దేవుడి పేరుతో రాజకీయం
ఆధ్యాత్మికత కన్నా ఆర్భాటాలు, ప్రచారానికే ప్రాధాన్యం
పుష్కరాలను ఈవెంట్‌గా మార్చేసిన ముఖ్యమంత్రి
* వ్యక్తిగత ప్రచారం, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం
* దేవాలయాలు కూల్చివేసి ఆహ్వానాల పేరిట హడావుడి
* పుష్కరాల పనుల్లో కోట్ల రూపాయల అవినీతి
* టెండర్లు లేకుండా అస్మదీయులకు నామినేషన్లపై కట్టబెట్టిన వైనం
* పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేతకు ఆహ్వానంపై విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతీ అంశాన్నీ తన ప్రచారానికి ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర పుష్కరాలను సైతం వ్యక్తిగత ఈవెంట్‌గా మార్చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నిన్నా మొన్నటిదాకా రాజధాని అమరావతి, పట్టిసీమలకు పదేపదే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపి అనుకూల మీడియాలో ఆర్భాటంగా ప్రచారం చేయించుకున్న చంద్రబాబు పుష్కరాల్లోనూ అదే తీరును కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
విజయవాడలో దేవాలయాలను అర్ధరాత్రి అడ్డగోలుగా కూలగొట్టిస్తూ, అమరావతిలో సదావర్తి సత్రం భూములను అస్మదీయులకు అప్పనంగా అప్పగిస్తూ, పుష్కరాల పనుల పేరుతో అస్మదీయులకు కోట్ల రూపాయలు దోచిపెడుతూ.. అనుకూల మీడియాలో మాత్రం తానో గొప్ప భక్తుడిగా ప్రచారం చేయించుకుంటున్నారని సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాలను ఈవెంట్‌లా మార్చివేసి, సినీ దర్శకులు బోయపాటి శ్రీనుకు బాధ్యతలు అప్పగించడం... చంద్రబాబు ప్రచారం కోసం తీసిన షూటింగ్ వల్ల జరిగిన తొక్కిసలాటలో 29మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
ఆ ప్రమాదం నుంచి కూడా చంద్రబాబు పాఠాలు నేర్చుకోలేదని, ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా పుష్కరాల్లోనూ మళ్లీ అదే బోయపాటి శ్రీనుకు పుష్కర ప్రారంభోత్సవ ఏర్పాట్లు, షూటింగ్ బాధ్యతలను అప్పగించడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయితే చంద్రబాబు ప్రచార యావ, గత ఏడాది ప్రమాదం మరచిపోని ప్రజలే తొలిరోజు పుష్కర స్నానాలకు దూరంగా ఉండటం గమనార్హం. పుష్కరాలకు ఆహ్వానం పేరుతో చంద్రబాబు రాజకీయాలకు పాల్పడుతున్నారని, తన ప్రచారంకోసం ఆఖరుకు దేవుణ్ని కూడా వాడేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది.
నిజంగా భక్తి ఉంటే..: పుష్కరాల పేరుతో చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా నాటకమేనని, ప్రచారం కోసం చేస్తున్న ప్రహసనమేనని సోషల్ మీడియాలో ఫొటోల సాక్షిగా విమర్శిస్తున్నారు. పుష్కరాల పేరుతో విజయవాడలో దేవాలయాలను కూలగొట్టించడమే ఆయన భక్తి ప్రపత్తులకు ప్రత్యక్ష నిదర్శనమని ఎద్దేవా చేస్తున్నారు. పుష్కర ఏర్పాట్లకు దేవాలయాలు అడ్డంకి అనుకుంటే సంప్రదాయికంగా పూజలు జరిపించి విగ్రహాలు తీసి మరోచోట ప్రతిష్టించవచ్చు. కానీ దేవాలయ బోర్డు సభ్యులను సంప్రదించకుండా అర్ధరాత్రి దౌర్జన్యంగా దేవాలయాలను కూలగొట్టించడం ఏ తరహా భక్తికి నిదర్శనమని ప్రశ్నిస్తున్నారు.
అంతటితో ఆగకుండా మసీదులు, చర్చిలపైన కూడా కన్నేశారని.. చివరకు కోర్టు స్టే వల్ల కూల్చివేతలు నిలిచిపోయాయని ఉదాహరిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో తాను చేసిన ఆర్భాటం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు మరణించినా చంద్రబాబు తీరులో మార్పు రాలేదని విమర్శిస్తున్నారు. కృష్ణా పుష్కరాల ప్రారంభంలోనూ ఆధ్యాత్మికత కంటే ఆర్భాటాలు, షూటింగ్‌లు, బాణసంచా పేలుళ్లకే ప్రాధాన్యమివ్వడంపై పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు భక్తి కేవలం ప్రచారం కోసమేనని... పలు సందర్భాల్లో షూ విడవకుండా కార్యక్రమాలు నిర్వహించడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.
ఇక అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన భూములను అతి తక్కువ ధరలకు అస్మదీయులకు అప్పగించడం బాబు భక్తికి అద్దం పడుతోందంటున్నారు. పాపాలు చేసేవారే దేవాలయాలకు వస్తారంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఇప్పుడు భక్తి పేరుతో చేస్తున్నవన్నీ ప్రచారం కోసమేనని విమర్శిస్తున్నారు. ఆఖరుకు హారతులను కృష్ణానది అభిముఖంగా కాకుండా వెనక్కు తిరిగి ఇవ్వడం ఆచార విరుద్ధమని ఆధ్యాత్మిక వాదులు మండిపడుతున్నారు.
నామినేషన్లపై పనులు...
పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యం కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. కానీ ఆ పేరుతో వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ వారికి దోచిపెట్టడం తెలుగుదేశం ప్రభుత్వానికే చెల్లిందని అధికార వర్గాలు సైతం విమర్శిస్తున్నాయి. పుష్కరాలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయో ఏడాది ముందే తెలుసు. ఆ మేరకు పుష్కర పనులకు టెండర్లు పిలిచి తక్కువ కోట్ చేసిన వారికి పనులు అప్పగించాలని తాము చెబుతున్నా... ముఖ్యమంత్రి చివరి వరకూ పనులకు అనుమతులివ్వలేదని చెబుతున్నారు.
చివరకు గడువు దగ్గర పడ్డాక సమయంలేదంటూ టెండర్లు పిలవకుండా నామినేషన్లపై కోట్ల రూపాయల పనుల్ని అస్మదీయులకు కట్టబెట్టేశారని ఒక ముఖ్య అధికారి తెలిపారు. గోదావరి పుష్కరాల్లో నామినేషన్లపై పార్టీ నేతలకు పనులు కట్టబెట్టిన ముఖ్యమంత్రి కృష్ణా పుష్కరాల్లోనూ అదే రిపీట్ చేశారని ఆయన విమర్శించారు. దాని ఫలితంగానే పుష్కరాలు ప్రారంభమయ్యేంత వరకూ పనులు జరుగుతున్నాయని, నాణ్యతకు తిలోదకాలిచ్చి చివరి నిమిషంలో అరకొరగా పనులు పూర్తి చేశారని ఆయన చెప్పారు.
ఆహ్వానాల పేరుతో రాజకీయం...
12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ఆహ్వానాల పేరుతో హడావుడి చేయడంపై విమర్శలు వినవస్తున్నాయి. రాష్ట్రపతిని, ప్రధానిని మర్యాద పూర్వకంగా పిలవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ బాబు తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం, రాజకీయ అవసరాల పరిరక్షణ కోసం, పరిచయాలు పటిష్టం చేసుకోవడం కోసం తనకు అవసరమనుకున్న వారినే స్వయంగా ఆహ్వానించడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద, చిన్న నటులందరికీ పుష్కరాలకు ముందే ఆహ్వానాలు పంపించిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించే విషయంలో ఎలాంటి ప్రొటోకాల్ పాటించలేదని వైఎస్సార్‌సీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. శుక్రవారం జగన్ నగరంలో లేడన్న విషయం తెలిసీ మంత్రులను పంపించడం, తాము ఆహ్వానించడానికి వెళితే జగన్ లేడంటూ తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకోవడం చంద్రబాబు దిగజారుడు ప్రచారానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
విపక్ష నేత అపాయింట్‌మెంట్ తీసుకోకుండా మంత్రులు ఎలా వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్‌కు ఆహ్వానం అందజేయడానికి వారం రోజులుగా అపాయింట్‌మెంట్ కావాలని చినరాజప్ప ప్రయత్నిస్తే దొరకలేదని రావె ల చెప్పడం, అపాయింట్‌మెంట్ లేకుండా శుక్రవారం రాత్రి జగన్ ఇంటి వద్దకు మీడియాతో వచ్చి హడావుడి చేయడం, శనివారం ఉదయం జగన్ సాదరంగా స్వాగతించి మర్యాద చేసినా బయటకు వచ్చి విమర్శలు చేయడంపై మండిపడుతున్నారు.
ఆహ్వానం విషయంలో అధికార పార్టీ, మంత్రి చెప్పినవన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. పుష్కర ఆహ్వానాలనూ రాజకీయం చేయడం అధికార పార్టీకి, సీఎంకు తగదని అంటున్నారు. పుష్కరాలు మొదలయ్యాక జగన్‌కు ఆహ్వానం పంపించడం ప్రభుత్వపరంగా తప్పిదమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.