అవినీతి ఈనాటి రాజనీతి
- కొత్త కోణం
‘‘ప్రజాస్వామ్యాన్ని, సామాజిక మనుగడను అవినీతి ధ్వంసం చేస్తుంది. ఇది ప్రజావ్యతిరేకమైనది మాత్రమే కాదు, ప్రజల జీవితాలను దెబ్బతీస్తుం ది. ఆర్థిక వ్యవస్థను, సాంస్కృతిక వారసత్వాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీనిని మొగ్గలోనే తుంచివేయకుంటే, సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను నాశనం చేస్తుంది.’’
సరిగ్గా పదిహేనేళ్ల క్రితం సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక ఇది. దాన్ని ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. అవినీతి నేడు మొక్క కాదు, ఊడలు దిగిన మర్రిలా తయారైంది. సుప్రీంకోర్టు హెచ్చరించినట్టే అది ప్రజా జీవితాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత దిగజార్చింది. దానికి ప్రత్యక్ష ఉదా హరణే తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి ఉదంతం. అది రేవంత్‌రెడ్డి సొంత వ్యవహారమేం కాదు. తన పార్టీ కోసం అధినేత ఆదేశం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి యాభై లక్షల రూపాయలు ఒక సంచిలో వేసుకొచ్చి బేరమాడటం మనందరం టీవీల్లో చూశాం.
అది చిలికి చిలికి గాలివానలా మారింది. ప్రస్తుత రాజకీయాల డొల్ల తనాన్ని, అవినీతి విశ్వరూపాన్ని బయటపెట్టింది. అయితే రాజకీయ పార్టీలు తప్ప, దీన్ని ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ తగి నంతగా పట్టించుకోలేదు. చివరకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా టీఆర్‌ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి.
ఒక్కొక్క ఎమ్మెల్యేకు రెండున్నర కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఇవ్వడానికి పథకం వేసినట్టు, రూ.150 కోట్ల వరకైనా ఖర్చు పెట్టడానికి టీడీ పీ సిద్ధపడినట్టు వార్తలు వచ్చాయి. ఇవేవీ ఎవరినీ కదిలించలేదు. పైగా ఇది ఈ ఒక్క పార్టీయే చేస్తున్నదా? అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ ఇదే విధానాన్ని సాగిస్తున్నా యంటూ సర్దిచెప్పుకుంటున్నారు.
అవినీతే అధికారానికి రాచమార్గం
అయితే ఇలా వందల కోట్లుగానీ లేక యాభై లక్షలే గానీ ఊరికే అలా వచ్చిపడ్డ వేమీ కాదు. వాళ్ళ దగ్గర అల్లాఉద్దీన్ అద్భుత దీపమేమీ లేదు. ఇదొక్కటనే కాదు. గత పదిహేనేళ్ళలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మారిన పరిస్థితులు ఆశ్చ ర్యకరమైనవి. ‘‘1994 ఎన్నికల్లో మా నాయన అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన పెట్టిన ఖర్చు రూ. 15 లక్షలు. నేను 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేశాను. దాదాపు రూ. 15 కోట్ల దాకా ఖర్చయింది’’ అని ఇటీ వల తెలంగాణకు చెందిన ఒక సీనియర్ రాజకీయ నేత వాపోయారు.
ఇక ఏపీలో ఖర్చు ఎంతుంటుందో ఊహించుకోవచ్చు. పార్టీ టికెట్ కోసమే ఒక్కొక్క అభ్యర్ధి కోట్లు చెల్లించాలి. గెలవడానికి మరిన్ని కోట్లు ఖర్చుచేయాలి. ఏండ్ల తరబడి వృత్తి రాజకీయవేత్తలుగా ఉన్నా కొందరు నేతలు ఈ ఖర్చును భరించలేని పరిస్థితి. కాబట్టే గెలుపు గుర్రాల పేరిట కాంట్రాక్టర్లను, వ్యాపార వేత్తలను, రియల్టర్లను రంగంలోకి దింపడం సర్వసాధారణమైంది. గత పదే ళ్లుగా మరో విచిత్రం జరుగుతోంది.
ఏ పార్టీ టికెట్టుపై గెలిచిన అభ్యర్థయినా అర నిమిషంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా మారిపోతున్నారు. అదే మంటే ఎన్నికల్లో ఖర్చు చేసిన కోట్ల రూపాయలను తిరిగి రాబట్టుకోవాలని, తమ వ్యాపారాలు, కాంట్రాక్టులు విస్తరించుకోవాలని అంటున్నారు. ఇప్పడు కోటీశ్వరులుగా ఉన్నవారిలో అత్యధికులు ముప్పై, నలభై ఏళ్ల క్రితం లక్షాధికా రులు కూడా కాదు. కానీ వారే నేడు కోట్లు గుమ్మరించి సీట్లను, ఓట్లను కొని ప్రజాప్రతినిధులు, మంత్రులు కాగలుగుతున్నారు.
నల్లధనమంతా ప్రజాధనమే
ఇటీవలి కాలంలో అవినీతిపై చాలానే అధ్యయనాలు జరిగాయి. వాటిలో చాలావరకు అవినీతికి మూడు ముఖ్య మూలాలను పేర్కొన్నాయి. మొద టిది, ప్రజా పనులుగా చెబుతున్న రోడ్లు, భవనాలు, భారీప్రాజెక్టులు, నీటి పారుదల, విమానాశ్రయాలు, ఓడరేవులు, పారిశ్రామిక సౌకర్యాల కల్పన లాంటి నిర్మాణ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ అవుతోంది. చిన్న పని నుండి భారీ ప్రాజెక్టుల వరకు నిర్మాణ వ్యయంకన్నా అధిక మొత్తం లో టెండర్లను ఖరారు చేస్తున్నారు.
దీని కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో ప్రభుత్వం నుంచి ముందుగానే కాంట్రాక్టర్లు నిధులను రాబడుతు న్నారు. అందులోంచి ప్రభుత్వ పెద్దలకు అందాల్సిన వాటా ముందుగానే అందుతుంది. అంతేకాదు, అంచనా వ్యయం కంటే తక్కువ ఖర్చుతోనే నిర్మా ణాలను పూర్తి చేస్తారు. ఇలా రెండు చేతులా అధిక లాభాలార్జించే కాంట్రాక్టర్లే క్రమంగా రాజకీయ నాయకులుగా మారి, రాజకీయాలపై, పార్టీలపై గుత్తాధి పత్యాన్ని సాగిస్తున్నారు.
ఇటీవల ఈ అవినీతి కింది దాకా విస్తరించింది. పనులు జరిగే ప్రాంతం లోని అధికారులు, సర్పంచ్‌లు మొదలుకొని ప్రజాప్రతినిధులందరికీ వాటా లు వెళ్ళడం సంప్రదాయంగా మారింది. అందుకే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లంతా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బరిలో నిలుస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అడపాదడపా ట్రాన్స్ ఫర్లకు, ప్రమోషన్లకు కొంత డబ్బు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దృష్టి పోస్టింగ్‌ల మీద కేంద్రీకృతమైంది. మంచి పోస్టింగ్‌లకు వేటికవిగా లెక్కలున్నాయి.
ఎక్కువ ధర పలికే పోస్టింగ్ అంటే ఎక్కువగా డబ్బులు రాలే అవకాశమున్న స్థానమని అర్థం. ఇలా ప్రభుత్వ బడ్జెట్ నుండి ఎవరికి అందినంత వారు దోచుకు తింటున్నారు. ప్రభుత్వ రాబడికి ప్రధాన వనరు ప్రజలు చెల్లించే పన్నులే. వస్తువుల మీద వేసే అమ్మకం, కొనుగోలు పన్నులు వాణిజ్య పన్ను లు. ప్రభుత్వ రాబడిలో అవి డెభై శాతం. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకూ, దేశ, రాష్ట్ర సహజ వనరులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వాధినేతలే ఖజానాను కొల్లగొట్టే దొంగలవుతుండటమే విషాదం.
ఇక రెండో అంశం, తరతరాలుగా ప్రజలు కాపాడుకుంటూ వచ్చిన భూమి, అడవులు, ఖనిజాలు, నీళ్ళు, ఇసుక తదితరాలను పెట్టుబడిదారు లకు తక్కువ రేట్లకు అమ్మి, ప్రభుత్వాల పెద్దలు వేల కోట్ల రూపాయలు కమీ షన్ల పేరుతో దిగమింగుతున్నారు. తాజా ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మూడవది, పన్నుల ఎగవేత. ‘‘భారతదేశం అవినీతికి అంతర్జాతీయ చిహ్నం గా మారడానికి కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్‌కంటాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ల అవినీతి, అసమర్థతలే కారణం.
పన్నుల ఎగవేతకు వ్యాపా రుల దగ్గర లంచాలు తీసుకోవడం, సరైన నిఘాను ఉంచకపోవడం వల్ల ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయంలో సగం కూడా రావడం లేదు. ఇలా పన్నుల ఎగవేతతో మిగుల్చుకున్నదే నల్లడబ్బుగా మారుతున్నది.’’ జాతీయ విజిలెన్స్ కమిషనర్‌గా పనిచేసిన విఠల్ ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు మన దేశంలో నల్లధనం మూలాలను వెల్లడిచేశాయి.
‘సంస్కరణలు’ కుంభకోణాలకు రహదారి
స్వాతంత్య్రానంతరం మొత్తం 200లకు పైగా భారీ కుంభకోణాలు జరిగినట్లు అంచనా. వీటిలో 98 శాతానికి పైగా 1990 తరవాత జరిగినవే. ఆర్థిక సంస్క రణల పేరిట దేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను ప్రవేశపెట్టిన తర్వాతనే, వాటి వల్లనే కుంభకోణాలు విపరీతంగా పెరిగిపో యాయనేది స్పష్టమే. రక్షణరంగం కూడా కుంభకోణాల్లో కూరుకుపోవడం దేశ సమగ్రత, భద్రతకు ముప్పును సూచిస్తోంది. ‘‘చాపర్ గేట్’’ పేరు మోసిన హెలికాప్టర్ల కుంభకోణం జాతి యావత్తుని నివ్వెరపరచింది.
ఇందులో ముడుపులు అందుకున్న మన వైమానిక దళాధిపతి త్యాగిపై కేసు కూడా నమోదైంది. అవినీతి కేసును ఎదుర్కొంటున్న మొదటి వైమానిక దళాధిపతి ఈయనే. అలాగే బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను అనుమానించడానికి తగిన ఆధారాలు న్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే మన కుంభకోణాల చరిత్రకు అంతుండదు.
అవినీతిని అరికట్టడానికే నిర్మించుకున్న కొన్ని రాజ్యాంగ సంస్థలు కూడా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), సెం ట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)లూ, రాష్ట్రాల స్థాయిలో అవినీతి నిరోధక సంస్థలు (ఏసీబీ), లోకా యుక్తలు అలాంటివే. ఇన్ని వ్యవస్థలున్నా శిక్షలు కేవలం నూటికి ఆరేనని గణాంకాలు చెబుతున్నాయి. విచారణ సంస్థలు ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండ టం వల్లనే నేరస్తులంతా నిరపరాధులుగా బయటపడుతున్నారనే విమర్శలు న్నాయి. ముఖ్యంగా సీబీఐ కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా మారిపోయిందనే అభిప్రాయం బలపడుతోంది.
ప్రజలే పూనుకోవాలి
ప్రజాస్వామ్య రక్షణలో పాలనా వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజలే ఆ బాధ్యతను తీసుకోవాలని రాజ్యాంగ రచనా సమయంలోనే పలువురు నిపు ణులు చెప్పారు. అవినీతి కుంభకోణాలలో ప్రభుత్వాల పెద్దలే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో బాధ్యులు అవుతున్నందున ప్రజలే అవినీతిని అరికట్టడానికి పూనుకోవాలి. పౌరసమాజం రాజకీయాలకు అతీతంగా సంఘటితమై నూతన తరహాలో ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడపాల్సి ఉంది.
ప్రభు త్వం ఖర్చుపెట్టే ప్రతి పైసా ప్రజలకు లెక్క తెలిసేలా పూర్తి పారదర్శకతను పాటించాలని డిమాండ్ చేయాలి. ప్రభుత్వం ఎవరికి ఏయే పరిశ్రమలు, గనులు కేటాయిస్తున్నదనే విషయాలను, దానివల్ల ఒనగూరే ప్రయోజనాలను ఎప్పటికప్పుడు బహిరంగం చేసేలా ఒత్తిడి చేయాలి. ప్రభుత్వానికి, పార్టీలకు వెలుపల ఉన్న పౌరసమాజం, ప్రజా సంఘాల పాత్ర దీనిలో ఎక్కువగా ఉం డాలి. అప్పుడు మాత్రమే అవినీతికి అంతం పలికే రోజులొస్తాయి.
- మల్లెపల్లి లక్ష్మయ్య
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213