kotta konam
-
గాంధీని వెంటాడుతున్న గతం
యావత్ ప్రపంచం గుర్తించి, గౌరవిస్తున్న గాంధీజీ విగ్రహ ఆవిష్కరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఘనాలోని ఒక విశ్వవిద్యాలయం అ«ధ్యాపకులు, విద్యార్థులు పోరాడి తమ క్యాంపస్‌లో లేకుండా చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. దక్షిణాఫ్రికాలో భారతీయులు నివసిస్తున్న కాలనీలలోనే కాఫిర్లు అయిన నల్లజాతీయులు ఉండడం తమకు అవమాన కరమని, వీళ్ళతో కలిసి జీవించడం వల్ల తమ పిల్లలు కూడా çసరైన జ్ఞానాన్నీ, ఎదుగుదలనూ అందుకోలేరనీ.. గాంధీ 1894 డిసెంబర్ 19న బ్రిటిష్ అధికారులకు రాసిన లేఖను నల్లజాతి ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా ఆక్షేపిస్తుండటం గమనార్హం. జాతివివక్ష, వర్ణవివ„ý మూలాలను గాంధీ పరిశీలించలేదని తెలుస్తోంది. మహాత్మాగాంధీ అనే మోహన్‌దాస్ కరంచంద్ గాంధీకి భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల నాయకుడిగా పేరు ప్రఖ్యాతులున్నాయి. అనేక ప్రాంతాల్లో ఆయనను ఈనాటికీ స్మరించుకుంటున్నా రనడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టించుకున్న ఆయన నిలువెత్తు విగ్రహాలే ప్రత్యక్ష ఉదాహరణలు. ఆయన అభిప్రాయాలను గౌరవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ ఆయన అభిప్రాయాలను వ్యతి రేకిస్తున్న వాళ్ళు సైతం ఉన్నారు. ఆ వ్యతిరేకత వల్లే ఘనా దేశంలోని ఒక విశ్వవిద్యాలయంలో నెలకొ ల్పిన గాంధీ విగ్రహాన్ని తొలగించాలనే ప్రయత్నం సఫలీకృతం అయ్యింది. దాని ఫలితంగానే ఈనెల 15వ తేదీన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆ విశ్వ విద్యాలయం ప్రాంగణం నుంచి తొలగించారు. జూన్ 4, 2016 వ సంవత్సరంలో ఘనాలోని అక్రాలో ఉన్న లెగాన్ క్యాంపస్‌లో నెలకొల్పిన గాంధీ విగ్రహాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవి ష్కరించారు. అయితే ఆ విశ్వవిద్యాలయానికి చెందిన ఆఫ్రికన్ స్టడీస్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 2016న ఒక వినతి పత్రాన్ని విశ్వవిద్యాలయం అధికా రులకు అందజేసారు. వర్ణ వివక్షను పాటించిన గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఆఫ్రికా ప్రజలను అవమానించడమేనని, ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ను ఆన్లైన్లో ఉంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లజాతి ప్రజల వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమకారుల మద్దతును కూడగట్టారు. ఈ సంచలన వార్తను అక్కడి పత్రికలూ, టీవీ ఛానళ్ళు విస్తృతంగా ప్రచారం చేసాయి. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో ఆయన అవలం భించిన వర్ణ వివక్ష అనుకూల విధానాలను ఆ పత్రి కలు తీవ్రంగా దుయ్యబట్టాయి. దక్షిణాఫ్రికాలో 1893 నుంచి 1914 వరకు ఉన్న మహాత్మాగాంధీ వర్ణ వివక్షను ప్రోత్సహించే అనేక ప్రసంగాలను, ఉత్తరాలను ఘనా విశ్వవిద్యాలయం ఉద్యమకారులు ఈ పిటిషన్లో ప్రస్తావించారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో బ్రిటిష్ అధికారులను సంబోధిస్తూ రాసిన ఉత్తరా లలో నల్లజాతి ప్రజలను కించపరిచే విధంగా ప్రస్తా వన ఉన్నట్టు ఉద్యమకారులు పేర్కొన్నారు. డిసెంబర్ 19, 1894న గాంధీ బ్రిటిష్ అధికారు లను ఉద్దేశిస్తూ ఒక ఉత్తరం రాసారు. భారతీయులు నివసిస్తున్న కాలనీలలోనే కాఫిర్లు అయిన నల్లజాతీ యులు ఉండడం తమకు అవమానకరమని, వీళ్ళతో కలిసి జీవించడం వల్ల తమ పిల్లలు కూడా సరి అయిన జ్ఞానాన్నీ, ఎదుగుదలనూ అందుకోలేరనీ గాంధీ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. అంతేకాకుండా మే 5 1895న మరో సందర్భంగా రాసిన ఉత్తరంలో కూడా నల్లజాతీయులను కాఫిర్ అనే పదంతో సంబోధించారు. సెప్టెంబర్ 26, 1896న మే 27, 1899న రాసిన లేఖల్లో సైతం గాంధీజీ నల్లజాతీయు లను కించపరిచారని ఉద్యమకారులు వివరించారు. కాఫిర్లు అనేపదం నల్లజాతి ప్రజల్లో తీవ్ర ఆక్షేప ణీయం. ఆ పదం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీ యడం మాత్రమే కాకుండా ఎంతో అవమానంగా భావిస్తారు. ఉత్తరాల్లో మాత్రమే కాకుండా ఆచర ణలో కూడా గాంధీ నల్లజాతి ప్రజలను తమకంటే తక్కువ వారిగానే భావించారు. ఆ రోజుల్లో ఉత్తర ప్రత్యుత్తరాలకు ఇతరత్రా సమాచారం చేరవేయడానికి పోస్టాఫీసులే ప్రధాన సాధనాలుగా ఉండేవి. శ్వేతజాతీయుల దురహంకా రానికి చిహ్నంగా శ్వేతజాతీయులకు ఒక ప్రత్యేకమైన క్యూ(లైన్) ఉండేది. నల్లజాతీయులతో కలిపి మిగి లిన వాళ్ళందరికీ కలిపి వేరుగా మరో లైన్ ఉండేది. అందులో భారతీయులతో పాటు ఇతర ఆసియా దేశాలకు చెందిన వారు క్యూలో నిలబడేవారు. భార తీయులకు వేరే క్యూ ఉండాలనీ, తాము నల్లజాతీ యులతో పాటు నిలబడలేమని గాంధీ బ్రిటిష్ ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారు. దీంతో ప్రభుత్వం భారతీయులకోసం మూడో క్యూను ఏర్పాటు చేసింది. అదేసమయంలో ప్లేగు వ్యాధి ప్రబలి వందలాది మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. అప్పుడు కూడా గాంధీ రాసిన ఉత్తరంలో, తాము కాఫిర్లయిన నల్లజాతి వారితో సమానంగా ఒకే ఆసుపత్రుల్లో ఉండలేమని వ్యతిరేకతను చాటారు. ఈ సంఘటన లన్నీ ఇప్పుడు ఆఫ్రికాలో చర్చనీయాంశాలుగా మారాయి. గాంధీ వర్ణ వివక్ష అనుకూల వైఖరిని నల్లజాతి ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. శ్వేతజాతీయులతో పాటు అందరికీ సమాన హక్కులు ఉండాలనే భావనకు బదులు, నల్లజాతి ప్రజలను తమకన్నా హీనమైన వారిగా పరిగణించ డంతో పాటు, భారతీయులకు ప్రత్యేకమైన సౌక ర్యాలు, హక్కులు కావాలని కోరడం నల్లజాతి ఉద్య మకారులను ఆగ్రహానికి గురిచేస్తున్నది. ఈ విషయాలతో పాటు మరో ముఖ్యమైన అంశాన్ని కూడా అక్కడి ఉద్యమ కారులు లేవనె త్తారు. బ్రిటిష్ పాలకులకు అక్కడి స్థానిక తెగల నాయకులకు మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. అందులో బోయర్ యుద్ధాలు ముఖ్యమైనవి. 1890 ప్రాంతంలో రెండు బోయర్ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలలో భారతీయ యువకులను బ్రిటిష్ పాలకుల తరఫున యుద్ధంలో క్షతగాత్రులను మోసు కెళ్ళే స్ట్రెచర్ బేరర్స్‌గా గాంధీ పంపించారు. అందుకు గాను బ్రిటిష్ పాలకులు గాంధీజీని ప్రశంసలతో ముంచెత్తారు. బోయర్స్ యుద్ధం దక్షిణాఫ్రికా చరి త్రలో ఒక కీలక మలుపుగా భావించొచ్చు. అప్పటి వరకు స్వతంత్రంగా ఉన్న దక్షిణాఫ్రికా నల్లజాతి తెగల సంస్థానాలు బోయర్స్ యుద్ధంలో బ్రిటిష్ పరం అయ్యాయి. ఇది కూడా ఆఫ్రికా ప్రజల మన సుల్లో వ్యతిరేకతను పెంచడానికి కారణమయ్యింది. మహాత్మాగాంధీ 1893లో దక్షిణాఫ్రికాకి వెళ్ళి, 1914లో తిరిగి స్వదేశానికి వచ్చారు. దాదాపు 20 సంవత్సరాల కాలంలో ఆయన అక్కడి భారతీయుల కోసం ముఖ్యంగా వ్యాపారవర్గాల ప్రయోజనం కోసం మాత్రమే పనిచేసాడనే విమర్శలున్నాయి. అంతేకాకుండా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు జరిగిన యుద్ధాల్లో బ్రిటిష్ వారికి అండగా నిలబడ్డాడని కూడా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ‘ది సౌత్ ఆఫ్రికన్ గాంధీ స్ట్రెచర్ బేరర్ ఆఫ్ ఎంపైర్’ అనే పేరుతో అశ్వనీదేశాయ్, గులాంవాహెద్ రాసిన పుస్త కంలో ఈ సంఘటనలతో పాటు అనేక ఉదంతాలూ సందర్భాల ప్రస్తావనలూ ఉన్నాయి. ఈ సంఘటనల వల్ల దక్షిణాఫ్రికాలో గాంధీ అనుసరించిన నల్లజాతి వ్యతిరేక స్వభావం చాలా స్పష్టంగా కనిపించిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాకు ఒక న్యాయ వాదిగా వెళ్ళారు. భారతీయ వ్యాపారుల పక్షాన నిల బడే ఉద్యోగం ఆయనకు లభించింది. కానీ అప్పటికే భారతీయులు దక్షిణాఫ్రికాలో తమ ఉపాధి, ఉద్యోగా లను దెబ్బతీస్తున్నారని శ్వేతజాతీయులు భావిం చారు. అందువల్ల భారతీయులు వస్తున్న పడవలను అడ్డుకోవడం, వారిని వెనక్కి పంపాలని డిమాండ్ చేయడం తరచుగా జరిగింది. జనవరి 16, 1897న భారత దేశం నుంచి వచ్చిన ప్రయాణికుల నౌకను అడ్డుకోవడానికి శ్వేతజాతీయులు ప్రయత్నించారు. ఆ సందర్భంగా గాంధీ కూడా అక్కడికి చేరారు. వ్యాపారుల పక్షాన భారతీయ కార్మికులను తీసు కెళ్ళడానికి వచ్చిన గాంధీని శ్వేతజాతీయులు గమ నించారు. అప్పుడు గాంధీపై శ్వేతజాతీయులు దాడి చేయడంతో అక్కడినుంచి తప్పించుకొని, సమీపం లోని పోలీసు స్టేషన్‌కి వెళ్ళి దాక్కున్నారు. పోలీసు కానిస్టేబుల్ రూపంలో మారువేషంలో అక్కడి నుంచి గాంధీ బయటపడినట్టు పైన పేర్కొన్న పుస్తకంలో ప్రస్తావించారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఒకపక్క భార తీయుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న క్రమంలో నల్లజాతీయులను కించపరుస్తున్నానన్న వాస్తవాన్ని గ్రహించలేకపోయారు. ఆయనలో ఉండే ఆధిపత్య ఆలోచనలకు ఇది ప్రతిరూపమని నల్లజాతి ఉద్యమకారులు భావిస్తున్నారు. చెప్పాలంటే దక్షిణా ఫ్రికాలో ఆయన రెండు దశాబ్దాలపాటు ఉన్నా నల్ల జాతీయుల హక్కుల గురించి ఏనాడూ మాట్లాడలే దనీ, పైపెచ్చు తమను కించపరిచే పదాలను ఆయన ప్రయోగించారని నల్లజాతీయులు భావిస్తున్నారు. అది వారి స్మృతిపథం నుంచి చెరగలేదని ఘనా ఉదంతం చాటుతోంది. పైగా తన అనాలోచిత భావా లతో ఆఫ్రికన్లను కాఫిర్లు అని ఆయన వ్యాఖ్యానిం చిన మాట నిజమేనని గాంధీ మనుమడు రాజ్మో హన్ గాంధీ అంగీకరించారు కూడా. అయితే గాంధీజీ భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత తన ఈ లోపాన్ని గుర్తించారని చరిత్రకారుల వ్యాఖ్య. అక్కడి అనుభవాలతో భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత అస్పృ స్యతను గాంధీ వ్యతిరేకించారు కానీ జాతి, వర్ణ వివక్ష మూలాల్ని విశ్లేషించి దానికనుగుణంగా సమూల చర్యలు చేపట్టడంలో గాంధీ విఫలమయ్యారు. మన దేశంలో కూడా ఒకవైపు అంటరానితనం పోవాలం టూనే మరోవైపు వర్ణ ధర్మం కొనసాగాలని ఆయన భావించడం ద్వంద్వ స్వభావంగానే పరిగణించాలి. అదే సమయంలో భారత్‌లో అంటరాని కులాల ప్రజలు తమ హక్కుల కోసం బాబాసాహెబ్ అంబే డ్కర్ నాయకత్వంలో పోరాడుతోంటే ఒకవైపు గాంధీ సానుభూతి ప్రకటిస్తూనే మరోవైపు వారి రాజకీయ సమానత్వం కోసం బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు పేరుతో సెపరేట్ ఎలక్టోరేట్‌ను ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకించడానికి ఈ లోపాలే కారణం. పైగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను రిజర్వ్డ్ స్థానాలకు పరి మితం చేసే ఎన్నికల విధానానికి అంకురార్పణ చేసారు. అంబేడ్కర్‌ని నయానా, భయానా, ఒప్పించి, పూనా ఒడంబడికను రూపొందించారు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
చరిత్ర పుటలో చెరగని సంతకం
కొత్త కోణం 1970 నుంచి దాదాపు 20 ఏళ్ళపాటు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సాగిన విప్లవోద్యమం ఎన్నో సామాజిక మార్పులకు కారణమైంది. ఒక తరంపైన నిండైన ముద్రవేసిన ఆయన జీవితం, ఉద్యమం సమాజ గమనానికి దిక్సూచిగా నిలిచాయి. 1984 నవంబర్ 9న అజ్ఞాతవాసంలోనే గుండెపోటుతో కనుమూసేంతవరకు నిరంతరం విప్లవాన్నే కలలుగని, తుదిశ్వాస వరకు విప్లవాచరణలో నిమగ్నుడైన చండ్ర పుల్లారెడ్డి జీవితం భావి తరాలకు సర్వదా స్ఫూర్తిదాయకం. సమాజ గమనంలో తనదైన ముద్ర వేసి కాల చక్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఉద్యమాలను, విప్లవాగ్నులను రగులుస్తూ ముందుకు సాగుతుంది. సమాజ పురోగమనానికి ఒక్కో సమయంలో కొందరు వ్యక్తులు తోడ్పడుతుంటారు. ఆ క్రమంలో కొందరు తమ ప్రాణాలను సమానత్వ సాధనకు, ప్రజలకు అర్పిస్తుంటారు. సమానత్వ సాధన దిశగా తెలుగునాట సమాజాన్ని ముందుకు నడిపించిన వ్యక్తుల ముద్రలు చాలానే ఉన్నాయి. ఒక తరంపై బలమైన ముద్రవేసిన చండ్ర పుల్లారెడ్డి వారిలో ఒకరు. 1960ల చివరిలో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమ నాయ కులలో ఒకరైన ఆయన నాయకత్వంలోని ఉద్యమంతో పాటు, పీపుల్స్‌వార్ నాయకత్వంలో సాగిన ఉద్యమాలు సైతం సమాజ గమనాన్ని మార్చాయన డంలో సందేహం లేదు. చండ్ర పుల్లారెడ్డి శత జయంతి సందర్భంగా మనం ఆయన జీవితాన్ని, ఉద్యమ ప్రభావాన్ని మననం చేసుకోవడానికే ఈ ప్రయత్నం. ఉద్యమ ప్రస్థానంలో తొలి దశ 1917 జనవరి 19న కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామంలో జన్మించిన చండ్ర పుల్లారెడ్డి ఇంజనీరింగ్ చదువు కోసం మద్రాసు వెళ్లారు. అక్కడ పుచ్చలపల్లి సుందరయ్య తదితర కమ్యూనిస్టు నాయకులతో ఏర్పడ్డ పరిచ యాలు ఆయనను వలస వ్యతిరేక పోరాటంలో భాగం చేశాయి, కాలేజీ నుంచి బహి ష్కరణకు గురిచేశాయి. ఆ తర్వాత ఆయన పూర్తి కాలం కమ్యూనిస్టు కార్య కర్తగా మారారు. అప్పటికే తెలంగాణలో సాగుతున్న మహత్తర రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి బయలుదేరి, మార్గ మధ్యంలోనే అరెస్టు అయ్యారు. జైలులో ఉన్న ఆయన నాటి పార్టీ నాయ కత్వం తీసుకున్న సాయుధ పోరాట విరమణ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 1952 ఎన్నికల్లో నాటి మద్రాసు రాష్ట్రంలోని నందికొట్కూరు నుంచి కమ్యూ నిస్టు పార్టీ అభ్యర్థిగా ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రి యలో అప్పటికే తక్కువ విశ్వాసం ఉన్న ఆయన... ప్రజా ఉద్యమ సమీకర ణపైనేlదృష్టి కేంద్రీకరించేవారు. ఆ క్రమంలోనే ప్రముఖ నక్సలైటు నాయ కుడు తరిమెల నాగిరెడ్డితో కలిసి పనిచేశారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చినప్పుడు ఆయన సుందరయ్య నాయకత్వంలోని సీపీఐ (ఎం) పక్షాన నిలిచారు. 1962 నాటి భారత–చైనా యుద్ధం సందర్భంగా చైనాను సమర్థించినందుకుగాను దేశ రక్షణ చట్టం కింద 1964–66 మధ్య జైలు జీవితం గడిపారు. నగ్జల్బరీ, శ్రీకాకుళాల వెలుగున సాగిన విప్లవ నేత ఆ కాలంలో ఆయన జైలులో సాగించిన అధ్యయనం, రచనా వ్యాసంగం కమ్యూనిస్టు విప్లవోద్యమానికి చాలా తోడ్పడింది. నాటి కీలక అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, ముఖ్యంగా రష్యా–చైనా విభేదాల విషయంలో కార్యకర్తలను చైతన్యవంతం చేయడానికి సహచర నాయకుడు మానికొండ సుబ్బారావుతో కలిసి ఆయన ‘‘ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం–దాని పరి ణామాలు’’ అనే గ్రంథాన్ని రాశారు. చైనాలో మావో ప్రారంభించిన ‘గ్రేట్ డిబేట్’లో చర్చకు వచ్చిన తొమ్మిది విషయాలపై ‘‘రష్యా–చైనా వాద నలు’’అనే పుస్తకాన్ని రాశారు. మావో సూక్తులను తెలుగులోకి అనువాదం చేసి. అచ్చు వేయించారు. ఇలా అధ్యయనం, రచనా వ్యాసంగం ఒకవైపు సాగిస్తూనే పుల్లారెడ్డి... చైనాకు వ్యతిరేకంగా క్రమక్రమంగా సీపీఐ (ఎం) తీసుకొస్తున్న వాదనలను పసిగట్టి, బహిరంగపరిచారు. అనతికాలంలోనే దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్యలతో కలిసి విప్లవకారుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆయన దృష్టి ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోని పని మీదనే ఉండేది. ఆనాటికే పశ్చిమ బెంగాల్ లోని నక్సల్బరీలో చారు మజూందార్ నాయకత్వంలో సాగుతోన్న రైతాంగ ఉద్యమం పుల్లారెడ్డిని తీవ్రంగా ప్రభావితం చేసింది. తెలంగాణలోని ములుగు అటవీ ప్రాంతాన్ని ఆయన తన మొదటి ఉద్యమ స్థానంగా ఎన్ను కున్నారు. అందుకు కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ‘‘వీర తెలంగాణ విప్లవ పోరాటం–గుణ పాఠాలు’’ అనే పుస్తకాన్ని రాశారు. అదే సమయంలో శ్రీకాకుళ రైతాంగ పోరాటంతో సంబంధాలను పునరుద్ధరించారు. అప్పటికే ఎంతో మంది నాయకులు పోలీసు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. అంతటి నిర్బంధంలో కూడా ఆయన ఇంకా కార్యాచరణలో ఉన్న నాయ కులను, కార్య కర్తలను సమన్వయం చేశారు. శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన పైలా వాసుదేవరావుతో కలిసి కమిటీని ఏర్పరి చారు. ఆ విధంగా చండ్ర పుల్లారెడ్డి శ్రీకాకుళ పోరాటాన్ని అనేక ఒడిదుడుకుల తర్వాత కూడా సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఆయన నాయకత్వంలో సాగిన ఉద్యమాల్లో నాలుగు ప్రధానమైనవి. ఒకటి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి గిరిజన పోరాటాలు. రెండవది కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నిజామాబాద్ మైదాన ప్రాంతాల్లో సాగిన రైతుకూలీ పోరాటాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు. మూడవది విద్యార్థి ఉద్యమం, నాల్గవది పట్టణ మధ్యతరగతి వర్గాలైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలను సమీకరించడం. మార్పును మోసుకొచ్చిన విప్లవ వెల్లువ 1968లో చండ్రపుల్లారెడ్డి నాయకత్వంలోని పార్టీ ములుగులో అడుగు పెట్టే నాటికి ఆదివాసీల పరిస్థితులు అధ్వానంగా ఉండేవి. బాగా పంటలు పండే మాగాణి భూములన్నీ బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారి అధీనంలో ఉండేవి. గిరిజనుల చేతుల్లో ఉన్నవి పోడు భూములే. పైగా ఫారెస్టు అధి కారులు గిరిజనులను క్రూరంగా దోపిడీ చేసేవారు. ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం కర్రను ముట్టనిచ్చేవారు కారు. వంటచెరుకు కోసం అడవిలో కర్రలు ఏరినా జరిమానాలకు, చిత్రహింసలకు గురిచేసే వారు. ఇక పటేల్, పట్వా రీలు గిరిజన తండాల మీద పడి బియ్యం, జొన్నలు పప్పు, నెయ్యి, కోళ్లు, డబ్బులు లంచాలుగా గుంజుకునేవారు. వెట్టి చాకిరీ చేయించుకునేవారు. షావుకారులు ఉప్పు, కిరోసిన్ ఇచ్చి గిరిజనులు సేకరించిన అటవీ ఉత్ప త్తులను దోచుకునేవారు. షావుకారులు, అడవిని ఆనుకొని ఉన్న భూస్వా ములు అప్పులు ఇచ్చి గిరిజనుల భూములను, వస్తువులను కారు చౌకకు కాజేసేవారు. పుల్లారెడ్డి నాయకత్వంలో అడవిలో అడుగుపెట్టిన ఉద్యమం గిరిజనులను సమీకరించింది. చైతన్య పరిచింది. దాదాపు మూడు లక్షల ఎకరాల సాగుభూమిని గిరిజనులు సొంతం చేసుకోగలిగారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని చాలా గ్రామాల్లో 1970ల నాటికి కూడా అంటరానితనం వికృత రూపంలో ఉండేది. దళితుల భూములను కబ్జా చేయడం, వెట్టిచాకిరీతో శ్రామికుల రక్తమాంసాలను దోచుకోవడం ఆనాడు సర్వసాధారణం. గ్రామాల్లో దళితులు చెప్పులు వేసుకొని నడవడానికి, బీడీలు తాగడానికి, లుంగీ కట్టుకొని పోవడానికి వీలులేదు. ఇక గొల్ల, గౌండ్ల, చాకలి, మంగలి లాంటి కులాల వారంతా భూస్వాములకు వెట్టికి అన్నీ సమర్పించాల్సిందే. ఉచితంగా సేవలు చేయాల్సిందే. అడిగితే తన్నులు, గుద్దులు, హత్యలే. కరీంనగర్ జిల్లాలో సాగుతోన్న ఈ దౌర్జన్యాలకు వ్యతి రేకంగా వెల్లువెత్తిన పోరాటాలకు సిరిసిల్ల ప్రాంతంలోని నిమ్మపల్లి పురుడు పోసింది. అదే సమయంలో జగిత్యాల ప్రాంతంలోని మద్దునూరులో పీపుల్స్ వార్ పార్టీ ఇటువంటి ఉద్యమాన్నే చేపట్టింది. దౌర్జన్యాలు చేస్తున్న భూస్వా ములు గ్రామాలను వదిలారు. వెట్టి చాకిరీ రద్దయింది. అంటరాని తనం పూర్తిగా పోకపోయినా, దళితుల్లో చైతన్యం పెరిగింది. భూమి సంబంధాలలో మార్పు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో 1987లో అధికారంలోనికి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1987 పంచాయతీ రాజ్ ఎన్నికల్లో మార్పులు తీసు కొచ్చింది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించింది. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో వచ్చిన సామాజిక, రాజకీయ, చైతన్యానికి తోడుగా ఈ రిజర్వేషన్లు అప్పటి వరకు సాగిన రెండు మూడు కులాల రాజకీయ గుత్తాధిపత్యానికి తెర దించాయి. అప్పటి వరకు గ్రామాలకు పరిమితమైన ఆధిపత్య కులాల వారు పట్టణాలకు తరలిపోయి, ఇతర వృత్తులు, వ్యాపారాల్లో ప్రవేశించి గతంకన్నా ఆర్థికంగా పుంజుకున్నారు. అలా ఈ ఉద్యమం తెలంగాణలోని గ్రామీణ సంబంధాలను సమూలంగా మార్చివేసింది. భవితకు దిక్సూచి 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన అనంతరం ఏర్పడిన ప్రజాస్వామిక వాతా వరణం పట్టణాలలోని మధ్యతరగతి వర్గాన్ని, గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థి లోకాన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లోకి ఆకర్షించింది. ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు, గాంధీ, ఉస్మానియా కాకతీయ వైద్య కళాశాలలు ప్రగతిశీల విప్లవ విద్యార్థి ఉద్యమాలకు నెలవుగా ఉండేవి. అదేవిధంగా ఆంధ్రప్రాంతంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న జవహర్ భారతి కళాశాలలో ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమం బలమైన స్థానాన్ని సాధించింది. విద్యార్థి ఉద్యమంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో వచ్చిన ప్రజాస్వామిక చైతన్యం తదనంతర సామాజిక రాజకీయ మార్పులపై ఎంతో ప్రభావాన్ని చూపింది. 1996 తరువాత ముందుకు వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నాయకత్వం ఈ ప్రజా స్వామిక చైతన్యాన్ని పుణికిపుచ్చుకున్నదే. 1970 నుంచి దాదాపు 20 ఏళ్ళపాటు తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సాగిన విప్లవోద్యమం ఎన్నో మార్పులకు కారణమైంది. ఒకతరంపైన నిండైన ముద్రవేసిన చండ్రపుల్లారెడ్డి జీవితం ఆయన సాగించిన ఉద్యమం సమాజ గమనానికి ఒక దిక్సూచిగా నిలిచింది. 1984 నవంబర్ 9న అజ్ఞాతవాసం లోనే గుండెపోటుతో కనుమూసేంతవరకు నిరంతరం విప్లవాన్నే కలలుగని, తుదిశ్వాస వరకు విప్లవాచరణలో నిమగ్నుడైన చండ్ర పుల్లారెడ్డి జీవితం భావి తరాలకు సర్వదా స్ఫూర్తిదాయకం. (నేడు చండ్ర పుల్లారెడ్డి శతజయంతి) మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
నాజీ ప్రేతాత్మను నిద్ర లేపకండి!
కొత్త కోణం అమెరికా నల్లజాతీయులను నేరగాళ్లుగా చిత్రించి వాళ్ల మీద కసి పెంచాడు. మెక్సికన్లను కూడా అదే స్థాయిలో శత్రువులుగా చిత్రీకరించాడు. చైనీయులు, భారతీయులపై సున్నిత విమర్శలు చేసినట్టు కనిపించినా ఈ రెండు దేశాలపై కూడా తన వైఖరిని చెప్పకనే చెప్పారాయన. అమెరికాలో నిరుద్యోగ సమస్యకు ఈ రెండు దేశాలే కారణమంటూ ట్రంప్ ప్రచారం చేసి, శ్వేతజాతీయుల్లో నిద్రాణంగా ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకున్నారు. వీటన్నింటినీ గుదిగుచ్చి చూస్తే ట్రంప్‌కీ, హిట్లర్‌కీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ‘బురఖా తొలగించకపోతే నిన్ను కాల్చేస్తాను’– ఇది అమెరికాలోని మిచి గాన్ నగరంలో ఓ ముస్లిం విద్యార్థినికి ఓ శ్వేతజాతీయుడి బెదిరింపు. ఇప్పుడు అమెరికాని కుదిపేస్తున్న భయానికి కేంద్ర బిందువు ఈ ధోరణే. న్యూయార్క్ లోని టాండన్ ఇంజనీరింగ్ స్కూల్ గోడల మీద రాసివున్న ‘ట్రంప్’ అన్న ఐదక్షరాలు కూడా అందరినీ భయకంపితం చేశాయి. దీన్ని ఆ స్కూల్ నిర్వాహకులు తీవ్రమైన చర్యగా భావిస్తుండడం గమనార్హం. మిన్నెసొటలోని స్కూల్ బాత్రూం గోడలపై ‘ట్రంప్’, ‘వైట్స్ ఓన్లీ’, ‘వైట్ అమెరికా’ అని రాసి ఉండడం చాలా మందిని, ముఖ్యంగా శ్వేతేతర ప్రజలను కలవరపరుస్తున్నది. మాప్లెగ్రోవ్ సీనియర్ హైస్కూల్లో ‘గోబ్యాక్ టూ ఆఫ్రికా–మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ రాసిన రాతలు కూడా చర్చనీయాంశాలయ్యాయి. వీట న్నింటికీ మించి న్యూయార్క్‌లోని వెల్స్విల్లేలో క్వాకెన్ బుష్ఫీల్డ్లో ‘మేక్ వైట్ – అమెరికా ఎగైన్’ అన్న గోడరాతల మధ్య స్వస్తిక్ గుర్తు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఓ ఆధా రాన్నిస్తున్నదని భావించవచ్చు. జర్మన్ జాత్యహంకారానికి సంకేతంగా భావించే స్వస్తిక్ గుర్తు శ్వేతజాతేతర ప్రజల అస్తిత్వానికి ప్రమాదంగా పరిణ మిస్తోందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. భయపెడుతున్న ధోరణి అమెరికా ఎన్నికలు ముగిసి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన రెండు మూడు రోజుల్లోనే ముస్లింలకు, నల్లజాతీయులకు వ్యతి రేకంగా బెదిరింపులూ, దాడులూ మొదలయ్యాయి. నిజానికి డొనాల్డ్ ట్రంప్ అనుచరులు వేసిన స్వస్తిక్ గుర్తులు దేశంలో చాలా ప్రాంతాల్లో దర్శనమి స్తున్నాయి. ఇది అమెరికా భవిష్యత్ దర్శినిగా అర్థం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు కాబోతున్న డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్‌లో అనుసరించబోయే విధానానికి ‘స్వస్తిక్’ ని సంకేతంగా చూడాలి. నాజీల గుర్తుగా అడాల్ఫ్ హిట్లర్ ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చిందే స్వస్తిక్ గుర్తు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యంతో, జర్మన్ జాతి ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే పన్నాగంతో జాత్యహంకారాన్ని రెచ్చగొట్టాడు. సరిగ్గా 83 ఏళ్లక్రితం 1933లో జర్మనీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిట్లర్ నాయకత్వంలోని నేషనలిస్టు సోషలిస్టు జర్మన్ వర్కర్స్ పార్టీ (నాజీ) అధి కారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కూడా హిట్లర్ నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, ఇతర జాతులకు ప్రత్యేకించి యూదులకు వ్యతిరేకమైన అంశాల్ని ఎజెండాగా చేశారు. నాటి జర్మనీ ఆర్థిక సంక్షోభం హిట్లర్‌కు పట్టం కట్టడానికి ఉపయోగ పడింది. అయితే అధికారంలోనికి వచ్చిన తర్వాత హిట్లర్ ప్రదర్శించిన జాత్య హంకారం యూరప్‌ను శవాల గుట్టలతో నింపింది. ఆర్యన్ జాతి ఒక్కటే సంకరం కానిదనీ, అన్ని జాతుల కన్నా అదే పవిత్రమైనదనీ, ప్రపంచాన్ని పాలించే హక్కు తమదేననీ నాజీలు బహిరంగంగానే ప్రకటించారు. అందరూ శత్రువులేనా? ప్రస్తుతం అమెరికా గోడల మీద నాజీల, ఆర్యన్ జాతి సంకేతం స్వస్తిక్ దర్శన మివ్వడాన్ని; నల్లజాతి వారికి, ముస్లింలకు వ్యతిరేకంగా కనిపించిన రాతలను తేలికగా తీసుకోలేం. నల్లవారు, ముస్లింల పట్ల ట్రంప్ వ్యతిరేక చర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియదు కానీ, ఇప్పటికే శ్వేతజాతి యువతరంలో అటువంటి ధోరణికి బీజాలు పడ్డాయి. అందులో భాగమే ఈ రాతలు, బెది రింపులు. 2001 సంవత్సరం సెప్టెంబర్ 11 నాటి ట్విన్ టవర్స్ పేల్చివేత ఘటనను ట్రంప్ సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఇటీవలి పారిస్ బాంబుపేలుళ్ల ఘటనపై కూడా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మధ్య ఆసియాలో ఐసిస్ చేస్తున్న దాడులను తన జాత్యహంకారానికి మద్దతుగా మలుచుకుంటున్నారు. ఆ విధంగా శ్వేతజాతీయుల మెదళ్లను ముస్లిం వ్యతి రేకతతో నింపడంలో సఫలమయ్యారు. అమెరికా నల్లజాతీయులను నేర గాళ్లుగా చిత్రించి వాళ్ల మీద కసి పెంచాడు. మెక్సికన్లను కూడా అదే స్థాయిలో శత్రువులుగా చిత్రీకరించాడు. చైనీయులు, భారతీయులపై సున్నిత విమర్శలు చేసినట్టు కనిపించినా ఈ రెండు దేశాలపై కూడా తన వైఖరిని చెప్పకనే చెప్పారాయన. అమెరికాలో నిరుద్యోగ సమస్యకు ఈ రెండు దేశాలే కారణమంటూ ట్రంప్ ప్రచారం చేసి, శ్వేతజాతీయుల్లో నిద్రాణంగా ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకున్నారు. వీటన్నింటినీ గుదిగుచ్చి చూస్తే ట్రంప్‌కీ, హిట్లర్‌కీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. అయితే ఈ పోలిక కొందరికి సముచితంగా అనిపించకపోవచ్చు. కానీ ట్రంప్ వ్యాఖ్యలను, ఉపన్యాసాలను విన్నవారికీ, హిట్లర్ నాటి జర్మనీ చరిత్ర చదివినవారికీ ఈ పోలిక సము చితమైనదిగానే కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ వంశీయులు జర్మనీకి చెందిన వారు కావడం గమ నించాల్సిన అంశం. ట్రంప్ తాత ఫ్రెడరిక్ ట్రంప్ 1885వ సంవత్సరంలో అమెరికాకు వలసవచ్చారు. ఫ్రెడరిక్ హోటల్ వ్యాపారం, డొనాల్డ్ ట్రంప్ తండ్రి ఫ్రెడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. దానినే డొనాల్డ్ కొనసాగించి పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. ట్రంప్‌కు శ్వేత జాతీ యులలో బలమైన స్థానం ఏర్పడడానికి కారణాలను పరిశీలించాలంటే అమె రికాలో ఉన్న వివిధ జాతీయుల జనాభాను గమనించాలి. 2010 సంవత్సరం లెక్కల ప్రకారం 30 కోట్ల 87 లక్షల జనాభాలో 22 కోట్ల 35 లక్షల మంది శ్వేత జాతీయులు. నల్లజాతీయులు కేవలం 3 కోట్ల 89 లక్షలు. ఆసియాకు (భారత్ తో సహా) చెందిన వారు ఒక కోటి 40 లక్షల మంది. అమెరికాలో వేలాది సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న నేటివ్ అమెరికన్స్ ఒక్క శాతం మాత్రమే. ఈ రకంగా చూస్తే అమెరికాలో ఉన్న జనాభాలో 99 శాతం మంది బయటి ప్రాంతాలవారే. మొత్తంగా శ్వేతజాతీయులు 72.4 శాతం ఉండగా, నల్లజాతీయులు 12 శాతం ఉన్నారు. మద్దతు వెనుక మతలబు శ్వేతజాతీయులలో మళ్లీ అగ్రస్థానం డొనాల్డ్ ట్రంప్ పూర్వీకుల దేశానికి చెందిన జర్మన్లదే. వారు మొత్తం 4 కోట్ల 28 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో 15 శాతం. ఆ తర్వాత వరుసగా ఐరిష్ 10.8 శాతం, ఇంగ్ల్లండ్ 8.7 శాతంగా ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇటాలియన్స్ 5.6 శాతం, పోలిష్ 3.2 శాతం, ఫ్రెంచ్ 3 శాతంగా ప్రభావం కలిగించే స్థానాల్లో ఉన్నారు. అంటే ఈరోజు ట్రంప్ ఇంత బలంగా నిలబడడానికి మూలాలు ఇక్కడివి మాత్రమే కాదన్న విషయం సుస్పష్టం. పకడ్బందీ వ్యూహ రచన చేయడానికి జర్మన్ల అండదండలు మెండుగా ఉండే అవకాశం ఉన్నది. శ్వేత జాతీయులలో సైతం జర్మన్లు అధికంగా ఉండడం ట్రంప్‌కు కలిసొచ్చిన అంశం. ఇటువంటి పరిస్థితుల్లో జర్మన్ జాతీయులు తమ పాత ఆధిపత్య ధోరణులను అమెరికాలో ప్రతిష్టించడానికి ప్రయత్నం చేస్తారనడంలో సందేహంలేదు. డొనాల్డ్ ట్రంప్ మంత్రి వర్గంలో ఉండబోయే వారిలో ఇప్ప టికే 26 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో 11 మంది పూర్వీకులు జర్మన్ జాతీయులే కావడం యాధృచ్చికం కాకపోవచ్చు. అందుకే స్వస్తిక్ అమెరికాలో హల్చల్ చేస్తున్నది. దీనితో రెండవ ప్రపంచ యుద్ధం మిగల్చిన విషాదం గుర్తుకొస్తున్నది. అందుకే సంప్రదా యానికి భిన్నంగా ట్రంప్ ఎన్నికైన వెంటనే వేలాది మంది వ్యతిరేక ప్రద ర్శనల్లో పాల్గొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటికీ, ఎలక్టోరల్ కాలేజీ ఈ ఎన్నికను నిర్ధారించాలి. అందుకే ట్రంప్‌ను తిరస్క రించాలని ఆన్లైన్లో ఆయన వ్యతిరేకులు ఎలక్టోరల్ కాలేజి సభ్యలకు పిటి షన్లు పెడుతున్నారు. వారు గత అయిదారు రోజులుగా అయిదు నినాదాలతో భారీ ప్రదర్శనలు చేశారు. అందులో మొదటి నినాదం ‘డంప్ ట్రంప్’. రెండ వది ‘గోడలను కాదు వార«ధులను నిర్మించండి’అనే నినాదం. అక్రమంగా అమెరికాలో నివాసముంటున్న మెక్సికన్లను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ తన ఎన్నికల సభల్లో మాట్లాడారు. అందువల్ల అమెరికాకు పొరుగున ఉన్న మెక్సికో సరిహద్దు పొడవునా గోడను నిర్మిస్తానని ప్రకటించారు. అప్పుడు అందరూ డొనాల్డ్ ట్రంప్‌ను జోకర్‌గా భావించారు. కానీ ఈరోజు జరుగు తున్న ఘటనలు ‘గోడ నిర్మాణం’ మాటలను నిజం చేసేటట్టు ఉన్నాయి. మరో అంశం, ప్రజల్లో డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను, ముఖ్యంగా జాత్య హంకార విధానాలను ఎండగట్టాలన్నది ప్రదర్శకుల భావన. నిజానికి హిల్లరీ క్లింటన్‌కు ప్రజలు నేరుగా వేసిన ఓట్లే అధికం. అయితే కొన్ని రాష్ట్రాలు ట్రంప్‌కు అనుకూలంగా ఓట్లు వేయడంతో ఆయన గెలుపు సాధ్యమైంది. ఇది నిజానికి ఎన్నికల విధానంలో ఉన్న సమస్య. ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్లీ పరో క్షంగా కొన్ని ఓట్లను ఇందులో కలపడం సరైనదికాదని ట్రంప్ వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా, ట్రంప్ గత ఎన్నికల్లో విద్వేష పూరితమైన ఉపన్యాసాలతో ప్రజల మెదళ్లను కలుషితం చేశారు. అందువల్ల ఆయనే స్వయంగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాలని ఆందోళనకా రులు కోరుతున్నారు. ఇంకొక అంశం, అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ తమ అధ్యక్షుడు కాదని అమెరికా ప్రజలు ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని ప్రజలు తిరస్కరించిన చరిత్ర ట్రంప్‌కే సొంతం. ప్రజల్లో భయాందోళనలు కలిగించే వారెవ్వరైనా తమ నాయకులు కాలేరని ఉద్యమ కారులు తెగేసి చెబుతున్నారు. సంఘర్షణ మొదలైనట్టేనా? అమెరికాలో ఈరోజు రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. జాత్య హంకార ధోరణిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపడితే ఏమి జరుగుతుందో ఆయన అనుచరులు అక్కడక్కడా దాడులు, బెదిరింపులతో రుచిచూపిస్తూ తమ ఆధిపత్య ధోరణులను బయటపెట్టుకుంటున్నారు. అటువంటి సంఘటనలను సహించబోమనే ప్రజలు కూడా ఉన్నారు. వారు గతంలో ఎన్నడూ లేని విధంగా బహిరంగంగానే తమ నిరసనలను తెలియ జేస్తున్నారు. ఒకరకంగా సంఘర్షణ మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ పదేళ్లుగా తన రాజకీయ ప్రస్థానం గురించి పథకాలు రచించుకున్నారు. అధికారంలోకి రావ డానికి ఎటువంటి నినాదాలు కావాలి, ఎటువంటి వ్యాఖ్యలు చేయాలనేది ముందస్తు ప్రణాళికతో వ్యూహాత్మకంగా అమలు జరిపినవే. ఇందుకు కచ్చి తంగా జర్మన్ జాత్యహంకారమే పునాది. ముస్లింలను అమెరికాకు రాకుండా అడ్డుకోవడం, అక్కడ ఉన్నవారిని వేధిస్తాడన్న విషయం స్పష్టమైంది.ఆ తర్వాతి వంతు ఆసియా వాసులదే. కాబట్టి ట్రంప్ వ్యతిరేక ఉద్యమం ఎంత బలంగా నిలబడితే అమెరికా ప్రజాస్వామ్యానికి అంత మంచిది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 మల్లెపల్లి లక్ష్మయ్య -
జనహితం.. ఐక్యతాబంధం
కొత్త కోణం అంబేద్కర్ లేకుండానే రాజ్యాంగ రచన సాగే పరిస్థితి ఒక దశలో ఏర్పడిందనేది నమ్మలేని నిజం. రాజ్యాంగ సభ చైర్మన్, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఆ సమయంలో కీలక పాత్ర పోషించారు. ‘‘సభలో, సభా కమిటీలలో అంబేద్కర్ ప్రదర్శించిన విజ్ఞానాన్ని, వివేచనను, ఆయన కృషిని చూశాక అటువంటి వ్యక్తిని సభలోకి తీసుకోకపోతే, జాతి నష్టపోతుందనే నిర్ణయానికి వస్తున్నాను... రాజ్యాంగ సభలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన తప్పక సభకు ఎన్నిక కావాలి’’ అని రాజేంద్రప్రసాద్ కరాఖండిగా చెప్పారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి సరిగ్గా ఆరున్నర శతాబ్దాలు. జనవరి 26, 1950 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో దేశం సర్వసత్తాక ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా అవతరించింది. రిపబ్లిక్ డే అంటేనే వెంటనే స్ఫురించేది భారత రాజ్యాంగం. దానికి కర్తగా అద్భుత ప్రతిభాప్రపత్తులను ప్రదర్శించిన దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. నిజానికి రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ నిర్ణాయక సభలో ఆయనకు సభ్యత్వమే లేని పరిస్థితి ఏర్పడిందంటే ఎవరూ నమ్మలేరు. కానీ అలాంటి పరిస్థితే ఏర్పడింది, అయినా అంబేద్కర్ మన రాజ్యాంగ రచనకు నిర్దేశకుడైన వైనం ఆసక్తికరం. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన భారతదేశం సొంత రాజ్యాం గాన్ని రూపొందించుకునే ప్రయత్నాలు మొదలైన తదుపరి పరిణామాలు అప్పట్లో యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘానికి అంబేద్కర్ చైర్మన్ కావడం మరింత విస్మయకర అంశమైంది. లోతైన పరిశోధన తరువాత కొన్ని ముఖ్యాంశాలు బయటపడ్డాయి. ప్రత్యే కించి ఆనాటి రాజ్యాంగ సభ చైర్మన్, ప్రప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంలో నిర్వహించిన కీలక పాత్ర నాటి చరిత్రను కొత్త కోణంలో చూపుతోంది. అంబేద్కర్ లేని రాజ్యాంగ సభా? స్వాతంత్య్రానంతరం 1946 జూలైలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బొంబాయి నుంచి షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ తరఫున పోటీ చేసిన అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఓడించింది. కమ్యూనిస్టులు కూడా వారికి తోడైనట్టు అంబేద్కర్ స్వయంగా తెలిపారు. అయితే అప్పటి తూర్పు బెంగాల్ నుంచి ఎన్నికైన జోగేంద్రనాథ్ మండల్ రాజీనామా చేసి ఆయనను జైసూర్ కుల్నా నుంచి రాజ్యాంగ సభకు పంపారు. ఇండిపెండెంట్ షెడ్యూల్డ్ కులాల సభ్యులు ముగ్గురు, ఆంగ్లో ఇండియన్, ముస్లిం లీగ్ సభ్యులు ఒక్కొక్కరు ఓటు వేసి అంబేద్కర్‌ను గెలిపించారు. అయితే దేశ విభజన వల్ల తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో భాగమైంది. అంబేద్కర్ ఆ దేశ రాజ్యాంగ సభ సభ్యుడయ్యారు. అందులో కొనసాగడం ఇష్టం లేక ఆయన రాజీనామా చేశారు. భారత రాజ్యాంగ రచనా సంఘంలో అంబేద్కర్‌కు స్థానం ఉండని స్థితిలో కథ మలుపు తిరిగింది. అంబేద్కర్‌ను రాజ్యాంగ సభలోకి తీసుకో వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అది బాబూ రాజేంద్రప్రసాద్ చూపిన చొరవతోనే జరిగిందని ఆయన రాసిన ఒక ఉత్తరం వెల్లడిస్తోంది. 1947, జూన్ 30న నాటి బొంబాయి ప్రధాన మంత్రి బి.జి. ఖేర్‌కు ఆయన ఇలా రాశారు: ‘‘డాక్టర్ అంబేద్కర్ విషయంలో ఎన్ని అభిప్రాయాలున్నప్పటికీ ఆయనను తిరిగి రాజ్యాంగ సభలోకి తీసుకోవాలి. రాజ్యాంగ సభలో, వివిధ సభా కమిటీలలో ఆయన ప్రదర్శించిన విజ్ఞానం, వివేచన, చేసిన కృషిని చూసిన తర్వాత ఈ నిర్ణయానికి వస్తున్నాను. అటువంటి వ్యక్తిని రాజ్యాంగ సభలోకి తీసుకోక పోతే, జాతి నష్టపోతుంది... జూలై 14న ప్రారంభమయ్యే రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేద్కర్ ఉండాలని కోరుకుంటున్నాను. అందువలన ఆయన తప్పనిసరిగా సభకు ఎన్నిక కావాలి.’’ రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఆవశ్యకతను రాజేంద్రప్రసాద్ ఆ విధంగా కరాఖండిగా చెప్పారు. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్‌ల అంగీకారం లేకుండా ఆయన తన నిర్ణయాన్ని అమలు చేయగలిగేవారు కారు. బొంబాయి నుంచి అప్పటి వరకు సభలో ప్రతినిధిగా ఉన్న న్యాయ నిపుణులు జయకర్ రాజీనామా చేయడం వలన ఒక స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి అంబేద్కర్ ఎన్నిక జరగా లని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. కానీ అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం నుంచి సభకు ఎంపిక కావడం కోసం ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మౌలాంకర్ను ఎంపిక చేసింది. ఆయనను ఒప్పించే బాధ్యతను సర్దార్ పటేల్‌కు అప్పజెప్పింది. 1947 జూలై 3న మౌలాంకర్‌కు రాసిన ఉత్తరంలో పటేల్ ‘‘ఇప్పుడు మీకు తొందరేం లేదు. రాజ్యాంగ సభకు ఎన్నికవడానికి కాంగ్రెస్ మరొకసారి అవకాశం కల్పిస్తుంది. ఈసారి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఉండాలని అందరం భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ప్రణాళికా రచన కాదు... రాజ్యాంగ సృజన నెహ్రూ, జూలై చివరి వారంలో భారత తొలి మంత్రివర్గంలో చేరి, న్యాయ శాఖామంత్రిగా పనిచేయాలని అంబేద్కర్‌ను కోరారు. ప్రణాళికా మంత్రిగా ఉంటే ప్రణాళికల రూపకల్పన దశలోనే ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వగలుగుతామని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ముందుగా న్యాయశాఖ బాధ్యతలు తీసుకోవాలని, ఆ తరువాత ప్రణాళికా శాఖను సైతం అప్పగిస్తామని నెహ్రూ అంబేద్కర్‌కి హామీ ఇచ్చారు. అయితే 1947 ఆగస్టు 29న ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా సంఘాన్ని ప్రకటించారు. అంబేద్కర్‌ను దానికి చైర్మన్‌గా నియమించారు. ఆ రోజు నుంచి అంబేద్కర్ రాజ్యాంగ రచన అనే బృహత్ కార్యానికి తన సర్వశక్తులు వెచ్చించారు. ఆయన కృషిని, దాని ఫలితాన్ని దేశం ఆనాడే గుర్తించింది. రాజ్యాంగ రచనా బాధ్యతలను అంబేద్కర్‌కి అప్పగించడం ఎంత సరైన నిర్ణయమని ఆనాడే భావించారో కమిటీ సభ్యుల అభిప్రాయాలను బట్టే తెలుస్తుంది. ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించిన చివరి రోజున కమిటీ సభ్యులలో ఒకరైన టి.టి. కృష్ణమాచారి మాట్లాడుతూ.. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులున్నప్పటికీ, అంబేద్కర్ మాత్రమే పూర్తి కాలం పనిచేసిన ఏకైక వ్యక్తి. ఇందులో ఒకరు రాజీనామా చేశారు. మరొక సభ్యుడు మరణించారు. వారి స్థానాల్లో ఎవరినీ తీసుకోలేదు. మరొక సభ్యుడు ప్రభుత్వ పనులలో తీరికలేకుండా ఉన్నారు. ఇంకొక ఇద్దరు సభ్యులు అనారోగ్య కారణాల వలన ఢిల్లీకి దూరంగా ఉన్నారు. దీనితో రాజ్యాంగ రచనా సంఘం బాధ్యత ఒక్క అంబేద్కరే తన భుజాన వేసుకోవాల్సి వచ్చింది. అంతే దీక్షతో ఆయన ఆ పనిని పరిపూర్తి చేశారు కూడా. ఆయన చేసిన ఈ కృషి ప్రశంసనీయమైనది’’ అన్నారు. అంబేద్కర్ పేరును ప్రతిపాదించిన రాజ్యాంగ సభ చైర్మన్ బాబూ రాజేంద్రప్రసాద్ కూడా తన చివరి ప్రసంగంలో ఆయన కృషిని కొనియాడారు. ‘‘డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌ను రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్‌గా ఎన్నుకోవడం ఎంత సరైనదో అందరికన్నా ఎక్కువగా నేను గుర్తించగలిగాను. ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచనా కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా సాగించారు. ఆయన తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేయడం మాత్రమే కాదు. ఎంతో తపనతో నిర్వహించారు. దీనికి మనమంతా ఆయనను అభినందించాలి.’’ ఆయన చేసిన అనితర సాధ్యమైన కృషి మీద విపులమైన అధ్యయనాలు ఎన్నో వచ్చాయి. భారత రాజ్యాంగాన్ని ఓ శక్తివంతమైన ఆయుధంగా మలచి అంబేద్కర్ కోట్లాది ప్రజలకు అందించారు. జనహితానికి విభేదాలు కావు అడ్డంకి రాజ్యాంగంలో ఉన్న అన్ని ప్రకరణలతో పాటు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఈ రోజుకే కాదు, ఏనాటికైనా దేశ పురోగమనానికి మార్గదర్శ కాలుగా ఉంటాయి. వాటి రూపకల్పనలో కూడా కీలక భూమికను పోషించినది అంబేద్కర్ కావడం విశేషం. ఈ సందర్భంగా మరొక విషయాన్ని మనం ఇక్కడ సంక్షిప్తంగానైనా ప్రస్తావించుకోవాలి. అంబేద్కర్ రాజ్యాంగ సభ సభ్యునిగా గానీ, రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్‌గా గానీ ఉంటారని ఆయనతో సహా అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అందువల్లనే 1947 మార్చిలో ఆయన రాజ్యాంగ సభకు తన ప్రతిపాదనగా పంపడానికి ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అన్న నివేదికను రూపొందించారు. ఆ తరువాత దానిని రాజ్యాంగ సభకు అందజేశారు. అంబేద్కర్ రాజకీయంగా గాంధీజీ అభిప్రాయాల పట్ల, కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల తన వ్యతిరేకతను 1930 నుంచి నిరంతరం తెలియజేస్తూనే ఉన్నారు. 1942లో ఏకంగా గాంధీజీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శనాత్మకమైన ఒక పెద్ద గ్రంథాన్ని రచించారు. రాజకీయ రిజర్వేషన్ల విషయంలో గాంధీజీతో పెద్ద వివాదం జరిగింది. ఇది తీవ్రమైన సైద్ధాంతిక ఘర్షణకు కూడా దారితీసింది. చివరకు గాంధీజీ నిరాహారదీక్ష దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిర్మాణం అయిన రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఉంటారని ఊహించకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. అయితే తూర్పు బెంగాల్ నుంచి మొదట రాజ్యాంగ సభలో సభ్యునిగా ప్రవేశించిన అంబేద్కర్ చేసిన ప్రసంగాలు, అనుసరించిన వైఖరి కాంగ్రెస్ పార్టీని ఆలోచనలో పడేసింది. రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్‌గా అంబేద్కర్ నియామకానికి మార్గం సుగమం చేసినది అదే. అలాగే కాంగ్రెస్‌తో అంబేద్కర్‌కి రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ పట్టుదలకి పోకుండా... దేశ ప్రజల, ఎస్సీ, ఎస్టీల రక్షణ, భద్రత, సంక్షేమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలా తనను తాను తగ్గించుకొని రాజ్యాంగ రచనా సంఘానికి నేతృత్వం వహించడం, ఒంటరిగా ఆ బృహత్తరమైన బరువు బాధ్యతలను దక్షతతో నిర్వహించడం అంబేద్కర్ రాజకీయ విజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం. రెండు విరుద్ధమైన శిబిరాలు దేశ ప్రయోజనాల కోసం ఒకటిగా మారడం వల్లనే భారత ప్రజలు ప్రజాస్వామ్య ఫలాలను అందించే అతి అరుదైన రాజ్యాంగాన్ని రచించుకోవడం సాధ్యమైంది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ నం: 9705566213)