ప్రొఫెసర్లకు అరవింద్ సుబ్రమణియన్ పాఠాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తాజాగా ప్రొఫెసర్లకు ఆర్థికాభివృద్ధి పాఠాలు నేర్పుతున్నారు. భారత ఆర్థికాభివృద్ధి, ఆర్థిక సర్వేలో సమకాలీన ధోరణుల అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన తొలి లెక్చర్ ఇచ్చారు. దేశం నలుమూలల్నించి సుమారు 150 మంది ప్రొఫెసర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఏడు రోజుల పాటు సుబ్రమణియన్ 35 ప్రసంగాలు ఇవ్వనున్నట్లు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.
ఈ కోర్సులో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, ఇటీవలి పరిణామాలు, ఎదురుకాబోయే సవాళ్లు, అనుసరించతగిన వ్యూహాలు మొదలైన వాటి గురించి లోతుగా తెలుసుకునేందుకు అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కోర్సు పూర్తయ్యాక స్థూల ఆర్థిక పరిణామాలు, విధానాలు తదితర అంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు, విశ్లేషించేందుకు తగిన ప్రావీ ణ్యం లభించగలదని జవదేకర్ చెప్పారు. ఒక విధానకర్త ఇలా ప్రొఫెసర్ అవతారమెత్తి, పాఠాలు బోధించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.