పేదలా? సంపన్నులా..? ఫేసే చెప్పేస్తుంది బాసూ!!
టొరంటో: ఫేస్ రీడింగ్ గురించి తెలిసిందే. ఎదుటి వ్యక్తి ముఖకవళికల ఆధారంగా అతను ఏమనుకుంటున్నాడో చెప్పేయడమన్నమాట. అయితే అదే ముఖాన్ని చూసి ఓ వ్యక్తి సంపన్నుడా? నిరుపేదా? అనే విషయాన్ని కూడా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. కెనడాలోని టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కుటుంబ వార్షికాదాయం సగటున 75వేల అమెరికా డాలర్లు ఉండే వారిపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. కుటుంబ ఆదాయం 60వేల డాలర్ల నుంచి లక్షడాలర్ల వరకు ఉన్న కొంత మంది వ్యక్తుల ముఖచిత్రాలను వలంటీర్లకు చూపించారు.
వారిలో ఎవరు పేదవారో, ఎవరు సంపన్నులో గుర్తించమన్నారు. 53 శాతం మంది కరెక్టుగా పేదవారిని, డబ్బున్న వారిని గుర్తించగలిగారు. ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులు అతని ముఖకవళికలు, తోటివారితో మెలిగే విధానంపై ప్రభావం చూపుతాయిని తేలింది. మన ముఖం మన అనుభవాలను, భావోద్వేగాలను ప్రదర్శిస్తుందని శాస్త్రవేత్తల్లో ఒకరైన నికోలస్ రల్స్ చెబుతున్నారు. అంతేగాక మనం ఎవరిని చూసినా మొదటగా వారి ముఖం చూస్తామని, మన మెదడులోని న్యూరాన్స్ మన ముఖ కవళికలను గుర్తించేలా చేస్తాయని ఆయన తెలిపారు.