
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్‌లో జనాకర్షక పథకాలకు పెద్దగా అవకాశం ఉండదని, ఉపాథి, పెట్టుబడుల ప్రవాహం పెంచే సంస్కరణలకే పెద్దపీట వేస్తుందని ఆర్థిక సర్వే సంకేతాలు పంపింది. ఉపాధి రంగాలైన టెక్స్‌టైల్స్, లెదర్, అపెరల్స్, జెమ్స్, జ్యూవెలరీ వంటి శ్రామిక శక్తి అధికంగా ఉన్న రంగాలకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ఉంటాయని భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచి..ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు వృద్ధి చెందే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వ్యవసాయం, ఎగుమతులకు ఊతం
ఉపాధి, విద్య, వ్యవసాయ రంగాలకు భారీగా ఊతమివ్వాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసిన క్రమంలో బడ్జెట్‌లో ఈ రంగాలకు ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. యువత, మహిళలతో పాటు శ్రామిక శక్తికి మెరుగైన ఉద్యోగాలను అందుబాటులోకి తేవడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ద్వారా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం తక్షణ అజెండాగా ఆర్థిక సర్వే పేర్కొనడంతో బడ్జెట్‌లో ఈ దిశగా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.
వీటికి తోడు ప్రయివేటు పెట్టుబడులు, ఎగుమతులపై ఆర్థిక వృద్ధి వేగాన్ని నిలకడగా కొనసాగించడం కీలకమని సర్వే చాటింది. వర్షపాత లేమితో పలు ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత పడిపోవడంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో రానున్న బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు నిధుల కేటాయింపు పెరిగే అవకాశం ఉంది.