డబ్బుతోపాటొచ్చే దరిద్రం ఏమిటో తెలుసా?
న్యూయార్క్: డబ్బూ, డబ్బూ, డబ్బూ....డబ్బుతోటిదే లోకం. డబ్బుంటే సకల సౌకర్యాలు కనుసన్నల్లోకి వస్తాయని భావించేవాళ్లు, పాపిష్టిది డబ్బు, ప్రపంచాన్ని పాపపంకిలం చేస్తుందని ఈసడించేవాళ్లూ ఉంటారు. సమస్యలను తీర్చే, సమస్యలను తెచ్చే డబ్బు గురించి ఎవరి అనుభవాలనుబట్టి వారు నిర్వచనాలు ఇస్తుంటారు. డబ్బుతోబాటు డాబు, దర్పం వస్తుందని, దాన్ని వెన్నంటే స్వార్థం, పిసినారి తనాన్ని కూడా మూటగట్టుకొస్తుందని ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ పలు శాస్త్రీయ అధ్యయనాల ద్వారా నిరూపించింది.
డబ్బున్న మారాజులు విందు, వినోదాల్లో తేలిపోవచ్చుగానీ వారికి సామాజిక జీవితం తక్కువని, ఎక్కువ శాతం వారు ఒంటరిగానే గడుపుతారని, అదే డబ్బులేని పేదవాళ్లు ఎక్కువగా సామాజిక జీవితం గడుపుతారని, అంటే బంధు, మిత్రులతో సుఖ సంతోషాలు పంచుకుంటారని ఈ అధ్యయనాల్లో తేలింది. తోటివారు ఏమైనా చెబుతుంటే దండిగా డబ్బున్న వాళ్లు వారి మాటలు వినిపించుకోకుండా ఎక్కడో ఆలోచిస్తుంటారు. అదే మధ్యతరగతి వాళ్లు తోటి వాళ్లు తమ కష్ట సుఖాల గురించి వివరిస్తుంటే అసహనంగా కదులుతూ మొబైల్ ఫోన్ లేదా పేపరు చూస్తూ అప్పుడప్పుడు మాత్రమే తలాడిస్తూ ఉంటారు.
ఇక తక్కువ ఆదాయం కలిగిన కష్ట జీవులు తమ కష్టాల గురించి ఏకరువు పెడుతుంటే రెప్ప వాల్చకుండా చెప్పేవారి కళ్లలోకి చూస్తూ తలాడిస్తుంటారు. దయతో వారి మాటలను అర్థం చేసుకుంటారు. మొత్తంగా డబ్బున్న వారిలో ఔదార్యం మరీ తక్కువగాను, మధ్య తరగతి కుటుంబాల్లో కాస్త ఎక్కువగాను, దిగువ తరగతి పేదల్లో మరీ ఎక్కువగాను ఉంటుందని సామాజిక ప్రయోగాల ద్వారా తేల్చారు. కాయకష్టం చేసుకొని బతికే పేదవాళ్లలోనే తొటివారికి సేవచేయాలనే పెద్ద మనసు ఉంటుందని, వారు ఎక్కువ సామాజిక జీవితాన్ని గడపడం ద్వారానే వారికి ఈ గుణం అబ్బిందని అధ్యయనంలో వెల్లడైంది.
పాత, చౌక కారును నడిపే యజమానులు బాటుసారులు రోడ్డు దాటుతున్నప్పుడు ఎక్కువసార్లు ఆగి, వారు దాటాకనే కారు నడుపుతారని, ఖరీదైన కార్లలో వెళ్లేవాళ్లు బాటసారుల కోసం కారును ఆపకుండా వీలైనంత వరకు దూసుకెళ్లేందుకే ప్రయత్నిస్తారని మరో అధ్యయనంలో రుజువైంది. దీన్నిబట్టి ఎక్కువ డబ్బున్నవారి, తక్కువ డబ్బున్న వారి మనస్తత్వం తీరును అర్థం చేసుకోవచ్చు. డబ్బున్న వారే ఎక్కువ మోసాలకు పాల్పడతారని, వారిలో చోర గుణం (స్టడీస్ ఆఫ్ షాప్‌లిఫ్టింగ్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం)కూడా ఎక్కువగానే ఉంటుందట.
డబ్బుకు సంబంధించిన ఓ వీడియో గేమ్‌ను డబ్బున్న వాళ్లతో, డబ్బులేని వాళ్లతో ఆడించగా డబ్బున్న వాళ్లు ఆ గేమ్‌లో మోసానికి పాల్పడ్డారు. వారిలో ఎక్కువ మంది పన్ను ఎగవేసేవారు ఉన్నట్లు కూడా తేలింది. అంతేకాకుండా తక్కువ డబ్బున్న వారే తమ డబ్బులో ఎక్కువ శాతం సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నట్లు, ఎక్కువ డబ్బున్న వాళ్లు సామాజిక కార్యక్రమాలకు అతి తక్కువ విరాళాలు ఇస్తున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది.
ప్రజల మధ్య ఎక్కువ ఆర్థిక అసమానతలున్న దేశాల్లో ధనవంతుల్లో దుర్మార్గం ఎక్కువ, ఔదార్యం తక్కువగా ఉందని, తక్కువ ఆర్థిక అసమానతులున్న దేశాల్లో ధనవంతుల్లో ఔదార్యం ఎక్కువగా ఉందని కూడా అధ్యయనకారులు సూత్రీకరించారు. ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో సామాజిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జీవన ప్రమాణాలు, జీవించే ప్రామాణిక కాలం, ఆరోగ్య వసతులు తక్కువ.
శిశు మరణాలు ఎక్కువ. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం పాళ్లు, సంతోషం పాళ్లు తక్కువే. అందుకే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల మాట్లాడుతూ సమకాలీన సమాజంలో ఆర్థిక అసమానతులను అధిగమించడమే అసలైన సవాల్ అని అన్నారు. అందరికి నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, పన్నుల వ్యవస్థను సరళీకరిస్తుందని ఆయన చెప్పారు.