‘హెచ్1బీ’తో భారత్‌కు దెబ్బే!
సంస్కరణలతో అమెరికాకు ఎగుమతయ్యే సేవలపై ప్రభావం
► ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్
► మాకు సాయపడే కంపెనీలకు మరిన్ని వీసాలు!: అమెరికా
వాషింగ్టన్: భారత్‌లో అధిక శాతం సేవలు అమెరికాకే ఎగుమతి అవుతున్నాయని, అందువల్ల హెచ్1బీ వీసాల జారీలో ట్రంప్ సర్కారు తీసుకునే తీవ్రమైన చర్యలు భారత్‌కు ఆందోళనకరంగా పరిణమిస్తాయని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. అమెరికాలోని ఆర్థిక మేథో సంస్థ పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగిస్తూ హెచ్1బీ వీసా ఆందోళనలపై స్పందించారు. ‘ట్రంప్ యంత్రాంగం ఏవైనా కఠిన చర్యలు తీసుకుంటే అది భారత్‌కు ఆందోళనకరమే.
భారత్‌లోని మొత్తం ఎగుమతుల్లో సేవారంగ ఎగుమతులు 40– 45 శాతం వరకూ ఉన్నాయి. ఇక మొత్తం సేవల్లో 50–60 శాతం వరకూ అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్1బీపై ఆంక్షలు భారత్‌పై ఎక్కువ ప్రభావం చూపవచ్చు’ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. వీసా సంస్కరణలు సహేతుకంగా ఉంటే ఫర్వాలేదని, ఎగుమతుల వృద్ధిపై ప్రభావం చూసే ఏ చర్యలైనా భారత్‌కు ఆందోళనకరమేనని, అందుకే అమెరికా తీసుకునే నిర్ణయాల్ని భారత్ నిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు.
భారత కంపెనీలకు గౌరవం: అమెరికా
తమ దేశంలో పెట్టుబడులు పెట్టిన భారత కంపెనీలకు అత్యంత గౌరవం ఇస్తామని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని అమెరికా స్పష్టం చేసింది. హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో భారత కంపెనీలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ.. కొద్ది రోజుల క్రితం అమెరికా ఆర్థిక మంత్రి స్టివెన్ మ్యూచిన్‌తో సమావేశం సందర్భంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక శాఖ తాత్కాలిక అధికార ప్రతినిధి మార్క్ టోనర్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెడుతున్న భారత కంపెనీలకు తాము అమితమైన గౌరవం ఇస్తామని, అవి తమ దేశంలో అనేక ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఆ గౌరవంతో వాటికి కొత్తగా వీసాలు కావాలంటే.. దానిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
టీసీఎస్, ఇన్ఫోసిస్ వాటా 8.8 శాతమే
హెచ్1–బీ వీసాల్లో సింహ భాగం భారతీయ కంపెనీలకే దక్కుతున్నాయన్న అమెరికా ఆరో పణల్ని ఐటీ పరిశ్రమ విభాగం నాస్కాం తోసిపుచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లను సమ ర్థిస్తూ 2014–15లో హెచ్1బీల్లో కేవలం 8.8 శాతం (7504) మాత్రమే ఈ రెండు సంస్థలకు దక్కాయంది. ఖాతాదారు కంపెనీల అవసరా లకు అనుగుణంగా ఉద్యోగుల్ని పంపేందుకు మాత్రమే ఈ వీసాల్ని వాడుతున్నాయంది.
రుణమాఫీతో జీడీపీ లోటు..
దేశంలో ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రుణమాఫీ నిర్ణయంపై ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్ ఆందో ళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ విధానం దేశమంతా అమలైతే దేశ జీడీపీ లోటు రెండు శాతం పెరిగే ప్రమాదముంద న్నారు. వాషింగ్టన్‌లో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ మరింత విస్తరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా పరిణమిస్తుంద న్నారు. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ. 36వేల కోట్ల వ్యవసాయ రుణాల్ని మాఫీ చేసిన నేపథ్యంలో సుబ్రమణియన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తూ వరుస ప్రకటనలు వెలువడడం విన్నాం. ఇది మరింత విస్తరిస్తే జీడీపీలో 2 శాతం లోటు ఏర్పడవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేపడుతు న్న ఆర్థిక వృద్ధి రేటు పెంపు ప్రయత్నాలకు ఇవి పెద్ద సవాలుగా పరిణమిస్తాయి. ఆర్థికంగా కేంద్రం సాధిస్తున్న విజయాల్ని రాష్ట్రాలు నిరుపయోగం చేస్తున్నాయ’ని విమర్శించారు. ప్రైవేట్ రంగంలో పేరుకుపోయిన రుణాల్ని ఎలా మాఫీ చేయాలన్న సవాలుతో కేంద్ర ప్రభుత్వం తంటాలు పడుతోందని, ఇప్పుడది రాజకీయ అంశంగా కూడా మారిందన్నారు.