కరోనా నివారణలో కుబేరులెక్కడ? | Mallepally Laxmaiah Writes Guest Column About Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా నివారణలో కుబేరులెక్కడ?

Published Thu, Mar 26 2020 12:22 AM | Last Updated on Thu, Mar 26 2020 12:27 AM

Mallepally Laxmaiah Writes Guest Column About Coronavirus - Sakshi

ప్రభుత్వాలు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ప్రజలు బాధ్యత వహించాల్సి వస్తున్నది. విద్య, వైద్యం ఏ దేశానికైనా అత్యంత కీలకమైన విషయాలనీ, వాటిని అశ్రద్ధ చేయొద్దని నెత్తీనోరూ బాదుకున్నా ఫలితం లేకపోయింది. శాస్త్రీయ అధ్యయనాలపై దృష్టిసారించాలనీ, దేశంలో పరిశోధనలపై ఖర్చుపెట్టాలని ఎంతోమంది ఎంత చెప్పినా ఆయా రంగాలకు కేటాయిస్తున్న మొత్తం అత్యల్పం. వీటన్నింటి ఫలితమే నేటి దుస్థితికి కారణం.తెలుగు రాష్ట్రాలలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పెద్దపెద్ద కాంట్రాక్టర్లు తమ దాతృత్వాన్ని ప్రదర్శించాలి. ప్రజలుంటేనే వారుండేది. వారు బతికేది. అందుకే ఇప్పుడు ప్రజల్ని బతికిద్దాం.

‘‘మానవ జాతికి అత్యంత ప్రమాదకరంగా మారింది, సమస్త మానవ జాతిని నాశనం చేయబోతున్నది వైరస్‌ అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ లక్షలాది మంది మరణిస్తే అది యుద్ధాల వల్లనో, మిస్సైల్స్‌ వల్లనో కాదు. విషక్రిముల వల్ల మాత్రమేనని అర్థం చేసుకోవాలి. అణ్వాయుధాల తయారీ మీద లెక్కలేనంత డబ్బును ఖర్చుపెడుతున్నాం. కానీ అంటువ్యాధులను నివారించడానికి మనం ఒక్క ప్రయత్నం కూడా చేయడంలేదు. నిజానికి ఈ విషయంలో మన ప్రయత్నం శూన్యం. రాబోయే భయంకరమైన అంటువ్యాధిని ఎదు ర్కోవడానికి మనం సిద్ధంగా లేం’’ ప్రపంచ ప్రసిద్ధిచెందిన వ్యాపార వేత్త, అపరకుబేరుడు బిల్‌గేట్స్‌ భవిష్యత్‌ని ఆవిష్కరిస్తూ వెల్లడించిన అభిప్రాయమిది.

2015 మార్చి 18న ఆయన ‘2015 టెడ్‌ టాక్‌’లో సాంకేతిక పరిశోధనల ఆవశ్యకతను గుర్తుచేస్తూ చేసిన ముందస్తు హెచ్చరిక ఇది. దీన్ని అమెరికాకు బిల్‌గేట్స్‌ ఇచ్చిన వార్నింగ్‌ అని భావించొచ్చు. ఆరోగ్య రక్షణ, మందుల తయారీ మీద ప్రభుత్వం చేస్తోన్న ఖర్చు క్రమంగా తగ్గుతున్నదని, వైరస్‌లను ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం చొరవ చూపడంలేదని గేట్స్‌ తన ఆవేదనను వ్యక్తం చేశారు. రోగనిర్ధారణ పరికరాలు, మందులు, వ్యాక్సిన్‌లను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడం ద్వారా దీనిని ఎదుర్కో గలమని సూచించారు. అయితే అమెరికా ప్రభుత్వం ఆయన సలహాలను పక్కన పెట్టింది. కానీ ఆయన మాత్రం ‘మిలింద గేట్స్‌ ఫౌండేషన్‌’ ద్వారా అటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. ఏ ఒక్కరి చొరవ మాత్రమే సరిపోదని ఆయన అనుభవం రుజువుచేసింది. దానివల్ల ఈ రోజు ప్రపంచంలో మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ను అగ్ర రాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా కూడా తట్టుకోలేకపోతున్నది. కరోనా వైరస్‌ దెబ్బకు అమెరికా అతలాకుతలం అవుతోంది. అమె రికాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోన్న ఇతర దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

మన దేశంలో రోజురోజుకూ విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కోటా నుకోట్ల మంది ప్రజలను భయకంపితులను చేస్తోంది. కానీ అమెరికా లాగా, చైనాలాగా, ఇటలీలాగా వైరస్‌ ప్రభావం పెరిగితే దానిని తట్టు కోవడానికి మనదేశ ఆరోగ్య వ్యవస్థ ఏమాత్రం సరిపోదు. వైద్య శాలలు, డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది, మందులు, వ్యాక్సిన్లు సరి పోయేంత అందుబాటులో లేవు. మన దేశంలో వైద్యుల కొరత చాలా ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతివేయి మందికి ఒక డాక్టర్‌ ఉండాల్సి ఉండగా, మన దేశంలో 10,189 మందికి ఒక డాక్టర్‌ ఉన్నారు. ఈ లెక్క ప్రకారం మన దేశంలో ఇంకా కావాల్సిన దానికన్నా ఆరు లక్షల మంది డాక్టర్ల కొరత ఉంది. అలాగే మన దేశ జనాభాని బట్టి చూస్తే మనకు దాదాపు 20 లక్షల మంది నర్సులు అవసరం ఉంటుంది. మన దేశంలో పదమూడు రాష్ట్రాల్లో 64 జిల్లాల్లో, 27 కోట్ల మంది ప్రజలకు అత్యవసరమైన బ్లడ్‌ బ్యాంక్‌లు లేవు. 2030 నాటికి 20 లక్షల మంది డాక్టర్లు మన దేశానికి అవసరమవుతారు. ఆరోగ్య వ్యవస్థ పరిరక్షణ మొత్తం 195 దేశాల్లో మనదేశం స్థానం 145గా ఉందంటే మనం ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో అర్థం అవుతుంది. ప్రభుత్వాలు ప్రత్యేకించి భారత ప్రభుత్వం ఆరోగ్యం, వైద్యంపై పెడుతున్న ఖర్చు జాతీయ స్థూల ఆదాయంలో 1.28 శాతం మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు తమకు వస్తున్న ఆదాయంలో 65 శాతం ఆరోగ్యానికే ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తంతో ప్రతి సంవత్సరం అయిదుకోట్ల 70 లక్షల మంది పేదరికం నుంచి బయ టపడవేయొచ్చని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ సంస్థ  జరిపిన సర్వేలో వెల్లడయ్యింది. 

ఇప్పటికే మనం పరిశోధనల విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సంస్థకు నిధుల కేటాయింపులు నామమాత్రం. ఏదో ఇలాంటి అత్యవసరమైన సమయాల్లో తప్ప మరెప్పుడూ దానిపేరు కూడా మనకు తెలియదు. అమెరికాలో ఇప్పటికిప్పుడు వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నం జరిగి సఫలం అయినట్టు వార్తలొస్తు న్నాయి. మన ప్రభుత్వాలు మాత్రం అటువైపుగా ఆలోచించటం మాట అటుంచి, వాళ్ళెవ్వరో తయారుచేస్తే మనం తెచ్చుకుందామనే భావ దారిద్య్రంలో బతుకుతున్నాం. అమెరికాలో బిల్‌గేట్స్‌ లాంటి వ్యాపార వేత్తలు స్వయంగా అటువంటి ప్రయత్నాలు చేస్తున్నా, ప్రభుత్వాలు మాత్రం తమకేమీ పట్టనట్టు మిన్నకుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

మనదేశంలో ప్రభుత్వం, ఔషధ రంగంలో ఉన్న పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు ఏమిచేస్తున్నారో ఇప్పటి వరకు సమాచారం లేదు. అటువంటి నమ్మకం కనపడటం లేదు. గత చరిత్ర అంతా అదే చెబుతున్నది. ఇందులో శాస్త్రవేత్తల తప్పు తక్కువ. ప్రభుత్వాలకే నిర్దిష్ట మైన దృక్పథం లేదు. దృష్టిలేదు. అయితే ఇప్పుడు ఇవి తలచుకొని కూర్చుంటే కూడా లాభం లేదు. నిజానికి ప్రభుత్వాలు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ప్రజలు బాధ్యత వహించాల్సి వస్తున్నది. విద్య, వైద్యం ఏదేశానికైనా అత్యంత కీలకమైన విషయాలనీ, వాటిని అశ్రద్ధ చేయొద్దని నెత్తీనోరూ బాదుకున్నా ఫలితం లేకపోయింది. శాస్త్రీయ అధ్యయనాలపై దృష్టిసారించాలనీ, పొరుగుదేశాలపై యుద్ధానికి సిద్ధం కావడానికి బదులు మన దేశంలో పరిశోధనలపై ఖర్చు పెట్టా లని ఎంతోమంది ఎంత చెప్పినా ఆయా రంగాలకు కేటాయిస్తున్న మొత్తం అత్యల్పం. వీటన్నింటి ఫలితమే నేటి దుస్థితికి కారణం.

అయితే ప్రస్తుత కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి కొన్ని చర్యలు తీసుకుంటూంటే కూడా దీనిని మన మందరం పాటించాల్సిందే. ఇందులో మినహాయింపులు అక్కరలేదు. స్వీయ నియంత్రణ అనే విషయాన్ని ప్రజలు పాటించి తీరాల్సిందే. అది తప్పనిసరి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ముందు గానే రాష్ట్రాలను లాక్‌డౌన్‌ చేశాయి. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాత్రి కర్ఫ్యూ ప్రకటిం చారు. ప్రజలకు మరింత బాధ్యత తెలిసిరావడానికి ఈ నిర్ణయం తీసు కున్నట్టు తెలుస్తున్నది. లాక్‌డౌన్‌ వల్ల రోజువారీ కూలీలూ, చిన్న చిన్న వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ప్రభుత్వాలు డబ్బులు, నిత్యావసర వస్తువులు అందించడానికి నిర్ణయించుకు న్నాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయమే. దీనికి కోట్ల డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రకటించిన నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆమో దించిన బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. ఏదోరకంగా ప్రభుత్వం ఆ బాధ్య తలను నెరవేరుస్తుందనుకుందాం. ఈ పరిస్థితి తొందరలోనే సర్దుకుం టుందనుకుందాం. ఒకవేళ ఏదైనా కారణం చేత లాక్‌డౌన్‌ కొనసాగితే, మరింతగా ప్రమాదం పెరిగితే వేల కోట్ల రూపాయల డబ్బులు కావాలి. అందుకు తగిన డబ్బులు ప్రభుత్వాల దగ్గర ఉంటాయని నేననుకోను.

ఇక్కడే బిల్‌గేట్స్‌ లాంటి వాళ్ల చొరవ అవసరమవుతుంది. ఆయన ఆరోగ్య రక్షణకు, వ్యాక్సిన్‌ కనుగొనడానికి అమెరికాలో కృషి చేస్తు న్నారు. అయితే అటువంటి అపరకుబేరులు మనదేశంలో వందల మంది ఉన్నారు. ముఖ్యంగా వేల కోట్లు కలిగిన వాళ్ళు వందకు పైగా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ల మేధస్సుతోనో, కాలం కలిసిరావడంతోనో డబ్బులు సంపాదించారు. ఈ రోజు వాళ్ళ డబ్బు అట్లాగే బ్యాంకుల్లో మూలిగితే, ఈ దేశంలోని ప్రజలు పిట్టల్లా రాలిపోయిన తరువాత వాళ్ళు మాత్రం ఆ డబ్బుతో చేయగలిగేదేమీ ఉండదు. ముఖ్యంగా తిండి, మందులు అందించడానికి ప్రభుత్వాల చేతికి బలంకావాలి. ప్రభుత్వం దగ్గర వ్యవస్థ ఉంది. సిబ్బంది ఉంది. కానీ నిధుల కొరత మొత్తం కార్యక్రమాలను నిర్వీర్యపరిచే ప్రమాదం వుంది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాలలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పెద్దపెద్ద కాంట్రాక్టర్లు తమ దాతృత్వాన్ని ప్రదర్శిం చాలి. ప్రతి వ్యక్తీ ముఖ్యంగా వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు తమ ఆదాయంలో కనీసం ఒక పదిశాతం ప్రభుత్వాలకు అందజేస్తే భారత దేశంలో లక్షకోట్లకు పైగా సమకూరుతాయి. ఇది మనల్ని మనం కాపా డుకున్నట్టవుతుంది. అంతేకానీ 130 కోట్ల మంది ప్రాణాలు గాలిలో ఉంటే కేవలం రూ. 15,000 కోట్లను ప్రధాని నరేంద్రమోదీ వెచ్చించి నంత మాత్రాన ఏ ప్రయోజనమూ ఉండదు. ఈ మొత్తం దేశంలోని ప్రతిమనిషికీ విభజిస్తే ఒక్కొక్కరికీ వచ్చేమొత్తం రూ.115 రూపా యలు మాత్రమేనని అర్థం చేసుకోవాలి. అందుకే అందరం అంతకు మించి ఆలోచిద్దాం. అందరికీ మించి అపరకుబేరులు ఆలోచించాలి. ప్రజలుంటేనే వారుండేది. వారు బతికేది. అందుకే ప్రజల్ని బతికిద్దాం.


వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య 
సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement