మస్క్ వాదనకు కాబోయే అధ్యక్షుని మద్దతు
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ కార్మికులకు అమెరికా సంస్థల్లో ఉపాధికి ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమని వ్యాఖ్యానించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మద్దతు లభించింది. హెచ్–1బీ వీసాల జారీని అమెరికాలో పలువురు వ్యతిరేకిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పని చేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాలను వ్యతిరేకించేవారు తమ అభిప్రాయం మార్చుకోవాలని మస్క్ సూచించడం తెల్సిందే. కేవలం నైపుణ్యత మీదనే మనగలిగే స్పేస్‌ఎక్స్, టెస్లా వంటి సృజనాత్మక సంస్థలకు హెచ్–1బీ వీసాదారుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు.
‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులు కానున్న మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీకి మద్దతు తెలుపుతున్నారు. దీన్ని రిపబ్లికన్ పారీ్ట సీనియర్లు తప్పుబడుతున్నారు. స్థానిక అమెరికన్లకే అధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానానికి ఇది విరుద్ధమంటున్నారు. వాళ్ల వైఖరిని మస్క్ తప్పుబట్టారు. హెచ్–1బీ వీసాల కోసం ఎంతకైనా తెగిస్తానని శనివారం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment