సడలుతున్న మౌఢ్యం సంకెళ్లు
కొత్త కోణం
భారత యువతకే కాదు, పేద దేశాలన్నిటిలోని యువతకూ అమెరికా అం టే ఓ రంగుల కల. మనలాంటి దేశాల్లో తగు ఉద్యోగావకాశాలు లేకపోవడమే అందుకు కారణం కావచ్చు. ఏదేమైనా నేటి విద్యార్థి, యువజనులలో పలువు రికి ఆ రంగుల స్వప్నాన్ని సాకారం చేసుకోవడమే జీవిత లక్ష్యం. ఆ కల నిజా నికి అంత అందమైనది కానేకాదు. జాత్యహంకారం, పేద దేశాల నుంచి వలసవచ్చిన వారిపట్ల వ్యతిరేకత. నల్లవారిపై సాగే దాడులు, హింస ఎప్పటి కప్పుడు అమెరికా అసలు స్వరూపాన్ని బయట పెడుతూనే ఉన్నాయి.
అంతే కాదు అతి గొప్ప ప్రజాస్వామ్యంగా చెప్పుకునే ఆ దేశంలో పౌరుల వ్యక్తిగత విశ్వాసాల పట్ల ఇసుమంత గౌరవమూ లేదనేది మరో చేదు వాస్తవం. శాస్త్రీ య చింతనను అణచివేసే మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి. భౌతికవాదాన్ని, కంటికి కనిపించే సత్యాన్ని, శాస్త్రీయతను ఎం తగా అణచివేసినా సమూలంగా నిర్మూలించడం అసాధ్యం. ఏదో రూపంలో, ఏదో చోట మళ్ళీ, మళ్ళీ అది జనిస్తూనే ఉంటుంది. దానిపేరే హేతుబద్ధత.
శాస్త్రీయ చింతనపై ఆంక్షలు, వివక్ష
ప్రపంచదేశాల్లో ఒకవంక మతం, అభౌతికవాదం విచ్చలవిడిగా వ్యాపిస్తున్నా, దానికి దీటుగా హేతువాదం, నాస్తికవాదం కూడా విస్తరిస్తున్నాయి. అమెరికా లోని కొన్ని రాష్ట్రాల్లో ‘నేను ఏ మతస్థుడినీ కాను,’ ‘నేను దేవుడిని నమ్మను’ అనే వారి పట్ల ఉద్యోగాల్లో, హోదాల్లో వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అర్కాన్సా, మేరీలాండ్, మిస్సిసిపి, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, టెన్సిసి, టెక్సస్ రాష్ట్రాలకు ‘బైబిల్ బెల్ట్’ అని పేరు.
నాస్తికులు, హేతువాదులు ఎలాం టి ప్రభుత్వ పదవులు, హోదాల్లో ఉండటానికి వీల్లేని విధంగా ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన చట్టాలున్నాయి. నాస్తికులు, హేతువాదులపై ఈ నిషేధం ఎంత పకడ్బందీగా అమలు జరుగుతోందంటే... అలాంటి వారి సాక్ష్యానికి కోర్టుల్లో విలువ లేదు. ఈ ప్రపంచం మనుగడకు కారణం భౌతిక పరిస్థితులే తప్ప దైవం, మతం కారణం కాదని విశ్వసించే వారికి రకరకాల అవమా నాలు, వేధింపులు తప్పడం లేదు. ఇక ఇస్లామిక్ దేశాల్లో నాస్తికులపై తీవ్ర నిషేధం మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో మరణ దండనను సైతం విధి స్తున్నారు.
అఫ్ఘానిస్తాన్, ఇరాన్, మలేసియా, మాల్దీవులు, మారిషస్, నైజీ రియా, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, సోమాలియా, సూడాన్, యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమన్ దేశాలు నాస్తికులు, హేతువాదులను తీవ్రం గా అణచివేస్తున్నాయి. మతాన్ని వదిలిన వారిని ఇస్లాం అతి తీవ్రంగా పరిగ ణించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇస్లాంను అనుసరించని మగవారికి మరణశిక్ష, మహిళలకు జీవిత ఖైదు విధించాలనే నిబంధనలున్నాయి.
బుద్ధికి మౌఢ్యం సంకెళ్లు
మన దేశంలో నాస్తికులు, హేతువాదులపై చట్టపరమైన నిషేధాలు లేకున్నా భౌతిక, మానసిక దాడులు, వెలివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మహా రాష్ట్రలో నాస్తికవాది నరేంద్ర దాబోల్కర్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు గోవింద్ పన్సారే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిం చి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకే వారిని సనాతనవాదులు హత్యచేశారు.
పాలకవర్గ రాజ్యాధికారాన్ని, ఆధిపత్యాన్ని సవాలు చేసిన వారెవరైనా వారికి మతం పేరిట నాస్తికులుగా, హేతువాదులుగా, నిరీశ్వరవాదులుగా ముద్రలు వేసి ఊచకోత కోసిన చరిత్ర భారత ఛాందసవాదులది. మూఢవిశ్వాసాలను, అరాచకాలను ఎదిరించి సత్యాన్ని, హేతువాదాన్ని ప్రచారం చేసిన లక్షలాది మంది బౌద్ధులను ద్రోహు లుగా, దేవుడి వ్యతిరేకులుగా ముద్రవేసి, హతమార్చి, వారి శవాల గుట్టలపై హైందవ ధర్మాన్ని నెలకొల్పిన ఆధారాలు వారి గ్రంథాల్లోనే కావల్సినన్ని ఉన్నాయి.
శుంగ వంశ స్థాపకుడైన పుష్యమిత్రుడు క్రీ.పూ.185లో చివరి మౌర్య చక్ర వర్తి బృహద్రదుడిని హతమార్చి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ‘అశోక వదన’, ‘దివ్యవదన’ బౌద్ధ గ్రంథాల్లో పుష్యమిత్రుని హత్యాకాండ నిక్షిప్తమై ఉంది. బయటి నుంచి దండెత్తి వచ్చిన హూణులు బౌద్ధుల పట్ల మరింత శతృ త్వంతో వ్యవహరించారు. హూణ వంశానికి చెందిన మిహిరకులుడు లక్షలాది బౌద్ధులను చంపిన వైనాన్ని కల్హణుని ‘రాజతరంగిణి’ వివరించింది.
‘ప్రాచీన భారతదేశ చరిత్ర’ రాసిన విన్సెంట్ స్మిత్ మిహిరకులుని ఈ క్రూరత్వాన్ని వివ రంగా ప్రస్తావించాడు. క్రీ.శ.528 ప్రాంతంలో శాంతియుత బౌద్ధ సమాజంపై తీవ్ర దాడులు జరిగాయి. మిహిరకులుడు బౌద్ధ చైత్యాలను, స్థూపాలను ధ్వంసం చేశాడు. మరొక రాజు శశాంకుడు ఏడో శతాబ్దం ప్రథమ దశాబ్దంలో అశోక చక్రవర్తి పోషించిన బుద్ధగయలోని బోధివృక్షాన్ని పెరికివేసి, తగుల బెట్టించాడు. పాటలీపుత్రలోని (నేటి పట్నా) బుద్ధుని పాదముద్ర శిలలను పగులగొట్టించాడు. విహారాలను ధ్వంసం చేశాడు. ఇవి భారత చరిత్రలో హేతుబద్ధతపై జరిగిన క్రూర దమనకాండలోని కొన్ని ఘటనలు మాత్రమే.
విస్తరిస్తున్న నాస్తికవాదం
ఇక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలను నాస్తి కులుగా ముద్రవేసి ప్రపంచవ్యాప్తంగా దాడులు చేశారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదన్నందుకు కొపర్నికస్‌పై దాడి చేశారు. అయినప్పటికీ హేతువాదం, శాస్త్రీయ చింతన ప్రాతిపదికగా కలిగిన నాస్తికవాదం నశించ లేదు. పైగా ఇటీవలి కాలంలో అది విస్తరిస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, దక్షిణాసియా దేశాల్లో నాస్తికత్వం, భౌతికవాదం పెరుగుతున్నాయి.
అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో నాస్తికులపై, భౌతికవాదంపై తీవ్ర వివక్ష ఉన్నా రోజు రోజుకూ మతంలేని, మతాన్ని అనుసరించని, దేవుణ్ణి నమ్మని వారి సంఖ్య పెరుగుతున్నట్టు ‘ప్యూ’ పరిశోధనా సంస్థ మే 2015 నివేదికలో స్పష్టం చేసింది. క్రైస్తవ యువకుల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని అది వెల్లడిం చింది. క్యాథలిక్కుల కన్నా ప్రొటెస్టెంట్లలో ఈ ధోరణి బలంగా ఉంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా జాతీయులకన్నా శ్వేత జాతీయులలోనే హేతువాద, నాస్తిక వాద దృష్టి ఎక్కువగా ఉందని అది తెలిపింది. 2007లో యువతలో 27 శాతం తమకు మతంతో సంబంధం లేదని ప్రకటిస్తే, 2015 లో అది 35 శాతానికి పెరిగింది.
1928-45 మధ్య పుట్టిన వారిలో క్రైస్తవ మతాన్ని పాటించేవారు 85 శాతం కాగా, అది 1990-96 మధ్య జన్మించిన వారిలో 56 శాతానికి పడి పోయింది. ‘గాలప్ ఇంటర్నేషనల్’ సంస్థ 2012లో చేపట్టిన ప్రపంచ వ్యాప్త సర్వే ప్రకారం యూరోపియన్ దేశాల్లో దేవుడనే భావన లేని జనాభా చాలా ఎక్కువగా ఉన్నది. బ్రిటన్‌లో దేవుడి మీద విశ్వాసాన్ని ప్రకటించిన వారు 37 శాతం మాత్రమే. అది జర్మనీలో 44 శాతం, డెన్మార్క్, నెదర్లాండ్స్‌లలో 28 శాతం ఉన్నారు. ఇక మతాన్ని విశ్వసించేవారు ఫ్రాన్స్‌లో 27 శాతం, ఈస్టోని యాలో 18 శాతం, స్వీడన్‌లో 18 శాతం, చెక్ రిపబ్లిక్‌లో 16 శాతం, నార్వేలో 22 శాతం మాత్రమే. ఇక తూర్పు, దక్షిణాసియా దేశాలకొస్తే చైనాలో 14 శాతం, జపాన్‌లో 16 శాతం, వియత్నాంలో 30 శాతం, హాంగ్‌కాంగ్‌లో 38 శాతం మాత్రమే మతం, దేవుడు అనే భావనలను నమ్ముతున్నారు.
హేతువాదం సత్యాన్వేషణ మార్గం
ప్రపంచమంతటా ఇలా హేతువాద చింతన పెరుగుతుండగా... మన దేశంలో మాత్రం దేవుడి మీద నమ్మకం అత్యధికంగా ఉంది. భారతీయుల్లో 81 శాతం దేవుడిని నమ్ముతున్నట్టు గణాంకాలు వివరిస్తున్నాయి. ముస్లిం దేశాల్లో కూడా అదే పరిస్థితి. ఇరాక్‌లో 88 శాతం, అఫ్ఘానిస్తాన్‌లో 83 శాతం, పాకిస్తాన్ లో 84 శాతం దేవుడు, మతంలో విశ్వాసం కలవారని ‘గాలప్ ఇంటర్నేషనల్’ లెక్క లు చెబుతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఇవే గణాంకాలు, లెక్కలు కొన్ని కఠోర వాస్తవాలను బహిర్గతం చేస్తున్నాయి.
ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించిన, సాధిస్తున్న దేశాలకు మతం మీద, దేవుడి మీద అంతగా పట్టింపు ఉండటంలేదు. స్వశక్తి మీద, భౌతిక పరిస్థితుల మీద అక్కడ ఎక్కువగా ఆధారపడుతున్నట్టు కనిపిస్తున్నది. మూఢత్వం, అంధ విశ్వాసం ప్రజలను శాస్త్రీయత వైపు దృష్టి సారించనివ్వదు. మూఢత్వం అభివృద్ధికి ఆటంకంగా మారడం మాత్రమే కాకుండా, మనుషులను తిరోగమనంలోకి నెట్టివేసే ప్రమాదమున్నది. మన దేశంలో అన్ని మతాలూ రాజకీయ, ఆర్థిక, సామాజిక హోదాను నిలబెట్టుకోవడానికి, తద్వారా ప్రయోజనం పొందడానికి చేయా ల్సినంత కృషి చేస్తున్నాయి. అందువల్లనే ఇతర దేశాలకన్నా అధికంగా మతంపై, దేవుడిపై ఆధారపడే వారి సంఖ్య ఇక్కడ పెరుగుతున్నది. ఇటీవల మీడియా కూడా మత కార్యక్రమాలకు, ఇతర అశాస్త్రీయ కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నది.
ఇటీవల జరిగిన పుష్కరాల తంతు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మతమనేది వ్యక్తిగత విశ్వాసం నుంచి పక్కకు జరిగి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతోంది. అయితే మన దేశం లోనూ శాస్త్రీయంగా, భౌతికవాద దృష్టితో ఆలోచించే వారి సంఖ్య పెరుగు తున్నా వారికి సరైన వేదికలు, కార్యక్రమాలు లేకపోవడం వల్ల సంఘటితం కావడం లేదు. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం సాగదు. అటు పడమటన, ఇటు తూర్పున వీస్తున్న శాస్త్రీయ ధృక్పథ వీచికలు ఇక్కడికీ విస్తరించక తప్పదు. హేతువాదం ప్రశ్నించే తత్వాన్ని, విమర్శనాత్మక దృక్పథాన్ని, సత్యా న్వేషణను నేర్పుతుంది. ప్రశ్నించే గుణమే లేకపోతే సమాజ పురోభివృద్ధి నిలి చిపోతుంది. హేతుబద్ధమైన తర్కాన్ని ఆహ్వానించడమే వర్తమాన ప్రపం చానికి, సమాజాలకు ఉపయుక్తమైనది.
- మల్లెపల్లి లక్ష్మయ్య
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213