నాజీ ప్రేతాత్మను నిద్ర లేపకండి! | trump like hitler | Sakshi
Sakshi News home page

నాజీ ప్రేతాత్మను నిద్ర లేపకండి!

Published Thu, Nov 17 2016 12:23 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

నాజీ ప్రేతాత్మను నిద్ర లేపకండి! - Sakshi

నాజీ ప్రేతాత్మను నిద్ర లేపకండి!

కొత్త కోణం
అమెరికా నల్లజాతీయులను నేరగాళ్లుగా చిత్రించి వాళ్ల మీద కసి పెంచాడు. మెక్సికన్‌లను కూడా అదే స్థాయిలో శత్రువులుగా చిత్రీకరించాడు. చైనీయులు, భారతీయులపై సున్నిత విమర్శలు చేసినట్టు కనిపించినా ఈ రెండు దేశాలపై కూడా తన వైఖరిని చెప్పకనే చెప్పారాయన. అమెరికాలో నిరుద్యోగ సమస్యకు ఈ రెండు దేశాలే కారణమంటూ ట్రంప్‌ ప్రచారం చేసి, శ్వేతజాతీయుల్లో నిద్రాణంగా ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకున్నారు. వీటన్నింటినీ గుదిగుచ్చి చూస్తే ట్రంప్‌కీ, హిట్లర్‌కీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి.

‘బురఖా తొలగించకపోతే నిన్ను కాల్చేస్తాను’– ఇది అమెరికాలోని మిచి గాన్‌ నగరంలో ఓ ముస్లిం విద్యార్థినికి ఓ శ్వేతజాతీయుడి బెదిరింపు. ఇప్పుడు అమెరికాని కుదిపేస్తున్న భయానికి కేంద్ర బిందువు ఈ ధోరణే. న్యూయార్క్‌ లోని టాండన్‌ ఇంజనీరింగ్‌ స్కూల్‌ గోడల మీద రాసివున్న ‘ట్రంప్‌’ అన్న ఐదక్షరాలు కూడా అందరినీ భయకంపితం చేశాయి. దీన్ని ఆ స్కూల్‌ నిర్వాహకులు తీవ్రమైన చర్యగా భావిస్తుండడం గమనార్హం. మిన్నెసొటలోని స్కూల్‌ బాత్‌రూం గోడలపై ‘ట్రంప్‌’, ‘వైట్స్‌ ఓన్లీ’, ‘వైట్‌ అమెరికా’ అని రాసి ఉండడం చాలా మందిని, ముఖ్యంగా శ్వేతేతర ప్రజలను కలవరపరుస్తున్నది. మాప్లెగ్రోవ్‌ సీనియర్‌ హైస్కూల్‌లో ‘గోబ్యాక్‌ టూ ఆఫ్రికా–మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ అంటూ రాసిన రాతలు కూడా చర్చనీయాంశాలయ్యాయి. వీట న్నింటికీ మించి న్యూయార్క్‌లోని వెల్స్‌విల్లేలో క్వాకెన్‌ బుష్‌ఫీల్డ్‌లో ‘మేక్‌ వైట్‌ – అమెరికా ఎగైన్‌’ అన్న గోడరాతల మధ్య స్వస్తిక్‌ గుర్తు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఓ ఆధా రాన్నిస్తున్నదని భావించవచ్చు. జర్మన్‌ జాత్యహంకారానికి సంకేతంగా భావించే స్వస్తిక్‌ గుర్తు శ్వేతజాతేతర ప్రజల అస్తిత్వానికి ప్రమాదంగా పరిణ మిస్తోందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

భయపెడుతున్న ధోరణి
అమెరికా ఎన్నికలు ముగిసి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన రెండు మూడు రోజుల్లోనే ముస్లింలకు, నల్లజాతీయులకు వ్యతి రేకంగా బెదిరింపులూ, దాడులూ మొదలయ్యాయి. నిజానికి డొనాల్డ్‌ ట్రంప్‌ అనుచరులు వేసిన స్వస్తిక్‌ గుర్తులు దేశంలో చాలా ప్రాంతాల్లో దర్శనమి స్తున్నాయి. ఇది అమెరికా భవిష్యత్‌ దర్శినిగా అర్థం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు కాబోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ భవిష్యత్‌లో అనుసరించబోయే విధానానికి ‘స్వస్తిక్‌’ ని సంకేతంగా చూడాలి. నాజీల గుర్తుగా అడాల్ఫ్‌ హిట్లర్‌ ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చిందే స్వస్తిక్‌ గుర్తు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్‌ ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యంతో, జర్మన్‌ జాతి ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే పన్నాగంతో జాత్యహంకారాన్ని రెచ్చగొట్టాడు. సరిగ్గా 83 ఏళ్లక్రితం 1933లో జర్మనీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిట్లర్‌ నాయకత్వంలోని నేషనలిస్టు సోషలిస్టు జర్మన్‌ వర్కర్స్‌ పార్టీ (నాజీ) అధి కారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కూడా హిట్లర్‌ నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, ఇతర జాతులకు ప్రత్యేకించి యూదులకు వ్యతిరేకమైన అంశాల్ని ఎజెండాగా చేశారు. నాటి జర్మనీ ఆర్థిక సంక్షోభం హిట్లర్‌కు పట్టం కట్టడానికి ఉపయోగ పడింది. అయితే అధికారంలోనికి వచ్చిన తర్వాత హిట్లర్‌ ప్రదర్శించిన జాత్య హంకారం యూరప్‌ను శవాల గుట్టలతో నింపింది. ఆర్యన్‌ జాతి ఒక్కటే సంకరం కానిదనీ, అన్ని జాతుల కన్నా అదే పవిత్రమైనదనీ, ప్రపంచాన్ని పాలించే హక్కు తమదేననీ నాజీలు బహిరంగంగానే ప్రకటించారు.

అందరూ శత్రువులేనా?
ప్రస్తుతం అమెరికా గోడల మీద నాజీల, ఆర్యన్‌ జాతి సంకేతం స్వస్తిక్‌ దర్శన మివ్వడాన్ని; నల్లజాతి వారికి, ముస్లింలకు వ్యతిరేకంగా కనిపించిన రాతలను తేలికగా తీసుకోలేం. నల్లవారు, ముస్లింల పట్ల ట్రంప్‌ వ్యతిరేక చర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియదు కానీ, ఇప్పటికే శ్వేతజాతి యువతరంలో అటువంటి ధోరణికి బీజాలు పడ్డాయి. అందులో భాగమే ఈ రాతలు, బెది రింపులు.  2001 సంవత్సరం సెప్టెంబర్‌ 11 నాటి ట్విన్‌ టవర్స్‌ పేల్చివేత ఘటనను ట్రంప్‌ సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఇటీవలి పారిస్‌ బాంబుపేలుళ్ల ఘటనపై కూడా ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. మధ్య ఆసియాలో ఐసిస్‌ చేస్తున్న దాడులను తన జాత్యహంకారానికి మద్దతుగా మలుచుకుంటున్నారు. ఆ విధంగా శ్వేతజాతీయుల మెదళ్లను ముస్లిం వ్యతి రేకతతో నింపడంలో సఫలమయ్యారు. అమెరికా నల్లజాతీయులను నేర గాళ్లుగా చిత్రించి వాళ్ల మీద కసి పెంచాడు. మెక్సికన్‌లను కూడా అదే స్థాయిలో శత్రువులుగా చిత్రీకరించాడు. చైనీయులు, భారతీయులపై సున్నిత విమర్శలు చేసినట్టు కనిపించినా ఈ రెండు దేశాలపై కూడా తన వైఖరిని చెప్పకనే చెప్పారాయన. అమెరికాలో నిరుద్యోగ సమస్యకు ఈ రెండు దేశాలే కారణమంటూ ట్రంప్‌ ప్రచారం చేసి, శ్వేతజాతీయుల్లో నిద్రాణంగా ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకున్నారు. వీటన్నింటినీ గుదిగుచ్చి చూస్తే ట్రంప్‌కీ, హిట్లర్‌కీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. అయితే ఈ పోలిక కొందరికి సముచితంగా అనిపించకపోవచ్చు. కానీ ట్రంప్‌ వ్యాఖ్యలను, ఉపన్యాసాలను విన్నవారికీ, హిట్లర్‌ నాటి జర్మనీ చరిత్ర చదివినవారికీ ఈ పోలిక సము చితమైనదిగానే కనిపిస్తుంది.

డొనాల్డ్‌ ట్రంప్‌ వంశీయులు జర్మనీకి చెందిన వారు కావడం గమ నించాల్సిన అంశం. ట్రంప్‌ తాత ఫ్రెడరిక్‌ ట్రంప్‌ 1885వ సంవత్సరంలో అమెరికాకు వలసవచ్చారు. ఫ్రెడరిక్‌ హోటల్‌ వ్యాపారం, డొనాల్డ్‌ ట్రంప్‌ తండ్రి ఫ్రెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలు పెట్టారు. దానినే డొనాల్డ్‌ కొనసాగించి పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. ట్రంప్‌కు శ్వేత జాతీ యులలో బలమైన స్థానం ఏర్పడడానికి కారణాలను పరిశీలించాలంటే అమె రికాలో ఉన్న వివిధ జాతీయుల జనాభాను గమనించాలి. 2010 సంవత్సరం లెక్కల ప్రకారం 30 కోట్ల 87 లక్షల జనాభాలో 22 కోట్ల 35 లక్షల మంది శ్వేత జాతీయులు. నల్లజాతీయులు కేవలం 3 కోట్ల 89 లక్షలు. ఆసియాకు (భారత్‌ తో సహా) చెందిన వారు ఒక కోటి 40 లక్షల మంది. అమెరికాలో వేలాది సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న నేటివ్‌ అమెరికన్స్‌ ఒక్క శాతం మాత్రమే. ఈ రకంగా చూస్తే అమెరికాలో ఉన్న జనాభాలో 99 శాతం మంది బయటి ప్రాంతాలవారే. మొత్తంగా శ్వేతజాతీయులు 72.4 శాతం ఉండగా, నల్లజాతీయులు 12 శాతం ఉన్నారు.

మద్దతు వెనుక మతలబు
శ్వేతజాతీయులలో మళ్లీ అగ్రస్థానం డొనాల్డ్‌ ట్రంప్‌ పూర్వీకుల దేశానికి చెందిన జర్మన్లదే. వారు మొత్తం 4 కోట్ల 28 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో 15 శాతం. ఆ తర్వాత వరుసగా ఐరిష్‌ 10.8 శాతం, ఇంగ్ల్లండ్‌ 8.7 శాతంగా ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇటాలియన్స్‌ 5.6 శాతం, పోలిష్‌ 3.2 శాతం, ఫ్రెంచ్‌ 3 శాతంగా ప్రభావం కలిగించే స్థానాల్లో ఉన్నారు. అంటే ఈరోజు ట్రంప్‌ ఇంత బలంగా నిలబడడానికి మూలాలు ఇక్కడివి మాత్రమే కాదన్న విషయం సుస్పష్టం. పకడ్బందీ వ్యూహ రచన చేయడానికి జర్మన్‌ల  అండదండలు మెండుగా ఉండే అవకాశం ఉన్నది. శ్వేత జాతీయులలో సైతం జర్మన్‌లు అధికంగా ఉండడం ట్రంప్‌కు కలిసొచ్చిన అంశం. ఇటువంటి పరిస్థితుల్లో జర్మన్‌ జాతీయులు తమ పాత ఆధిపత్య ధోరణులను అమెరికాలో ప్రతిష్టించడానికి ప్రయత్నం చేస్తారనడంలో సందేహంలేదు. డొనాల్డ్‌ ట్రంప్‌ మంత్రి వర్గంలో ఉండబోయే వారిలో ఇప్ప టికే 26 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో 11 మంది పూర్వీకులు జర్మన్‌ జాతీయులే కావడం యాధృచ్చికం కాకపోవచ్చు.

అందుకే స్వస్తిక్‌ అమెరికాలో హల్‌చల్‌ చేస్తున్నది. దీనితో రెండవ ప్రపంచ యుద్ధం మిగల్చిన విషాదం గుర్తుకొస్తున్నది. అందుకే సంప్రదా యానికి భిన్నంగా ట్రంప్‌ ఎన్నికైన వెంటనే వేలాది మంది వ్యతిరేక ప్రద ర్శనల్లో పాల్గొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచినప్పటికీ, ఎలక్టోరల్‌ కాలేజీ ఈ ఎన్నికను నిర్ధారించాలి. అందుకే ట్రంప్‌ను తిరస్క రించాలని ఆన్‌లైన్‌లో ఆయన వ్యతిరేకులు ఎలక్టోరల్‌ కాలేజి సభ్యలకు పిటి షన్లు పెడుతున్నారు. వారు గత అయిదారు రోజులుగా అయిదు నినాదాలతో భారీ ప్రదర్శనలు చేశారు. అందులో మొదటి నినాదం ‘డంప్‌ ట్రంప్‌’. రెండ వది ‘గోడలను కాదు వార«ధులను నిర్మించండి’అనే నినాదం. అక్రమంగా అమెరికాలో నివాసముంటున్న మెక్సికన్లను లక్ష్యంగా చేసుకొని ట్రంప్‌ తన ఎన్నికల సభల్లో మాట్లాడారు. అందువల్ల అమెరికాకు పొరుగున ఉన్న మెక్సికో సరిహద్దు పొడవునా గోడను నిర్మిస్తానని ప్రకటించారు. అప్పుడు అందరూ డొనాల్డ్‌ ట్రంప్‌ను జోకర్‌గా భావించారు. కానీ ఈరోజు జరుగు తున్న ఘటనలు ‘గోడ నిర్మాణం’ మాటలను నిజం చేసేటట్టు ఉన్నాయి.

మరో అంశం, ప్రజల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనలను, ముఖ్యంగా జాత్య హంకార విధానాలను ఎండగట్టాలన్నది ప్రదర్శకుల భావన. నిజానికి హిల్లరీ క్లింటన్‌కు ప్రజలు నేరుగా వేసిన ఓట్లే అధికం. అయితే కొన్ని రాష్ట్రాలు ట్రంప్‌కు అనుకూలంగా ఓట్లు వేయడంతో ఆయన గెలుపు సాధ్యమైంది. ఇది నిజానికి ఎన్నికల విధానంలో ఉన్న సమస్య. ప్రత్యక్ష ఎన్నికల్లో  మళ్లీ పరో క్షంగా కొన్ని ఓట్లను ఇందులో కలపడం సరైనదికాదని ట్రంప్‌ వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా, ట్రంప్‌ గత ఎన్నికల్లో విద్వేష పూరితమైన ఉపన్యాసాలతో ప్రజల మెదళ్లను కలుషితం చేశారు. అందువల్ల ఆయనే స్వయంగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాలని ఆందోళనకా రులు కోరుతున్నారు. ఇంకొక అంశం, అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ తమ అధ్యక్షుడు కాదని అమెరికా ప్రజలు ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని ప్రజలు తిరస్కరించిన చరిత్ర ట్రంప్‌కే సొంతం. ప్రజల్లో భయాందోళనలు కలిగించే వారెవ్వరైనా తమ నాయకులు కాలేరని ఉద్యమ కారులు తెగేసి చెబుతున్నారు.

సంఘర్షణ మొదలైనట్టేనా?
అమెరికాలో ఈరోజు రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. జాత్య హంకార ధోరణిలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవిని చేపడితే ఏమి జరుగుతుందో ఆయన అనుచరులు అక్కడక్కడా దాడులు, బెదిరింపులతో రుచిచూపిస్తూ తమ ఆధిపత్య ధోరణులను బయటపెట్టుకుంటున్నారు. అటువంటి సంఘటనలను సహించబోమనే ప్రజలు కూడా ఉన్నారు. వారు గతంలో ఎన్నడూ లేని విధంగా బహిరంగంగానే తమ నిరసనలను తెలియ జేస్తున్నారు. ఒకరకంగా సంఘర్షణ మొదలైంది. డొనాల్డ్‌ ట్రంప్‌ పదేళ్లుగా తన రాజకీయ ప్రస్థానం గురించి పథకాలు రచించుకున్నారు. అధికారంలోకి రావ డానికి ఎటువంటి నినాదాలు కావాలి, ఎటువంటి వ్యాఖ్యలు చేయాలనేది ముందస్తు ప్రణాళికతో వ్యూహాత్మకంగా అమలు జరిపినవే. ఇందుకు కచ్చి తంగా జర్మన్‌ జాత్యహంకారమే పునాది. ముస్లింలను అమెరికాకు రాకుండా అడ్డుకోవడం, అక్కడ ఉన్నవారిని వేధిస్తాడన్న విషయం స్పష్టమైంది.ఆ తర్వాతి వంతు ఆసియా వాసులదే. కాబట్టి ట్రంప్‌ వ్యతిరేక ఉద్యమం ఎంత బలంగా నిలబడితే అమెరికా ప్రజాస్వామ్యానికి అంత మంచిది.

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 97055 66213
మల్లెపల్లి లక్ష్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement