‘ప్రముఖుల’తోనే ప్రజలకు తంటా | problems of very important personss | Sakshi
Sakshi News home page

‘ప్రముఖుల’తోనే ప్రజలకు తంటా

Published Wed, Jul 22 2015 11:49 PM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

‘ప్రముఖుల’తోనే ప్రజలకు తంటా - Sakshi

‘ప్రముఖుల’తోనే ప్రజలకు తంటా

కొత్త కోణం
 
పౌరులందరికీ మత స్వేచ్ఛ ఉన్నమాట నిజమే. కానీ మత కార్యక్రమాల్లో ప్రభుత్వం పాత్ర
ఏ మేరకు ఉండాలనేదే సమస్య. మత ఉత్సవాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి.
కానీ ప్రభుత్వమే వాటిని నిర్వహించడం, ముఖ్యమంత్రులు తదితరులు వాటిలో పాల్గొనడాన్నే పునరాలోచించాలి. గోదావరికి ఎగువన నాసిక్‌లో జరుగుతున్న కుంభమేళాలో ప్రముఖులు పాల్గొనరాదని మహారాష్ట్ర నిర్ణయించింది. ప్రజా భద్రతపై అధికారులు దృష్టి కేంద్రీకరించడానికి, తొక్కిసలాటలను నివారించడానికి ఇది అవసరం. తెలుగు ప్రముఖులకు అది పడుతున్నట్టు లేదు.
 
‘‘నా మరణానంతరం నాకు ఏ మత కర్మకాండలు నిర్వహించకూడదని కోరుతున్నాను. అటువంటి విషయాల్లో నాకు ఎలాంటి విశ్వాసమూ లేదు. ఏ రూపంలోనూ అది జరగడానికి వీల్లేదు. అది చిన్నదైనా, పెద్దదైనా నాకు ఇష్టం లేదు. ఇది నా మనస్ఫూర్తిగా చేస్తున్న ప్రకటనని అంతా గుర్తుంచుకోవాలి.’’ ఇది భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రకటన. దాన్ని ఆయన తు.చ. తప్పక పాటించారు కూడా. ప్రభుత్వ కార్యక్రమాల సంద ర్భంగా సాగే మతపరమైన పూజలు, యజ్ఞాలకు సాధ్యమైనంత వరకు ఆయన దూరంగా ఉండేవారు. నెహ్రూ మరణించి యాభై ఏళ్ళు దాటింది. నాటికి నేటికి ప్రపంచమూ, దానితో పాటే మన దేశమూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందింది. అంతరిక్ష విజ్ఞానం నుంచి వైద్య రంగం వరకు ఎన్నెన్నో అద్భుత విజయాలను సాధించింది.

కానీ మనిషి మాత్రం ఇంకా తిరోగామిగానే ఉన్నాడే? అనే బాధ మాత్రం తొలగ లేదు. రాజకీయ నేతలు, మరీ ముఖ్యంగా రాజ్యాంగ బాధ్యతలను మోస్తున్న రాష్ట్రపతులు (కేఆర్ నారాయణన్ మినహా), గవర్నర్లు, పాలనా బాధ్యతలు మోస్తున్న ముఖ్యమంత్రులు మూఢవిశ్వాసాల ప్రచారకులుగా వ్యవహరి స్తున్న తీరు ఆశ్చర్యకరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా, ఆడంబ రంగా జరుగుతున్న గోదావరి పుష్కరాల తంతును చూస్తుంటే నెహ్రూ మరో ఐదు వందల ఏళ్ల తర్వాత పుట్టాల్సినవాడా? లేక మన నే తలు కనీసం ఒకటి, రెండు శతాబ్దాల క్రితం పుట్టినవారా? అని సందేహం కలుగుతోంది.

ప్రచారంపై యావ... ఘోరాలకు తోవ
గోదావరి నది సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిణామా లకు పుట్టినిల్లు. ప్రజల జీవితాలు ఆ నదీ తీరంతో పెనవేసుకున్నాయి. ఏ నది విషయంలోనైనా ఇంచుమించుగా అది అంతే వాస్తవం. ప్రాణాధారమైన నదుల పట్ల ప్రజలకు ఉన్న ప్రేమ, గౌరవాలను భక్తిగా మార్చి స్వార్థ ప్రయోజ నాలకు వాడుకోవడం తరతరాలుగా వస్తున్నది. గతంలో పూజారి వ్యవస్థ ఆ పని చేస్తే. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే తమ స్వీయ రాజకీయ, ఆర్థిక ప్రయోజ నాలకు, కీర్తి ప్రతిష్టలకు వాడుకోవాలనుకుంటున్నారు. కాబట్టే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారగణం యావత్తుకూ పుష్కరాల యావ తప్ప మరేం పట్టకుండా పోయింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. తన పుష్కర పూజా తతంగాన్నంతా డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా మలచి, అంతర్జాతీయ ఖ్యాతి గడిం చాలని ఆశ పడ్డారు. అందువల్లే గంటలకొద్దీ ప్రజలను నిలిపివేసి మరీ సకు టుంబంగా తొలి పుష్కర స్నానమాచరించారు. ఫలితంగా 27 మంది సామా న్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటనపై ఇప్పటికే చాలా విశ్లేషణలు, సమాచారం వెలువడింది. కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళడం లేదు. భారీ ప్రచారానికి, ఏర్పాట్లకు కలిపి తెలంగాణ ప్రభుత్వం రూ. 600 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.1,600 కోట్లు ఖర్చు చేసినట్టు సగర్వంగా ప్రకటించుకున్నాయి. అయినా కనీస సదుపాయాలను సమకూర్చలేకపో యాయి. రాజమండ్రి తొక్కిసలాటలో ఊపిరి సలపక విలవిలాడిన వారికి గుక్కెడు నీళ్లు అందించలేకపోయారు. దాదాపు నెల రోజుల నుంచి మం త్రులు, అధికారులు అందరూ అక్కడే. సచివాలయాల్లో పనులన్నీ దాదాపుగా స్తంభించాయి. అయినా జరగరాని అనర్థం జరిగిపోయింది. లక్షలకొలదీ ప్రజలను తరలి రమ్మన్నవాళ్లకు వారికి తగ్గ ఏర్పాట్లు సరే... అలా జనం వెల్లు వెత్తడం వల్ల తలెత్తగల ప్రజారోగ్య సమస్యలు సైతం పట్టలేదు. కాబట్టే ప్రధాన పుష్కర ఘాట్లన్నిట్లో ఈ కోలీ వంటి బాక్టీరియా, చర్మవ్యా ధులకు, ఎలర్జీలకు కారణమయ్యే కాలుష్యాలు పెరిగిపోయాయి. కనీసం ఇప్పటికైనా ఈ కోలీ ప్రమాదకర స్థాయిల్లో ఉన్న పుష్కర ఘాట్లను స్నానాలకు అనర్హమై నవిగా ప్రకటించి, మూసేయాలి.

లక్షల మంది పాల్గొనే కుంభమేళాలు, పుష్కరాల సందర్భంగా ఇలాంటి అనర్థాలు జరిగిన అనుభవాలు మనకు గతంలోనూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్‌లో 1954 కుంభమేళాలో 50 లక్షల మంది పాల్గొనగా జరిగిన తొక్కిసలాటలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి ప్రధాని నెహ్రూ ఈ దుర్ఘటనపై జస్టిస్ కమలాకాంత్ వర్మ నేతృత్వంలో ఒక కమిషన్‌ని నియమించారు. జనం పోటెత్తే కుంభమేళాల వంటి సమ్మేళనాలకు తగు జాగ్ర త్తలను తీసుకోవాలని ఆ కమిషన్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రము ఖులు, పదవుల్లో ఉన్న రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇటువంటి సమ్మేళనాల్లో పాల్గొనకూడదని సూచించింది. అప్పుడే అధికార యంత్రాంగం స్వేచ్ఛగా ప్రజల భద్రత, రక్షణపై దృష్టిని కేంద్రీకరించగలుగుతుందని స్పష్టం చేసింది. ఈ సిఫారసులపై ఆధారపడే నెహ్రూ... ప్రజాప్రతినిధులు ఇటు వం టి మతపరమైన మేళాల్లో పాల్గొనరాదని కఠిన పదజాలంతో హెచ్చరించారు. అది మన పాలకుల చెవులకు సోకి ఉంటే, రాజమండ్రి ఘోరం జరిగేదే కాదు.

పడకేసిన పాలన... పొంచివున్న పెను ముప్పు
అదలా ఉంచితే, పుష్కర సమయంలో పాలనా వ్యవస్థ పడకేయడం మరో అంశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు నీటి చుక్కలేక, వర్షాభావంతో, పొలాలు బీడువారి తల్లడిల్లుతున్నారు. వారి గోడు వినే దిక్కులేదు. గత రెండు నెలలుగా చినుకులు తప్ప రైతుకి పనికి వచ్చే గట్టి వర్షం ఒక్కసారైనా కురిసింది లేదు. భూమి నిండుగా తడిచింది లేదు. దీనితో ఖరీఫ్ పంటలన్నీ మొలకలుగానే ఎండిపోయాయి. కొన్ని చోట్ల రైతులు ఇంకా భూములు దున్ననేలేదు. గత ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీంతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 2,000 మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడినట్టు రైతు సంఘాలు ఘోషిస్తున్నాయి. తెలంగాణలో అది మరింత ఎక్కువ. ఈ ఏడాది ఇంతవరకు తెలంగాణలోని ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇక ఏపీలోని ప్రకా శం, నెల్లూరు, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో చాలినన్ని వర్షాలు లేవు. ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వర్షాభావ పరిస్థితులు గ్రామీణ యువత మీద తీవ్ర ప్రభావం కలిగిస్తాయి. అందువల్ల రెండు ప్రభుత్వాలు ఇటు దృష్టిని కేంద్రీకరించి, కరువు పరిస్థితులను అంచనావేసి కార్యాచరణను రూపొందించాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు, ఆకలిచావులు పెరిగే ప్రమాదం ఉంది. ఇవేమీ పట్టకుండా గత 20 రోజులుగా పుష్కరాల్లో మునిగితేలుతున్న నాయకగణం జరగరానిది ఏదైనా జరిగాక, పరిస్థితులు చేయిదాటిపోయాక తీరుబడిగా పశ్చాత్తాపపడి లాభం లేదు. రెండు రాష్ట్రాల్లో కలిపి కోటీ యాభై లక్షల మంది నిరుద్యోగులు, అర్ధ నిరుద్యోగులున్నట్టు అంచనా. సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ నిరుద్యోగ యువత గురించి, ఉపాధి కల్పన గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. తెలుగు ముఖ్యమంత్రులకు అదీ పట్టినట్టు లేదు. చెప్పుకుంటూ పోతే, ప్రజల తక్షణ సమస్యలు కోకొల్లలు.

ప్రముఖులు దూరంగా ఉంటేనే మేలు
మత ఉత్సవాలు, కార్యక్రమాలు జరగకూడదని, వాటిలో పాల్గొనకూడదని ఎవరూ అనరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశ ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉంది, అన్ని మతాలకూ సమాన హక్కులున్నాయి. కాకపోతే మత కార్యక్రమాల్లో ప్రభుత్వం పాత్ర ఏ మేరకు ఉండాలనేదే సమస్య. మత ఉత్స వాల్లో పాల్గొనే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి, నిజమే. కానీ ప్రభుత్వమే వాటిని స్వయంగా నిర్వహించడం, ముఖ్యమం త్రులు, మంత్రులతో సహా అంతా పోటీపడి, సరిగ్గా ముహూర్తానికే వాటిలో పాల్గొనడం గురించే పునరాలోచించాలి. గోదావరికి ఎగువనున్న నాసిక్‌లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతోంది. ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు దాన్లో పాల్గొనరాదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చాలా మంచి పరి ణామం. ప్రజా సౌకర్యాలను, భద్రతను విస్మరించి అధికారులు పోలీసులు ప్రముఖుల చుట్టూ చేరడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారు. తొక్కిస లాట జరిగే ప్రమాదముంటుంది. తెలుగు ప్రముఖులకు ఈ విషయాలు పట్టి నట్టు లేవు. రాజమండ్రి దుర్ఘటన తదుపరి ఇకనైనా ప్రముఖులు వెళ్ళకుండా ఉంటే బాగుండునని అంతా భావిస్తుండగా... ఉభయరాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజమండ్రి, భద్రాచలాల్లో రెండు పుష్కర స్నానాలు చేయడం ఆహ్వనించదగినది కాదు.

ప్రముఖులకు కూడా పౌరులందరికీ ఉండే హక్కులన్నీ ఉంటాయి, నిజమే. కానీ మిగతా పౌరుల రక్షణార్థం వారు కొన్నిటిని వదులుకోవాల్సి రావచ్చు. రాజ్యాంగపరమైన గురుతర బాధ్యతలను మోస్తున్న ప్రతినిధులు ఒకరకంగా ప్రజాసేవకులు. వారికి ఒకరు చెప్పాల్సిన అవసరం రాకూడదు. గతంలో ఇటువంటి సందర్భాల్లో కొందరు నేతలు వాటికి హాజరు కాకుం డడమో లేదా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెళ్లిరావడమో చేశారు. ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నట్టు వారికి ప్రజలే ముఖ్యమైతే... వారికి అవకాశమే ఇవ్వకుండా తామే సరిగ్గా మహాముహూర్తానికి ఎందుకు స్నానాలు చేశారు? పుష్కర పుణ్యాన్నంతా తామే మూటకట్టుకోవాలనే అత్యాశతోనేనా? ఇటు వంటి ఎన్నో ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పాల్సి ఉంది. ఏదేమైనా మన ప్రభుత్వాల, నేతల తీరు మారాలి. నెహ్రూ అంతటి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోకపోయినా...ప్రజల రక్షణను, భద్రతను దృష్టిలో పెట్టుకొని తమ ప్రవర్తనను మార్చుకుంటే మంచిది. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు కాపలాదారులుగా ఉండాల్సిన పాలకులు, వారిని ఇబ్బందులకు గురిచేసే విధానాలకు స్వస్తి చెప్పాలి.






మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement