రాష్ట్రాలను కోరిన ఆర్థిక సలహాదారు అరవింద్
న్యూఢిల్లీ: పేద, ధనిక రైతుల స్థితిగతులకనుగుణంగా రాష్ట్రాలు రైతులపై వ్యవసాయ ఆదాయ పన్ను భారం మోపాలని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సూచించారు. కేంద్రప్రభుత్వం రైతులపై ఆదాయపన్ను విధించకుండా రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని, అయితే రాష్ట్రాలు ఆ పన్ను వేయకుండా ఎవరూ ఆపలేరని అరవింద్ చెప్పారు. ఒకవేళ అలాంటి పన్ను విధించాలని రాష్ట్రాలు భావిస్తే ఆ నిర్ణయాధికారం, అవకాశాలు 29 రాష్ట్రాలకూ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ధనిక, పేద రైతులను గుర్తెరిగి పన్ను వేయాలని రాష్ట్రాలకు సూచించారు. వ్యవసాయ ఆదాయంపైనా ఖచ్చితంగా పన్ను వేయాల్సిందేనని నీతి ఆయోగ్ సభ్యుడైన బిబేక్ డిబ్రోయ్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. అయితే, అలాంటి పన్నును కేంద్రప్రభుత్వం విధించబోదని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు.
వ్యవసాయ ఆదాయంపై పన్ను ప్రసక్తే లేదు: పనగరియా
వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే ప్రశ్నే లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో వ్యవసాయ ఆదాయంపై పన్ను ఎలా విధిస్తామని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ ఆదాయంపై కూడా పన్ను విధించాలన్న నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రోయ్ వివాదాస్పద వ్యాఖ్యలపై శుక్రవారం సీఐఐ సదస్సు సందర్భంగా స్పందిస్తూ... దేశంలోని 80 శాతం గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయంతో ముడిపడ్డాయని పేర్కొన్నారు.
ధనిక, పేద తేడాతో వ్యవసాయ పన్ను!
Published Sat, Apr 29 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM
Advertisement
Advertisement