సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. వచ్చే నెల అక్టోబర్ 16తో ఆయన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో, అరవింద్ సుబ్రహ్మణ్యన్ పదవీ కాలాన్ని 2018 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేడు(శనివారం) పేర్కొన్నారు. పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌లో సీనియర్ ఫెలో అయిన సుబ్రహ్మణ్యన్, 2014 అక్టోబర్‌లో దేశీయ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమింపబడ్డారు. మూడేళ్ల కాలానికి గాను ఆయన, ఈ బాధ్యతలు చేపట్టారు.
స్థూల ఆర్థిక అంశాలు, ప్రధాన బాధ్యతలు వంటి వాటికి ఆర్థికమంత్రికి సలహాదారుగా వ్యవహరిస్తారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్ రాజన్ నియమించబడటంతో, సుబ్రహ్మణ్యన్ ఆయన స్థానంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన సుబ్రహ్మణ్యన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేశారు. యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్, డీఫిల్ పొందారు.