముతున్నట్టు గణాంకాలు వివరిస్తున్నాయి. ముస్లిం దేశాల్లో కూడా అదే పరిస్థితి. ఇరాక్‌లో 88 శాతం, అఫ్ఘానిస్తాన్‌లో 83 శాతం, పాకిస్తాన్ లో 84 శాతం దేవుడు, మతంలో విశ్వాసం కలవారని ‘గాలప్ ఇంటర్నేషనల్’ లెక్క లు చెబుతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఇవే గణాంకాలు, లెక్కలు కొన్ని కఠోర వాస్తవాలను బహిర్గతం చేస్తున్నాయి. ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించిన, సాధిస్తున్న దేశాలకు మతం మీద, దేవుడి మీద అంతగా పట్టింపు ఉండటంలేదు. స్వశక్తి మీద, భౌతిక పరిస్థితుల మీద అక్కడ ఎక్కువగా ఆధారపడుతున్నట్టు కనిపిస్తున్నది. మూఢత్వం, అంధ విశ్వాసం ప్రజలను శాస్త్రీయత వైపు దృష్టి సారించనివ్వదు. మూఢత్వం అభివృద్ధికి ఆటంకంగా మారడం మాత్రమే కాకుండా, మనుషులను తిరోగమనంలోకి నెట్టివేసే ప్రమాదమున్నది. మన దేశంలో అన్ని మతాలూ రాజకీయ, ఆర్థిక, సామాజిక హోదాను నిలబెట్టుకోవడానికి, తద్వారా ప్రయోజనం పొందడానికి చేయా ల్సినంత కృషి చేస్తున్నాయి. అందువల్లనే ఇతర దేశాలకన్నా అధికంగా మతంపై, దేవుడిపై ఆధారపడే వారి సంఖ్య ఇక్కడ పెరుగుతున్నది. ఇటీవల మీడియా కూడా మత కార్యక్రమాలకు, ఇతర అశాస్త్రీయ కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఇటీవల జరిగిన పుష్కరాల తంతు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మతమనేది వ్యక్తిగత విశ్వాసం నుంచి పక్కకు జరిగి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతోంది. అయితే మన దేశం లోనూ శాస్త్రీయంగా, భౌతికవాద దృష్టితో ఆలోచించే వారి సంఖ్య పెరుగు తున్నా వారికి సరైన వేదికలు, కార్యక్రమాలు లేకపోవడం వల్ల సంఘటితం కావడం లేదు. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం సాగదు. అటు పడమటన, ఇటు తూర్పున వీస్తున్న శాస్త్రీయ ధృక్పథ వీచికలు ఇక్కడికీ విస్తరించక తప్పదు. హేతువాదం ప్రశ్నించే తత్వాన్ని, విమర్శనాత్మక దృక్పథాన్ని, సత్యా న్వేషణను నేర్పుతుంది. ప్రశ్నించే గుణమే లేకపోతే సమాజ పురోభివృద్ధి నిలి చిపోతుంది. హేతుబద్ధమైన తర్కాన్ని ఆహ్వానించడమే వర్తమాన ప్రపం చానికి, సమాజాలకు ఉపయుక్తమైనది. - మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
‘ప్రముఖుల’తోనే ప్రజలకు తంటా
కొత్త కోణం పౌరులందరికీ మత స్వేచ్ఛ ఉన్నమాట నిజమే. కానీ మత కార్యక్రమాల్లో ప్రభుత్వం పాత్ర ఏ మేరకు ఉండాలనేదే సమస్య. మత ఉత్సవాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి. కానీ ప్రభుత్వమే వాటిని నిర్వహించడం, ముఖ్యమంత్రులు తదితరులు వాటిలో పాల్గొనడాన్నే పునరాలోచించాలి. గోదావరికి ఎగువన నాసిక్‌లో జరుగుతున్న కుంభమేళాలో ప్రముఖులు పాల్గొనరాదని మహారాష్ట్ర నిర్ణయించింది. ప్రజా భద్రతపై అధికారులు దృష్టి కేంద్రీకరించడానికి, తొక్కిసలాటలను నివారించడానికి ఇది అవసరం. తెలుగు ప్రముఖులకు అది పడుతున్నట్టు లేదు. ‘‘నా మరణానంతరం నాకు ఏ మత కర్మకాండలు నిర్వహించకూడదని కోరుతున్నాను. అటువంటి విషయాల్లో నాకు ఎలాంటి విశ్వాసమూ లేదు. ఏ రూపంలోనూ అది జరగడానికి వీల్లేదు. అది చిన్నదైనా, పెద్దదైనా నాకు ఇష్టం లేదు. ఇది నా మనస్ఫూర్తిగా చేస్తున్న ప్రకటనని అంతా గుర్తుంచుకోవాలి.’’ ఇది భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రకటన. దాన్ని ఆయన తు.చ. తప్పక పాటించారు కూడా. ప్రభుత్వ కార్యక్రమాల సంద ర్భంగా సాగే మతపరమైన పూజలు, యజ్ఞాలకు సాధ్యమైనంత వరకు ఆయన దూరంగా ఉండేవారు. నెహ్రూ మరణించి యాభై ఏళ్ళు దాటింది. నాటికి నేటికి ప్రపంచమూ, దానితో పాటే మన దేశమూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందింది. అంతరిక్ష విజ్ఞానం నుంచి వైద్య రంగం వరకు ఎన్నెన్నో అద్భుత విజయాలను సాధించింది. కానీ మనిషి మాత్రం ఇంకా తిరోగామిగానే ఉన్నాడే? అనే బాధ మాత్రం తొలగ లేదు. రాజకీయ నేతలు, మరీ ముఖ్యంగా రాజ్యాంగ బాధ్యతలను మోస్తున్న రాష్ట్రపతులు (కేఆర్ నారాయణన్ మినహా), గవర్నర్లు, పాలనా బాధ్యతలు మోస్తున్న ముఖ్యమంత్రులు మూఢవిశ్వాసాల ప్రచారకులుగా వ్యవహరి స్తున్న తీరు ఆశ్చర్యకరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా, ఆడంబ రంగా జరుగుతున్న గోదావరి పుష్కరాల తంతును చూస్తుంటే నెహ్రూ మరో ఐదు వందల ఏళ్ల తర్వాత పుట్టాల్సినవాడా? లేక మన నే తలు కనీసం ఒకటి, రెండు శతాబ్దాల క్రితం పుట్టినవారా? అని సందేహం కలుగుతోంది. ప్రచారంపై యావ... ఘోరాలకు తోవ గోదావరి నది సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిణామా లకు పుట్టినిల్లు. ప్రజల జీవితాలు ఆ నదీ తీరంతో పెనవేసుకున్నాయి. ఏ నది విషయంలోనైనా ఇంచుమించుగా అది అంతే వాస్తవం. ప్రాణాధారమైన నదుల పట్ల ప్రజలకు ఉన్న ప్రేమ, గౌరవాలను భక్తిగా మార్చి స్వార్థ ప్రయోజ నాలకు వాడుకోవడం తరతరాలుగా వస్తున్నది. గతంలో పూజారి వ్యవస్థ ఆ పని చేస్తే. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే తమ స్వీయ రాజకీయ, ఆర్థిక ప్రయోజ నాలకు, కీర్తి ప్రతిష్టలకు వాడుకోవాలనుకుంటున్నారు. కాబట్టే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారగణం యావత్తుకూ పుష్కరాల యావ తప్ప మరేం పట్టకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. తన పుష్కర పూజా తతంగాన్నంతా డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా మలచి, అంతర్జాతీయ ఖ్యాతి గడిం చాలని ఆశ పడ్డారు. అందువల్లే గంటలకొద్దీ ప్రజలను నిలిపివేసి మరీ సకు టుంబంగా తొలి పుష్కర స్నానమాచరించారు. ఫలితంగా 27 మంది సామా న్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటనపై ఇప్పటికే చాలా విశ్లేషణలు, సమాచారం వెలువడింది. కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళడం లేదు. భారీ ప్రచారానికి, ఏర్పాట్లకు కలిపి తెలంగాణ ప్రభుత్వం రూ. 600 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.1,600 కోట్లు ఖర్చు చేసినట్టు సగర్వంగా ప్రకటించుకున్నాయి. అయినా కనీస సదుపాయాలను సమకూర్చలేకపో యాయి. రాజమండ్రి తొక్కిసలాటలో ఊపిరి సలపక విలవిలాడిన వారికి గుక్కెడు నీళ్లు అందించలేకపోయారు. దాదాపు నెల రోజుల నుంచి మం త్రులు, అధికారులు అందరూ అక్కడే. సచివాలయాల్లో పనులన్నీ దాదాపుగా స్తంభించాయి. అయినా జరగరాని అనర్థం జరిగిపోయింది. లక్షలకొలదీ ప్రజలను తరలి రమ్మన్నవాళ్లకు వారికి తగ్గ ఏర్పాట్లు సరే... అలా జనం వెల్లు వెత్తడం వల్ల తలెత్తగల ప్రజారోగ్య సమస్యలు సైతం పట్టలేదు. కాబట్టే ప్రధాన పుష్కర ఘాట్లన్నిట్లో ఈ కోలీ వంటి బాక్టీరియా, చర్మవ్యా ధులకు, ఎలర్జీలకు కారణమయ్యే కాలుష్యాలు పెరిగిపోయాయి. కనీసం ఇప్పటికైనా ఈ కోలీ ప్రమాదకర స్థాయిల్లో ఉన్న పుష్కర ఘాట్లను స్నానాలకు అనర్హమై నవిగా ప్రకటించి, మూసేయాలి. లక్షల మంది పాల్గొనే కుంభమేళాలు, పుష్కరాల సందర్భంగా ఇలాంటి అనర్థాలు జరిగిన అనుభవాలు మనకు గతంలోనూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్‌లో 1954 కుంభమేళాలో 50 లక్షల మంది పాల్గొనగా జరిగిన తొక్కిసలాటలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి ప్రధాని నెహ్రూ ఈ దుర్ఘటనపై జస్టిస్ కమలాకాంత్ వర్మ నేతృత్వంలో ఒక కమిషన్ని నియమించారు. జనం పోటెత్తే కుంభమేళాల వంటి సమ్మేళనాలకు తగు జాగ్ర త్తలను తీసుకోవాలని ఆ కమిషన్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రము ఖులు, పదవుల్లో ఉన్న రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇటువంటి సమ్మేళనాల్లో పాల్గొనకూడదని సూచించింది. అప్పుడే అధికార యంత్రాంగం స్వేచ్ఛగా ప్రజల భద్రత, రక్షణపై దృష్టిని కేంద్రీకరించగలుగుతుందని స్పష్టం చేసింది. ఈ సిఫారసులపై ఆధారపడే నెహ్రూ... ప్రజాప్రతినిధులు ఇటు వం టి మతపరమైన మేళాల్లో పాల్గొనరాదని కఠిన పదజాలంతో హెచ్చరించారు. అది మన పాలకుల చెవులకు సోకి ఉంటే, రాజమండ్రి ఘోరం జరిగేదే కాదు. పడకేసిన పాలన... పొంచివున్న పెను ముప్పు అదలా ఉంచితే, పుష్కర సమయంలో పాలనా వ్యవస్థ పడకేయడం మరో అంశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు నీటి చుక్కలేక, వర్షాభావంతో, పొలాలు బీడువారి తల్లడిల్లుతున్నారు. వారి గోడు వినే దిక్కులేదు. గత రెండు నెలలుగా చినుకులు తప్ప రైతుకి పనికి వచ్చే గట్టి వర్షం ఒక్కసారైనా కురిసింది లేదు. భూమి నిండుగా తడిచింది లేదు. దీనితో ఖరీఫ్ పంటలన్నీ మొలకలుగానే ఎండిపోయాయి. కొన్ని చోట్ల రైతులు ఇంకా భూములు దున్ననేలేదు. గత ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీంతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 2,000 మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడినట్టు రైతు సంఘాలు ఘోషిస్తున్నాయి. తెలంగాణలో అది మరింత ఎక్కువ. ఈ ఏడాది ఇంతవరకు తెలంగాణలోని ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇక ఏపీలోని ప్రకా శం, నెల్లూరు, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో చాలినన్ని వర్షాలు లేవు. ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వర్షాభావ పరిస్థితులు గ్రామీణ యువత మీద తీవ్ర ప్రభావం కలిగిస్తాయి. అందువల్ల రెండు ప్రభుత్వాలు ఇటు దృష్టిని కేంద్రీకరించి, కరువు పరిస్థితులను అంచనావేసి కార్యాచరణను రూపొందించాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు, ఆకలిచావులు పెరిగే ప్రమాదం ఉంది. ఇవేమీ పట్టకుండా గత 20 రోజులుగా పుష్కరాల్లో మునిగితేలుతున్న నాయకగణం జరగరానిది ఏదైనా జరిగాక, పరిస్థితులు చేయిదాటిపోయాక తీరుబడిగా పశ్చాత్తాపపడి లాభం లేదు. రెండు రాష్ట్రాల్లో కలిపి కోటీ యాభై లక్షల మంది నిరుద్యోగులు, అర్ధ నిరుద్యోగులున్నట్టు అంచనా. సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ నిరుద్యోగ యువత గురించి, ఉపాధి కల్పన గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. తెలుగు ముఖ్యమంత్రులకు అదీ పట్టినట్టు లేదు. చెప్పుకుంటూ పోతే, ప్రజల తక్షణ సమస్యలు కోకొల్లలు. ప్రముఖులు దూరంగా ఉంటేనే మేలు మత ఉత్సవాలు, కార్యక్రమాలు జరగకూడదని, వాటిలో పాల్గొనకూడదని ఎవరూ అనరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశ ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉంది, అన్ని మతాలకూ సమాన హక్కులున్నాయి. కాకపోతే మత కార్యక్రమాల్లో ప్రభుత్వం పాత్ర ఏ మేరకు ఉండాలనేదే సమస్య. మత ఉత్స వాల్లో పాల్గొనే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి, నిజమే. కానీ ప్రభుత్వమే వాటిని స్వయంగా నిర్వహించడం, ముఖ్యమం త్రులు, మంత్రులతో సహా అంతా పోటీపడి, సరిగ్గా ముహూర్తానికే వాటిలో పాల్గొనడం గురించే పునరాలోచించాలి. గోదావరికి ఎగువనున్న నాసిక్‌లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతోంది. ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు దాన్లో పాల్గొనరాదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చాలా మంచి పరి ణామం. ప్రజా సౌకర్యాలను, భద్రతను విస్మరించి అధికారులు పోలీసులు ప్రముఖుల చుట్టూ చేరడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారు. తొక్కిస లాట జరిగే ప్రమాదముంటుంది. తెలుగు ప్రముఖులకు ఈ విషయాలు పట్టి నట్టు లేవు. రాజమండ్రి దుర్ఘటన తదుపరి ఇకనైనా ప్రముఖులు వెళ్ళకుండా ఉంటే బాగుండునని అంతా భావిస్తుండగా... ఉభయరాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజమండ్రి, భద్రాచలాల్లో రెండు పుష్కర స్నానాలు చేయడం ఆహ్వనించదగినది కాదు. ప్రముఖులకు కూడా పౌరులందరికీ ఉండే హక్కులన్నీ ఉంటాయి, నిజమే. కానీ మిగతా పౌరుల రక్షణార్థం వారు కొన్నిటిని వదులుకోవాల్సి రావచ్చు. రాజ్యాంగపరమైన గురుతర బాధ్యతలను మోస్తున్న ప్రతినిధులు ఒకరకంగా ప్రజాసేవకులు. వారికి ఒకరు చెప్పాల్సిన అవసరం రాకూడదు. గతంలో ఇటువంటి సందర్భాల్లో కొందరు నేతలు వాటికి హాజరు కాకుం డడమో లేదా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెళ్లిరావడమో చేశారు. ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నట్టు వారికి ప్రజలే ముఖ్యమైతే... వారికి అవకాశమే ఇవ్వకుండా తామే సరిగ్గా మహాముహూర్తానికి ఎందుకు స్నానాలు చేశారు? పుష్కర పుణ్యాన్నంతా తామే మూటకట్టుకోవాలనే అత్యాశతోనేనా? ఇటు వంటి ఎన్నో ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పాల్సి ఉంది. ఏదేమైనా మన ప్రభుత్వాల, నేతల తీరు మారాలి. నెహ్రూ అంతటి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోకపోయినా...ప్రజల రక్షణను, భద్రతను దృష్టిలో పెట్టుకొని తమ ప్రవర్తనను మార్చుకుంటే మంచిది. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు కాపలాదారులుగా ఉండాల్సిన పాలకులు, వారిని ఇబ్బందులకు గురిచేసే విధానాలకు స్వస్తి చెప్పాలి. మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213. -
అవినీతి ఈనాటి రాజనీతి
- కొత్త కోణం ‘‘ప్రజాస్వామ్యాన్ని, సామాజిక మనుగడను అవినీతి ధ్వంసం చేస్తుంది. ఇది ప్రజావ్యతిరేకమైనది మాత్రమే కాదు, ప్రజల జీవితాలను దెబ్బతీస్తుం ది. ఆర్థిక వ్యవస్థను, సాంస్కృతిక వారసత్వాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీనిని మొగ్గలోనే తుంచివేయకుంటే, సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను నాశనం చేస్తుంది.’’ సరిగ్గా పదిహేనేళ్ల క్రితం సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక ఇది. దాన్ని ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. అవినీతి నేడు మొక్క కాదు, ఊడలు దిగిన మర్రిలా తయారైంది. సుప్రీంకోర్టు హెచ్చరించినట్టే అది ప్రజా జీవితాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత దిగజార్చింది. దానికి ప్రత్యక్ష ఉదా హరణే తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి ఉదంతం. అది రేవంత్‌రెడ్డి సొంత వ్యవహారమేం కాదు. తన పార్టీ కోసం అధినేత ఆదేశం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి యాభై లక్షల రూపాయలు ఒక సంచిలో వేసుకొచ్చి బేరమాడటం మనందరం టీవీల్లో చూశాం. అది చిలికి చిలికి గాలివానలా మారింది. ప్రస్తుత రాజకీయాల డొల్ల తనాన్ని, అవినీతి విశ్వరూపాన్ని బయటపెట్టింది. అయితే రాజకీయ పార్టీలు తప్ప, దీన్ని ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ తగి నంతగా పట్టించుకోలేదు. చివరకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రెండున్నర కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఇవ్వడానికి పథకం వేసినట్టు, రూ.150 కోట్ల వరకైనా ఖర్చు పెట్టడానికి టీడీ పీ సిద్ధపడినట్టు వార్తలు వచ్చాయి. ఇవేవీ ఎవరినీ కదిలించలేదు. పైగా ఇది ఈ ఒక్క పార్టీయే చేస్తున్నదా? అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ ఇదే విధానాన్ని సాగిస్తున్నా యంటూ సర్దిచెప్పుకుంటున్నారు. అవినీతే అధికారానికి రాచమార్గం అయితే ఇలా వందల కోట్లుగానీ లేక యాభై లక్షలే గానీ ఊరికే అలా వచ్చిపడ్డ వేమీ కాదు. వాళ్ళ దగ్గర అల్లాఉద్దీన్ అద్భుత దీపమేమీ లేదు. ఇదొక్కటనే కాదు. గత పదిహేనేళ్ళలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మారిన పరిస్థితులు ఆశ్చ ర్యకరమైనవి. ‘‘1994 ఎన్నికల్లో మా నాయన అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన పెట్టిన ఖర్చు రూ. 15 లక్షలు. నేను 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేశాను. దాదాపు రూ. 15 కోట్ల దాకా ఖర్చయింది’’ అని ఇటీ వల తెలంగాణకు చెందిన ఒక సీనియర్ రాజకీయ నేత వాపోయారు. ఇక ఏపీలో ఖర్చు ఎంతుంటుందో ఊహించుకోవచ్చు. పార్టీ టికెట్ కోసమే ఒక్కొక్క అభ్యర్ధి కోట్లు చెల్లించాలి. గెలవడానికి మరిన్ని కోట్లు ఖర్చుచేయాలి. ఏండ్ల తరబడి వృత్తి రాజకీయవేత్తలుగా ఉన్నా కొందరు నేతలు ఈ ఖర్చును భరించలేని పరిస్థితి. కాబట్టే గెలుపు గుర్రాల పేరిట కాంట్రాక్టర్లను, వ్యాపార వేత్తలను, రియల్టర్లను రంగంలోకి దింపడం సర్వసాధారణమైంది. గత పదే ళ్లుగా మరో విచిత్రం జరుగుతోంది. ఏ పార్టీ టికెట్టుపై గెలిచిన అభ్యర్థయినా అర నిమిషంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా మారిపోతున్నారు. అదే మంటే ఎన్నికల్లో ఖర్చు చేసిన కోట్ల రూపాయలను తిరిగి రాబట్టుకోవాలని, తమ వ్యాపారాలు, కాంట్రాక్టులు విస్తరించుకోవాలని అంటున్నారు. ఇప్పడు కోటీశ్వరులుగా ఉన్నవారిలో అత్యధికులు ముప్పై, నలభై ఏళ్ల క్రితం లక్షాధికా రులు కూడా కాదు. కానీ వారే నేడు కోట్లు గుమ్మరించి సీట్లను, ఓట్లను కొని ప్రజాప్రతినిధులు, మంత్రులు కాగలుగుతున్నారు. నల్లధనమంతా ప్రజాధనమే ఇటీవలి కాలంలో అవినీతిపై చాలానే అధ్యయనాలు జరిగాయి. వాటిలో చాలావరకు అవినీతికి మూడు ముఖ్య మూలాలను పేర్కొన్నాయి. మొద టిది, ప్రజా పనులుగా చెబుతున్న రోడ్లు, భవనాలు, భారీప్రాజెక్టులు, నీటి పారుదల, విమానాశ్రయాలు, ఓడరేవులు, పారిశ్రామిక సౌకర్యాల కల్పన లాంటి నిర్మాణ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ అవుతోంది. చిన్న పని నుండి భారీ ప్రాజెక్టుల వరకు నిర్మాణ వ్యయంకన్నా అధిక మొత్తం లో టెండర్లను ఖరారు చేస్తున్నారు. దీని కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో ప్రభుత్వం నుంచి ముందుగానే కాంట్రాక్టర్లు నిధులను రాబడుతు న్నారు. అందులోంచి ప్రభుత్వ పెద్దలకు అందాల్సిన వాటా ముందుగానే అందుతుంది. అంతేకాదు, అంచనా వ్యయం కంటే తక్కువ ఖర్చుతోనే నిర్మా ణాలను పూర్తి చేస్తారు. ఇలా రెండు చేతులా అధిక లాభాలార్జించే కాంట్రాక్టర్లే క్రమంగా రాజకీయ నాయకులుగా మారి, రాజకీయాలపై, పార్టీలపై గుత్తాధి పత్యాన్ని సాగిస్తున్నారు. ఇటీవల ఈ అవినీతి కింది దాకా విస్తరించింది. పనులు జరిగే ప్రాంతం లోని అధికారులు, సర్పంచ్‌లు మొదలుకొని ప్రజాప్రతినిధులందరికీ వాటా లు వెళ్ళడం సంప్రదాయంగా మారింది. అందుకే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లంతా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బరిలో నిలుస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అడపాదడపా ట్రాన్స్ ఫర్లకు, ప్రమోషన్లకు కొంత డబ్బు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దృష్టి పోస్టింగ్‌ల మీద కేంద్రీకృతమైంది. మంచి పోస్టింగ్‌లకు వేటికవిగా లెక్కలున్నాయి. ఎక్కువ ధర పలికే పోస్టింగ్ అంటే ఎక్కువగా డబ్బులు రాలే అవకాశమున్న స్థానమని అర్థం. ఇలా ప్రభుత్వ బడ్జెట్ నుండి ఎవరికి అందినంత వారు దోచుకు తింటున్నారు. ప్రభుత్వ రాబడికి ప్రధాన వనరు ప్రజలు చెల్లించే పన్నులే. వస్తువుల మీద వేసే అమ్మకం, కొనుగోలు పన్నులు వాణిజ్య పన్ను లు. ప్రభుత్వ రాబడిలో అవి డెభై శాతం. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకూ, దేశ, రాష్ట్ర సహజ వనరులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వాధినేతలే ఖజానాను కొల్లగొట్టే దొంగలవుతుండటమే విషాదం. ఇక రెండో అంశం, తరతరాలుగా ప్రజలు కాపాడుకుంటూ వచ్చిన భూమి, అడవులు, ఖనిజాలు, నీళ్ళు, ఇసుక తదితరాలను పెట్టుబడిదారు లకు తక్కువ రేట్లకు అమ్మి, ప్రభుత్వాల పెద్దలు వేల కోట్ల రూపాయలు కమీ షన్ల పేరుతో దిగమింగుతున్నారు. తాజా ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మూడవది, పన్నుల ఎగవేత. ‘‘భారతదేశం అవినీతికి అంతర్జాతీయ చిహ్నం గా మారడానికి కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్‌కంటాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ల అవినీతి, అసమర్థతలే కారణం. పన్నుల ఎగవేతకు వ్యాపా రుల దగ్గర లంచాలు తీసుకోవడం, సరైన నిఘాను ఉంచకపోవడం వల్ల ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయంలో సగం కూడా రావడం లేదు. ఇలా పన్నుల ఎగవేతతో మిగుల్చుకున్నదే నల్లడబ్బుగా మారుతున్నది.’’ జాతీయ విజిలెన్స్ కమిషనర్‌గా పనిచేసిన విఠల్ ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు మన దేశంలో నల్లధనం మూలాలను వెల్లడిచేశాయి. ‘సంస్కరణలు’ కుంభకోణాలకు రహదారి స్వాతంత్య్రానంతరం మొత్తం 200లకు పైగా భారీ కుంభకోణాలు జరిగినట్లు అంచనా. వీటిలో 98 శాతానికి పైగా 1990 తరవాత జరిగినవే. ఆర్థిక సంస్క రణల పేరిట దేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను ప్రవేశపెట్టిన తర్వాతనే, వాటి వల్లనే కుంభకోణాలు విపరీతంగా పెరిగిపో యాయనేది స్పష్టమే. రక్షణరంగం కూడా కుంభకోణాల్లో కూరుకుపోవడం దేశ సమగ్రత, భద్రతకు ముప్పును సూచిస్తోంది. ‘‘చాపర్ గేట్’’ పేరు మోసిన హెలికాప్టర్ల కుంభకోణం జాతి యావత్తుని నివ్వెరపరచింది. ఇందులో ముడుపులు అందుకున్న మన వైమానిక దళాధిపతి త్యాగిపై కేసు కూడా నమోదైంది. అవినీతి కేసును ఎదుర్కొంటున్న మొదటి వైమానిక దళాధిపతి ఈయనే. అలాగే బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణంలో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను అనుమానించడానికి తగిన ఆధారాలు న్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే మన కుంభకోణాల చరిత్రకు అంతుండదు. అవినీతిని అరికట్టడానికే నిర్మించుకున్న కొన్ని రాజ్యాంగ సంస్థలు కూడా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), సెం ట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)లూ, రాష్ట్రాల స్థాయిలో అవినీతి నిరోధక సంస్థలు (ఏసీబీ), లోకా యుక్తలు అలాంటివే. ఇన్ని వ్యవస్థలున్నా శిక్షలు కేవలం నూటికి ఆరేనని గణాంకాలు చెబుతున్నాయి. విచారణ సంస్థలు ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండ టం వల్లనే నేరస్తులంతా నిరపరాధులుగా బయటపడుతున్నారనే విమర్శలు న్నాయి. ముఖ్యంగా సీబీఐ కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా మారిపోయిందనే అభిప్రాయం బలపడుతోంది. ప్రజలే పూనుకోవాలి ప్రజాస్వామ్య రక్షణలో పాలనా వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజలే ఆ బాధ్యతను తీసుకోవాలని రాజ్యాంగ రచనా సమయంలోనే పలువురు నిపు ణులు చెప్పారు. అవినీతి కుంభకోణాలలో ప్రభుత్వాల పెద్దలే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో బాధ్యులు అవుతున్నందున ప్రజలే అవినీతిని అరికట్టడానికి పూనుకోవాలి. పౌరసమాజం రాజకీయాలకు అతీతంగా సంఘటితమై నూతన తరహాలో ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడపాల్సి ఉంది. ప్రభు త్వం ఖర్చుపెట్టే ప్రతి పైసా ప్రజలకు లెక్క తెలిసేలా పూర్తి పారదర్శకతను పాటించాలని డిమాండ్ చేయాలి. ప్రభుత్వం ఎవరికి ఏయే పరిశ్రమలు, గనులు కేటాయిస్తున్నదనే విషయాలను, దానివల్ల ఒనగూరే ప్రయోజనాలను ఎప్పటికప్పుడు బహిరంగం చేసేలా ఒత్తిడి చేయాలి. ప్రభుత్వానికి, పార్టీలకు వెలుపల ఉన్న పౌరసమాజం, ప్రజా సంఘాల పాత్ర దీనిలో ఎక్కువగా ఉం డాలి. అప్పుడు మాత్రమే అవినీతికి అంతం పలికే రోజులొస్తాయి. - మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213