కొత్త కోణం
అణగారిన దీన జనులకు రక్షకునిగా నిలిచినందుకు రోమన్ పాలకులు యేసు క్రీస్తును శిలువ ఎక్కించారు. కానీ ఆయన చేసిన త్యాగం రోమన్ సామ్రాజ్య పునాదులను కుదిపేసింది. యేసు అనుచరులు ప్రజలకు అండగా నిలచి, వారికి నూతన చైతన్యాన్ని అందించారు. యేసు క్రీస్తు బోధనలు త్యాగ నిరతిని, పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని ప్రపంచ పరి వ్యాప్తం చేశాయి. బెత్లెహాం, యెరుషలెంలో మొదలైన యేసు జ్ఞాన జ్యోతి యావత్ ప్రపం చాన్ని ప్రభావితం చేసింది. నేడు ప్రపంచంలోని అత్యధిక సంఖ్యాకుల మతం క్రైస్తవమే.
జనసంద్రంలా ఉన్న అది ఊరేగింపు కాదు, దండయాత్ర. రెంటికీ పెద్ద తేడా లేదు. నిరసన తీవ్ర రూపం ఊరేగింపు. అది తిరుగుబాటుగా మారితే దండ యాత్ర. అది కూడా బహుశా అలాంటిదే. చింపిరి గుడ్డలతో, ఎండిన డొక్క లతో చిక్కిశల్యమైన శరీరాలతో పరుగులాంటి నడకతో అరుస్తూ తరలిపోతు న్నారు. వారి ముఖాల్లో ఏదో తెలియని కాంతి.. అది రాబోయే విజయపు వెలుగే కావచ్చు. ఒక్కుమ్మడిగా ఆ జనసంద్రం ఓ పట్టణంలోకి చొచ్చుకు పోయింది. వారిని చూసి నగరవాసులు ఏదో తుపాను తమను ముంచే స్తోందని బెంబేలెత్తి పోయారు. ధైర్యం చేసి కొందరు ఆ జైత్రయాత్రకు నాయ కత్వం వహిస్తున్న నాయకుడి దగ్గరకు వచ్చి ‘నీ అనుచరులు అరవడం ఆపాలి’ అని కోరారు. వాళ్లు నినదించడం ఆపేస్తే రాళ్లు కేకలు వేస్తాయని ఆయన సమాధానమిచ్చారు. ఆయన ఏ సాయుధ తిరుగుబాటుదారుడో లేదా రక్తపాతాన్ని కోరే దుందుడుకు మనిషో కాదు.. శాంతి దూతగా పేరొం దిన జీసస్ క్రైస్ట్ లేదా యేసు క్రీస్తు.
ఆ జనసమూహం ప్రవేశించినది క్రైస్తవుల పవిత్రస్థలమైన యెరుషలెం (జెరూసలెం). యేసు క్రీస్తు ఆ పట్టణానికి దగ్గరలోని బెత్లెహాం అనే పల్లెలో జన్మించారు. యేసు క్రీస్తు తల్లి కడుపులో ఉన్నప్పుడే నాటి రోమ్ చక్రవర్తి ఆగస్టస్ ప్రతి ఒక్కరూ తమ సొంత ఊళ్లకు వెళ్లి పేర్లను నమోదు చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. గతెలి ప్రాంతంలోని నజెరత్‌లో వడ్రంగి పని చేసే యేసు తండ్రి యోసెప్, తల్లి మరియ అలా బెత్లెహాంకు తిరిగి వచ్చారు. బతుకు తెరువు కోసం వలసపోయిన వారు చాలా మంది తిరిగిరావడంతో అందరికీ ఆ ఊళ్లో వసతి దొరకలేదు. తమ ఇల్లు పాడుబడిపోవడంతో, ఇంటి పక్కనే ఉన్న పశు వుల కొట్టమే యోసెప్ కుటుంబ నివాసమైంది. అక్కడే మరియ నేడు ప్రపం చంలోని అత్యధికులకు ఆరాధ్యుడైన యేసుకు జన్మనిచ్చింది.
యేసు జ్ఞాన ప్రస్థానం
చిన్నతనం నుంచే యేసుకు ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రార్థనా మందిరాలకు వెళ్లినప్పుడు ఆయన అక్కడి పెద్దలతో సమయం మరచి మరీ నిత్యం ఏదో చర్చించేవాడు. ఒకసారి వారి కుటుంబం ఒక ప్రార్థనా మంది రానికి వెళ్లి వస్తుండగా పన్నెండేళ్ల బాల యేసు తల్లిదండ్రులకు కనబడలేదు. వారు మూడు రోజులపాటూ పయనించి తిరిగి ఆ ఆలయానికి చేరేసరికి యేసు అక్కడి పండితులతో చర్చిస్తూ కనిపించాడు. మొదట్లో మనం పేర్కొన్నట్టుగా యేసు జరిపిన పోరాటానికి సామాజిక, రాజకీయ కారణాలు అనేకం. యేసు క్రీస్తు పుట్టుకకు, పోరాటానికి ముందున్న పరిస్థితులు అర్థమైతే ఆయన బోధనలు, ఆలోచనలు అర్థమవుతాయి. యేసు కాలం నాటి రోమన్ సామ్రాజ్యం చక్రవర్తి అధికారాలకు ఎదురే ఉండేది కాదు. సమాజం లోని కొన్ని ఆధిపత్య వర్గాలు కింది స్థాయి ప్రజలను నిత్యం అణచివేతకు గురిచేస్తుండేవి.
నాడు అమలులో ఉన్న యూద(జుడాయిజం) మతంలో ప్రజలు భిన్న వర్గాలుగా విడిపోయి ఉన్నాయి. వారిలో పవిత్రులు–అపవి త్రులు అనే రెండు ప్రధానమైన విభాగాలు ఉండేవి. వారినే పరిశుద్ధులు– పాపులు అని పిలిచేవారు. పరిశుద్ధులనేవారు పాపులను మనుషులుగానే గుర్తించేవారు కాదు. వారిపట్ల చాలా క్రూరంగా వ్యవహరించేవారు. సద్దు కయులు, పరిసయులు, లేఖకులు, ప్రధాన పూజారులు, ఎస్సేనులు అనే ఐదు విభాగాలుగా పరిశుద్ధులు ఉండేవారు. ఇందులో సద్దుకయులు పాల కులకు ప్రతినిధులు. పరిసయులు మతబోధకులు. లేఖకులు ప్రార్థనా మంది రాల దగ్గర మత నిబంధనలను రాతపూర్వకంగా పొందుపరిచే వారు. ఎస్సే నులు ఈ సమాజాన్ని తిరస్కరించి మృత సముద్రం దగ్గరలోని గుహలలో జీవిస్తూ మత బోధనలను తిరిగి రాసేవారు. కొంత మందిని పాపులనే పేరుతో జ్ఞానానికీ, సంపదకూ దూరంగా పెట్టే పరిస్థితి నాడుండేది. వీరు కాక, జిలెట్లు అనే వారు సాయుధంగా రోమన్ సామ్రాజ్యాన్ని కూలదోయా లని ప్రయత్నిస్తుండేవారు.
రోమన్ చక్రవర్తులు ప్రజలందరినీ వివిధ పన్నులతో విపరీతంగా పీడించి, పీల్చి పిప్పి చేస్తుండేవారు. ప్రార్థనా మందిరాల దగ్గర కూడా పన్నులు వసూలు చేసేవారు. ఈ సామాజిక అణచివేతకు, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా జిల్లెట్ల లాంటి వారు దాడులు తదితర ప్రతిఘటనా ప్రయత్నాలు చేశారు. అందులో భాగమే యోహాన్ బాప్తిష్మం. యోహాన్ ఎవరో కాదు. యేసు క్రీస్తు పెద్దమ్మౖయెన ఎలిజబెత్ కొడుకు. ఆయన అప్పటి ప్రజల స్థితిగతులపై ఆవే దన చెందేవారు. ఎప్పుడూ అడవిలో ఉంటూ, పండ్లు, కందమూలాలు తింటూ యోర్దాన్(జోర్దాన్) నది వద్ద గడిపేవాడు. ప్రజలపై పన్నులు వేసి, అణచివేతకు గురిచేసే వారిని పిలిచి ‘మారు మనస్సు పొందుడు’ అని ఆదేశించేవాడు. ఇంకెప్పుడూ ఇటువంటి పాపపు పనులు చేయమని వారిని ఒప్పించి ప్రతి ఒక్కరినీ నీటిలో ముంచి, తీసేవాడు. ఇదే మారు మనస్సు పొందడమనీ, అందుకు ఒక పవిత్ర మార్గమనీ వారి భావం. దీనినే బాప్తిష్మం అంటారు. ఇది ఒకరకంగా తిరుగుబాటు. యేసు క్రీస్తు కూడా తనకు బాప్తిష్మం ఇవ్వమని యోహాన్‌ను అడుగగా, యోహాన్ ‘నేను నీకు నీటితో ఇచ్చే బాప్తిష్మం కన్నా నీవు భవిష్యత్‌లో ఇచ్చే బాప్తిష్మం శక్తిమంతమైనది. నీవు ఇచ్చే బాప్తిష్మం అగ్గితో ఇచ్చేది. అత్యంత పరిశుద్ధమైనది. నీవు ఇచ్చే బాప్తిష్మం పరిశుద్ధాత్మ నుంచి వస్తుంది’ అని పలికి ఆయనకు బాప్తిష్మం ఇచ్చారు.
దోపిడీ, అణచివేతలపై తిరుగుబాటు
యేసు క్రీస్తు బాప్తిష్మం పొందిన తర్వాత పది ఆజ్ఞలుగా ప్రచారంలో ఉన్న మోషె ‘టెన్ కమాండ్‌మెంట్స్’ను ప్రజలలోనికి విస్తృతంగా తీసుకెళ్లారు. పేదలకు, అనాథలకు, రోగ, పీడితులకు, పుల అనే పేరుతో వెలికి గురైన వారికి యేసు అండగా నిలిచాడు. అప్పటికే చక్రవర్తులు, ధనవంతులు తామే దేవుళ్లమని చెప్పుకొని ప్రజలను పీడించడానికి వ్యతిరేకంగా ఈ పది ఆజ్ఞలను ఆయన ఎక్కుపెట్టారు. యేసు నిత్యం పేదలతోనే జీవిస్తూ వారి ఆకలిని, అనారోగ్యాలను పారద్రోలడానికి కృషి చేశారు. లోకంలోని దీనులకూ, అణ గారిన వర్గాలకూ, అల్పులకూ అండగా నిలిచిన ఆయన వారిని అక్కున చేర్చుకుని ఆకలి తీర్చి, మందూ మాకూ లేని రోజుల్లో వారి ఆరోగ్యాన్ని రక్షిం చారు. అందువల్లే యేసు క్రీస్తు ప్రజలకు రక్షకునిగా మారారు. యేసు అంటేనే మేసయ్య, అంటే రక్షకుడని అర్థం. ప్రజా పీడక వర్గాలు యేసును దయ్యమని, దేవుడి బిడ్డగా చెప్పుకొంటూ దైవ దూషణకు పాల్పడుతున్నాడని ప్రచారం చేశారు. యేసును అంతం చేయడానికి కుట్ర పన్నారు. యూద మత పెద్దలు, రోమన్ రాజ్యాధినేతలు చేతులు కలిపి, రోమన్ న్యాయాధిపతి ముందు యేసుక్రీస్తుని దోషిగా నిలబెడతారు. కానీ రోమన్ న్యాయాధిపతి పిలాత్, యేసును విచారించి నిర్దోషిగా ప్రకటిస్తాడు. అయినప్పటికీ యూద మత పెద్దల ఒత్తిడికి పిలాత్ లొంగిపోయి, యేసుకు శిలువ వేయాలని తీర్పుని స్తాడు. కేవలం యేసునే కాదు, ఎంతో మంది ఆయన అనుచరులను, ఆనాటి సామాజిక తిరుగుబాటుదార్లను అలా క్రూరంగా చంపారు.
అయితే యేసు క్రీస్తు చేసిన త్యాగం రోమన్ సామ్రాజ్య పునాదులనే కదిలించి వేసింది. యేసు క్రీస్తును శిలువ వేసిన తర్వాత మరెంతో మంది యేసు అనుచరులు ప్రజల మధ్య జీవించి, వారికి అండగా ఉండడమే కాక వారికి నూతన చైతన్యాన్ని అందించారు. సొంత ఆస్తులు పెంచుకొని, ఇత రులను అణచివేసే పద్ధతికి స్వస్తి పలకాలని వారు చేసిన ప్రచారంతో పలువురు తమ భూములను, ఆస్తులను సమాజపరం చేశారు. వీటిని ఎవరికి ఎంతెంత అవసరముందో వారి అవసరాల మేరకు పంపిణీ చేసే బాధ్యతను యేసు అనుచరులు తీసుకున్నారు. ఈ విధంగా ప్రజల్లో యేసు క్రీస్తు బోధ నలు త్యాగ నిరతిని, పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని పరివ్యాప్తి చేశాయి. బెత్లెహాం, యెరుషలెం పరిసరాల్లో ప్రారంభమైన యేసు క్రీస్తు జ్ఞానజ్యోతి అఖండ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ప్రపంచంలో ఈ రోజు క్రైస్తవమే అత్యధిక సంఖ్యాకుల మతంగా ఉన్నది.
భారతావనితో, బౌద్ధంతో అనుబంధం
ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన యేసు క్రీస్తు జీవితంలోని దాదాపు సగభాగం పేజీలు మాయమయ్యాయి. 12 ఏళ్ల ప్రాయం నుంచి 30 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆయన ఎక్కడ ఉన్నదీ. ఏం చేసిందీ ఎవరికీ తెలియదు. అయితే రష్యన్ జర్నలిస్టు నికోలస్ నటోవిట్జ్ రాసిన ‘అన్‌నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్’ పుస్తకాన్ని బట్టి యేసు బెత్లెహాం నుంచి అఫ్ఘానిస్తాన్ మీదుగా కాశ్మీర్ చేరినట్టు తెలుస్తోంది. శ్రీనగర్‌లో అందుకు లిఖిత పూర్వక ఆధారాలు దొరికాయి. 1887లో భారత పర్యటనకు వచ్చిన నటోవిట్జ్ మార్గ మధ్యలో ప్రమాదానికి గురై, ఒక బౌద్ధ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటుం డగా యేసు క్రీస్తుకు సంబంధించిన ఈ విషయాలు తెలిసినట్టు ఆయన తెలిపారు. బౌద్ధ, జైన, హిందూ మత పండితులతో, గురువులతో యేసు ఎన్నోసార్లు చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు. ఆయనను ఇషా అని పిలిచే వారని ఆధారాలతో తెలిపారు. నటోవిట్జ్ తర్వాత 1899లో మీర్జా గులాం అహ్మద్, 1970లలో జర్మనీకి చెందిన హోల్గర్ కెర్‌స్టన్ ఇదే విషయంపై రాసిన పుస్తకాలు కూడా దీన్ని ధృవీకరించాయి.
అప్పట్లో మధ్య ఆసియా నుంచి భారత దేశానికి రావడం సాధారణమే. కశ్మీర్‌కే కాదు, తెలంగాణ లాంటి ప్రాంతాలకు కూడా రోమన్ రాజ్యాలతో సంబంధాలు ఉండేవి. గ్రీకు తత్వవేత్తలలో ఒకరైన పైర్రో అలెగ్జాండర్ సేనాధిపతి సెల్యూకస్‌తో వచ్చి, బౌద్ధ గురువులతో చర్చించి, గ్రీస్‌లో హేతువాద దృష్టిని ప్రచారం చేసినట్టు లిఖిత పూర్వక ఆధారాలున్నాయి. బౌద్ధ సాంప్రదాయమైన భిక్షిణి, భిక్షువులు క్రైస్తవంలో నన్, ప్రీస్ట్, ఫాదరి రూపంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రచారం చేసిన అంశాలలో పంచశీల అంతర్భాగంగా ఉంది. చాలావరకు రెండు మతాల మధ్య సైద్ధాంతిక సారూప్యత కనిపిస్తుంది. వివిధ మతాల మధ్య సంబంధాలు సర్వసాధారణమే. ఇస్లాం అయినా, క్రైస్తవం అయినా, సిక్కు మతమైనా, మరే మతమైనా ప్రాథమిక దశలో ఇతర మతాలను అధ్యయనం చేస్తుందన్నది చరిత్ర రుజువు చేసింది. అందుకే నూతనంగా వస్తున్న పరి శోధనలను సత్య దృష్టితో చూడాలి. ఆలోచించాలి. విశ్లేషించాలి. ఆ విధంగా మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సత్యాలు నిలుస్తాయి. గెలు స్తాయి. లేదంటే మూఢనమ్మకాలుగా కొనసాగుతూనే ఉంటాయి.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మల్లెపల్లి లక్ష్మయ్య
97055 66213
Comments
Please login to add a commentAdd a comment