ఒక ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. చాలా ధనం ఉండటం వల్ల వేరే ఆలోచన లేక తింటూ, తాగుతూ సుఖాన్ని అనుభవిస్తుండేవాడు. ఆ ధనవంతుడి ఇంటి బయటనే లాజరు అనే ఒక బీదవాడు ఆకలికి అలమటిస్తూ ధనవంతుడు ఏమన్నా ఇస్తాడేమో అని ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడు భోజనం చేశాక తన పెదవులను రొట్టె ముక్కలతో తుడిచి వాటిని బయట పడవేస్తే ఆ రొట్టె ముక్కలతో కడుపు నింపుకునేవాడు లాజరు. కొంత కాలానికి ధనవంతుడు చనిపోయాడు. శరీరం ఇక్కడే ఉంది, ధనవంతుడు కదా! అంతిమ సంస్కారాలు బాగానే జరిగాయి. జనం కూడా బాగానే వచ్చారు. కానీ అతడు మాత్రం నరకంలో కళ్లు తెరిచాడు. అతని ధనం అతనికి సంతోషాన్ని ఇచ్చే స్థలాన్ని మాత్రం ఇవ్వలేదు. ఆ తరువాత బీదవాడైన లాజరు కూడా మరణించాడు. అతడు సంతోష కరమయిన స్థలంలో కళ్లు తెరిచాడు.
ధనవంతుడు ధనవంతుడు కావడం వలన వేదనకరమయిన స్థలంలోనికి, లాజరు బీదవాడు కావడం వలన సంతోషకరమయిన స్థలం లోనికి వెళ్లలేదు. ప్రాణంతో ఉన్నప్పుడు తాము బతికిన దానిని బట్టి ఆ స్థలాలలోకి వెళ్లారని అర్ధమవుతుంది. తనకు ఆస్తి, ధనం ఉన్నప్పుడు ధనవంతుడు తన పక్కనే ఉన్న లాజరును పట్టించుకోలేదు. తన వరకు తాను తిని, తాగి సంతోషపడ్డాడు. దేవుడు ఒకరిని ధనవంతుడిగా లేదా బీదవాడిగా పుట్టించాడంటే ఎక్కడ పుట్టామో అక్కడ మనం మన భక్తిని కాపాడుకోవాలని! పక్కన ఒకరు ఆకలితో అలమటిస్తుంటే మనం అతడిని పట్టించుకోకుండా బతుకుతుంటే మనలను దేవుడు మెచ్చుకుంటాడా? బీదవాడు ధనవంతుడిని నిందించకుండా తన స్థితిని నిందించుకోకుండా తానున్న స్థితిలోనే భక్తిని కాపాడుకోవాలని లాజరు ద్వారా దేవుడు మనకు చెబుతున్నాడు.
వేదన కరమయిన స్థలంలో ఉన్న ధనవంతుడు తన దాహాన్ని తీర్చమని.. లాజరుని పంపమని.. అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము ‘‘నా కుమారుడా భూమి మీద నీవు నీకిష్టమయినట్టు బ్రతికావు’’ అని అంటున్నాడు అంటే భూమి మీద మన బతుకుని బట్టి మనకు స్థలం నిర్ణయించబడుతుందని అర్థమవుతుంది కదా. అందుకే. మన తోటి సహోదరునికి సాయం చేయాలి, సహోదరుడిని ప్రేమించాలి. అదే దేవుడికి ఇష్టమయిన కార్యం.
Comments
Please login to add a commentAdd a comment