జీవితమంతా ప్రజలకు నిబద్ధులై ఉండే అరుదైన అధికారుల గురించి ఆలోచిస్తే మొట్టమొదట మన కళ్లముందు కదలాడే ప్రత్యక్ష రూపం ఎస్.ఆర్. శంకరన్‌దే. 1974 ప్రాంతంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దళితుల, ఆదివాసీల విషయంలో చేసిన కీలక నిర్ణయాలు, శంకరన్ లాంటి అభ్యుదయ అధికారుల చేతిలో శక్తివంతమైన ఆయుధాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక దళిత, ఆదివాసీల అభ్యున్నతికి బాటలు వేసే అత్యంత సాహసోపేత మైన నిర్ణయాలెన్నో చేసిన ఎస్.ఆర్. శంకరన్ ఒక్క ఏడాదిలోనే దాదాపు 120 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ఐఏఎస్ అధికారుల చరిత్రలో అరుదైన సందర్భం.
భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. విశిష్టమై నది. అధిపతులూ, అధికా రులూ, పరిపాలకులూ ఈ దేశంలో ఎంతటి అత్యు న్నత పదవిలో ఉన్న వారైనా భారత రాజ్యాంగానికి బద్ధులైæ ఉండాల్సిందే. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడి, పాలనను కొనసాగించే వ్యవ స్థలు మూడు. అందులో ఒకటి శాసన వ్యవస్థ. రెండు అధికార వ్యవస్థ. మూడు న్యాయ వ్యవస్థ. ఈ మూడింటిలో శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కేవలం విధానాలూ, చట్టాల, రూపకల్పనలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కానీ శాసన న్యాయ వ్యవస్థలు అంతగా ప్రజలకి చేరువ కావు. అయితే అధికార వ్యవస్థ నిత్యం ప్రజలమధ్యే ఉండాల్సి ఉంటుంది. వీరె ప్పుడూ ప్రజలకు, రాజ్యాంగానికీ మాత్రమే జవాబు దారీగా ఉండాలి. ప్రభుత్వంలోని బ్యూరోక్రాట్స్ కానీ, అధికారంలో ఉన్న పెద్దలెవరైనా, ఇతర ఆధి పత్యశక్తుల ఆజ్ఞలకు లోబడి పనిచేయాల్సిన అవ సరం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వా లను నడిపే ముఖ్యమంత్రులనూ, మంత్రులనూ ఎది రించి రాజ్యాంగం అమలుకోసం నిలబడే శక్తిసామ ర్థ్యాలు వీరికి కావాలి.
జీవితమంతా ప్రజలకు నిబద్ధులై ఉండే అరుదైన అధికారుల గురించి ఆలోచిస్తే మొట్టమొ దట మన కళ్లముందు కదలాడే ప్రత్యక్ష రూపం ఎస్‌ఆర్ శంకరన్‌దే. ప్రభుత్వాలు, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థా, ఇతర పాలనా విభాగాలేవైనా వాటి కర్తవ్య నిర్వహణ అణగారిన వర్గాల సమస్యల పరి ష్కారంలోనే ప్రతిబింబిస్తుందని మనస్ఫూర్తిగా నమ్మి నవాడు. తాను బతికి ఉన్నంత కాలం అట్టడుగు వర్గాల, దళితుల అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేసారు. పేదలు, అత్యంత నిరుపేదలు అనే ఊహాజనితమైన ఆవిష్కరణలను తిప్పికొట్టి అన్ని రకాల పేదరికాలనూ, వివక్షనూ ఎదుర్కొంటున్న వర్గం కేవలం అంటరాని కులాలేనని తేల్చి చెప్పారు.
పామరుల చెంతకు పాలనావ్యవస్థ
పామరుల చెంతకు పాలనావ్యవస్థను పరుగులు పెట్టించిన ఘనత ఎస్.ఆర్. శంకరన్‌దేనంటే అతి శయోక్తికాదు. తమిళనాడులోని తంజావూరులో 1934, అక్టోబర్ 22న ఆయన జన్మించారు. మదు రైలో కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఆయన ఐఏ ఎస్‌లో చేరకముందు లెక్చరర్‌గా కొంత కాలం పని చేశారు. 1956లో ఐఏఎస్‌లో చేరిన శంకరన్ 1959లో కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్‌గానూ, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గానూ పనిచేశారు. తరువాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్ళారు. 1971–73లో కేంద్ర ఉక్కు, గనుల శాఖామంత్రిగా ఉన్న కుమార మంగళంకు స్పెషల్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. బొగ్గు గనులను జాతీయం చేసే కార్యక్రమంలో ఎస్.ఆర్. శంకరన్ పాత్ర అత్యంత కీలకమైనది. బొగ్గుగని కార్మికులు బానిసలుగా జీవి స్తున్న స్థితిలో వారికి రాజ్యాంగపరమైన హక్కులను కల్పించడంలో శంకరన్ కృతకృత్యులయ్యారు.
సాంఘిక సంక్షేమానికి ఆద్యుడు
కారణాలేవైనప్పటికీ 1974 ప్రాంతంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దళితుల, ఆదివాసీల విషయంలో చేసిన కీలక నిర్ణయాలు, ఎస్‌సీ, ఎస్టీల పట్ల అను సరించిన వైఖరి శంకరన్ లాంటి అభ్యుదయ అధికా రుల చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మారాయి. హైదరాబాద్‌లో 1976లో నిర్వహించిన హరిజన కాన్ఫరెన్స్ హరిజన పదం వాడకం అవమానకరమైన దనీ, దాన్ని ఇకపై వాడకూడదనీ తీర్మానించింది. తదనంతర కాలంలో ఆ తీర్మానమే ప్రభుత్వ ఉత్త ర్వుగా రూపుదిద్దుకుంది. అప్పటినుంచి ప్రభుత్వ రికార్డుల్లో హరిజన అనే పదం స్థానంలో షెడ్యూల్డ్ కులాలు అని చేర్చారు. ఈ సదస్సులో ఎస్సీల సమ స్యపై దాదాపు 322 సిఫారసులను సూచించారు. అందులో 224 తీర్మానాలు ఆమోదించారు. ఆంధ్ర ప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దళిత, ఆది వాసీల అభ్యున్నతికి బాటలు వేసే అత్యంత సాహ సోపేత మైన నిర్ణయాలెన్నో చేసిన ఎస్.ఆర్. శంకరన్ ఒక్క ఏడాదిలోనే దాదాపు 120 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ఐఏఎస్ అధికారుల చరిత్రలో అరు దైన సందర్భం.120 జీఓల్లో 100కి పైగా శంకరన్‌గారి సింగిల్ సిగ్నేచర్‌తో ఉండడం నిజాయితీ కలిగిన, పాలనాధికారులకు ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. హరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ పేరును సాంఘిక సంక్షేమ శాఖగా మార్పు చేయడం జీఓల్లో ఒకటి.
దళితుల, ఆదివాసీల గురించి జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం అత్యంత స్పష్టంగా వివక్ష కనిపిస్తూంటుంది. వీరికోసం ప్రభుత్వం నిర్మించి ఇస్తోన్న ఇళ్లన్నీ వెలివేసినట్టు ఊరుచివరే నిర్మిస్తారు. గ్రామం వెలుపల కాకుండా, గ్రామం మధ్యలోనే వీరి ఇళ్ళు నిర్మించాలనీ, దళితుల వాడల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనీ, రేషన్ షాపు లను దళితులకే కేటాయించాలనీ, దళితుల పిల్లలకు పౌష్ఠికాహారం, గ్రామ పంచాయతీల్లో దళిత మహిళ లకు రిజర్వేషన్లు, ఒంటరి దళిత మహిళలకు ఇండ్ల స్థలాలు, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో శిక్షణ, ఇనాం భూములకు పట్టాలు, ప్రభుత్వ హౌజింగ్ కాలనీల్లో దళితులకు ఇండ్ల కేటాయింపుల్లో ప్రాధాన్యం, స్థానిక సంస్థల బడ్జెట్‌లో 15 శాతం నిధులను దళితుల అభివృద్ధికి ప్రత్యేకించి కేటాయిం చడం కుల నిర్మూలన అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చడం, దళిత వాడల్లో విద్యుదీకరణ, పబ్లిక్ స్కూల్స్‌లో రిజర్వేషన్లు దళిత వాడల్లో పాఠశాలల ఏర్పాటు లాంటివి వంద జీవోల్లో కొన్ని మాత్రమే.
రెండో వైపు షెడ్యూల్డ్ తెగలైన ఆదివాసీలకు అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి సారించారు. ఆది వాసీల కోసం ప్రత్యేక సమీకృత ఆదివాసీ అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ)లను ఏర్పాటు చేయడంలో శంకరన్ కృషి మరువలేనిది. పైగా ఎస్‌సీ, ఎస్‌టీ పిల్లలకు మెరుగైన విద్యనందించే లక్ష్యంతో ప్రత్యేక హాస్టల్స్‌ను ప్రారంభించిన ఘనత కూడా శంకరన్‌దే. 1976లో వచ్చిన వెట్టిచాకిరీ నిషేధ చట్టం ఆయన కృషి ఫలి తమే. ఎందరినో భూస్వాముల చెర నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించారు. ఈ విషయమై 1978లో అధికారంలోనికి వచ్చిన ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డితో వచ్చిన విభేదాల కారణంగా త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బదిలీపై వెళ్ళారు. అక్కడ కేంద్ర పారామిలిటరీ దళాల అరా చకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎంతో కృషి చేశారు.
1983లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేప ట్టిన అనంతరం ఆయన తిరిగి మన రాష్ట్రానికి వచ్చారు. సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్య తలు స్వీకరించారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు, స్కాలర్‌షిప్‌ల పెంపుదల, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలు కోసం కృషి చేసారు. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడులో జరిగిన దారు ణానికి చలించిపోయిన ఎస్‌ఆర్.శంకరన్ ప్రభుత్వ పెద్దలను ధిక్కరించి కూడా కొన్ని సాహసోపేత నిర్ణయాలు చేసారు.
నక్సలైట్లతో చర్చలు
పదవీ విరమణ తర్వాత మూడు ముఖ్యమైన విష యాలలో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు. అందులో పౌరస్పందన వేదిక (కన్‌సర్డ్న్ సిటిజన్స్ కమిటీ) ఒకటి. ప్రభుత్వానికీ నక్సలైట్లకూ మధ్య జరుగుతోన్న పోరులో కోల్పోతున్న పౌరుల ప్రాణా లను కాపాడేందుకు మానవీయ దృక్పథంతో మేధా వులను కూడగట్టి పౌరస్పందన వేదికను ఏర్పరి చారు. 1997లో ఏర్పాటైన ఈ వేదిక ప్రభుత్వానికీ నక్సలైట్ల మధ్య చర్చలు జరగడానికి తీవ్రంగా కృషి చేసింది. దాని ఫలితంగా 2004లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో నక్స లైట్లను చర్చలకు ఆహ్వానించడం భారతదేశ చరిత్ర లోనే అరుదైన సంఘటన. ఆ తర్వాత ఆయన దృష్టి మొత్తం పాకీపనివారి విముక్తిపై సారించారు. దళిత మావన హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్‌తో కలిసి సఫాయి కర్మచారీ ఆందోళన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడం కోసం శంకరన్ చేసిన ప్రయత్నం అద్వితీయమైనది. ప్రభుత్వ పాలనలో తన అనుభవాన్ని ఉపయోగించి ఆ సమస్యపై దేశ వ్యాప్తంగా చర్చకు తెరదీసారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చే విధంగా సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ ఉద్యమం వల్ల చేతితో మలం ఎత్తే అమానవీయ పని నుంచి ఎందరో బయటపడ్డారు.
శంకరన్ ప్రధాన పాత్రధారిగా ప్రారంభమైన సఫాయి కర్మచారీ ఆందోళన్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడమే కాకుండా, దాని కన్వీనర్ బెజ వాడ విల్సన్‌కు రామన్ మెగసెసే అవార్డు రావడం శంకరన్ కృషిలో భాగంగా భావించాలి. పెళ్ళి తన లక్ష్యానికి అవరోధం అవుతుందని భావించి వ్యక్తిగత జీవితాన్నే త్యజించినవాడు. 2008 అక్టోబర్ 7వ తేదీన అశేష దళిత ప్రజానీకానికి వీడ్కోలు పలు కుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకున్న ఆస్తి మిత్రులు కొనిచ్చిన ఓ చిన్న ఫ్లాటు, ఆయన పుస్తకాలు మాత్రమే. నిస్వార్థ నిరాడంబర అభినవ బౌద్ధుడు ఎస్‌ఆర్.శంకరన్. ఆయన కృషికి గుర్తుగా పద్మభూషణ్ అవార్డు అతన్ని వరించి వస్తే సున్ని తంగా తిరస్కరించారు. కేంద్ర రాష్ట్రాల్లో శంకరన్ లాంటి నిబద్ధత కలిగిన అధికారులు చాలా అరుదనే చెప్పాలి. శంకరన్ ఆశయాలను ఈతరం అధికారులు పుణికిపుచ్చుకోవాల్సిన సందర్భమిదే.
(అక్టోబర్ 22న ఎస్‌ఆర్.శంకరన్ జయంతి)
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 97055 66213
Comments
Please login to add a commentAdd a comment