బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావన లేకుండా పోతోంది. ప్రతి సంవత్సరం ప్రకటించే ఎకనామిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా తొలగించారు. వీటన్నింటికీ పరాకాష్టగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల పేదలను ఆదుకునే పేరుతో తీసుకొచ్చిన పదిశాతం రిజర్వేషన్లు. ఇది కేవలం దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు.
‘‘సామాజిక న్యాయం, సామాజిక సామరస్య సూత్రాల ఆధారంగా సమాజంలోని అంతరాలను తొలగించడానికి బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఆర్థిక న్యాయం, రాజకీయ సాధికారతతో కూడిన సామాజిక న్యాయం మరింత శక్తివంతమయ్యేందుకు, అస్థిత్వ రాజకీ యాలు, తాత్కాలిక ఉపశమనాలకు బదులుగా సమాజంలోని అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్రాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. విద్య, వైద్యం, ఉపాధి విషయాల్లో సమానావకాశాలను అందించడానికి సమతుల్యతను పాటిస్తాం’’ అని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో ఆర్భాటంగాప్రకటించుకుంది.
అయితే ఆచరణలో ఐదేళ్ళ మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నదన్నది అక్షర సత్యం. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం బీజేపీ ప్రభుత్వ ఆలోచనలో సైతం లేదన్న వాస్తవాన్ని బలోపేతం చేస్తోంది. గత ఐదేళ్ళుగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల సంగతి అటుంచితే కనీసం వాళ్ళని మనుషులుగా చూడనిపరిస్థితికి అద్దం పడుతోంది. ఐదేళ్ళ బీజేపీ పాలన దేశంలోని దళితుల, ఆదివాసీల బతుకులను శతాబ్దాల అగాధాల్లోకి నెట్టివేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి మీద దృష్టిపెడుతున్నది. అందుకోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సాగించే వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్స్ ప్రారంభించింది. ఆ పథకం ఎంతో మంది అణగారిన వర్గాల వారిని పరిశోధన వైపు తీసుకురాగలిగింది. కానీ బీజీపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేసింది. బడ్జెట్‌లో కేటాయింపులే దానికి ప్రత్యక్షనిదర్శనం. బీసీ విద్యార్థుల కోసం ప్రకటించిన జాతీయ స్కాలర్‌షిప్‌లు 2012–2013 సంవత్సరంలో 45 కోట్లు ఖర్చు చేస్తే, 2019–20 సంవత్సరానికి 30 కోట్లు కేటాయించడం శోచనీయం. ఇందులో దాగి ఉన్న మరో మోసం ఏమిటంటే, 2018–19 సంవ త్సరం బడ్జెట్‌లో 110 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
కానీ బడ్జెట్ సవరణలలో అది 30 కోట్లకు కుదించారు. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే కొన్ని వేల మంది విద్యార్థులు నష్టపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ విద్యార్థులు అధికంగా ఆధారపడే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు చాలా ఘోరంగా కోతకు గురయ్యాయి. 2017–18లో 3414 కోట్లు కేటాయిస్తే, 2019–20 సంవత్సరానికి అది 2926 కోట్లకు పడిపోయింది. ఎస్సీల కోసం ముఖ్యమైన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ కోసం గత రెండేళ్ళుగా కేటాయింపులు లేనేలేవు. ఇక రాష్ట్రాలలో ఆదివాసుల కోసం అమలు చేసే స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ గత రెండేళ్లుగా 1350 కోట్లుగా నిలకడగా కొనసాగుతున్నది. బడ్జెట్ మాత్రం లక్షల కోట్లకు పెరిగిపోతున్నా వీరి అభివృద్ధి కోసం కేటాయిం చాల్సిన నిధులు మాత్రం అంతకంతకూ కనుమరుగైపోతున్నాయి.
ఆది వాసీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కేటాయించే నిధు లను చూస్తే ప్రభుత్వ చేతలకీ, మాటలకీ పొంతన లేని విషయం తేటతెల్లం అవుతుంది. 2017– 18లో కోటి రూపాయలు, 2019–20లో రెండు కోట్లు కేటాయించారు. అదేవిధంగా బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళే స్కాలర్ షిప్‌ల మొత్తం గణనీయంగా తగ్గించేశారు. 2017–18లో 19 కోట్ల 87 లక్షలుంటే, అది 2018–19, 2019–20లలో 10 కోట్లకు కుదించారు. ఇవి బీజేపీ విధానాల డొల్లతనాన్ని బయటపెట్టే మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించుకున్న కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఈ అక్టోబర్ 2తో ఇది పరిసమాప్తం కాబోతున్నది. స్వచ్ఛభారత్‌లో చెరగని మచ్చ మాన్యువల్ స్కావెంజింగ్. మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే అమానవీయ చర్యను నిర్మూలించే ఉద్దేశంతో 15 ఏళ్ళ క్రితమే ఒక చట్టం వచ్చింది. కానీ ఆ చట్టం సమర్థవం తంగా అమలు జరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఈ దారుణమైన పనిలో 58 వేల మంది ఉన్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఈ లెక్కలు కాకి లెక్కలన్న విషయాన్ని సఫాయికర్మచారీ ఆందోళన్ నాయకుడు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ సాక్ష్యాధారాలతో సహా వివరిస్తున్నారు. మాన్యువల్ స్కావెంజర్స్ సంఖ్య ఒక లక్షకుపైనే ఉంటుం దని బెజవాడ విల్సన్ ప్రకటించారు.
అయితే ఈ అత్యంత అమానవీయ పనిలో శతాబ్దాల తరబడి మునిగితేలుతున్న దళితులకు పునరావాసం కల్పించి, వారిని ఆ వృత్తి నుంచి దూరంగా తీసుకురావాలని చట్టం నిర్దేశిస్తున్నది. ప్రతి కార్మికుడికీ ఒకేసారి 40 వేల రూపాయలు ఇచ్చి ఆ పనిని మాన్పించేందుకు సహకరించాలని ప్రభుత్వాలే నిర్ణయించాయి. అయితే ఈ సంవత్సరాంతంలోగా వీరికి పునరావాసం కల్పించాలి. అందుకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 232 కోట్లు అవసరమవుతాయి. సఫాయికర్మచారీ ఆందోళన్ అంచనాను తీసుకుంటే 480 కోట్లు ఖర్చవుతాయి. కానీ, కేంద్రం దీనికి కేవలం 30 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ప్రభుత్వ ద్వంద్వ వైఖరి స్పష్టమౌతుంది. 2017–18లో ఈ కార్యక్రమానికి కేటాయింపులే లేకపోవడం మరో విచిత్రమైన విషయం.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాల్లో ప్రణాళికా సంఘం రద్దు ఒకటి. దీనివల్ల బడ్జెట్‌లో మార్పులు జరిగాయి. ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ అనే విధానానికే స్వస్తి పలి కారు. దీంతో ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికోసం రూపొందించిన సబ్‌ప్లాన్ విధానం ప్రమాదంలో పడిపోయింది. అయితే కేంద్రంలో మాత్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఏవో లెక్కలు చూపిస్తున్నారు. సెంటర్ ఫర్ బడ్జెట్, గవర్నెన్స్ అకౌంటబిలిటీ సంస్థ అధ్యయనం ప్రకారం, ఈ పథకం కేవలం నామమాత్రంగానే కొనసాగుతున్నదని తేలిపోయింది.
1974 నుంచి ట్రైబల్ సబ్ ప్లాన్, 1979–80 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అమలులో ఉంది, 2006 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్‌ను షెడ్యూల్డ్ కులాల సబ్‌ప్లాన్‌గా మార్చారు. ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వారికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలనేది సబ్‌ప్లాన్ సారాంశం. ఎస్సీ, ఎస్టీల వాడలు, పల్లెలు, గూడేలు, తండాలు అభి వృద్ధితో పాటు, వ్యక్తిగత అభివృద్ధి కూడా దీని ఉద్దేశం.
కానీ కనీసం కాగితాలవరకైనా జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపులే లేవు. ఎస్సీల సబ్‌ప్లాన్ 16 శాతం కేటాయించాల్సి ఉండగా, 2017–18లో 8.4 శాతం, 2018–19లో 8.8 శాతం, 2019–20లో 9.3 శాతం మాత్రమే కేటాయించారు. ఇవి ఏవీ కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయవు. రక్షణ రంగం, శాస్త్రసాంకేతిక రంగాలు, పరిశోధనా విభాగాలు, ఇంకా ఇతర రంగాలు ఏవీ కూడా ఎస్సీల అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ఉపయోగపడవు. ట్రైబల్ సబ్‌ప్లాన్ ప్రకారం ఆదివాసులకు 8.6 శాతం కేటాయించాల్సి ఉండగా 2017–18లో 5.6 శాతం, 2018–19లో 5.8 శాతం, 2019–20లో 6.1 శాతం కేటాయింపులు చూపించి చేతులు దులుపుకున్నారు.
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం గత ప్రభుత్వాలు అనుసరించిన విధా నాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాఖలాలు లేవు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీల పట్ల ముఖ్యంగా ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం ఒకరకంగా శతృవైఖరినే అవలంబిస్తూ వస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల బలిదానం నుంచి మొదలుకొని, ఆవు మాంసం తిన్నారనే పేరుతోనో మరో కారణంతోనో దళితుల మీద జరిగిన హత్యాకాండను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తూండటం ప్రజలకు తెలియంది కాదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ అనుసరిస్తోన్న రాజకీయవిధానం ఇందుకు నిదర్శనం. రాజ్యాంగం అందించిన హక్కుల ద్వారా చదువుకొని, విద్యావంతులవుతున్న దళితుల పట్ల హిందూ సమాజంలోని కులాలకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది.
రిజర్వేషన్ల వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదనే కోపం కూడా ఉంది. దీనిని ఉపయోగించుకొని బీసీలతో సహా హిందూ సమాజంలోని కులాలన్నింటినీ ఏకం చేయడం కోసమే ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన గత ఎన్నికల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. దానికి ముస్లింల పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా ప్రభుత్వం దీనికి జతచేస్తున్నది. దళితులు, ముస్లింలమీద గోసంరక్షణ పేరుతో జరిగిన దాడులు దీనికి నిదర్శనం. ఈ దృక్పథమే బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాల అమలు మీద ప్రభావం చూపుతున్నది. అందువల్లనే బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావనలేకుండా పోతోంది.
ప్రతి సంవత్సరం ప్రకటించే ఎకనామిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా తొలగించారు. వీటన్నింటికీ పరాకాష్టగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల పేదలను ఆదుకునే పేరుతో తీసుకొచ్చిన పదిశాతం రిజర్వేషన్లు. ప్రభుత్వాల దగ్గర నిధులు లేకకాదు. వాళ్ళు అనుకుంటే వేల కోట్లను రాత్రికి రాత్రే తమ కులాల వాళ్ళకు పంపిణీ చేయగలరు. అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు. చివరకు బాగా ముడుపులు అందే రక్షణ రంగం కావచ్చు. కానీ దళిత, ఆదివాసీల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా బయటపెట్టింది. ఇది కేవలం దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు.
వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment