బాబాసాహెబ్ అంబేడ్కర్ సాగించిన కార్యాచరణ మీద చాలామంది అసమగ్రమైన అధ్యయనంతో అసందర్భంగా మాట్లాడుతున్నారు. అంబేడ్కర్ ప్రతి విషయాన్నీ అనుభవించి, ఆలోచించాడు. దానికి తగ్గట్టుగా అధ్యయనం సాగించాడు. ఆ అధ్యయనాన్ని అక్షరబద్ధం చేశాడు. ఆయన తన ఆదర్శ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని భూమికగా ఎంచుకొని, సమానత్వాన్ని సాధించాలని భావించాడు. ఆయన చేసిన రచనలు, సాగించిన వాదనలు, ఉద్యమాలన్నీ అదే మార్గంలో ఉంటాయి. ఆయన సమానత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రజాస్వామ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. అందుకే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న ఆయన నలభై సంవత్సరాల రచనల్లో కొన్నిటినైనా చదవాలి.
‘భిక్షువులారా! శ్రావస్తిలో ఒకప్పుడు ఒక రోజు... పుట్టుకతో అంధులైన వారిని పిలిచి, ఒక ఏనుగును తెప్పించి, దానిని గుర్తుపట్టమనీ, అది ఏ ఆకారంలో ఉంటుందో చెప్పాలనీ ఆజ్ఞాపించారు. అయితే అంధులు ఒక్కొక్కరు ఏనుగులోని ఒక్కొక్క భాగాన్ని తడిమిచూసి తమ అభిప్రాయాలను వివరించారు. తలను పట్టుకున్న మొదటివాడు అది ఒక కుండలాగా ఉందన్నాడు. చెవి పట్టుకున్న వాడు అది చేటలా ఉందన్నాడు. దంతాన్ని తాకిన వాడు నాగలికర్రుగా అనుకున్నాడు. మరొకరు తొండం ఎడ్ల బండి కాడిలా ఉందన్నాడు. ఆఖరి వాడు తోకను ముట్టుకొని అది రోకలిలా ఉందని చెప్పాడు. వీళ్ళందరు ఏనుగు మొత్తాన్ని తాకలేదు. అది ఎట్లా ఉందో చెప్పలేకపోయారు.
వాళ్ళు పుట్టుకతో అంధులు కావడం వల్ల అట్లా అనుకున్నారు. అయితే కండ్లు ఉండి, ధమ్మాన్ని (ధర్మాన్ని) సమగ్రంగా అర్థం చేసుకోలేక చాలా మంది తమకు ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళకు ఏ ధర్మమైనా అర్థం కాదు. అందుకే ప్రతి చిన్న విషయానికీ వాదోపవాదాలకు రావడం, తమ అజ్ఞానాన్ని జ్ఞానంగా ప్రదర్శించడం చేస్తున్నారు. మీరు అలా చేయకూడదు. ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి’’ అంటూ గౌతమ బుద్ధుడు తన శిష్యులకు హితబోధ చేశారు.
ఇది బౌద్ధ సాహిత్యంలో తిత్తియసుత్తలో ఉంది. ఆ తర్వాత ఇదే కథ జైన, హిందూ, సూఫీ సాహిత్యంలోకి వెళ్ళింది.
చాలా మందికి ఈ కథ తెలుసు. ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళ గురించీ, వాదోపవాదాలు చేసే వాళ్ళను గురించీ ఈ కథ చెప్పడం వింటూంటాం. అయితే ఇక్కడ సందర్భమేమిటనే సందేహం రాక తప్పదు. భారత దేశ సామాజిక గతినీ, స్థితినీ తెలియజేసి, దానిని ఎలా మార్చాలో తన విస్తృతమైన అధ్యయనం ద్వారా తెలియజేసిన భారత సామాజిక విప్లవకారుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ విషయంలో ఇటీవల ఇదే జరుగుతున్నది.
అంబేడ్కర్ తాత్విక చింతన, ఆయన సాగించిన కార్యాచరణ, జీవిత ఘట్టాలు, ఇట్లా అనేక విషయాలపై చాలామంది అసమగ్రమైన అధ్యయనంతో అసందర్భంగా మాట్లాడుతున్నారు. అయితే ఎవరినీ నిందించడం నా ఉద్దేశ్యం కాదు. కానీ దాని వల్ల అంబేడ్కర్ ప్రధానమైన తాత్విక చింతన, ఆయన సాగించిన సంఘర్షణాయుతమైన జీవన గమనం తప్పుగా అర్థం అవుతుంది.
నిజానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ తాత్విక కేంద్ర బిందువులను అర్థం చేసుకుంటే, ఆయన మనకు అర్థం అవుతారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ దేశపు మూలస్తంభపు పునాదిని కనిపెట్టారు. అందు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అంబేడ్కర్‌ని మనం మేధావిగా చెప్పుకుంటాం. అయితే అది సాధ్యం కావడానికి ఆయన అనుభవం, ఆందోళన, ఆలోచన, అధ్యయనం, అక్షరం, ఆచరణలు ఒకదాని వెంట ఒకటి నడిచాయి.
అంబేడ్కర్ ప్రతి విషయాన్నీ అను భవించి, ఆలోచించాడు. దానికి తగ్గట్టుగా అధ్యయనం సాగించాడు. అందుకు తగ్గట్టుగా అధ్యయనాన్ని అక్షరబద్దం చేశాడు. దానిని ఆచరణలో చూపెట్టాడు. తాత్విక వేత్తలు చెప్పినట్టుగా, ప్రపంచాన్ని చాలా మంది అధ్యయనం చేసి, వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ మార్చడమెలాగో చెప్పిన వాడే తాత్వికుడు. అటువంటి వాడే అంబేడ్కర్.
బాబాసాహెబ్ అంబేడ్కర్ తన కాలేజీ చదువు ముగించుకొని, కొలంబియాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు. అక్కడ తన జీవిత అనుభవం ద్వారా ఏర్పడిన ఆందోళనను ఆలోచనలో పెట్టి అధ్యయనం సాగించాడు. అక్కడే తన దృక్పథాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో తీర్చిదిద్దుకున్నాడు. 1913 నుంచి 1917 వరకు అంబేడ్కర్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేసిన అధ్యయనం ఆయనను ఒక తాత్వికుడిగా తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశా న్నిచ్చింది. దానికి ప్రధానమైన వ్యక్తి ఆయన గురువు ప్రొఫెసర్ జాన్ డ్యూయీ. పంతొమ్మిదవ, ఇరవైవ శతాబ్దాలలో అమెరికాలోని తాత్వికుల్లో జాన్ డ్యూయీ అగ్రగణ్యుడు.
అటువంటి ఒక తాత్వికుడు అంబేడ్కర్‌కు గురువుగా దొరికాడు. జాన్ డ్యూయీ ప్రధానమైన పరి శోధన డెమోక్రసీ. ప్రజాస్వామ్య భావనను ఆధునికంగా ఆలోచించిన వాడు జాన్ డ్యూయీ. ప్రజాస్వామ్యాన్ని అబ్రహం లింకన్ సహా అనేక మంది పరిపాలనా సంబంధమైన విషయంగా వ్యాఖ్యానిస్తే, జాన్ మాత్రం దానిని ఒక సామాజిక అంశంగా, యావత్ సమాజానికి సంబంధించిన విషయంగా, మానవ సంబంధాలకు విస్తరింపజేశాడు.
తన ‘ప్రజాస్వామ్యం – విద్య’ అనే పుస్తకంలో రాసిన విధంగా, ‘‘ప్రజాస్వామ్యం కేవలం పాలనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ప్రజల మధ్య, ప్రజల జీవనానికి సంబంధించినది. వారి మధ్య ఉండే సంబంధాలను నిర్దేశించేది’’. అయితే అంబేడ్కర్ తన మొత్తం ప్రయాణంలో ప్రజాస్వామ్య తాత్విక పునాదిని అర్థం చేసుకున్నాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జాన్ డ్యూయీ నుంచి ప్రేరణ పొందా డనడానికి ‘కుల నిర్మూలన’లో వ్యక్త పరిచిన ప్రాథమిక అభిప్రాయమే నిదర్శనం.
అంబేడ్కర్ ప్రజాస్వామ్యాన్ని అన్ని రంగాలకు వర్తించే ఒక తాత్విక శక్తిగా మలుచుకున్నాడు. అంబేడ్కర్ తన నలభై సంవత్సరాల చురుకైన ఉద్యమ జీవితంలో సాగించిన పరిశోధనలు, అమలు చేసిన కార్యాచరణలు దానినే బలపరుస్తున్నాయి. ఆయన 1916లో కులాల పుట్టుక అనే అంశంపై పరిశోధన చేసి, దానిని కుల నిర్మూలనలో ఒక లక్ష్యంగా చేసుకొని, బౌద్ధాన్ని స్వీకరించడం ద్వారా ఒక సామాజిక ప్రజాస్వామ్యంగా మనకు అందించారు.
అదే విధంగా 1919లో సౌత్‌భరో కమిటీ ముందు ప్రభుత్వ నిర్వాహణలో ప్రజల భాగ స్వామ్యం ఉండాలనీ, అందులో అణిచివేతకు గురైన వర్గాలను ప్రత్యే కంగా గుర్తించి తగు ప్రాధాన్యత కల్పించాలనీ ప్రసంగించాడు. సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ల ద్వారా దానికి ఒక బలాన్ని చేకూర్చి 1950లో ఆమోదించిన రాజ్యాంగంలో అందుకు తగ్గట్టుగానే చట్టబద్ధత కల్పించాడు. ఇది రాజకీయ ప్రజాస్వామ్యం.
అదేవిధంగా 1918లో మొట్టమొదటి ఎకనామిక్ జర్నల్‌లో ‘థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్’ అనే వ్యాసంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిపై మార్గనిర్దేశనం చేశాడు. వ్యవసాయం మీదనే ప్రజలు ఆధారపడటం వల్ల ఆ వ్యవస్థ ఒత్తిడికి గురవుతోందనీ, తన 27వ ఏటనే దేశానికీ, ప్రపంచానికీ మార్గనిర్దేశనం చేశాడు. ఇదే విషయమై పరిశోధన సాగించిన సర్ ఆర్థర్ లూయీస్‌కు 1954లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
అంటే దాదాపు 36 సంవత్సరాల ముందే అంబేడ్కర్ తన దార్శనికతను ప్రదర్శించాడు. అంతేకాకుండా, 1945లో తాను రాసిన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అన్న డాక్యుమెంటులో దేశంలోని వనరులను, ముఖ్యంగా భూమినీ, భారీ పరిశ్రమలనూ, బ్యాంక్, ఇన్సూరెన్స్ సంస్థల వంటి వాటినీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంచకూడదనీ, వాటిని జాతీయం చేయాలనీ ప్రతిపాదించాడు.
అంబేడ్కర్ తన ఆదర్శ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని భూమికగా ఎంచుకొని, సమానత్వాన్ని సాధించాలని భావించాడు. అందుకే తాను చేసిన రచనలు, సాగించిన వాదనలు, ఉద్యమాలన్నీ అదే మార్గంలో ఉంటాయి. ఆయన సమానత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రజాస్వా మ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. అందుకే ఆయన లక్ష్యాల్లో సమా నత్వం, స్వేచ్ఛ, సోదరత్వం ముఖ్యమైనవి.
వాటి సాధనకు మార్గం సుగమం చేసేదే ప్రజాస్వామ్యం. అందుకే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న ఆయన నలభై సంవత్స రాల రచనల్లో కొన్నిటినైనా మనం చదవాలి. ఆయన మూలసిద్ధాంత మైన ప్రజాస్వామ్య భావనను అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి.
-మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment