Aravind Subramanian
-
అవినీతి అంతం కోసమే.. నోట్ల రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతిని అంతమొందించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి కోసం కాదని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం నిర్వహించిన భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) హెల్త్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘సుబ్రమణియన్ నివేదిక చదివాను. అందులో ఆర్థిక వికాసానికి నోట్ల రద్దు వ్యతిరేకంగా ఉందని రాశారు. అయితే సుబ్రమణియన్ ఈ పదాన్ని ఎందుకు వాడారో నాకు తెలియదు. ఇది కేవలం అవినీతిపరులకు, అక్రమంగా నగదు దాచుకున్నవారికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య మాత్రమేఆర్థిక వికాసం గురించి తెలిసినవారు నిజాయతీపరులై ఉంటారు, చట్టానికి కట్టుబడి ఉంటా’రని రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. కాగా పెద్ద నోట్ల రద్దు దారుణమని, ఇది ఆర్ధిక వృద్ధికి పెనుప్రమాదమని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన అరవింద్...నోట్లరద్దు తదనంతర పరిణామాలపై ఆరు నెలలు అధ్యయనం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఏడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు 6.8 శాతానికి పడిపోయిందన్నారు. గతంలో ఇది ఎనిమిది శాతంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. -
'28 శాతం జీఎస్టీని తొలగించండి'
న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారుగా గత కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేసిన అరవింద్ సుబ్రమణియన్ ఓ పెద్ద డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) రూపాన్ని సులభతరం చేసేందుకు అత్యధిక శ్లాబు అయిన 28 శాతాన్ని తొలగించాలని అరవింద్ సుబ్రమణియన్ డిమాండ్ చేశారు. అంతేకాక అన్ని ఉత్పత్తులు, సర్వీసులపై ఒకే విధమైన సెస్ రేటును కొనసాగించాలని కూడా కోరారు. ‘28 శాతం రేటును తొలగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. సెస్‌లు ఉండాలి. కానీ సెస్‌ల రేట్లన్నీ ఒకే విధంగా ఉంటే మంచిది. ప్రస్తుతం జీఎస్టీ రేట్లు జీరోగా, 3 శాతంగా(బంగారంపై), 5 శాతంగా, 12 శాతంగా, 18 శాతంగా, 28 శాతంగా ఉన్నాయి. వీటిని హేతుబద్ధం చేయాల్సినవసరం ఉంది. తొలుత 28 శాతం రేటును తొలగించాలి’ అని సుబ్రమణియన్ అన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా అరవింద్ సుబ్రమణియన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. గత వారం క్రితమే సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో తిరిగి అమెరికా వెళ్లేందుకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్‌లో తనకు మనవడు/మనవరాలు పుట్టబోతున్నారని, ఈ క్రమంలోనే తాను కుటుంబంతా సమయం కేటాయించడానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఏడాది వ్యవధిలో ఉన్నత స్థాయి పదవిలో ఉన్న వారు వైదొలగడం ఇది రెండో సారి. -
ఆర్థిక సలహాదారు అరవింద్ రాజీనామా
-
ఆర్థిక సలహాదారు రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. కుటుంబంతో కలిసి ఉండేందుకు ఆయన తిరిగి అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్ పోస్ట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో అరవింద్ సుబ్రమణియన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో దానికి ఆమోదం తెలపడం మినహా మరో మార్గం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు. పలు కీలక ఆర్థిక నిర్ణయాల్లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్ సుబ్రమణియన్ చురుకైన పాత్ర పోషించారు. కాగా 2014 అక్టోబర్‌లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్ సుబ్రమణియన్ నియమితులయ్యారు. ఆర్థిక సలహాదారు పదవి కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం మాత్రమే కాదని కీలక నిర్ణయాల ప్రభావం, పర్యవసానాలనూ అంచనా వేయగలగాలని, ఇవన్నీ అరవింద్ సుబ్రమణియన్‌లో పుష్కలంగా ఉన్నాయని జైట్లీ ప్రశంసించారు. -
రెండంకెల అభివృద్ధి ఎటుపోయింది?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక సలహాదారుడు అర్వింద్ సుబ్రమణియన్ సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన 2017–18 ఆర్థిక సర్వే చప్పచప్పగా ఉంది. జీడీపీలో రెండంకెల అభివృద్ధి సాధించడం అందుబాటులోనే ఉందని, మరికొంత కాలంలోనే అది సాకారమవుతుందని ఇదే అర్వింద్ సుబ్రమణియన్ 2014–15 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన తన తొలి ఆర్థిక సర్వే నివేదికలో వెల్లడించారు. అది ఇప్పటికి సాధ్యంకాకపోగా వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటుందని, అది ఏడు నుంచి ఏడున్నర శాతం వరకు ఉండవచ్చని చెప్పారు. మూడేళ్ల క్రితం చెప్పిన రెండంకెల అభివృద్ధి ఎందుకు సాధ్యం కాలేదని ఆయన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ‘స్టఫ్ హాపెన్స్’ అంటూ బాధ్యతారహితంగా సమాధానం చెప్పారు. స్టఫ్ హాపెన్స్ అనేది ఆంగ్లంలో క్రూరమైన నానుడి. స్థూలంగా దీని అర్థం ‘కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు అంతే. ప్రత్యేక కారణాలంటూ ఉండవు’. బాధ్యతాయుతమైన పదవులో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి సమాధానాన్ని ఆశించలేం. ఆశించిన ఆర్థికాభివృద్ధి సాధించక పోవడానికి కారణం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు బెడిసికొట్టడమేనన్నది అందరికీ తెల్సిందే. అయితే వాటి ప్రభావం మరెంతో కాలం ఉండదని, ఆప్పటికే ఆర్థిక వ్యవస్థ వాటి ప్రభావం నుంచి బయట పడిందని సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఉండొచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పారుగానీ, దానికి అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించలేదు. పెట్టుబడుదారులకు భారంగా పెరిగిన వడ్డీ రేట్ల గురించిగానీ, భారతీయ బ్యాంకుల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన రుణాల మొత్తాలను ఎలా రాబట్టుకోవాలో సూచించలేదు. ఆర్థికంగా మరీ భారమైన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను, భారమవుతున్న బ్యాంకులను అమ్ముకోవాలంటూ ఉచిత సలహా మాత్రం ఇచ్చారు. జీఎస్టీతో ఆర్థిక రంగం ముందుకు దూసుకెళుతుందని, జనధన్ యోజన, ఆధార్ లాంటి పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలవుతాయని గతంలో ఊదరగొట్టిన సుబ్రమణియన్ ఈ రోజున వాటి గురించి మాట మాత్రంగాను ప్రస్తావించలేదు. వ్యవసాయంపైనా వాతావరణ పరిస్థితులు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వాటిని ఎలా ఎదుర్కోవాలో సూచించలేదు. ఎన్నికల సంవత్సరంలో వస్తున్న ఆర్థిక సర్వే కనుక అన్ని రంగాల అభివృద్ధికి సమతౌల్య ప్రణాళికతో ఆర్థిక సర్వే ఉంటుందని భావించిన భారతీయులకు సుబ్రమణియన్ ఆశాభంగమే కలిగించారు. అప్పటికే చక్రం కింద నలిగిన చెరకు గెడను చప్పరించినట్లుగా చప్పచప్పగా ఉంది ఆయన నివేదిక. -
రెండేళ్లలో బ్యాంకు ఖాతాలకు నేరుగా సొమ్ము
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాకు నెలానెలా కొంత మొత్తం ప్రభుత్వం సమకూర్చే విధానం కార్యాచరణకు నోచుకోనుంది. రానున్న రెండేళ్లలో సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ) పథకాన్ని ఒకటి రెండు రాష్ట్రాలైనా అమలు చేస్తాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నా పెద్దా, ధనిక..పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కనీస మొత్తం చెల్లించాలని 2016-17 ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. కాగా,వచ్చే రెండేళ్లలో ఒకట్రెండు రాష్ట్రాలు తప్పనిసరిగా యూబీఐని అమలుచేస్తాయని అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం ప్రస్తుతం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అవినీతిలో కూరుకుపోవడంతో వాటితో పోలిస్తే సార్వత్రిక కనీస రాబడి కింద అందే మొత్తం పౌరుల కనీస అవసరాలను చాలావరకూ తీర్చవచ్చనే అభిప్రాయం నెలకొంది. ఒకటి, రెండు రాష్ట్రాలు ఈ పథకాన్ని తలకెత్తుకున్నా వాటి ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా యూబీఐని దశలవారీగా విస్తరిస్తారు. -
అరవింద్ సుబ్రహ్మణ్యన్ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. వచ్చే నెల అక్టోబర్ 16తో ఆయన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో, అరవింద్ సుబ్రహ్మణ్యన్ పదవీ కాలాన్ని 2018 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేడు(శనివారం) పేర్కొన్నారు. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌లో సీనియర్ ఫెలో అయిన సుబ్రహ్మణ్యన్, 2014 అక్టోబర్‌లో దేశీయ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమింపబడ్డారు. మూడేళ్ల కాలానికి గాను ఆయన, ఈ బాధ్యతలు చేపట్టారు. స్థూల ఆర్థిక అంశాలు, ప్రధాన బాధ్యతలు వంటి వాటికి ఆర్థికమంత్రికి సలహాదారుగా వ్యవహరిస్తారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్ రాజన్ నియమించబడటంతో, సుబ్రహ్మణ్యన్ ఆయన స్థానంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన సుబ్రహ్మణ్యన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేశారు. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్, డీఫిల్ పొందారు. -
ప్రొఫెసర్లకు అరవింద్ సుబ్రమణియన్ పాఠాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తాజాగా ప్రొఫెసర్లకు ఆర్థికాభివృద్ధి పాఠాలు నేర్పుతున్నారు. భారత ఆర్థికాభివృద్ధి, ఆర్థిక సర్వేలో సమకాలీన ధోరణుల అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన తొలి లెక్చర్ ఇచ్చారు. దేశం నలుమూలల్నించి సుమారు 150 మంది ప్రొఫెసర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఏడు రోజుల పాటు సుబ్రమణియన్ 35 ప్రసంగాలు ఇవ్వనున్నట్లు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ కోర్సులో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, ఇటీవలి పరిణామాలు, ఎదురుకాబోయే సవాళ్లు, అనుసరించతగిన వ్యూహాలు మొదలైన వాటి గురించి లోతుగా తెలుసుకునేందుకు అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కోర్సు పూర్తయ్యాక స్థూల ఆర్థిక పరిణామాలు, విధానాలు తదితర అంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు, విశ్లేషించేందుకు తగిన ప్రావీ ణ్యం లభించగలదని జవదేకర్ చెప్పారు. ఒక విధానకర్త ఇలా ప్రొఫెసర్ అవతారమెత్తి, పాఠాలు బోధించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. -
ధనిక, పేద తేడాతో వ్యవసాయ పన్ను!
రాష్ట్రాలను కోరిన ఆర్థిక సలహాదారు అరవింద్ న్యూఢిల్లీ: పేద, ధనిక రైతుల స్థితిగతులకనుగుణంగా రాష్ట్రాలు రైతులపై వ్యవసాయ ఆదాయ పన్ను భారం మోపాలని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సూచించారు. కేంద్రప్రభుత్వం రైతులపై ఆదాయపన్ను విధించకుండా రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని, అయితే రాష్ట్రాలు ఆ పన్ను వేయకుండా ఎవరూ ఆపలేరని అరవింద్ చెప్పారు. ఒకవేళ అలాంటి పన్ను విధించాలని రాష్ట్రాలు భావిస్తే ఆ నిర్ణయాధికారం, అవకాశాలు 29 రాష్ట్రాలకూ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ధనిక, పేద రైతులను గుర్తెరిగి పన్ను వేయాలని రాష్ట్రాలకు సూచించారు. వ్యవసాయ ఆదాయంపైనా ఖచ్చితంగా పన్ను వేయాల్సిందేనని నీతి ఆయోగ్ సభ్యుడైన బిబేక్ డిబ్రోయ్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. అయితే, అలాంటి పన్నును కేంద్రప్రభుత్వం విధించబోదని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. వ్యవసాయ ఆదాయంపై పన్ను ప్రసక్తే లేదు: పనగరియా వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే ప్రశ్నే లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో వ్యవసాయ ఆదాయంపై పన్ను ఎలా విధిస్తామని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ ఆదాయంపై కూడా పన్ను విధించాలన్న నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రోయ్ వివాదాస్పద వ్యాఖ్యలపై శుక్రవారం సీఐఐ సదస్సు సందర్భంగా స్పందిస్తూ... దేశంలోని 80 శాతం గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయంతో ముడిపడ్డాయని పేర్కొన్నారు. -
‘హెచ్1బీ’తో భారత్‌కు దెబ్బే!
సంస్కరణలతో అమెరికాకు ఎగుమతయ్యే సేవలపై ప్రభావం ► ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ► మాకు సాయపడే కంపెనీలకు మరిన్ని వీసాలు!: అమెరికా వాషింగ్టన్: భారత్‌లో అధిక శాతం సేవలు అమెరికాకే ఎగుమతి అవుతున్నాయని, అందువల్ల హెచ్1బీ వీసాల జారీలో ట్రంప్ సర్కారు తీసుకునే తీవ్రమైన చర్యలు భారత్‌కు ఆందోళనకరంగా పరిణమిస్తాయని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. అమెరికాలోని ఆర్థిక మేథో సంస్థ పీటర్సన్ ఇన్స్టిట్యూట్లో ప్రసంగిస్తూ హెచ్1బీ వీసా ఆందోళనలపై స్పందించారు. ‘ట్రంప్ యంత్రాంగం ఏవైనా కఠిన చర్యలు తీసుకుంటే అది భారత్‌కు ఆందోళనకరమే. భారత్‌లోని మొత్తం ఎగుమతుల్లో సేవారంగ ఎగుమతులు 40– 45 శాతం వరకూ ఉన్నాయి. ఇక మొత్తం సేవల్లో 50–60 శాతం వరకూ అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్1బీపై ఆంక్షలు భారత్‌పై ఎక్కువ ప్రభావం చూపవచ్చు’ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. వీసా సంస్కరణలు సహేతుకంగా ఉంటే ఫర్వాలేదని, ఎగుమతుల వృద్ధిపై ప్రభావం చూసే ఏ చర్యలైనా భారత్‌కు ఆందోళనకరమేనని, అందుకే అమెరికా తీసుకునే నిర్ణయాల్ని భారత్ నిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు. భారత కంపెనీలకు గౌరవం: అమెరికా తమ దేశంలో పెట్టుబడులు పెట్టిన భారత కంపెనీలకు అత్యంత గౌరవం ఇస్తామని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని అమెరికా స్పష్టం చేసింది. హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో భారత కంపెనీలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ.. కొద్ది రోజుల క్రితం అమెరికా ఆర్థిక మంత్రి స్టివెన్ మ్యూచిన్తో సమావేశం సందర్భంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక శాఖ తాత్కాలిక అధికార ప్రతినిధి మార్క్ టోనర్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెడుతున్న భారత కంపెనీలకు తాము అమితమైన గౌరవం ఇస్తామని, అవి తమ దేశంలో అనేక ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఆ గౌరవంతో వాటికి కొత్తగా వీసాలు కావాలంటే.. దానిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వాటా 8.8 శాతమే హెచ్1–బీ వీసాల్లో సింహ భాగం భారతీయ కంపెనీలకే దక్కుతున్నాయన్న అమెరికా ఆరో పణల్ని ఐటీ పరిశ్రమ విభాగం నాస్కాం తోసిపుచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లను సమ ర్థిస్తూ 2014–15లో హెచ్1బీల్లో కేవలం 8.8 శాతం (7504) మాత్రమే ఈ రెండు సంస్థలకు దక్కాయంది. ఖాతాదారు కంపెనీల అవసరా లకు అనుగుణంగా ఉద్యోగుల్ని పంపేందుకు మాత్రమే ఈ వీసాల్ని వాడుతున్నాయంది. రుణమాఫీతో జీడీపీ లోటు.. దేశంలో ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రుణమాఫీ నిర్ణయంపై ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్ ఆందో ళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ విధానం దేశమంతా అమలైతే దేశ జీడీపీ లోటు రెండు శాతం పెరిగే ప్రమాదముంద న్నారు. వాషింగ్టన్లో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ మరింత విస్తరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా పరిణమిస్తుంద న్నారు. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ. 36వేల కోట్ల వ్యవసాయ రుణాల్ని మాఫీ చేసిన నేపథ్యంలో సుబ్రమణియన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తూ వరుస ప్రకటనలు వెలువడడం విన్నాం. ఇది మరింత విస్తరిస్తే జీడీపీలో 2 శాతం లోటు ఏర్పడవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేపడుతు న్న ఆర్థిక వృద్ధి రేటు పెంపు ప్రయత్నాలకు ఇవి పెద్ద సవాలుగా పరిణమిస్తాయి. ఆర్థికంగా కేంద్రం సాధిస్తున్న విజయాల్ని రాష్ట్రాలు నిరుపయోగం చేస్తున్నాయ’ని విమర్శించారు. ప్రైవేట్ రంగంలో పేరుకుపోయిన రుణాల్ని ఎలా మాఫీ చేయాలన్న సవాలుతో కేంద్ర ప్రభుత్వం తంటాలు పడుతోందని, ఇప్పుడది రాజకీయ అంశంగా కూడా మారిందన్నారు.