కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక సలహాదారుడు అర్వింద్ సుబ్రమణియన్ సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన 2017–18 ఆర్థిక సర్వే చప్పచప్పగా ఉంది. జీడీపీలో రెండంకెల అభివృద్ధి సాధించడం అందుబాటులోనే ఉందని, మరికొంత కాలంలోనే అది సాకారమవుతుందని ఇదే అర్వింద్ సుబ్రమణియన్ 2014–15 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన తన తొలి ఆర్థిక సర్వే నివేదికలో వెల్లడించారు. అది ఇప్పటికి సాధ్యంకాకపోగా వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటుందని, అది ఏడు నుంచి ఏడున్నర శాతం వరకు ఉండవచ్చని చెప్పారు.
మూడేళ్ల క్రితం చెప్పిన రెండంకెల అభివృద్ధి ఎందుకు సాధ్యం కాలేదని ఆయన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ‘స్టఫ్ హాపెన్స్’ అంటూ బాధ్యతారహితంగా సమాధానం చెప్పారు. స్టఫ్ హాపెన్స్ అనేది ఆంగ్లంలో క్రూరమైన నానుడి. స్థూలంగా దీని అర్థం ‘కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు అంతే. ప్రత్యేక కారణాలంటూ ఉండవు’. బాధ్యతాయుతమైన పదవులో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి సమాధానాన్ని ఆశించలేం. ఆశించిన ఆర్థికాభివృద్ధి సాధించక పోవడానికి కారణం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు బెడిసికొట్టడమేనన్నది అందరికీ తెల్సిందే. అయితే వాటి ప్రభావం మరెంతో కాలం ఉండదని, ఆప్పటికే ఆర్థిక వ్యవస్థ వాటి ప్రభావం నుంచి బయట పడిందని సుబ్రమణియన్ స్పష్టం చేశారు.
అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఉండొచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పారుగానీ, దానికి అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించలేదు. పెట్టుబడుదారులకు భారంగా పెరిగిన వడ్డీ రేట్ల గురించిగానీ, భారతీయ బ్యాంకుల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన రుణాల మొత్తాలను ఎలా రాబట్టుకోవాలో సూచించలేదు. ఆర్థికంగా మరీ భారమైన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను, భారమవుతున్న బ్యాంకులను అమ్ముకోవాలంటూ ఉచిత సలహా మాత్రం ఇచ్చారు. జీఎస్టీతో ఆర్థిక రంగం ముందుకు దూసుకెళుతుందని, జనధన్ యోజన, ఆధార్ లాంటి పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలవుతాయని గతంలో ఊదరగొట్టిన సుబ్రమణియన్ ఈ రోజున వాటి గురించి మాట మాత్రంగాను ప్రస్తావించలేదు. వ్యవసాయంపైనా వాతావరణ పరిస్థితులు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వాటిని ఎలా ఎదుర్కోవాలో సూచించలేదు.
ఎన్నికల సంవత్సరంలో వస్తున్న ఆర్థిక సర్వే కనుక అన్ని రంగాల అభివృద్ధికి సమతౌల్య ప్రణాళికతో ఆర్థిక సర్వే ఉంటుందని భావించిన భారతీయులకు సుబ్రమణియన్ ఆశాభంగమే కలిగించారు. అప్పటికే చక్రం కింద నలిగిన చెరకు గెడను చప్పరించినట్లుగా చప్పచప్పగా ఉంది ఆయన నివేదిక.
Comments
Please login to add a commentAdd a comment