ఒకవైపు గిడ్డంగుల్లో ఆహారధాన్యాలు పుచ్చిపోతాయి. మరోవైపు పేద జనపు డొక్కలు తిండిలేక మాడిపోతాయి. ఒకవైపు సంపద పోగుపడి బిలియనీర్ల సంఖ్య ఎగబాకుతుంటుంది. ఆ పక్కనే మరికొన్ని కోట్ల పేదల ఆదాయం పడిపోయి, పేదరికం కూడా పెరిగిపోతుంటుంది. క్షీరసాగర మథనంలో కొందరికే అమృతం దక్కినట్టు స్వాతంత్య్ర ఫలాలు కూడా కొందరికే దక్కాయి. దేశం పేదది కాకపోయినా దేశంలో ఇంకా పేదవాళ్లున్నారు. విలువలకు పేరున్న దేశమైనా కులాల అసమానతలున్నాయి. అందుకే ఈ దేశంలోని వైవిధ్యాలనే కాదు, వైరుద్ధ్యాలనూ తరచి చూసుకోవాలి. జనాల మధ్య అంతరాలను తగ్గించడం ద్వారానే ఈ దేశాన్ని ఒక్కటిగా చేయగలం అని గుర్తించాలి.
క్షీర సాగర మథనం. సముద్రం నుంచి అమృతాన్ని వెలికితీసేందుకు ఇటు రాక్షసులు, అటు దేవతలు రెండు వర్గాలు కలిసి శ్రమించి, మంధర పర్వతంతో సముద్రాన్ని మథిస్తారు. అందులోంచి అనేక విశిష్ట వస్తువులు, మనుషులు, జంతువులు, అనంతరం విషం, చిట్టచివరకు అమృతం వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన కథే కావొచ్చు. కానీ నేడు ఇదే అత్యంత సందర్భోచితమైన అంశం. ఏ అమృతం కోసమైతే ఇరు వర్గాలు సమంగా శ్రమించాయో, దాని ఫలితాలు మాత్రం ఇరు పక్షాలకీ సమంగా అందలేదు.
చావును శాశ్వతంగా తరిమికొట్టే అమృ తాన్ని దేవతలు చేజిక్కించుకుని, మరొక వర్గానికి మత్తులో ముంచెత్తే సురాపానం అంటగట్టారు. దేవతలు కదా ఏం చేసినా చెల్లుతుంది. మరో వర్గం కూడా అంతే శ్రమించినప్పటికీ అసలు ఫలితం దక్కక పోవడం కథలోని సారాంశం. అమృతం అందుకున్న వర్గం మరింత శక్తితో తమ ఆధిపత్యాన్ని నిలుపుకొంటూనే వచ్చింది. మరొక వర్గం కాలక్రమేణా దాడులకూ, దౌర్జన్యాలకూ గురై క్షీణించింది లేదా అధికారగణం చేతిలో బానిసలుగా మారిపోయింది.
అసలు విషయానికొద్దాం. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. మన భారత ప్రభుత్వం ఈ సంద ర్భాన్ని ‘అమృత్ మహోత్సవ్’ పేరుతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవా లని నిర్ణయించింది. అందుకుగానూ గతేడాది మార్చి 12 నుంచి వచ్చే సంవత్సరం అంటే ఆగస్టు 15, 2023 వరకు ఈ ఉత్సవాలను నిర్వ హిస్తోంది. ఈ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర ప్రయాణంలో పాల్గొన్న ప్రజలందరికీ ఈ ఉత్సవాలను అంకితం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
75 ఏళ్ల ఉత్సవాలు కాబట్టి అమృత్ మహోత్సవ్ అనే పేరు పెట్టారు కానీ, సరిగ్గా సరిపోయింది అది. అమృతం కోసం సాగర మథనంలో పాల్గొన్న అందరికీ అమృతం అందనట్టే స్వాతంత్య్ర ఫలాలు సైతం కొందరికే దక్కాయన్న విషయానికి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర పాలన మన దేశ ప్రజలకు అందించింది ఆకలి, పేదరికం, నిరుద్యోగం, అణచివేత. గత 75 ఏళ్ళలో జరిగిన ఆర్థికాభివృద్ధి, సమకూరిన సంపద, అతికొద్ది మంది సంపన్నుల, ఆధిపత్య వర్గాలకే వెళ్ళి పోయింది. సమాజంలో సంపద సమష్టిగానే వృద్ధి చెందుతుంది. కానీ ఫలితాలు అందరికీ అందడంలో మాత్రమే తేడా ఉంటుంది.
మన దేశంలోని కేవలం వందమంది కోటీశ్వరులు 57 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని కలిగివున్నారని గ్లోబల్ రిపోర్టు తెలియజేసింది. అంటే ఇది భారతదేశ రెండు సంవత్సరాల ఆర్థిక బడ్జెట్‌కు సమానమని గుర్తించాలి. అదేవిధంగా 50 శాతం మంది జనాభా కేవలం 6 శాతం సంపదను కలిగి ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఒక సంవత్సరంలోనే, అది కూడా కోవిడ్ సమయంలోనే 102 మందిగా ఉన్న కోటీశ్వరులు(బిలియనీర్స్) 142కి పెరిగారు. మార్చి 2020 నుంచి, నవంబర్ 30, 2021 వరకు 23 లక్షల కోట్లు ఉన్న కోటీశ్వరుల సంపద 57.3 లక్షల కోట్లకు చేరినట్టు లెక్కలు చెబు తున్నాయి. అదే విధంగా కోవిడ్ సమయంలోనే ఇప్పటి వరకు ఉన్న పేదలకు అదనంగా, 4.6 కోట్ల మంది పేదరికంలోకి దిగజారి పోయారు.
అదేవిధంగా భారత దేశానికి మరొక అవలక్షణం ఉన్నది. అదే కులం. భారత దేశంలో సమకూరిన సంపద కూడా కొన్ని కులాలకే పరిమితమైపోయింది. ఇదే విషయాన్ని నితిన్ కూర్ బర్తి అనే విద్యావేత్త, 1961 నుంచి 2021 వరకు చేసిన అధ్యయనంలో కులాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయనీ, మన దేశంలో ఉన్న ఆధిపత్య కులాలు ఆదాయంలోనూ ఖర్చులోనూ మిగిలిన కులాల కన్నా ముందు వరుసలో ఉన్నాయనీ తేల్చారు. ‘వెల్త్ ఇన్ ఈక్వాలిటీ క్లాస్ అండ్ కాస్ట్ ఇన్ ఇండియా – 1962–2021’ అన్న ఈ పరిశోధనా పత్రాన్ని ఆయన ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు 2018లో సమర్పించారు. 2011లోని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ డాటా ప్రకారం, ఒక ఎస్సీ కుటుంబానికి ఒక సంవత్సర ఆదాయం 89 వేలు ఉంటే, ఎస్టీ కుటుంబ వార్షికాదాయం 75 వేలు ఉంది.
అదే ఓబీసీల్లో ఇది ఒక లక్షా నాలుగు వేలు. ఇక ఆధిపత్య కులాల్లో ఇది లక్షా 64 వేలు అని నితిన్ తేల్చారు. అదేవిధంగా సంవత్సర ఖర్చు ఎస్సీల్లో 87 వేలు, ఎస్టీల్లో 72 వేలు, ఓబీసీల్లో లక్షా ఎనిమిదివేలు, అగ్రకులాల్లో లక్షా 46 వేలుగా ఆయన లెక్కలు గట్టారు. సాధారణ ప్రజల్లో కూడా ఆర్థిక వ్యత్యాసాలు చాలా ఎక్కువగానే ఉన్నట్టు మనకు ఈ లెక్కలు చెబుతున్నాయి. వీటితో పని లేకుండానే ఏ గ్రామం వెళ్ళినా ఈ తేడాలు మనకు వీధుల్లో దర్శనమిస్తాయి. దళిత కుటుంబాల్లో, వారి ఇళ్లల్లో ఈ విషయాలు అత్యంత స్పష్టంగా మనం గమనించొచ్చు.
ఇదే విషయం ఇటీవల మరొక సర్వేలో తేలింది. క్రానిక్ పావర్టీ రీసెర్చ్ సెంటర్ ద్వారా జరిగిన పరిశోధన ద్వారా ఇదే విషయం అక్షరసత్యమని రుజువయ్యింది. పేదరికం అనేది తరతరాలుగా వస్తున్న వారసత్వంగా కొందరికి మారిపోయిందని ఆ సంస్థ నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చింది. ఇది భారత దేశానికే పరిమితమైన పరిణామంగా ఆ సంస్థ పేర్కొన్నది. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలు, దళిత వాడలు, ఆ వర్గాలకు చెందిన ప్రజలు పేదలుగానే పుట్టి, పేదలు గానే మరణిస్తూ, తమ పిల్లలకు సైతం పేదరికాన్నే వారసత్వంగా ఇచ్చి వెళుతున్నారని ఈ పరిశోధన అభిప్రాయపడింది.
ప్రపంచంలో వందమంది పేదలుంటే అందులో 28 మంది మనదేశంలోనే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆకలితో అలమటించే భారత దేశ ప్రజల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం 18 కోట్ల మంది ఇంకా సరిౖయెన ఆహారం కూడా అందని స్థితిలో బతుకులీడుస్తున్నారని 2020 నివేదికలో పేర్కొన్నారు. ఇంకా మహిళల్లో ఆకలి బాధ తీవ్రస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. 15 నుంచి 49 ఏళ్ళ వయసు ఉన్న మహిళల్లో దాదాపు 51 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లల్లో 35 శాతం మంది సరిౖయెన ఎదుగదలను కలిగిలేరు. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో మన ర్యాంకు 101 అని తేల్చారు.
అయితే మన దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నదనుకుంటే పొరపాటే. బియ్యం, గోధుమల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించింది. భారత రైతాంగం కష్టపడి పండించిన ఈ ధాన్యమంతా ఎఫ్‌సీఐ గోదాముల్లో పడి మూలుగుతోంది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం, గడచిన ఐదేళ్ళలో 38 వేల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పుచ్చి, పురుగుల పాల య్యాయి. 2021 డిసెంబర్ నాటికి 213 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 378 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయి. కానీ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతావనిలో ఇంకా ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వరి, గోధుమల లాంటి ఆహారధాన్యాలు పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఆకలితో కాలే కడుపునకు పిడికెడు అన్నం లేదు.
ఇది భారత దేశ అమృతోత్సవ సంబరాల సత్యాలు. భారత దేశంలో క్షీరసాగర మథనం లాంటి సంప్రదాయాలే మనకు ఆద ర్శాలు. ఒక వైపు సంపద, మరోవైపు పేదరికం, ఒకవైపు ఆహార ధాన్యాల నిల్వలు పుచ్చిపోతోన్న స్థితి, మరోవైపు ఆకలితో మలమల లాడే కడుపులు. ఇన్ని సాక్ష్యాలున్నా ఇంకా మనది సమైక్య భారతమని అందామా? ముమ్మాటికీ అనలేం. ఇది వైరుద్ధ్య భారతం. ఇక్కడ ఒక్క భారతం లేదు. ఇవి రెండు భారతాలు. ఇంకా చెప్పాలంటే మరెన్నో భారతాలు. నిజానికి ఈ దేశం పేదది కాదు. ప్రజలే పేదవాళ్ళు. ఈ వైరుద్ధ్యాలు ఇప్పటికైనా మనకు అర్థం కాకపోతే, పరిణామాలు ఎవ్వరూ ఊహించలేరు. అమృతోత్సవాలు జరపడం కాదు, అందరికీ అమృతం అందించే గుణం కావాలి.
-మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment