ఇళ్లు చూపే అంతరాలు | mahesh describing about poor and rich | Sakshi
Sakshi News home page

ఇళ్లు చూపే అంతరాలు

Published Tue, Jan 23 2018 2:36 AM | Last Updated on Tue, Jan 23 2018 2:36 AM

mahesh describing about poor and rich - Sakshi

ముంబైలో మురికివాడల ఉనికిని చాలామంది గుర్తించనప్పటికీ నగర ఆర్థిక వ్యవస్థకు బాగా దోహదం చేస్తున్న పలు పరిశ్రమలు అక్కడే ఉన్నాయన్న వాస్తవాన్ని మర్చిపోరాదు. నిజానికి మురికివాడలు లేకుంటే ముంబై స్తంభించిపోవచ్చు.

విశ్లేషణ
భూమ్మీద సంపన్నులు, పేదల మధ్య అంతరం మరీ కొట్టొచ్చినట్లు కనిపించే నగరం ఉందంటే అది ముంబైనే అని చెప్పాలి. దేశంలోనే అతి సంపన్నుడైన ముఖేష్‌ అంబానీ నివసిస్తున్న 27 అంతస్తుల నివాస భవనం ఇక్కడే ఉంది. 36 ఫ్లోర్లతో టెక్స్‌టైల్‌ టైకూన్‌ గౌతమ్‌ సింఘానియా నిర్మించిన భారీ భవంతీ ఇక్కడే ఉంది. అనిల్‌ అంబానీ 19 ఫ్లోర్ల భవనంలో ఉంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి చగన్‌ భుజ్‌బల్‌ తన కుటుంబం కోసం తొమ్మిదంతస్తుల భవంతి నిర్మించుకున్నారు. ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా ఏడు ఫ్లోర్లతో కూడిన నివాసంలో కుటుంబంతో ఉంటున్నట్లు తెలిసింది. ఈ సామాజిక శ్రేణిలో ఉంటున్న ఇతరులకు కూడా అద్భుత భవనాలు ఉన్నాయి కానీ పైన చెప్పిన ఆకాశ హర్మ్యాలు వీరికిలేవు. 

ఈ సంపన్నుల సంపదపై లేక వారి డాంబికాలతో నాకు పేచీ లేదు. కానీ ఇదీ కొన్ని పోలికలకు తావిస్తోంది. నందన్‌ నీలేకని రాసిన ‘ఇమేజింగ్‌ ఇండియా: ఐడియాస్‌ ఫర్‌ ది న్యూ సెంచురీ’ పుస్తకంలో ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా చెబుతున్న ధారవిలో ఉన్న తుక్కు, తోలు, రీసైక్లింగ్‌ పరిశ్రమ సంవత్సరానికి 1.7 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆదాయాన్ని సృష్టిస్తోందని తెలిపారు. ఇది అంబానీ నూతన గృహ నిర్మాణానికి పెట్టినంత వ్యయానికి సమానమని అంచనా. ఈ ఆకాశహర్మ్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా, కనిపించని గుడిసెలు ముంబైలో అధిక భాగంలో వ్యాపించి ఉన్నాయి. వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థతో అతి పెద్దనగరంగా ముంబైకి ఉన్న ప్రతిష్టను ఇది పలుచబారుస్తోంది. మురికివాడల శ్రమతో ముంబై ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న తోడ్పాటును ఆర్థికవేత్తలెవరూ  అర్థం చేసుకోలేదు. మురికివాడలు లేకుంటే ముంబై నగరం స్తంభించిపోవచ్చు.

మురికివాడల పునరావాస ప్రాధికార సంస్థ ముంబై నగరంలో 12.5 లక్షల గుడిసెల్లో 62 లక్షల మంది గుడిసెవాసులు ఉన్నట్లు తేల్చింది. 1995కి ముందునుంచీ నగరంలో ఉన్న గుడిసె వాసులకు ఉచితంగా గృహాలను కల్పిస్తామని మొదట్లో చెప్పారు. తర్వాత దానిని 2000 సంవత్సరం వరకు పొడిగించారు. ఇక్కడ చెప్పొచ్చే అంశం మురికివాడల ఉనికి, నత్తనడకన నడుస్తున్న వాటి పునరావాసం మాత్రం కాదు. మురికి వాడలు, గుడిసెవాసుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఇక్కడ చర్చనీయాంశం. ఇటీవలే నగరంలోని అసల్ఫా మురికివాడ సుందరీకరణలో భాగంగా దాని వెలుపలి గోడలకు రంగులద్దారు. గుడిసెవాసుల జీవితాలకు కాస్త రంగులద్దడం అన్నమాట. కంటికి వికారంగా ఉండే వారి జీవితాలను పరోక్షంగా చిన్నచూపు చూసే చర్య ఇది. 

మురికివాడలకు వెలుపల ఉన్నవారు నగరంలో  మురికివాడలు ఉన్నాయన్న విషయాన్ని నమ్మేందుకు కూడా ఇష్టపడరు. పైగా నగరాన్ని వృద్ధి చేయడంలో వారి పాత్రను గుర్తించాలని కూడా వీరు భావించరు. అనియత రంగంలో చాలాభాగం మురికివాడల నిర్వహణలోనే సాగుతోంది. మీ ఇళ్లలో పనిమనుషులు, మీ డ్రైవర్లు లాగే ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో వెయిటర్లు కూడా ఈ మురికివాడలకు చెందినవారే. చాలా సందర్భాల్లో వీరు నివసించే గుడిసెలు కుటుంబం మొత్తానికి కూడా 100 నుంచి 140 చదరపు అడుగులకు మించి ఉండవు. పునరావాసం కింద వీరికి కల్పిస్తున్న గృహాలు 225 చదరపు అడుగుల్లో ఉంటాయి. అంటే వారు ఇంతవరకు నివసిస్తున్న నివాస ప్రాంతం ఇప్పుడు రెట్టింపు అవుతుం దన్నమాట. కానీ ఇవి కూడా వారికి అందటం కష్టమే. ఎందుకంటే వీరికి గృహాలను నిర్మించి ఇవ్వవలసిన బిల్డర్లు, డెవలపర్లు మురికివాడల్లో నిర్మాణ హక్కులను పొందడమే కాకుండా అనుమతించిన మేరకు గుడిసె వాసులు కాని వారికి ఇలా కట్టిన గృహాలను అమ్ముకుం టారు. దీనికి వీరు గుడిసెవాసులకు డబ్బు చెల్లిస్తారు.

గత రెండు దశాబ్దాల్లో ఉచితంగా 1.7 లక్షల మందికి గృహ నిర్మాణ పథకాలు మంజూరయ్యాయి. వీటిలో 1,441 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. కానీ ఇవన్నీ అమలై ఉంటే నగర గృహ కల్పన విధానంపై ఇది ప్రభావం చూపి పేదలకు మెరుగైన జీవితాన్ని అందించే అవకాశముండేది. ఇప్పుడు ప్రభుత్వం గుడిసెవాసులకు 322 చదరపు అడుగులలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తలుస్తోంది. ఈ అదనపు స్థలంలో కుటుంబాలు కాస్త సౌకర్యవంతంగా ఉంటాయి. మొదట్లో 100–140 చదరపు అడుగుల్లో ఉన్న స్లమ్‌ యూనిట్లు తర్వాత పునరావాసంలో 225 చదరపు అడుగులకు పెరిగాయి. తర్వాత వీటిని 269 చదరపు అడుగులకు పెంచారు. ఈ పెంపుదల ప్రభుత్వం ఉదారంగా తీసుకున్నది కాదు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన 322 చదరపు అడుగుల పరిమితిని విధించింది మరి.

అందుచేత, భూమి లభ్యతపైనే ఇంటి పరిమాణం ఆధారపడుతుంది. ముంబైలో ఇళ్లలో 10 శాతం మాత్రమే సగం జనాభా ఉంటున్న మురికివాడల స్వాధీనంలో ఉన్నాయి.  అందుకే ముంబైలో కొన్ని అతి భారీ భవంతులు ఉండగా మరికొన్ని బతకడానికి మాత్రమే సరిపోయే పరిమాణంలో ఉంటున్నాయి. చివరకు మురికివాడలకు దూరంగా ఉండే ప్లాట్‌లలోని వారు కూడా ప్రధానమంత్రి అవాస్‌ యోజన పథకంలో తలపెట్టనున్న పరిణామం కలిగిన ఇళ్లలోనే నివసిస్తున్నారు.

మహేశ్‌ విజాపుర్కర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ :  mvijapurkar@gmail.com 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement