ప్రజలందరికీ ఓటుహక్కు కోసం పోరాడిన బాబాసాహెబ్ అంబేడ్కర్ సార్వత్రిక ఓటింగ్ హక్కు ప్రాథమిక హక్కుల్లో ఉండాలని ప్రతిపాదించారు. కానీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లాంటి వాళ్ళు ఒప్పుకోకుండా ఆర్టికల్ 326గా ఉంచారు. దాని ఫలితాన్ని మనం ఈనాటికీ అనుభవించాల్సి వస్తోంది. ఆ ఒక్కతప్పిదం కారణంగానే అధికారపక్షం ఇష్టారాజ్యంగా ఓట్లను గల్లంతు చేసే పరిస్థితులేర్పడ్డాయి. ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే కులం పేరుతోనో, మతం పేరుతోనో, తమ వర్గం కాదనో, తమ పార్టీకి చెందిన వాళ్ళు కారనో అవలీలగా వేల సంఖ్యలో ఓట్లను గల్లంతుచేసే దుస్సాహసానికి ఒడిగట్టేవారు కాదు.
మగధ రాజ్యంలోని రాజగృహంలో విశ్రాంతి తీసుకొంటున్న శాక్యముని గౌతమ బుద్ధుని దగ్గరికి మగధ దేశరాజు ప్రసేనజిత్తు తన ప్రధాన వస్సకరను పంపించారు. ‘‘వజ్జి రిపబ్లిక్ మీద దాడిచేసి వాళ్ళకు తగు గుణపాఠం చెప్పాలని ప్రసేన జిత్తుకు ఆలోచన ఉందని, ఆ విష యమై మీ సలహా కావాలని రాజు కోరుతున్నారు.’’ అని వస్సకర బుద్ధునితో ప్రస్తావించారు. వజ్జి రిపబ్లిక్ స్వతంత్రంగా పాలన సాగి స్తున్నది. అందువల్ల దానిని జయించి, మగధలో కలుపుకోవాలని ప్రసేన జిత్తు పథకం వేశారు. వస్సకర అడిగిన సలహాకు గౌతమ బుద్దుడు నేరుగా సమాధానం చెప్పలేదు కానీ తన ప్రథమ శిష్యుడైన ఆనందునితో చర్చించాడు. ఈ çసందర్భంగా గౌతమ బుద్ధుడు ఆనందుడిని ఏడు ప్రశ్నలు అడిగాడు.
అవి... 1) వజ్జి రిపబ్లిక్ ప్రజలు క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతుంటారా? 2) ఏకపక్షంగా కాకుండా చర్చల ద్వారా సమష్టి నిర్ణయాలు తీసుకుంటారా? 3) మోసంతో కాకుండా, మంచి మార్గంలో వ్యాపారాలను, వృత్తులను సాగిస్తున్నారా? 4) ఒకసారి సమష్టిగా తీసు కున్న నిర్ణయాలను ఉల్లంఘన లేకుండా అమలు చేస్తున్నారా? 5) పెద్దలను గౌరవించి, వారి మాటలకు విలువనిస్తున్నారా? పూర్వకాలం నుంచి తమ పెద్దలు నిర్మించిన ప్రార్థనామందిరాలను కాపాడుకుంటు న్నారా? 6) మహిళలనూ, పిల్లలనూ గౌరవిస్తూ, బాధ్యతగా చూసుకుం టున్నారా? 7) జ్ఞానులకు, గురువులకు రక్షణ కల్పిస్తూ, వారిని గౌర విస్తూ వారు సూచించిన మార్గాలను అనుసరిస్తున్నారా? అని బుద్దుడు, ఆనందుడిని ప్రశ్నించారు. దానికి ఆనందుడు ‘అవును’ అని సమాధా నమిచ్చాడు. మీరు అడిగిన విషయాలన్నింటిలోనూ వారు అగ్రగామి గానే ఉన్నారని ఆనందుడు బదులిచ్చాడు. ఇది విన్న బుద్ధుడు ‘‘వజ్జి ప్రజలు ఆ విషయాలను పాటిస్తున్నంత కాలం వారిది ప్రగతి పథమే తప్ప వారికి పతనం అనేదే లేదని తేల్చి చెపుతాడు. వారిని ఎవరూ జయించలేరని కూడా స్పష్టం చేస్తాడు. మగధరాజు ప్రసేన జిత్తు ప్ర«ధాని వస్సకరకు బుద్ధుని అంతరంగం అర్థమైపోయింది. అదే విషయాన్ని మగధ రాజుకు చెప్పి, వజ్జి రిపబ్లిక్ మీద దాడిని నిలిపి వేశారు.
ఒకదేశం గానీ, రాజ్యంగానీ, ప్రాంతంగానీ ప్రగతిదారిలో వెళ్లా లన్నా, విజేతగా నిలబడాలన్నా ప్రజలే కేంద్రబిందువుగా పరిపాలన సాగాలి. అదేవిధంగా పాలనలో ప్రజలు భాగస్వాములు కావాలి. పాలకులకు ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఉండాలి. ప్రజాక్షేమం కోసమే రాజ్యాలు, ప్రభుత్వాలు పనిచేయాలనేది బుద్ధుడి బోధన ఉద్దేశ్యం. ఇటువంటి పాలన కోసం ప్రపంచ చరిత్రలోనూ, భారత రాజకీయ ప్రస్తానంలోనూ ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అటువంటి అనుభవాన్నే మనకు సామ్రాట్ అశోకుని పాలన కూడా అందించింది. అయితే చాలా వందల ఏళ్ళు మన దేశాన్ని నియంతృత్వం, అరాచకం రాజ్యమేలాయి. వాటన్నింటినీ దాటుకొని, అనేకానేక అవరోధాలను అధిగమించి ఈ రోజు భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో తన మను గడను కొనసాగిస్తున్నది.
అయితే ఇందులో కూడా అనేక లోపాలూ, పరిమితులూ ఉండవచ్చు కానీ ప్రజాస్వామ్య ఆలోచనలతో ఒక నిర్మా ణాత్మకమైన రాజ్యాంగం వెలుగులో మనం పాలన సాగిస్తున్నామన్నది మాత్రం వాస్తవం. అలాంటి ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల ప్రక్రియ కీలకం. అందులో భాగంగానే మన దేశ పార్లమెంటులో భాగమైన లోక్ సభకు పదిహేడవ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఓటింగ్ ఒక ముఖ్యమైన అంశం. మన దేశంలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఓటు హక్కు అందరికీ లేదు. అది కొందరి హక్కుగానే ఉండేది. మనదేశంలో మొదటిసారిగా 1920లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కేవలం విద్యావంతులూ, భూములూ, వ్యాపారాలూ, ఆస్తిపా స్తులూ ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. అయితే సామా న్యుడి ఓటు హక్కుకోసం సార్వత్రిక ఒటింగ్ (వయోజన ఓటింగ్) వచ్చేవరకూ నిరంతరం తపించిన మహానుభావుడు అంబేడ్కర్.
భారత ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే ఉద్దే శ్యంతో బ్రిటిష్ పాలకులు సౌత్‌బరో అనే రాజకీయ నిపుణుని నాయ కత్వంలో 1919లో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫారసులకు అను గుణంగా బ్రిటిష్ పాలకులు 1920లో ఎన్నికలు నిర్వహించారు. అంట రాని కులాలలో పుట్టి అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును అభ్యసించి, తన జాతి రక్షణే జీవిత లక్ష్యంగా తుది శ్వాస వరకూ పోరాడిన వ్యక్తి డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్. కేవలం 28 ఏళ్ల వయస్సులో తన జాతి జనుల విముక్తికోసమే కాక దేశంలోని అన్ని వర్గాల ప్రజలకోసం పరితపించారు అంబేడ్కర్. 1919లో సౌత్‌బరో కమి టీకి సమర్పించిన వినతిపత్రంలో యువ అంబేడ్కర్ తన ప్రజాస్వామ్య తాత్వికతకు పునాదులు వేశారు. ఆ పునాదులే భారతదేశ ప్రజాస్వామ్య సాధనమైన రాజ్యాంగాన్ని రచించడానికి ఆధారమయ్యాయి. అవే పునా దులు నేటికీ మన దేశ ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టడానికి సాధనా లవుతున్నాయి.
ప్రజాస్వామ్యమంటే ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలనీ, ఏదో కొద్ది మందికి మాత్రమే ఉండే ఓటు హక్కు నియంతృత్వానికి, కొద్ది మంది ఆలోచనల ప్రకారమే పాలన సాగించే నిరంకుశ విధానానికీ మాత్రమే ఉపయోగపడుతుందనీ అంబేడ్కర్ వాదించారు. అంతేకాకుండా, అంట రానితనం, వివక్షతో తరతరాలుగా దాస్యాన్ని అనుభవిస్తున్న అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని కూడా ఆయన వాదించారు. కానీ సౌత్ బరో కమిటీ ఆ ప్రాధాన్యతలను తోసిపుచ్చింది. ఆ తర్వాత 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ ఛైర్మన్‌గా మరొక కమిటీని భార తదేశానికి పంపించింది. ఆ కమిషన్‌ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిం చింది. అయితే స్వాతంత్య్రం రావాలనే లక్ష్యంతో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నమూనా రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో 1928 మే నెలలో ఒక కమిటీని వేసింది.
అందులో అన్ని పక్షాలకు అవకాశాలను కల్పించారు. సర్ అలీ అమన్, తేజ్ బహదూర్ సఫ్రూ, సుభాష్ చంద్రబోస్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి జవహర్ లాల్ నెహ్రూ కార్యదర్శిగా పనిచేశారు. ఇదే కమిటీలో జయకర్, అనీబి సెంట్ కొంత ఆలస్యంగా చేరారు. అయితే ఈ కమిటీ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత ఆ విషయం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ బీఆర్ అంబేడ్కర్ 1928లో మళ్ళీ ఒకసారి సైమన్ కమిషన్ ముందు హాజరై అందరికీ ఓటు హక్కు కల్పించాలనే విషయమై మరింత శక్తివంతంగా వినిపించారు.
అంతే కాకుండా 1930, 31 సంవత్సరాలలో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో అణగారిన వర్గాలతోపాటు అందరికీ పాలనలో భాగస్వామ్యం దక్కాలని వాదించారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం అందరికీ ఓటు హక్కు అనే విషయాన్ని పట్టించుకోలేదు. 1935లో మొదటి సారిగా వచ్చిన ‘భారత చట్టం’లోనూ సార్వత్రిక ఓటింగ్‌కు అవకాశం రాలేదు. 1937లో, 1946లో జరిగిన ఎన్నికల్లో కూడా విద్యా వంతులకు, వ్యాపారులకు, భూస్వాములకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. వాళ్ళ ప్రతినిధులు మాత్రమే పార్లమెంటులో అసెంబ్లీలో అడుగుపెట్టారు.
1947లో భారతదేశం స్వాతంత్య్రం సాధించడంతో నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకునే అవకాశం మనకు దక్కింది. అనేక దేశాల్లో వచ్చిన విప్లవాలు, మార్పులు, పరిణామాలను అర్థం చేసుకొని ఒక రాజ్యాంగం ఆవశ్యకతను గుర్తించి, దాన్ని యుద్ధప్రాతిపదికన లిఖిం చడం మొదలైంది. ఆ రాజ్యాంగ రచనకు అంబేడ్కర్ నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. 1919 నుంచి ఎంతో తపనతో ప్రతి పాదిస్తూ వచ్చిన సార్వత్రిక ఓటింగ్ విధానానికి సుదీర్ఘకాలం తరువాత అవకాశం లభించింది. అంబేడ్కర్ ఆ ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో ఉండాలని ప్రతిపాదించారు.
కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ 1928లో రూపొందిం చిన రాజ్యాంగానికి భిన్నంగా పటేల్ వ్యవహరించారు. సార్వత్రిక ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చకుండా, ఆర్టికల్ 326గా ఉంచారు. దీనివల్ల కలిగిన నష్టాన్ని తరతరాలుగా సామాన్యుడు భరిస్తూ వస్తున్నాడు. దాని ఫలితాన్ని మనం ఈనాటికీ అనుభవించాల్సి వస్తోంద న్నది తాజా పరిస్థితులను చూస్తే అర్థం అవుతుంది. ఆ ఒక్కతప్పిదం కారణంగానే అధికారపక్షం ఇష్టారాజ్యంగా ఓట్లను గల్లంతు చేసే పరిస్థి తులేర్పడ్డాయి. కులం పేరుతోనో, మతం పేరుతోనో, తమ వర్గం కాదనో, తమ పార్టీకి చెందిన వాళ్ళు కారనో అవలీలగా వేల సంఖ్యలో ఓట్లను గల్లంతుచేసే దుస్సాహసానికి ఒడిగట్టేవారు కాదు. అసలీ దుర్మా ర్గపుటాలోచనలకు అవకాశం ఉండేదే కాదు.
ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే, రాజ్యాంగంలో 226వ ఆర్టికల్ ప్రకారం ఎవరైనా ఓటు హక్కును కోల్పోయి ఉన్నా ఓటరు లిస్టులో తమ పేరు గురించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న ఓట్ల గల్లంతు వివాదానికి న్యాయపరమైన పరిష్కారం లభించేది. మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల్లో చేర్చిన విషయాలపట్ల మాత్రమే హైకోర్టు, సుప్రీంకోర్టులు బాధ్యత వహిస్తాయి. ఆనాడు అంబేడ్కర్ చేసిన ఆలో చనను ఈసారి కొలువుదీరే పార్లమెంటు చర్చించి, సార్వత్రిక ఓటింగ్‌ను ప్రాథమిక హక్కుల్లో చేర్చే ప్రయత్నం చేయాలి.
వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment