సాక్షి ప్రతినిధి, కడప: అవకాశం ఉంది అనతి కాలంలో సొమ్ము చేసుకోవచ్చు.. స్వల్ప మార్పులు చేర్పులు చేస్తే లక్షలు దండుకోవచ్చు.. చేతివాటం ప్రదర్శిస్తే ఏకంగా ఉద్యోగాలు స్వాధీనం చేసుకోవచ్చు అని కొందరు అధికారులు దురాలోచన చేశారు. జిల్లాలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వ్యవహారంలో విద్యాశాఖ పీకల్లోతు ఆరోపణల్లో కూరకపోగా, కలెక్టరేట్ యంత్రాంగం పాత్ర సైతం మెండుగా ఉన్నట్లు బయటపడుతోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతివాటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాబితా ఆధారంగా అభ్యర్థులతో రాయబేరాలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకనుగుణంగానే అర్హుల జాబితాలో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం.
జిల్లాలో బోగస్ కలకలం
ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీలో బోగస్ సర్టిఫికెట్ల బాగోతం జిల్లాలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కడప, మైలవరం ఎంఈఓలు నాగమునిరెడ్డి, మస్తాన్‌రెడ్డిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంట్లో మరికొందరు కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తేలుకుట్టిన దొంగల మాదిరిగా విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈమొత్తం వ్యవహారంపై ఈనెల 17న ‘బోగస్ బాగోతం’ అంటూ సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఏడవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు 600కు 598 మార్కులు వచ్చినట్లు సర్టిఫికెట్లతో దరఖాస్తులు చేసుకున్నారు. రాయచోటి ప్రాంతంలో మూతపడిన ఓ పాఠశాల నుంచి పెద్దఎత్తున సర్టిఫికెట్లు పొందినట్లు తెలుస్తోంది. దాదాపు 66మందికి 5వతరగతి, 7వతరగతి పాస్ అయినట్లు సర్టిఫికెట్లు అందజేసినట్లు సమాచారం. అలా పొందిన వారే మెరిట్ జాబితాలో వచ్చిచేరినట్లు తెలుస్తోంది. రాయచోటిలోని వాణి పాఠశాల, బి.మఠంలోని దీప్తి పాఠశాల నుంచి ఇలా సర్టిఫికెట్లు జారీ అయ్యినట్లు తెలుస్తోంది. ఇలా కొందరు హెచ్‌ఎంలు ఇష్టారాజ్యంగా మార్కులు జాబితా అందించినట్లు సమాచారం.
తొలిదశ విచారణలో నిర్లక్ష్యం
ఎస్సీ, ఎస్టీ ఆఫీసు సబార్డీనేట్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వ్యవహారం తెరపైకి రావడంతో ఇబ్బడిముబ్బడిగా బోగస్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. 61 ఖాళీలకు 25,373 దరఖాస్తులు చేరాయి. తొలిదశలో ఎంఈఓలు పర్యవేక్షించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. కొందరు పైరవీలకు తలొగ్గిని కారణంగా నకిలీలు అలాగే ఉండిపోయారు. ఈవ్యవహారాన్ని ఉదాహరణలతో సహా సాక్షి వెలుగులోకి తెచ్చింది. కలెక్టర్ కెవి సత్యనారాయణ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో డీఈఓ ప్రతాప్‌రెడ్డి నేతత్వంలో రెండవమారు విచారణ చేయించారు. అసలు విషయం బహిర్గతం కావడంతో కడప, మైలవరం ఎంఈఓలు నాగమునిరెడ్డి, మస్తాన్‌రెడ్డిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాగా ఉప విద్యాశాఖాధికారి ఒకరు పెద్దఎత్తున ఎంఈఓలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ కీలక భూమిక
డీఈఓ కార్యాలయం నుంచి మెరిట్ జాబితా రూపొందించే క్రమంలో వచ్చిన జాబితాను కాకుండా తన ఇష్టానుసారం ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ పొందుపర్చినట్లు తెలుస్తోంది. కలెక్టరేట్ కార్యాలయంలోని ఆపరేటర్ తన చేతివాటం చూపినట్లు సమచారం. మెరిట్ అభ్యర్థుల వద్దకు తన వారిని పంపించి, మీకు ఉద్యోగం గ్యారంటీ, అంతా మేము చూసుకుంటాం. మాకు ఏమిస్తారని బేరం పెట్టినట్లు సమచారం. ఈక్రమంలో రామాంజనేయపురంలో ఉన్న మహిళా అభ్యర్థిని వద్దకు దళారీని పంపినట్లు తెలుస్తోంది. తన భర్త అనారోగ్యంతో ఉన్నారు, తాను డబ్బు ఇచ్చుకునే పరిస్థితి లేదని అమె తేల్చిచెప్పినట్లు సమాచారం. లిస్టులో లేని పేర్లను కూడా ఇదే ఆపరేటర్ ఎంటర్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈక్రమంలో కూడా అనర్హులు వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
టీడీపీ నేతలు సైతం ఒత్తిడి
బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నాయకులు సైతం పెద్దఎత్తున ఒత్తిడి చేసినట్లు సమాచారం. విద్యాశాఖ ఉన్నతాధికారిపై మైదుకూరు ప్రాంత నాయకుడు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. తన నియోజకవర్గ పరిధిలోని వారందరికీ ఉద్యోగాలు దక్కాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అత్యధిక ప్రోటోకాల్ ఉన్న నాయకుడు సైతం పైరవీలు చేసినట్లు సమాచారం. తన సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మెరిట్ జాబితాలో ఉన్నవారి పేర్లు...వారి మార్కులే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 1995–2000 ప్రాంతంలో పబ్లిక్ పరీక్షలో 600 మార్కులకు 590పైగా మార్కులు పొందిన ఎస్టీలు తర్వాత అర్ధంతరంగా చదువులకు దూరం కావడమే చూస్తే ఈ వ్యవహారం ఓ బోగస్ అని తేటతెల్లం అవుతోందని అర్హులైన అభ్యర్థులు అంటున్నారు. లోతుగా పరిశీలిస్తే ఈవ్యవహారంలో మరికొందరి బాగోతం బహిర్గతం కానుందని పలువురు పేర్కొంటున్నారు.
కలెక్టరేట్‌లోనూ బోగస్ బాగోతం
Published Thu, Sep 22 2016 11:52 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement