రిజర్వేషన్ల స్ఫూర్తిని మరిచారా? | Mallepalli Laxmaiah writes on reservations | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల స్ఫూర్తిని మరిచారా?

Published Thu, Feb 9 2017 12:34 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

రిజర్వేషన్ల స్ఫూర్తిని మరిచారా? - Sakshi

రిజర్వేషన్ల స్ఫూర్తిని మరిచారా?

కొత్త కోణం
రాజకీయ రిజర్వేషన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్నది సుస్పష్టం. ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు ఆయా పార్టీల, వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప, తమ సామాజిక వర్గాల ప్రయోజనాలకు కాదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పథకాలు, కార్యక్రమాల రూపకల్పన బాధ్యతను ఆ వర్గాల శాసనసభ్యులకే అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది దేశంలోనే తొలి ప్రయత్నం. తొలి సమావేశానికి హాజరైన ప్రతిపక్షాలు తదుపరి సమావేశాలను బహిష్కరించడం దురదృష్టకరం.

భారత కుల వ్యవస్థ సృష్టించిన అసమానతలు, అవమానాలు, వివక్ష ఇంకా కొనసాగుతున్న ఈ వ్యవస్థలో రిజర్వేషన్లే లేకపోతే? అనే ప్రశ్న మనల్ని భయకంపితుల్ని చేస్తుంది. ఉన్న  రిజర్వేషన్లు సరిగా అమలు కాకపోతే ఎలా? అనే మరో సమాధానం లేని ప్రశ్నా ఎదురవుతుంది, నిజమే. కానీ, రిజర్వేషన్ల ఫలితాలను అనుభవిస్తున్న వారు తాము ఎవరికి ప్రాతినిధ్యం వహించాలో వారిపట్ల, దేనికి కట్టుబడి ఉండాలో దానిపట్ల నిబద్ధతతో పనిచేయకపోతే? అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం కావాలి.

అణచివేతకు గురవుతున్న  సామాజిక వర్గాలకు చెందినవారు రిజర్వేషన్ల వల్ల అధికారంలోకి లేదా పదవుల్లోకి వచ్చాక తమ వర్గాల ప్రయోజనాలను విస్మరించడం అత్యంత ప్రమాదకరం. అదే జరిగితే మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాసతో సాధించుకున్న రిజర్వేషన్లు సత్ఫలితాలనివ్వవు అనడానికి నేటి పరిస్థితులే సాక్ష్యం. విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందుతున్నవారు వాటిని సాధించుకోవడానికి జరిగిన కృషిని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ చర్చ పట్ల గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శించడమే తప్ప, అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వారు గుర్తించడం లేదు. అసలు రిజర్వేషన్ల ప్రాధాన్యతగానీ, వాటి విస్త్రుత ప్రయోజనంగానీ వారిలో అత్యధికులకు తెలియదు. ఫలితంగా, రిజర్వేషన్లు పాక్షిక ఫలితాలను ఇస్తున్నాయే తప్ప, ఆశించిన స్థాయి ప్రయోజనాలను కల్పించడం లేదు.  

ప్రత్యేక రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరు
దళితులకు, ఆదివాసీలకు రిజర్వేషన్లు, ప్రత్యేక హక్కుల ప్రక్రియకు  1949 నవంబర్‌లో చట్టబద్ధత వచ్చింది. అది 30 ఏళ్ల మేధో పోరాటం ఫలితం. అదీ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తానే ఒక సైన్యమై సాగించిన అవిశ్రాంత సమర ఫలం. ఏప్రిల్, 14, 1891న జన్మించిన అంబేడ్కర్‌ డిగ్రీ పూర్తి చేశాక, బరోడా రాజు సాయాజీరావు గైక్వాడ్‌ సహకారంతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. అమెరికాలో అంబేడ్కర్‌ గురువైన జాన్‌ డ్యూ   బోధించిన ప్రజాస్వామ్యమనే అంశం ఆయన భావి జీవితాశయానికి అంకురార్పణ చేసింది. తన దేశంలోని దుర్భర సామాజిక పరిస్థితులను మార్చే మార్గాన్ని, అసమానతలను రూపు మాపే çసమరానికి దిశానిర్దేశం చేసింది. 1917 జూన్‌లో భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఆయన ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టారు.

భారత ప్రభుత్వ విధానంలో తీసుకురావాల్సిన మార్పులపైlబ్రిటిష్‌ ప్రభుత్వం నియమించిన సౌత్‌బరో కమిటీ ముందు అంబేడ్కర్‌ మొట్టమొదటిసారిగా తన వాదనలు వినిపించారు. ‘‘అంటరానివారిని ఈ దేశంలో హీనులుగానే చూస్తున్నారు. వీళ్లు ఎటువంటి రాజకీయ ప్రక్రియలో భాగం కాలేకపోతున్నారు’’ మతాచారాలు, సాంప్రదాయాలు వీరిని అమానవీయ పద్ధతుల్లో చూస్తున్నాయి. ప్లేటో చెప్పిన బానిసత్వ నిర్వచనం ఇక్కడ అంటరాని కులాలకు వర్తిస్తుంది’’ అన్నారాయన. కేవలం 28 ఏళ్ల వయసులో అంబేడ్కర్‌ చేపట్టిన  మొట్టమొదటి రాజకీయ కార్యాచరణ ఇది. అంటరాని కులాలకు రాజకీయ రంగంలో నిజమైన ప్రాతినిధ్యం కావాలని వాదించారు. అప్పటికే ముస్లింలకు, ఆంగ్లో ఇండియన్లకు ఉన్న వి«ధంగా ప్రత్యేక ప్రాతినిధ్యం కోరారు.

అప్పట్లో విద్యావంతులకు, పన్నులు కట్టేవారికి, జమీందారులకు, భూ యజమానులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆ రోజుల్లో బొంబాయి ప్రెసిడెన్సీలో అంటరాని కులాలకు చెందిన గ్రాడ్యుయేట్‌ ఒక్కరే ఉండేవారు. అంటే వారికి ఓటు హక్కు లేదనే చెప్పాలి. అందువల్ల ప్రభుత్వమే ఎక్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు అంటరాని కులాల నుంచి ప్రతినిధులను నామినేట్‌ చేయాలని అంబేడ్కర్‌ కోరారు. 1927లో   బొంబాయి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా నామినేట్‌ అయ్యారు. కౌన్సిల్‌ సమావేశాల్లో అంబేడ్కర్‌ బడ్జెట్‌ కేటాయింపులు, విద్యాచట్టం, వారసత్వ ఉద్యోగాల చట్టం తదితర అంశాలను చాలా లోతుగా చర్చించారు.

ఈ చర్చలకు సంబంధించి ముఖ్యంగా రెండు అంశాలను ప్రస్తావించాలి. ఒకటి, గ్రామ స్థాయి న్యాయస్థానాలను ఏర్పాటు చేసి, వాటికి గ్రామాధికారులను న్యాయమూర్తులుగా నియమించాలని చేసిన ప్రతిపాదనను ఆయన  తీవ్రంగా వ్యతిరేకించారు. వాటికి తీర్పులిచ్చే అధికారాన్ని ఇవ్వడాన్ని ఆయన మనుధర్మంగా అభివర్ణించారు. గ్రామంలో జరిగే నేరాలపై ఇచ్చే తీర్పులు కులాన్ని బట్టి ఉంటాయని, అందువల్ల గ్రామస్థాయి న్యాయవ్యవస్థ సరిౖయెంది కాదని వాదించారు. ఇక రెండవది, 1927లోనే ఆయన   రెసిడెన్షియల్‌ పాఠశాలల వ్యవస్థను బొంబాయి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో ప్రతిపాదించారు. అంటరాని కులాల పిల్లల విద్యార్జనకు వారు నివసించే పరిసరాలు అనుకూలంగా ఉండవని, వారికి ప్రత్యేక వసతితో కూడిన  విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

దళితుల రాజకీయ ప్రాతినిధ్యానికి నాడే  తూట్లు
భారత దేశానికి స్వాతంత్య్రం ఇస్తే ఎటువంటి రాజ్యాంగం రూపొందించాలి?  ఎటువంటి ప్రభుత్వ విధానం ఉండాలి? అనే అంశాలపై 1928లో నియమించిన సైమన్‌ కమిషన్‌ ముందు కూడా అంబేడ్కర్‌ అంటరాని కులాల రాజకీయ భాగస్వామ్యం, ప్రాతిని«ధ్యాలను బలంగా ప్రతిపాదించారు. ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు గానీ, ప్రభుత్వ పథకాలు గానీ అంటరాని కులాలకు అందుబాటులోనికి రావాలంటే, ఆ కులాలకు చెందిన అధికారులు ఉంటే తప్ప న్యాయం జరగదని వివరించారు. అంటరాని కులాలకు కూడా భూములు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే... ఆధిపత్య కులాలకు మంచి భూములు ఇచ్చి, అంటరాని కులాలకు పనికిరాని భూములు ఇచ్చారని అంబేడ్కర్‌ సోదాహరణంగా వివరించారు. సార్వజనీన ఓటింగ్‌ అవసరాన్ని సైతం నొక్కి చెప్పారు.

దీని తర్వాత జరిగిన మరొక ముఖ్యమైన ఘట్టం 1930–31 లండన్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశాలు. రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌కి అంబేడ్కర్‌ను అంటరాని కులాల ప్రతినిధిగా బ్రిటిష్‌ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన గాంధీజీ తప్పు పట్టారు. అంటరాని కులాలకు కూడా కాంగ్రెసే నాయకత్వం వహిస్తున్నదని వాదించారు. అంబేడ్కర్‌ ప్రతిపాదించిన ప్రత్యేక ఓటింగ్‌ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే బ్రిటిష్‌ ప్రభుత్వం మాత్రం అంబేడ్కర్‌ వాదనను అంగీకరించి ‘కమ్యూనల్‌ అవార్డు’ పేరిట అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్‌ను, ఎన్నిక విధానాన్ని ప్రకటించింది. దాన్ని వ్యతిరేకించిన గాంధీజీ దాని అమలును నిలిపివేయాలని ఆమరణ నిరాహార దీక్షకు సైతం దిగారు.

కమ్యూనల్‌ అవార్డును రద్దు చేయకపోతే గాంధీజీ ప్రాణాలకు ముప్పు ఉన్నదంటూ  ఆయనతో అంబేడ్కర్‌ ఒక ఒప్పందానికి రావాలని ఒత్తిడి చేశారు. అందుకు అంగీకరించకపోతే, ఆధిపత్య కులాలు, మైనారిటీగా ఉన్న అంటరాని కులాలపై దాడులకు పాల్పడతాయని జంకిన అంబేడ్కర్‌ ‘పూనా ఒడంబడిక’కు అంగీకరించారు. కమ్యూనల్‌ అవార్డు ప్రకారమైతే, దళిత ప్రజా ప్రతినిధులను దళితులే ఎన్నుకునే అవకాశం ఉండేది. పూనా ఒప్పందం ప్రకారం రిజర్వుడ్‌ నియోజకవర్గాల విధానం వచ్చింది. దాన్నే 1935 భారత చట్టంలో పొందుపరిచారు. దాని ప్రకారం 1937లో మొదటిసారి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇప్పటిలాగానే దళితులు సహా అందరూ ఓటెయ్యాలి. ఫలితంగా అంటరాని కులాల రిజర్వుడు నియోజకవర్గాల నుంచి  కాంగ్రెస్‌ అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందారు. గాంధీ వల్ల, కాంగ్రెస్‌ వల్ల అంటరాని కులాల జరిగిన ఈ నష్టాన్ని వివరిస్తూ అంబేడ్కర్‌ ఓ పుస్తకం రాశారు.

ప్రత్యేక ఓటింగ్‌ విధానం మాత్రమే అంటరాని కులాలకు న్యాయం చేస్తుందని అంబేడ్కర్‌ భావించారు. 1946లో ప్రారంభమైన రాజ్యాంగ సభ రచనలో దాన్ని మళ్లీ ప్రతిపాదించారు. కానీ కాంగ్రెస్‌ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. 1935 చట్టంలో ఉన్న రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ లాంటి వాళ్లు ప్రయత్నించారు. కానీ అంబేడ్కర్‌ సాగించిన అంతర్గత పోరాటం ఫలితంగా రిజర్వేషన్లను కొనసాగించడానికి చివరకు అంగీకరించారు. ఎట్టకేలకు 1949 ఆగస్టు 24, 25 తేదీల్లో జరిగిన రాజ్యాంగ సభ చర్చల అనంతరం ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ల హక్కు లభించింది.

మీరే నిర్ణయాలు తీసుకోమంటే కాదంటారా?
అయితే గత 67 ఏళ్ల అనుభవంలో రాజకీయ రిజర్వేషన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్నది సుస్పష్టం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు ఆయా పార్టీల ప్రయోజనాలకు, వ్యక్తిగత ప్రయోజనా లకు ప్రాధాన్యం ఇస్తున్నారే కానీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రజల ప్రయోజనాలకు కాదు. 1956, మార్చి 18న ఆగ్రాలో జరిగిన బహిరంగ సభలో అంబేడ్కర్‌ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ రూపకల్పనలో తెచ్చిన మార్పుల దృష్ట్యా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టానికి సవరణలను ప్రతిపాదిం చారు. దానికన్నా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పథకాలు, కార్యక్రమాల రూపకల్పన చేసే బాధ్యతను ఎస్సీ, ఎస్టీ శాసన సభ్యులకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇటువంటి ప్రయత్నం తొలిసారి అని చెప్పొచ్చు.

మొదటి సమావేశానికి హాజరైన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తర్వాత జరిగిన సమావేశాలను బహిష్కరించారు. ఆయా పార్టీల నాయకత్వాల ఆదేశాలే అందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాల పట్ల  ప్రతిపక్షంలో ఉన్నవారికి విమర్శనాత్మక దృక్పథం ఉండటం ఏ మాత్రం తప్పు కాదు. కానీ ఇది ఎస్సీ, ఎస్టీల సమస్యలకు ఒక పరిష్కార మార్గం. అందులో తప్పులుంటే విమర్శించవచ్చు. లోపాలను ఎత్తి చూపవచ్చు. కానీ ప్రభుత్వమే ముందుకు వచ్చి, మీ సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం మీరే నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు అవి సానుకూలంగా స్పందించి ఉండాల్సింది. ఆయా పార్టీల నాయకత్వాలు కూడా రిజర్వేషన్ల స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. అంబేడ్కర్‌ దశలవారీగా ముప్ఫై ఏళ్లు సాగించిన పోరాటాన్ని, తద్వారా సా«ధించుకున్న  రాజకీయ రిజర్వేషన్ల స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి.

-మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 97055 66213

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement