యావత్ ప్రపంచం గుర్తించి, గౌరవిస్తున్న గాంధీజీ విగ్రహ ఆవిష్కరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఘనాలోని ఒక విశ్వవిద్యాలయం అ«ధ్యాపకులు, విద్యార్థులు పోరాడి తమ క్యాంపస్‌లో లేకుండా చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. దక్షిణాఫ్రికాలో భారతీయులు నివసిస్తున్న కాలనీలలోనే కాఫిర్లు అయిన నల్లజాతీయులు ఉండడం తమకు అవమాన కరమని, వీళ్ళతో కలిసి జీవించడం వల్ల తమ పిల్లలు కూడా çసరైన జ్ఞానాన్నీ, ఎదుగుదలనూ అందుకోలేరనీ.. గాంధీ 1894 డిసెంబర్ 19న బ్రిటిష్ అధికారులకు రాసిన లేఖను నల్లజాతి ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా ఆక్షేపిస్తుండటం గమనార్హం. జాతివివక్ష, వర్ణవివ„ý మూలాలను గాంధీ పరిశీలించలేదని తెలుస్తోంది.
మహాత్మాగాంధీ అనే మోహన్‌దాస్ కరంచంద్ గాంధీకి భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల నాయకుడిగా పేరు ప్రఖ్యాతులున్నాయి. అనేక ప్రాంతాల్లో ఆయనను ఈనాటికీ స్మరించుకుంటున్నా రనడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టించుకున్న ఆయన నిలువెత్తు విగ్రహాలే ప్రత్యక్ష ఉదాహరణలు. ఆయన అభిప్రాయాలను గౌరవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ ఆయన అభిప్రాయాలను వ్యతి రేకిస్తున్న వాళ్ళు సైతం ఉన్నారు. ఆ వ్యతిరేకత వల్లే ఘనా దేశంలోని ఒక విశ్వవిద్యాలయంలో నెలకొ ల్పిన గాంధీ విగ్రహాన్ని తొలగించాలనే ప్రయత్నం సఫలీకృతం అయ్యింది. దాని ఫలితంగానే ఈనెల 15వ తేదీన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆ విశ్వ విద్యాలయం ప్రాంగణం నుంచి తొలగించారు.
జూన్ 4, 2016 వ సంవత్సరంలో ఘనాలోని అక్రాలో ఉన్న లెగాన్ క్యాంపస్‌లో నెలకొల్పిన గాంధీ విగ్రహాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవి ష్కరించారు. అయితే ఆ విశ్వవిద్యాలయానికి చెందిన ఆఫ్రికన్ స్టడీస్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 2016న ఒక వినతి పత్రాన్ని విశ్వవిద్యాలయం అధికా రులకు అందజేసారు. వర్ణ వివక్షను పాటించిన గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఆఫ్రికా ప్రజలను అవమానించడమేనని, ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ను ఆన్‌లైన్‌లో ఉంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లజాతి ప్రజల వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమకారుల మద్దతును కూడగట్టారు. ఈ సంచలన వార్తను అక్కడి పత్రికలూ, టీవీ ఛానళ్ళు విస్తృతంగా ప్రచారం చేసాయి. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో ఆయన అవలం భించిన వర్ణ వివక్ష అనుకూల విధానాలను ఆ పత్రి కలు తీవ్రంగా దుయ్యబట్టాయి.
దక్షిణాఫ్రికాలో 1893 నుంచి 1914 వరకు ఉన్న మహాత్మాగాంధీ వర్ణ వివక్షను ప్రోత్సహించే అనేక ప్రసంగాలను, ఉత్తరాలను ఘనా విశ్వవిద్యాలయం ఉద్యమకారులు ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో బ్రిటిష్ అధికారులను సంబోధిస్తూ రాసిన ఉత్తరా లలో నల్లజాతి ప్రజలను కించపరిచే విధంగా ప్రస్తా వన ఉన్నట్టు ఉద్యమకారులు పేర్కొన్నారు.
డిసెంబర్ 19, 1894న గాంధీ బ్రిటిష్ అధికారు లను ఉద్దేశిస్తూ ఒక ఉత్తరం రాసారు. భారతీయులు నివసిస్తున్న కాలనీలలోనే కాఫిర్లు అయిన నల్లజాతీ యులు ఉండడం తమకు అవమానకరమని, వీళ్ళతో కలిసి జీవించడం వల్ల తమ పిల్లలు కూడా సరి అయిన జ్ఞానాన్నీ, ఎదుగుదలనూ అందుకోలేరనీ గాంధీ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. అంతేకాకుండా మే 5 1895న మరో సందర్భంగా రాసిన ఉత్తరంలో కూడా నల్లజాతీయులను కాఫిర్ అనే పదంతో సంబోధించారు. సెప్టెంబర్ 26, 1896న మే 27, 1899న రాసిన లేఖల్లో సైతం గాంధీజీ నల్లజాతీయు లను కించపరిచారని ఉద్యమకారులు వివరించారు. కాఫిర్లు అనేపదం నల్లజాతి ప్రజల్లో తీవ్ర ఆక్షేప ణీయం. ఆ పదం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీ యడం మాత్రమే కాకుండా ఎంతో అవమానంగా భావిస్తారు. ఉత్తరాల్లో మాత్రమే కాకుండా ఆచర ణలో కూడా గాంధీ నల్లజాతి ప్రజలను తమకంటే తక్కువ వారిగానే భావించారు.
ఆ రోజుల్లో ఉత్తర ప్రత్యుత్తరాలకు ఇతరత్రా సమాచారం చేరవేయడానికి పోస్టాఫీసులే ప్రధాన సాధనాలుగా ఉండేవి. శ్వేతజాతీయుల దురహంకా రానికి చిహ్నంగా శ్వేతజాతీయులకు ఒక ప్రత్యేకమైన క్యూ(లైన్) ఉండేది. నల్లజాతీయులతో కలిపి మిగి లిన వాళ్ళందరికీ కలిపి వేరుగా మరో లైన్ ఉండేది. అందులో భారతీయులతో పాటు ఇతర ఆసియా దేశాలకు చెందిన వారు క్యూలో నిలబడేవారు. భార తీయులకు వేరే క్యూ ఉండాలనీ, తాము నల్లజాతీ యులతో పాటు నిలబడలేమని గాంధీ బ్రిటిష్ ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారు. దీంతో ప్రభుత్వం భారతీయులకోసం మూడో క్యూను ఏర్పాటు చేసింది. అదేసమయంలో ప్లేగు వ్యాధి ప్రబలి వందలాది మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. అప్పుడు కూడా గాంధీ రాసిన ఉత్తరంలో, తాము కాఫిర్లయిన నల్లజాతి వారితో సమానంగా ఒకే ఆసుపత్రుల్లో ఉండలేమని వ్యతిరేకతను చాటారు. ఈ సంఘటన లన్నీ ఇప్పుడు ఆఫ్రికాలో చర్చనీయాంశాలుగా మారాయి. గాంధీ వర్ణ వివక్ష అనుకూల వైఖరిని నల్లజాతి ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. శ్వేతజాతీయులతో పాటు అందరికీ సమాన హక్కులు ఉండాలనే భావనకు బదులు, నల్లజాతి ప్రజలను తమకన్నా హీనమైన వారిగా పరిగణించ డంతో పాటు, భారతీయులకు ప్రత్యేకమైన సౌక ర్యాలు, హక్కులు కావాలని కోరడం నల్లజాతి ఉద్య మకారులను ఆగ్రహానికి గురిచేస్తున్నది.
ఈ విషయాలతో పాటు మరో ముఖ్యమైన అంశాన్ని కూడా అక్కడి ఉద్యమ కారులు లేవనె త్తారు. బ్రిటిష్ పాలకులకు అక్కడి స్థానిక తెగల నాయకులకు మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. అందులో బోయర్ యుద్ధాలు ముఖ్యమైనవి. 1890 ప్రాంతంలో రెండు బోయర్ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలలో భారతీయ యువకులను బ్రిటిష్ పాలకుల తరఫున యుద్ధంలో క్షతగాత్రులను మోసు కెళ్ళే స్ట్రెచర్ బేరర్స్‌గా గాంధీ పంపించారు. అందుకు గాను బ్రిటిష్ పాలకులు గాంధీజీని ప్రశంసలతో ముంచెత్తారు. బోయర్స్ యుద్ధం దక్షిణాఫ్రికా చరి త్రలో ఒక కీలక మలుపుగా భావించొచ్చు. అప్పటి వరకు స్వతంత్రంగా ఉన్న దక్షిణాఫ్రికా నల్లజాతి తెగల సంస్థానాలు బోయర్స్ యుద్ధంలో బ్రిటిష్ పరం అయ్యాయి. ఇది కూడా ఆఫ్రికా ప్రజల మన సుల్లో వ్యతిరేకతను పెంచడానికి కారణమయ్యింది.
మహాత్మాగాంధీ 1893లో దక్షిణాఫ్రికాకి వెళ్ళి, 1914లో తిరిగి స్వదేశానికి వచ్చారు. దాదాపు 20 సంవత్సరాల కాలంలో ఆయన అక్కడి భారతీయుల కోసం ముఖ్యంగా వ్యాపారవర్గాల ప్రయోజనం కోసం మాత్రమే పనిచేసాడనే విమర్శలున్నాయి. అంతేకాకుండా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు జరిగిన యుద్ధాల్లో బ్రిటిష్ వారికి అండగా నిలబడ్డాడని కూడా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ‘ది సౌత్ ఆఫ్రికన్ గాంధీ స్ట్రెచర్ బేరర్ ఆఫ్ ఎంపైర్’ అనే పేరుతో అశ్వనీదేశాయ్, గులాంవాహెద్ రాసిన పుస్త కంలో ఈ సంఘటనలతో పాటు అనేక ఉదంతాలూ సందర్భాల ప్రస్తావనలూ ఉన్నాయి. ఈ సంఘటనల వల్ల దక్షిణాఫ్రికాలో గాంధీ అనుసరించిన నల్లజాతి వ్యతిరేక స్వభావం చాలా స్పష్టంగా కనిపించిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాకు ఒక న్యాయ వాదిగా వెళ్ళారు. భారతీయ వ్యాపారుల పక్షాన నిల బడే ఉద్యోగం ఆయనకు లభించింది. కానీ అప్పటికే భారతీయులు దక్షిణాఫ్రికాలో తమ ఉపాధి, ఉద్యోగా లను దెబ్బతీస్తున్నారని శ్వేతజాతీయులు భావిం చారు. అందువల్ల భారతీయులు వస్తున్న పడవలను అడ్డుకోవడం, వారిని వెనక్కి పంపాలని డిమాండ్ చేయడం తరచుగా జరిగింది. జనవరి 16, 1897న భారత దేశం నుంచి వచ్చిన ప్రయాణికుల నౌకను అడ్డుకోవడానికి శ్వేతజాతీయులు ప్రయత్నించారు. ఆ సందర్భంగా గాంధీ కూడా అక్కడికి చేరారు. వ్యాపారుల పక్షాన భారతీయ కార్మికులను తీసు కెళ్ళడానికి వచ్చిన గాంధీని శ్వేతజాతీయులు గమ నించారు. అప్పుడు గాంధీపై శ్వేతజాతీయులు దాడి చేయడంతో అక్కడినుంచి తప్పించుకొని, సమీపం లోని పోలీసు స్టేషన్‌కి వెళ్ళి దాక్కున్నారు. పోలీసు కానిస్టేబుల్ రూపంలో మారువేషంలో అక్కడి నుంచి గాంధీ బయటపడినట్టు పైన పేర్కొన్న పుస్తకంలో ప్రస్తావించారు.
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఒకపక్క భార తీయుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న క్రమంలో నల్లజాతీయులను కించపరుస్తున్నానన్న వాస్తవాన్ని గ్రహించలేకపోయారు. ఆయనలో ఉండే ఆధిపత్య ఆలోచనలకు ఇది ప్రతిరూపమని నల్లజాతి ఉద్యమకారులు భావిస్తున్నారు. చెప్పాలంటే దక్షిణా ఫ్రికాలో ఆయన రెండు దశాబ్దాలపాటు ఉన్నా నల్ల జాతీయుల హక్కుల గురించి ఏనాడూ మాట్లాడలే దనీ, పైపెచ్చు తమను కించపరిచే పదాలను ఆయన ప్రయోగించారని నల్లజాతీయులు భావిస్తున్నారు. అది వారి స్మృతిపథం నుంచి చెరగలేదని ఘనా ఉదంతం చాటుతోంది. పైగా తన అనాలోచిత భావా లతో ఆఫ్రికన్లను కాఫిర్లు అని ఆయన వ్యాఖ్యానిం చిన మాట నిజమేనని గాంధీ మనుమడు రాజ్‌మో హన్ గాంధీ అంగీకరించారు కూడా. అయితే గాంధీజీ భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత తన ఈ లోపాన్ని గుర్తించారని చరిత్రకారుల వ్యాఖ్య. అక్కడి అనుభవాలతో భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత అస్పృ స్యతను గాంధీ వ్యతిరేకించారు కానీ జాతి, వర్ణ వివక్ష మూలాల్ని విశ్లేషించి దానికనుగుణంగా సమూల చర్యలు చేపట్టడంలో గాంధీ విఫలమయ్యారు. మన దేశంలో కూడా ఒకవైపు అంటరానితనం పోవాలం టూనే మరోవైపు వర్ణ ధర్మం కొనసాగాలని ఆయన భావించడం ద్వంద్వ స్వభావంగానే పరిగణించాలి.
అదే సమయంలో భారత్‌లో అంటరాని కులాల ప్రజలు తమ హక్కుల కోసం బాబాసాహెబ్ అంబే డ్కర్ నాయకత్వంలో పోరాడుతోంటే ఒకవైపు గాంధీ సానుభూతి ప్రకటిస్తూనే మరోవైపు వారి రాజకీయ సమానత్వం కోసం బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు పేరుతో సెపరేట్ ఎలక్టోరేట్‌ను ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకించడానికి ఈ లోపాలే కారణం. పైగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను రిజర్వ్‌డ్ స్థానాలకు పరి మితం చేసే ఎన్నికల విధానానికి అంకురార్పణ చేసారు. అంబేడ్కర్‌ని నయానా, భయానా, ఒప్పించి, పూనా ఒడంబడికను రూపొందించారు.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment