ముంబై గత వైభవ చిహ్నాలుగా నిలిచిన బట్టల మిల్లుల పొగగొట్టాలు ఒక్కటొకటిగా అంతరిస్తుంటే వాటి కంటే ప్రమాదకరమైన విషవాయువులను వెదజల్లుతున్న నగల తయారీ గొట్టాలు పెనుసమస్యకు కారణమవుతున్నాయి.
ఒకప్పుడు ముంబైలో దాదాపు 80 టెక్స్‌టైల్ మిల్లులుండేవి. మొదటి ప్రపంచ యుద్ధ కాలం వరకు నగరంలో ప్రధాన పారిశ్రామిక కార్యాచరణ పత్తిని దుస్తులుగా మార్చడంగానే ఉండేది. నల్లమందు వ్యాపారంలోని మిగులుతో ఇవి 1850ల మధ్యలో వృద్ధి చెందాయి. ఇటీవలి వరకు దాదాపు 200 అడుగుల ఎత్తున్న బట్టల మిల్లుల పొగ గొట్టాలు ముంబై నగరానికి విశిష్ట చిహ్నంగా ఉండేవి.
ప్రముఖ కార్మిక నేత దత్తా సామంత్ నేతృత్వంలో 1982లో మిల్లు కార్మికులు విఫల సమ్మెను చేపట్టాక ముంబై మిల్లులు పనిచేయడం ఆగిపోయింది. దీంతో పరిస్థితి మారిపోయింది. 1990లో ప్రభుత్వం మిల్లులకు చెందిన భూములను రియల్ ఎస్టేట్‌లోకి మార్చడానికి అనుమతించింది. దీంతో ముంబై ఉజ్వల గతానికి చిహ్నంగా నిలిచిన ఎల్తైన చిమ్నీల స్థానంలో ఇప్పుడు ఆఫీసులు, మాల్స్, గృహసముదాయాలతో కూడిన ఆకాశాన్నంటే టవర్లను ఎవరైనా చూడవచ్చు.
కష్టంతో అయినా సరే, మీకు మంచి గైడ్ దొరి కితే, ముంబైలో ఇంకా మిగిలివున్న ఒకటీ, రెండు మిల్లుల గొట్టాలను మీరు గుర్తించవచ్చు. కానీ ఇవి కూడా త్వరగానో, తర్వాతో కూల్చివేతకు సమీపంలో ఉన్నాయి. భూమి కోసం తహతహలాడుతున్న నగరంలో ఖాళీ స్థలాలకు విలువ పెరుగుతోంది. కానీ ఇప్పుడు ఎల్తైన చిమ్నీలు కాకుండా, మరెన్నో పొగగొట్టాలను నగరంలో చూడవచ్చు. కానీ ఇవి చిన్నపాటి స్థలంలో ప్రధానంగా అత్యంత రద్దీ ఉండే దక్షిణ ముంబైలోని కల్బాదేవి ప్రాంతంలో కనిపిస్తాయి. అయితే ఈ చిమ్నీలు బంగారాన్ని నగలుగా మార్చే యూనిట్లకు సంబంధించినవి. ఇక్కడ తయారైన నగలను వలస వచ్చిన మహిళలు ఉపయోగిస్తుంటారు. ఇవి సమీపంలోని జవేరి బజార్‌కు తరలి వెళతాయి. దేశంలోని అతి పెద్ద బంగారం మార్కెట్ ఇదే. ఇవి కల్బాదేవి ఆవరణలో ఈ తయారీ యూనిట్లున్నాయి కాబట్టే ఇక్కడినుంచి జవేరి బజార్‌కు తరలించడం సులభం. కానీ ఇక్కడి ఇతర నివాస ప్రాంతాలకు దీనివల్ల కలుగుతున్న అసౌకర్యం కానీ, ఆరోగ్యానికి కలుగుతున్న ప్రమాదం గురించి కానీ ఆలోచించరు.
బట్టల మిల్లులకు చెందిన పొగగొట్టాలు చిమ్మే పొగలాగా కాకుండా, ఈ నగల తయారీ గొట్టాలు వాటినుంచి విషవాయువులను వెదజల్లుతాయి. ఈ పొగ గొట్టాలు సమీపంలోని పాతవీ, అతి చిన్నవి అయిన నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంటున్నాయి. చావల్స్ అని పిలుస్తున్న ఈ చిన్న అపార్ట్‌మెంట్లు నగరంలోని తొలి సామూహిక గృహాలకు సంకేతాలు. ఒక ఉమ్మడి వరండాలో విడి గదులు ఉంటాయి. వీటి చివరలో ఉమ్మడి మరుగుదొడ్లు ఉంటాయి.
ఇవి ప్రారంభంలో మిల్లులకు సమీపంలో బట్టల మిల్లుల కార్మికులకు నివాసం కల్పించాయి. తర్వాత బట్టల మిల్లులకు వెన్నెముకగా ఉండే విస్తరిస్తున్న నగర ఆర్థిక వ్యవస్థకు సేవ చేసేందుకు వచ్చినవారికి ఆశ్రయం కల్పించాయి. ఈ చిన్న చిన్న గదులు ఇరుగ్గా, గాలి తక్కువగా, సౌకర్యాల లేమితో ఉంటున్నందున జనాభా గణన అధికారులు వీటిని సులువుగా మురికివాడలుగా గుర్తించేవారు. ఈ గృహాలు అక్కడి మొత్తం ప్రాంతాన్ని ప్రమాదకరంగా మార్చేశాయి.
ఈ నగల తయారీ యూనిట్లలో యాసిడ్లను, పెద్ద సంఖ్యలో ఎల్పీజీ సిలెండర్లను నిలువ చేస్తారు. ముడి బంగారాన్ని వీటితో కరిగించి ఒక రూపానికి తెస్తారు. ఈ క్రమంలో వచ్చే వాయువులు అగ్నిప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఈ ఇళ్లకు చెందిన మెట్లు సాధారణంగా కొయ్యతో చేసి ఉంటాయి. ఇది మరీ ప్రమాదకరం. బంగారం వేడి చేసేటప్పుడు వచ్చే పొగలు ఇక్కడ రోజువారీ సమస్యగా మారిపోయాయి. ఇక్కడ అగ్నిప్రమాదాలు ఏర్పడే సమస్యే కాదు. ఇక్కడి రోడ్లు ఇరుగ్గా ఉండటంతో ఫైర్ ఇంజన్లు లోపలికి రాలేవు. ఇటీవల సంభవించినట్లుగా అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడం ఇక్కడ పెనుసవాలు. నగల వ్యాపారం చేసే జిల్లాల నుంచి వచ్చే రోజువారీ జనాలు మరిన్ని సమస్యలకు కారణమవుతుంటారు.
ఈ నగల తయారీ యూనిట్లను తొలగించాలని ముఖ్యమంత్రి పురపాలక సంస్థను ఆదేశించినప్పటికీ, పసిడి రంగానికి చెందిన సంపన్న, శక్తివంతమైన శక్తులే ఈ యూనిట్ల వృద్ధికి కారకులని పురపాలక సంస్థకు తెలుసు కాబట్టి ఇక్కడ నివాసముంటున్న వారు పరిస్థితి మార్పుపై పెద్దగా ఆశలు పెట్టుకోరు. నగల తయారీ గొట్టాలను తొలగించాలని ఆదేశించి అమలు చేసినా, మళ్లీ అవి ఎలాగోలా ఏర్పడుతుండటంతో పురపాలక అధికారులు హేళనకు గురవుతుంటారు.
బులియన్ మార్కెట్ చాలా కఠోరమైంది. మొండిపట్టు గలది. బాంద్రా–కుర్లా కాంప్లెక్స్ లోని అత్యంత విలువైన డైమండ్ మార్కెట్‌లోని స్థలాలను వీరు కొనుగోలు చేసినప్పటికీ గత దశాబ్దంగా వీటిలో నివసించిన వారే లేకపోయారు. ఎందుకంటే జవెరీ బజార్ వారి వ్యాపారానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంది. వ్యాపారానికి ముఖ్యమైనది సామీప్యతే కదా. కాబట్టి ఈసారి ఈ సమస్య పరిష్కారం అటు ముఖ్యమంత్రికీ, ఇటు మునిసిపల్ కార్పొరేషన్‌కీ పరీక్షే మరి.
మహేశ్ విజాపుర్కర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment